రెండో స్వాతంత్య్ర పోరాటమా? | ABK Prasad Article On Secularism In BJP India | Sakshi
Sakshi News home page

రెండో స్వాతంత్య్ర పోరాటమా?

Published Tue, Jul 23 2019 12:57 AM | Last Updated on Tue, Jul 23 2019 12:59 AM

ABK Prasad Article On Secularism In BJP India - Sakshi

‘‘దేశంలో నిజమైన సెక్యులర్‌ (లౌకిక సమ భావన) వ్యవస్థను నెలకొల్పగల అవకాశాలను కాంగ్రెస్‌ పోగొట్టుకుంది. సురక్షితమైన, ఆధునిక, సమష్టి భారతాన్ని నెలకొల్పాలన్న కల సాకారం కావడానికి ప్రజలు తోడ్పడాలి.’’ 
– ప్రధాని నరేంద్రమోదీ నూతన లోక్‌సభలో చేసిన ప్రకటన 

‘‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ భారత్‌లో ఒక ప్రజా ఉద్యమ సంస్థ. భారత బహుముఖీన చిత్ర పటాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్‌ కేంద్రకార్యాలయాన్ని దర్శించుకుని నాయకులతో చర్చలు జరిపాను. 1925లో స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర నిరంతరం వివాదాలతో కూడుకున్నదైనప్పటికీ, అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్వచ్చంద సంస్థగానే పేర్కొనాలి. జర్మనీ దేశస్తునిగా నాకు 1930– 40లలో ఆరెస్సెస్‌ చరిత్ర గురించి అవగాహన ఉంది. ఆరెస్సెస్‌ నాయకుల్లో కొందరు జర్మనీ నాజీ (హిట్లర్‌) ఉద్యమం నుంచి ఉత్తేజం పొందారని నాకు తెలుసు. కొందరికి ఇష్టమున్నా లేకున్నా ఇది వాస్తవం.’’
– జర్మనీ రాయబారి లిందర్న్‌. ది హిందూ : 21–07–2019

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 72 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘‘సురక్షితమైన, ఆధునిక, సమష్టి భారతాన్ని నెలకొల్పాలన్న కల సాకారం కావడానికి ప్రజలు తోడ్పడాలని’’ ప్రధాని మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత ప్రకటన చేయడంలో అర్థం ఏమై ఉంటుంది? ఆయన చెప్పే కల ఇంత వరకు సాకారం కాకపోవడానికి ఎవరు కారకులు? దీనికి సమాధానం.. స్వాతంత్య్రానంతరం తొలి 20 ఏళ్లు మినహాయిస్తే మిగతా దశాబ్దాలన్నింటా, స్వాతంత్య్రోద్యమంలో అశేష త్యాగాలతో భారతీయులు సాధించుకున్న స్వేచ్ఛను, విమోచనను ఒక వైపు నుంచి కాంగ్రెస్‌ అనంతర నాయకత్వం, ఆ పిమ్మట కాంగ్రెస్‌ స్థానంలో అదే స్వార్థ ప్రయోజనాలతో అధికార స్థానాలు ఆక్రమించిన ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ– ఎన్డీయే కూటమి నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ స్వతంత్ర ఆర్థిక విధాన నిర్ణయాల గురించిన తొలి ప్రకటనలకు, ప్రజలకు చేసిన వాగ్దానాలకు, స్వతంత్ర విదేశాంగ విధానానికి, అలీన విధానంతోనే దేశాన్ని అభ్యుదయమార్గం పట్టించడానికి  చేసిన తొలి ప్రయత్నాలన్నీ నేడు బుగ్గిపాలు కావడానికి ఈ రెండు శక్తులే కారణం.

తొల్లింటి సమష్టి భారత లౌకిక రాజ్యాంగ వ్యవస్థల స్వరూప స్వభావాలకే ఎసరు పెట్టి, కుల, మత, వర్గ, వర్ణ సంఘర్షణలకు తావులేని సర్వమత సమభావన లక్ష్యానికి తూట్లు పొడుస్తూ వచ్చిన దాని ఫలితమే– కేవల ‘హిందూ రిపబ్లిక్‌’ రాజ్యాంగానికి ప్రాణ ప్రతిష్ట చేసే ప్రయత్నానికి పాలకులు ఉద్యుక్తులవుతున్నట్లు ఉంది. బహుశా అందుకనే క్రాంతదర్శి అయిన భారత సెక్యులర్‌ రాజ్యాంగ నిర్మాతలలో అగ్రేసరుడైన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 1946లోనే, దేశ పరిస్థితులపై అవగాహనతో, దూరాలోచనతో ఇలా ప్రకటించారు:  ‘హిందూరాజ్‌’ పేరిట దేశాన్ని ప్రకటించడమంటే భారతదేశానికి అంత కన్నా పెద్ద విషాదకర సంఘటన మరొకటి ఉండదు. ఎట్టి పరిస్థితు ల్లోనూ ‘హిందూ రాజ్‌’ నిర్ణయాన్ని, ప్రకటనను అడ్డుకుని తీరాల్సిందే. (‘ఇండియా పార్టిషన్‌’ గ్రంథం : పే. 354–5)

మోదీ నాయకత్వంలో ఆరెస్సెస్‌–బీజేపీ కాశ్మీరం నుంచి కన్యా కుమారి దాకా, అసోం, మణిపూర్‌ నుంచి ఉత్తర ప్రదేశ్, బీహార్, హరియాణా, పంజాబ్, త్రిపుర, కర్ణాటక, కేరళ, ఒరిస్సాల వరకు దళిత, మైనారిటీలు వందలాదిమందిపై జరిగిన అత్యాచారాలు, హత్యలూ, వేధింపులకూ లెక్కలేదు. ప్రజాసమస్యలను గొంతెత్తి చాటే సామాజిక కార్యకర్తలను ప్రజలపట్ల వకాల్తా వహించి ఉద్యమించిన పలువురు చరిత్రకారులను, పాత్రికేయులను, అధ్యాపకులను, ఆర్థిక వేత్తలను వేధించి, అరెస్టు చేయడమో, దొంగచాటుగా హతమార్చడమో, లేదా విచారణ తతంగం చాటున, హంతకులకు శిక్షలు లేకుండా కేసులు మూసివేయడమో జరుగుతూ ఉంది. ఈ రోజుకీ కల్బుర్గి, పన్సారీ, లంకేష్‌లను హత్య గావించిన హంతకుల ఆచూకీ (తెలిసికూడా) ప్రకటించి, శిక్షించడం జరగలేదు. గతంలో దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, ప్రాణాలు, పుస్తెలు సహా త్యాగం చేసిన కోట్లాదిమంది స్త్రీ, పురుష యోధుల జ్ఞాపకాలు వెన్నంటుతుండగా, నేడు స్వతంత్ర భారతంలో గాడితప్పిన పాలనా వ్యవస్థలు ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాల పైన, పత్రికా ప్రసార మాధ్యమాలపైన ఉక్కుపాదం మోపి, కొన్ని సంస్థలను బెదిరించి తమకు అనుకూల బాకాలుగా మార్చుకున్న వైనం కాదనలేని ఒక నగ్న సత్యం. అందుకే దేశం రాజ్యాంగ వ్యవస్థల్ని మరింతగా ప్రజానుకూల వ్యవస్థలుగా తీర్చి దిద్దుకోవాల్సిన తరుణంలో రాజ్యాంగం హామీపడగా ‘మేముగా రచించుకుని మాకు మేముగా అంకితం చేసుకుంటున్నామని’ రాజ్యాంగంపరంగా ప్రజలు ప్రకటించుకున్న సంగతిని రాజకీయ నాయకులు మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. దేశానికి, ప్రజలకూ అబద్ధాలు చెబుతున్నారు. 

ప్రజలలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, హేతువాదాన్ని పెంచి, పోషించడాన్ని పౌర బాధ్యతల అధ్యాయంలో రాజ్యాంగం ఆదేశిస్తున్నా– దాన్ని తోసిరాజని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్థాయి నుంచి విశ్వవిద్యా లయ, కేంద్రీయ విద్యాలయాల స్థాయి వరకూ శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు, శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చిన మానవ ప్రపంచ పరిణామ చరిత్రకు వక్రభాష్యాలు పాలకులు నూరి పోసేందుకు వెరవటం లేదు, వైదిక విజ్ఞానం మీద నమ్మకాలు, పూజలు పునస్కారాలమీద వ్యక్తిగత విశ్వాసాలు వేరు, విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిరూపణను కాదనడం అజ్ఞానం. డార్విన్‌ పరిణామవాదాన్ని నిరూపణలతో విశ్వసించిన ప్రపంచ వైజ్ఞానిక శాస్త్రాన్ని కాదని మొండి వాదనలతో మానవ పరిణామవాద నిరూపణలను కాలదన్నే వారిని అన్నీ ‘కోతి చేష్టలే’నంటే బాధపడిపోయి, తాము మాత్రం డార్విన్‌ వానర సంతతికి వారసులం కాము, కేవలం రుషుల నుంచి జాలువారిన బిడ్డలమేనని, డార్విన్‌ సిద్ధాంతం అబద్ధమనీ బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు సత్యపాల్‌సింగ్‌ మానవ హక్కుల సవరణ బిల్లుపై చర్చ సందర్భంలో చెప్పారు.

దానికి దీటైన సమాధానమిస్తూ డీఎంకే సభ్యురాలు కనిమొళి ‘దురదృష్టవశాత్తు నా పూర్వీకులు ఋషులు కారు, కేవలం మానవమాత్రులు, విజ్ఞానశాస్త్ర నిరూపణ ప్రకారం నా తల్లిదండ్రులు శూద్రులు. వీరెవరూ దేవుడి బిడ్డలు కారు, దేవుడిలో ఏ భాగానికీ చెందిన వారు కారు. కానీ ఈరోజుకీ వీరందరూ మానవహక్కుల కోసమే పోరాడుతూ వచ్చారు, ఇంకా ఈ రోజుకీ పోరాడుతూనే ఉన్నారని’ నషాళానికి అంటే జవాబిచ్చారు సింగ్‌కి. ఎందుకంటే, తమది ‘సాంస్కృతిక జాతీయవాదం’ అని ఆరెస్సెస్‌–బీజేపీ కలయిక నమ్మించజూస్తోంది. మరి ఆ జాతీయ స్రవంతిలోనే, ఆ సంస్కృ తిలోనే అంతర్భాగంగా పెరుగుతూ వచ్చిన విభిన్న మతాలకు, కులాలకు, వృత్తులకు, వివిధ జాతులకు, విభిన్న భాషలకు చెందినవారు వెరసి ‘ఉమ్మడి సంస్కృతిలో, జాతీయ వాదంలో భాగస్వాములు కారా? అందుకు ఆరెస్సెస్‌–బీజేపీయులు అవుననీ చెప్పరు, కాదనీ చెప్పరు. ముంగిగా మౌనం వహిస్తారు. ఆ మౌనమే ‘హిందూ రిపబ్లిక్‌’ ఆశయాన్ని వారు సాధించే క్రమంలో ముందుకు సాగడానికి ఆస్కారమవుతుంది. 

బహుశా బీజేపీ (ఆరెస్సెస్‌) ఎంపీ సాక్షీ మహరాజ్‌ 2019 ఎన్నికల తర్వాత ఇండియాలో ఇక ఎన్నికలుండవని ప్రకటించడానికి పార్టీ లోలోపల అంతర్మథనానికి పునాది అయి ఉండాలి. పార్టీ నాయక స్థానంలో ఉన్నవారిలో ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ ధోరణుల ఫలితంగానే, రెండో అభిప్రాయాన్ని గౌరవించకపోతేమానె, కనీసం స్వీకరించగల ప్రజాస్వామిక నైజం కొరవడినందువల్లనే అర్ధంతరంగా, అనాలోచితంగా, నిరంకుశంగా మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి పేద, మధ్యతరగతి, చిన్న పారిశ్రామిక వర్గాలకు బ్యాంకులలో నగదు లావా దేవీలు జరుపుకొనకుండా నానా ఇబ్బందులకు గురిచేసినప్పుడు– ముందు రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ రాజన్, ఆ పిమ్మట వచ్చిన ఊర్జిత్‌ పటేల్, ఆ తర్వాత క్రమంగా మరి ఇద్దరు గవర్నర్లు పదవులకు రాజీ నామాలిచ్చి మౌనంగా నిరసన తెలపాల్సి వచ్చింది, అలాగే బీజేపీ– ఆరె స్సెస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టించిన విద్యా సంస్కరణలకు నిరసనగా కనీసం ఇరువురు ప్రముఖ విద్యావేత్తలు తమ వైస్‌ ఛాన్స్‌లర్‌ పదవులను అర్ధంతరంగా విడిచిపెట్టి పోవలసివచ్చింది. ఇంతటి పరిణామాలు దేశ ప్రజలు అంతకుముందు అంత ఆకస్మిక నిర్ణయాలుగా ఎరుగరు. చివరికి ప్రపంచ ప్రసిద్ధ భారత ఆర్థికవేత్తలలో ఒకరు, నోబెల్‌ బహుమాన గ్రహీత, నలందా (బౌద్ధ) విశ్వవిద్యాలయాల వైస్‌–ఛాన్స్‌లర్‌గా ఉంటున్న ప్రొఫెసర్‌ అమర్త్యసేన్, బీజేపీ పాలకుల ఒత్తిడి వల్లనే మోదీ తొలి పాలనలోనే వైదొలగవలసి వచ్చింది. పైగా– స్వామి వివేకానందను గౌరవిస్తున్నట్లు కనబడుతూనే ఆయన చికాగో (అమెరికా) ప్రపంచ సర్వమత సమ్మేళన సభలో చేసిన మహా నైతిక బోధను, దాని ప్రాశ స్త్యాన్ని బీజేపీ–పరివార్‌ పాలకులు ఆచరణలో పాటించడం మానేశారు.

ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒకే నేత’ అనే సరికొత్త పాలనా నినాదం లేదా విధానంవల్ల దేశంలో రెండో స్వాతంత్య్ర పోరాటం ద్వారానే బహుశా మోదీ ఆశిస్తున్న నిజమైన ‘సురక్ష ఆధునిక సర్వజన దేశం’ ఆవిర్భవిస్తుందేమో కళ్లు వత్తులు చేసు కుని చూద్దాం!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement