సుప్రసిద్ధ మహాకవి సి. నారాయణ రెడ్డి మూడు దశా బ్దాల నాడే కొందరు భావి పాలకులు దేశ రాజ్యాంగాన్ని పక్కకు తోసేసి, ‘రాచరిక పాలన’ను అభిలషిస్తూ ప్రవర్తించే అవకాశాలు ఎలా ఉన్నాయో ‘ప్రపంచ పదులు’ కవిత ద్వారా పాఠకులకు అందించారు. ‘నడమంత్రపు బుద్ధి దూకుడు’ ఎలా ఉంటుందో ఆ కవితలో నిరూపించారు:
‘‘గాలిలోన ఎగిరిపడే గడ్డిపరక ఊపిరెంత?
ఏటిలోన తుళ్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత?
అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతె ఏం లాభం?
కడలిలోన మిడిసిపడే కప్పపిల్ల పాకుడెంత?
నడమంత్రపు సిరినేర్పిన దుడుకుబుద్ధి
దూకుడెంత?’’
పాలకుల ఈ ‘దుడుకు బుద్ధి’ వల్ల దేశానికి రాబో తున్న అనర్థాల గురించి అడుగడుగునా నిశితమైన పరిశీలనలో ఉన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. పదవిని అధిష్ఠించిన రోజు నుంచీ దేశ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.
బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ పాలకులు ఎత్తుకున్న ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ నినాదం దేశ ఫెడరల్ వ్యవస్థ స్వరూప, స్వభావాలకు విరుద్ధం. దేశంలో ‘రాచరికం’ ఉంది గాని 75 ఏళ్లలో దేశ ప్రజలు నిర్మించుకున్న సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ లేదని వర్తమాన పరిస్థితులు చెబుతున్నాయి. కనుకనే కాలానికి లొంగిపోని కర్మయోగులు నేడు మేలుకోవలసి ఉంది. ఎందుకంటే:
‘‘కలవరపడి వెనుతిరిగితే కాలం ఎగబడుతుంది
కదనుతొక్కితే కాలం భయపడుతుంది
కనురెప్పలు మూతపడితే కాలం జోకొడుతుంది
కంఠమెత్తి తిరగబడితే కాలం జేకొడుతుంది!’’
కాబట్టి ప్రతిపాదిత ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ విధా నాన్ని బుద్ధిజీవులు అందరూ వ్యతిరేకించాలి. పటిష్ఠ మైన ప్రజాస్వామ్య పునాదులను గౌరవించాలనీ, ప్రస్తుత పాలకుల కనుసన్నలలోనే ఎదిగిన మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్య రక్షణ’ పేరిట మరో ‘తైనాతీ’ కమిటీ ఏర్పాటు తగదనీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. పాలకుల చేతిలో కోవింద్ కీలు బొమ్మగా వ్యవహరించరాదనీ ఆయన సలహా ఇచ్చారు. అసలు విచిత్రమేమంటే, కేంద్ర, రాష్ట్రాలకు కలిపి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశాని కయ్యే అపారమైన ఖర్చును ఆదా చేయవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం సలహా ఇవ్వబోవడం! ఈ చర్య రాజ్యాంగాన్నీ, పార్లమెంటరీ వ్యవస్థనూ అవ మానపరచడమే!
అంతేగాదు, మత విశ్వాసాలను కూడా రాజకీయ లబ్ధి కోసం బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు వాడుకోవడం ఓటర్లను దగా చేయడమే! ఈ రాజకీయమే వేల ఏళ్ల నాటి బాబ్రీమసీదు కట్టడాన్ని బలవంతంగా కూల్చి వేసి, దాని స్థానే రామమందిర నిర్మాణానికి కారణ మయ్యింది.
నిజానికి సాధారణ ముస్లిం పౌరులు హిందువులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. హిందువులు పవిత్రంగా భావించే రామా యణాన్ని స్థానిక ‘అవధి’ భాషలో రచించి ఖ్యాతి వహించిన తులసీదాస్‌ను హిందీలో రాయనందుకు శిక్షించడానికి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో ఆయననూ, ఆయన రామాయణాన్నీ ఓ స్థానిక ముస్లిం కాపాడాడు. ఈ వాస్తవాన్ని ఈ రోజుకీ గుర్తించ నిరాకరిస్తున్న ముఠా... మహాత్మాగాంధీ పేరిట కంటి తుడుపు ఉత్సవాలు చేస్తున్నా రని గమనించాలి.
లాహోర్ కుట్ర కేసులో నిందితులుగా, ముద్దా యిలుగా ఉన్న భగత్‌సింగ్, సుఖదేవ్‌లు ఉరిశిక్షను ఎదుర్కొంటున్నప్పుడు భగత్‌సింగ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘తన కాలంలో మార్క్స్ కొత్త తరహాగా ఆలోచించబట్టే కాల చక్రాన్ని తన పద్ధతుల్లో త్వరిత గతిన ముందుకు నడిపించగలిగారు. అలాగే మన దేశంలో సామ్యవాద సిద్ధాంతాన్ని (సోషలిజం) నేను గాని, నువ్వు గాని (సుఖదేవ్‌తో సంభాషణ) ఆరంభించలేదు. నిజానికి కాలం, పరిస్థితులు కల్పించిన ప్రభావ ఫలితం అది.
ఇంత కష్టమైన బాధ్యతను మనం చేపట్టినప్పుడు దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలే గాని కష్టాలు ఎదురయ్యాయని చెప్పి, ఆత్మహత్య చేసుకుంటే అది ప్రజలకు మార్గదర్శకం కాజాలదు.’’ ఈ మాటలు భగత్‌సింగ్ ఏ సందర్భంలో అన్నాడు? ఉవ్వెత్తున ప్రజాందోళన వల్ల మన ఉరిశిక్షలు ఆగిపోయి, యావజ్జీవ కారాగార శిక్షగా మారిపోవచ్చు. కానీ, 14 ఏళ్లపాటు ద్వీపాంతరవాస శిక్ష అనుభవించాక మనం జీవచ్ఛవాలుగా మారిపోతాం. అలాంటప్పుడు బతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు కదా... ఇలా ఆలోచిస్తూ సుఖదేవ్ తన అభిప్రాయాల్ని భగత్‌సింగ్‌కు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి జవాబుగా భగత్‌సింగ్ రాసిన ఆశావహమైన లేఖే ‘కాలం అవసరం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం’ అన్న ప్రత్యుత్తరం.
కాగా, నేటి తరం పాలకులకు రాజ్యాంగ విలువలూ తెలియవు. కనుకనే పాలనా వ్యవస్థల నుంచి, విద్యా వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా ఇష్టం వచ్చినట్లు మార్చడానికి ప్రయత్ని స్తున్నారు. అందుకే బహుశా, ‘ఒడువని ముచ్చట’ అనే కవితలో కందుకూరి అంజయ్య ఆవేదనను మనమూ పంచుకుందాం:
శంకరా!
ఇప్పుడు మనుషులను
కూడగట్టే మానిసి లేడు
మంచి చెడ్డలను విప్పిచెప్పే
సాత్వికుడూ లేడు
అంతా...
వడ్లూ – పెరుగూ కలిసినట్టుంది
ఈనగాస్తే నక్కలపాలయింది
అంతా మొదటికొచ్చింది
ఒడువని ముచ్చటై కూసుంది!!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
రాజ్యాంగ విలువలకు తిలోదకాలేనా?
Published Wed, Jan 24 2024 5:22 AM | Last Updated on Wed, Jan 24 2024 5:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment