ఒడిదుడుకుల మధ్య న్యాయవ్యవస్థ | ABK Prasad Article On Law System In India | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల మధ్య న్యాయవ్యవస్థ

Published Tue, Oct 6 2020 12:51 AM | Last Updated on Tue, Oct 6 2020 12:51 AM

ABK Prasad Article On Law System In India - Sakshi

అసాధారణ పరిస్థితుల్లో తప్ప దర్యాప్తుపై స్టే అర్డర్లు ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సుప్రీంకోర్టు హితవు చెప్పిన నేపథ్యంలో న్యాయవ్యవస్థల తీర్పుల్లో వాటి స్వభావాల్లో రకరకాల వ్యత్యాసాలు, వ్యాఘాతాలపై విస్తృత చర్చ జరుగుతోంది. భారత రాజ్యాంగం మూడు విభాగాలకు పరిధులు గీసి మరీ నిర్ణయించిన గీతలు దాటి ఒక విభాగంలోకి మరొకటి చొరబడి ‘కప్పల తక్కెడ’గా మారడంతో ఎవరు ఎందులో తలదూర్చుతున్నారో, మరెవరు వేలుపెట్టి ఒకరి నిర్ణయాలను మరొకరు తారుమారు చేస్తున్నారో అర్థం కాని స్థితే దీనికి కారణం. న్యాయస్థానాల తీర్పుల్లో, తీరుతెన్నుల్లో ఈ ఒడిదుడుకులకు అసలు మూలం ఇదే మరి.

అమరావతి భూములపై దర్యాప్తు ప్రారంభం కాకముందే స్టే ఆర్డర్లు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేయడాన్ని మేం ఆమోదించం. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుల పైన స్టేలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూ వచ్చినందుననే ఇప్పుడు మేం అమరావతి భూముల కేసులో హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకుంటున్నాం. ఒకసారి ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన తర్వాత దర్యాప్తు ప్రారంభించకుండానే కేసులో ఏముంది అంటూ హైకోర్టు స్టే ఇవ్వడం ఏమిటి? చట్టం తన పని తాను చేసుకుపోవా ల్సిందే. పదే పదే చెబుతున్నాం–అసాధారణ పరిస్థితుల్లో తప్ప స్టే ఇవ్వ కూడదు. ఇది ఆమోదం కాదు. ఇలాంటి ఉత్తర్వులు నిలబడవు.
– ఏపీ హైకోర్టు స్టే ఉత్తర్వును సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వు 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థల తీరుతెన్నుల్ని తీర్పుల స్వభావాలను పరిశీలిస్తున్నప్పుడు తరచుగా మనకు రకరకాల వ్యత్యా సాలు, వ్యాఘాతాలు ఎదురవుతూ ఉండటం కద్దు. అయితే కుండ బద్దలు కొట్టినట్లు అరమరికలు లేకుండా ప్రలోభాలకు లోనుకాకుండా తీర్పులు చెప్పేవారి సంఖ్య అరుదైనా, అసలంటూ లేకపోలేదు. న్యాయమూర్తుల్లో కనిపించే ఈ వ్యత్యాసానికి అమెరికాలో నల్లజాతి విమోచన ప్రధాత ప్రెసిడెంట్‌ అబ్రహాం లింకన్‌ ఒక హాస్య సంభాషణ ద్వారా చెప్పిన ఉదాహరణను నేనీ వ్యాసం చివరలో నివేదిస్తాను. ఈ లోగా అసలు ఎఫ్‌ఐఆర్‌ గురించి గానీ, సంబంధిత దర్యాప్తు గురించీ, అందులోని విషయాల గురించి గానీ ఏ ప్రసార మాధ్యమాల్లో (మీడియా)నూ ప్రచురించడాన్ని నిషేధిస్తూ ఒక అసాధారణ ఆదేశాన్ని ఏపీ హైకోర్టు జారీ చేసింది. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరసిస్తూ నాయకులు, న్యాయవాదులు, మీడియా సంస్థలుS, సంపాదకులు, ప్రొఫెషనల్‌ సంస్థలు సహా ఈ ‘గాగ్‌’ (నోరు నొక్కేసే) ఆర్డర్‌ను విమర్శించి ఖండించాల్సి వచ్చింది. 

ఈ గందరగోళానికి కారణం ఏమిటి? ఇందుకు మన వ్యవస్థలో ఉన్న లోపమెక్కడ?  74 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు వ్యవస్థను సమూ లంగా సంస్కరించడంలో విఫలమవుతున్నాం? కావాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను కోరి మరీ తెచ్చుకుని రూపొందించుకున్న స్వతంత్ర భారత సెక్యులర్‌ రాజ్యాంగానికి మన రాజకీయనాయకులు, వారి పార్టీలు చివరికిలా ఎందుకు భ్రష్టు పట్టిస్తూ వచ్చారు? చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రూపొందించుకున్న అత్యు న్నత ప్రజానుకూల తీర్పులను కూడా పాలకులు, కొన్ని రాష్ట్రాల న్యాయస్థానాలు, సుప్రీంకు చెందిన కొన్ని ధర్మాసనాలు సహితం ఎందుకు ఉల్లంఘిస్తూ వచ్చాయి? లోతుగా వెళ్లవలసి వస్తే జైన్‌ హవాలా కేసులో అడ్వాణీకి ప్రమేయం ఉన్నదని సమాచారం పొక్కిన ప్పటినుంచీ స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా మెలగవలసిన సీబీఐ, సీవీసీ లాంటి అత్యున్నత శాఖలు కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల మోచేతినీళ్లకు మోసులెత్తుతూ వచ్చినప్పుడు ఆ ‘ఎసరు’ న్యాయవ్యవస్థలకు మాత్రం తగలకుండా ఉంటుందా? నిజానికి ఒక దశ వరకూ, బహుశా ‘జైన్‌ హవాలా కేసు’ నడుస్తున్న సమయం దాకా పతంజలి శాస్త్రి, వీఆర్‌ కృష్ణయ్యర్‌ లాంటి మచ్చలేని న్యాయమూర్తులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అలంకరిస్తున్న దాకా మనకూ గర్విం చదగిన న్యాయస్థానాలున్నాయని దిలాసాగా గడుపుతూ వచ్చాం.

ఇక ఆ తర్వాత క్రమంగా భారత రాజ్యాంగం మూడు విభాగాలకు (ప్రభుత్వం, శాసనవేదిక, న్యాయస్థానం) పరిధులు బరిగీసి మరీ నిర్ణ యించిన గీతలు దాటి ఒక విభాగంలోకి మరొకటి చొరబడి ‘కప్పల తక్కెడ’గా మారడంతో ఎవరు ఎందులో తలదూర్చుతున్నారో, మరె వరు వేలుపెట్టి ఒకరి నిర్ణయాలను మరొకరు తారుమారు చేస్తున్నారో, ఏ ప్రలోభంతో ఈ మార్పులు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి భారత సామాన్య ప్రజాబాహుళ్యానికి దాపురిస్తూ వచ్చింది. మరీ దూరం పోకండి, జైన్‌ హవాలా కేసు విచారణ సందర్భం గానే బహుశా తొలిసారిగా (కొన్నేళ్లనాడు) సుప్రీం ధర్మాసనం సీబీఐ, చీఫ్‌ విజిలెన్స్‌ కమిషన్‌ పాత్రలను ప్రశ్నించవలసి వచ్చింది. నాడు ప్రధానమంత్రి కార్యాలయం కనుసన్నల్లోనే ఈ రెండు సంస్థలు రాజ కీయపరమైన ఒత్తిళ్లకు లోనుకావలసి వచ్చినప్పుడు ఈ సంస్థలు కేవలం ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల మాటే వినడా నికి అలవాటుపడి తాము స్వతంత్ర సంస్థలన్న ‘స్పృహ’నే కోల్పో తున్నాయని నాటి సుప్రీంకోర్టు ‘చురక’వేస్తూ ఇకనుంచి ఈ సంస్థలు తన కనుసన్నల్లో కూడా ఉండి బాధ్యతతో మెలగాలని చురక అంటిం చవలసి వచ్చింది. ఆనాడు స్వతంత్ర భారతంలో సుప్రీం చరిత్రలో ఇది తొలి చురక అని నా భావన! దీనర్థం–ఇప్పటికీ ఆదర్శనీయమైన ధర్మాసనాలు ‘సుప్రీం’లోనూ రాష్ట్రాలలోనూ మనకు అసలు లేవని కాదు, కాకపోతే అనేక సందర్భాలలో కొన్నింటికి బూజుపట్టింది, మరి కొన్ని చైతన్యంలోనే ఉన్నాయి.

ఇంతకూ వచ్చిన అసలు రోగమంతా ప్రధానంగా రాజకీయాలలోనూ, రాజకీయ పాలనా వ్యవస్థల్లోనే గూడు కట్టుకుపోయింది. ఎంత దట్టంగా ఈ ‘రోగం’ వ్యాపించి ఉందంటే– రాజకీయం ఎక్కడ మొదలయి, ఎక్కడికి పాకుతోంది, న్యాయ పాలన ఎక్కడ, ఎందుకు కుంటుపడి నడక సాగిస్తోంది అన్న మీమాంస ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయిలో సాగుతోంది నేడు. ఇందుకు ఉదాహరణలు వెతుక్కోవడానికి ఎంతో దూరం ప్రయా ణించక్కరలేదు–ఇటీవల సంవత్సర కాలంలోనే పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ మీద ఊరూనాడూ గుప్పుమన్న ‘సెక్స్‌ స్కాండల్‌’ ఫలితంగా పదవిని విడిచిపోయే తరుణంలో బాబ్రీమసీదు స్థానంలో అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌ ఎంతో వేగంగా క్లియర్‌ కావటం, ఆ వెంటనే కొద్దిరోజుల్లోనే గొగో య్‌కు రాజ్యసభ సీటు ‘వడ్డించిన విస్తరి’గా అమరిపోవడం. అలాగే సీబీఐ స్పెషల్‌ జడ్జి జస్టిస్‌ విజ్‌గోపాల్‌ హరికిషన్‌ లోయా హత్యకేసులో ఒక అధికార పార్టీ అగ్ర నాయకుడే ఇరుక్కు పోయినప్పుడు ఆ కేసును కొట్టేసిన మరో జస్టిస్‌కు ప్రయోజనం చేకూరడం తెలిసిన విషయమే! ఈ తంతు మన అవినీతి రాజకీయ చట్రంలో ప్రధానంగా గత నలభై ఏళ్లుగానూ, మరీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాలకు పైగానూ దేశంలో యథేచ్ఛగా సాగిపోతోంది. బహుశా ఇంతకన్నా చెడిపోవల సిన ఆ మిగులుసగులు మంచి ఏమైనా మిగిలిందేమో భూతద్దం పెట్టి చూసినా ఏ మేరకు కనపడుతుందో వెతుక్కోవలసిందేనేమో! 

ఎందుకంటే, వారం పది రోజుల క్రితమే వెలువడిన ఒక కేంద్రీయ సాధికార విచారణ సంస్థ, పరిశోధనా సంస్థ తాజా నివేదిక ప్రకారం ఇంతవరకూ పార్లమెంటు చరిత్రలో కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో హంతకులుగా, నేరగాళ్లుగా, వేధింపురాయుళ్లుగా, దౌర్జన్యపరులుగా నమోదైన శాసనకర్తల సంఖ్య 4,200 మంది అని  వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల నాయకుల, శాసనకర్తల, న్యాయవ్యవస్థల మధ్య నడిచే ‘ఆదానప్రదానా’లు ఎలా ఉంటాయో తేల్చుకోవడం కష్టం. తాజా ఉదాహరణగా, కొద్ది రోజుల లోనే రిటైరైన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా పాత్ర. ఆయన తీర్పుల ధోరణి దేశంలో ఎందుకు అంతగా అభాసుపాలు కావలసి వచ్చిందో ఇక ఎంత మాత్రం దాచలేని సత్యంగా బయటపడిపోక తప్పలేదు. మనకు ఏదో ఒక రాజ్యం అయితే ఉంది గానీ, ఉన్న ఆ లౌకిక రాజ్యాంగం కూడా ఆకారంలో తప్ప తొల్లింటి రూపంలోనే, ఆచరణలోనే ఉందని భ్రమించి కూర్చుం దామా? లేదా ధర్మరక్షణకే కట్టుబడి ఉన్నామన్న గుండె నిబ్బరంతో ప్రతి పౌరుడు చాటుకోగల స్థితిలో నేడున్నాడా? ఆ భరోసా ఇవ్వగల స్థానంలో నేడు న్యాయ వ్యవస్థను ఉంచగలిగామా? 

దీనికి సమాధానాన్ని గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పగల్గడమే కాదు, అసలు గుండెకాయే స్పందించగల్గాలి. సంపాదన ఇవాళ రావొచ్చు, రేపు చేజారిపోనూ పోవచ్చు. మనిషికైనా, రాజకీయ అధికా రంలో, న్యాయస్థానంలో కూర్చున్న వారికైనా లోభానికీ, ప్రలోభానికీ మధ్య ఉన్న ఈక్వేషన్‌ కూడా అంచనాలో ఉండాలి. బహుశా పాలనా రంగంలో ఈ అన్నింటినీ కాచి వడబోసిన ప్రెసిడెంట్‌ అబ్రహాం లింకన్‌ ఆనాడే– కొందరు సమకాలీన న్యాయమూర్తులు ఎలా ఉండేవారో చెబుతూ ఒక విచిత్రమైన సాదృశ్యాన్ని గుర్తుచేశాడు: ‘‘వీధిలో నడిచివెళ్లే ఓ వ్యక్తి పెద్ద పెట్టున శబ్దం వచ్చేలా తన ముక్కును చీదుకుంటూ పోతున్నందుకు అతణ్ణి ఉరి తీయాల్సిందేనం టాడట ఓ న్యాయమూర్తి, ఇక మరో న్యాయమూర్తేమో అసలింతకీ ఆముక్కుచీదుకున్న వ్యక్తి ఏ చేత్తో చీదుకున్నాడో ఫిర్యాదుదారు తేల్చి చెప్పనందుకు ఆ ఉరిశిక్షను కాస్తా రద్దు చేస్తాడ’’ట. (డేవిడ్‌పానిక్‌: జడ్జెస్‌ గ్రంథం– క్వీన్స్‌ కౌన్సెల్‌ గౌరవ సభ్యుడు). మన తీర్పులు, తీర్పరులూ ఇందుకు భిన్నంగా ఉండగలరన్న ఆశాభావంతో...! ఈ లెక్కన డాక్టర్‌ అంబేడ్కర్‌ తెగేసి చెప్పింది నిజమనిపిస్తుంది: ‘మన దేశం రెండే రెండు జాతులుగా విడిపోయింది. ఒకటి మోతుబరులైన వర్గాలు, రెండు అణగారిన వర్గాలు’!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement