పారదర్శకతే న్యాయవ్యవస్థకు ప్రాణం | Transparency Is Soul For Law System | Sakshi
Sakshi News home page

పారదర్శకతే న్యాయవ్యవస్థకు ప్రాణం

Published Sun, Oct 11 2020 1:20 AM | Last Updated on Sun, Oct 11 2020 1:20 AM

Transparency Is Soul For Law System - Sakshi

శ్రీరాజ్యవ్యవస్థకు ఉండే సంపన్న వర్గ స్వభావం న్యాయవ్యవస్థకు కూడా ఉంటుందని ఒకప్పటి కేరళ సీఎం, మార్క్సిస్టు నాయకుడు నంబూద్రిపాద్‌ వ్యాఖ్యానించారు. ఒక్క సంపన్న వర్గ స్వభావం మాత్రమే కాదు... కుల వ్యవస్థ లోతుగా పాతుకుపోయిన మన దేశంలో రాజ్య వ్యవస్థలో భాగంగా ఉన్న న్యాయ వ్యవస్థకు ఆధి పత్య కుల స్వభావం కూడా ఉంటుందనేది కూడా మౌలిక సత్యం. ఆ వ్యవస్థ నిర్భయంగా, పక్షపాతరహితంగా, పారదర్శకంగా, స్వతం త్రంగా వ్యవహరించాలని నూటికి 80 మందిగా ఉన్న బహుజనులు కోరుకుంటున్నారు.

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొన్ని పత్రికల్లో పతాక శీర్షికలు అయ్యాయి. ‘న్యాయవ్యవస్థపై ఎవరికైనా విశ్వాసం లేకపోతే పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరవచ్చున’న్నది వాటి సారాంశం. ప్రజాస్వామ్యం మూడు స్తంభాలపై ఆధారపడి వుందని, న్యాయం అనే స్తంభం బలహీనమైతే అది అంతర్యుద్ధానికి దారితీస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించిందని కూడా పత్రికలు రాశాయి. ఈ వ్యాఖ్యలు అసాధారణమైనవి. హైకోర్టుపై ప్రచార మాధ్యమాల్లో వెలువడుతున్న బహిరంగ వ్యాఖ్యలు, విమర్శలపై ధర్మాసనం ఇలా స్పందించిందని ఆ వార్తల సారాంశం. వాస్తవంలో న్యాయవ్యవస్థ బలహీనమైపోలేదు. నిస్సహాయ స్థితిలో పడనూలేదు. ‘రాష్ట్రంలో చట్టబద్ధ పాలన(రూల్‌ ఆఫ్‌ లా) సరిగ్గా అమలు జరగడం లేదు. అది జరగకపోతే మేమే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని వినియోగిస్తామ’ని ధర్మాసనం అనడమే అందుకు నిదర్శనం. 

రాజ్యవ్యవస్థలో భాగమైన మూడు వ్యవస్థలు– శాసన, కార్య నిర్వాహక, న్యాయవ్యవస్థల్లో న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం ప్రకారం విశేషమైన స్థానం వుంది. అధికారాలు కూడా వున్నాయి. శాసనవ్యవస్థ చేసిన చట్టం రాజ్యాంగవిరుద్ధమని భావిస్తే, ఆ చట్టాన్ని కొట్టివేసే సమీక్షా ధికారం న్యాయవ్యవస్థకు వుంది. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టును మూసివేయడం అనే ప్రశ్నే తలెత్తకూడదు. ఆ తరహా వ్యాఖ్య ధర్మాసనం నుంచి రాకూడదు. న్యాయవ్యవస్థ అనేది ప్రజల అవసరం. ప్రధానంగా బలహీన వర్గాలకు దాని అవసరం ఎంతో వుంది. దేశంలో మిగిలిన రెండు వ్యవస్థలూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో తమకు జరిగే అన్యాయాన్ని సరిదిద్దడానికి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చును అనే భావం అందరిలో ఏర్పడింది.

రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ప్రజల హక్కులనూ పరి రక్షిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులూ, తీర్పులూ జారీ చేసినప్పుడల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు. అందుకు భిన్నమైన తీర్పులు వెలువడినప్పుడు ఆమోదించ లేకపోతున్నారు. భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అవి ఉద్దే శాలు ఆపాదించేలా వుండకూడదు. అలా చేస్తే చర్య తీసుకోవడానికి కోర్టు ధిక్కార చట్టం వుండనే వుంది. విమర్శల విషయంలో న్యాయమూర్తులు సంయమనంతో, ఉదాత్తంగా వ్యవహరించాలనే భావన కూడా సుప్రీంకోర్టు పలు సంద ర్భాల్లో వ్యక్తం చేసింది. 

ప్రజాభిప్రాయమే సుప్రీం
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే న్యాయ మూర్తులు ఇచ్చే తీర్పులు నూటికి నూరుపాళ్లూ న్యాయబద్ధంగా వుంటున్నాయని చెప్పలేం. అవి తప్పనిసరిగా సామాజిక ప్రయో జనం కలిగి వున్నవేనని కూడా ఆమోదించలేం. కనుకనే దిగువ కోర్టులు ఇచ్చే ప్రతి తీర్పునీ పై కోర్టులు ఖాయం చేయటం లేదు. అందుకు ఉదాహరణలు కోకొ ల్లలు. సుప్రీంకోర్టు తీర్పును అంతిమ తీర్పుగా భావించడానికి కారణం అంతకుమించిన పై కోర్టు దేశంలో లేకపోవడమే. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్త ర్వులూ, తీర్పులపైన ప్రస్తుతం ప్రజల్లో విస్తృతమైన చర్చే జరుగు తోంది. చర్చను తప్పుపట్టవల సిన అవసరం లేదు. అది ప్రజల జ్ఞానానికి, చైతన్యానికి నిదర్శనం కావొచ్చును. ఆంధ్రప్రదేశ్‌లో అధి కార పార్టీ, ప్రతిపక్షాల మధ్య పరి స్థితి అగ్గిమీద గుగ్గిలంలా వుంది. మరోవైపు ప్రతిపక్ష స్థానం కోసం టీడీపీ, బీజేపీల మధ్య వున్న పోటాపోటీ అగ్నికి ఆజ్యం పోస్తోంది.  

మరి ఈ ఉత్తర్వుల మాటేమిటి?
అయితే కొన్ని ఉత్తర్వులు చట్టపరంగా లేవని సద్విమర్శలు చేయడం కూడా తప్పనిసరి అవుతోంది. ఉదాహ రణకు రాజధాని ప్రాంతంలో భూముల బదిలీకి సంబంధించిన తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ కేసులో అసలు దర్యాప్తే జరప రాదని హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. వారంరోజులు గడువు ఇచ్చి తేల్చ వలసిందిగా హైకోర్టును సుప్రీం కోర్టు కోరింది. అలాగే గత అడ్వొ కేటు జనరల్‌తో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలు నిందితులుగా వున్న ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ కేసులో కూడా అసలు దర్యాప్తే జరపవద్దని ఉత్త ర్వులు జారీ చేయడం అసాధా రణం. అదే ఉత్తర్వులో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌తోపాటు అసలు కోర్టు ముందుకు రాని నిందితులపై కూడా ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని చెప్పడం మరింత అసాధారణం. ఇందుకు దారితీసిన అసాధారణ పరిస్థితులు ఏమిటో ఆ ఉత్త ర్వులో హైకోర్టు చెప్పలేదు. అలాంటి ఉత్తర్వులపై సహజంగానే ప్రజల్లో చర్చ జరగుతుంది. అందునా రాజధాని వ్యవహారంతో ముడిపడి వున్న కేసులు గనుక ఆ చర్చ ఉద్రేకపూరితంగా కూడా వుంటుంది

. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నదనే ప్రచారం నడుస్తున్న మాట వాస్తవం. హైకోర్టు రాజ్యాంగ ప్రకారం తీర్పులు ఇవ్వడం తప్ప అవి ప్రభుత్వానికి వ్యతిరేకమా, అనుకూలమా... వాటిని ప్రతిపక్షాలు ఎలా వినియోగించుకుంటాయి అనేది న్యాయస్థానానికి ఉండకపోవచ్చు. అయితే రాజకీయ పార్టీలు తీర్పులను, న్యాయమూర్తుల వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే వుంటాయి. కనుకనే ఇటీవల హైకోర్టు ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. అలా చేయడంలో ఆ పత్రికలకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవని భావించగలమా? వాటి వెనక రాజకీయ నాయ కుల ప్రయోజనం ఉండదని అనుకోగలమా? ఈ నేపథ్యంలోనే ఈమధ్య ఒక నిర్మాణాత్మకమైన వచ్చింది. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు తీర్పులో భాగం చేయాలన్నదే దాని సారాంశం. 

మన దేశంలో న్యాయవ్యవస్థను, ఆ మాటకొస్తే అన్ని వ్యవస్థలనూ స్వప్రయోజనాలకోసం ఉప యోగించుకునే ఆధిపత్య కులాలు, సంపన్న వర్గాలు, పార్టీలు లేకపోలేదు. అధికారంలో వున్నప్పుడూ, లేనప్పుడూ కూడా రాజ్యాంగ వ్యవస్థల్లో తమ ఏజెంట్లను ఎలా చొప్పించి ఉంచాలో ఈ వర్గాలకి బాగా తెలుసు. కనుకనే చుండూరు, అంతకుముందు కారంచేడు కేసుల్లో తీర్పులు అలా వచ్చాయి. కారంచేడు కేసులో కింది కోర్టు విధించిన శిక్షలను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఇక రిజర్వేషన్లపై సీలింగ్‌ వ్యవహారం కూడా అంతే. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు సీలింగ్‌ విధించింది. కానీ ఆర్థికంగా బలహీనవర్గాల పేరిట 10 శాతం రిజర్వేషన్లు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అదనంగా కల్పించి, ఆ రిజర్వేషన్లను 60 శాతానికి పెంచినప్పుడు మాత్రం అది స్టే ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇక ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించదు. రాజ్యాంగ పీఠికలోనే మూడు లక్ష్యాలు– సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను మన రాజ్యాంగ నిర్మాతలు ప్రస్తావించారు. 

మొదటగా చెప్పిన సామాజిక న్యాయం ఎందుకు అమలు కావడం లేదు? రాజ్యాంగ వ్యవస్థలో న్యాయవ్యవస్థ అంతర్భాగం కనుక రాజ్యవ్యవస్థకు వుండే సంపన్న వర్గ స్వభావం న్యాయవ్యవస్థకు కూడా ఉంటుందని ఒకప్పటి కేరళ ముఖ్యమంత్రి, మార్క్సిస్టు నాయకుడు నంబూద్రిపాద్‌ వ్యాఖ్యానించారు. ఒక్క సంపన్నవర్గ స్వభావం మాత్రమే కాదు... కుల వ్యవస్థ లోతుగా పాతుకుపోయిన మన దేశంలో రాజ్య వ్యవస్థలో భాగంగా వున్న న్యాయవ్యవస్థకు ఆధిపత్య కుల స్వభావం కూడా ఉంటుందనేది కూడా మౌలిక సత్యం. ఆ వ్యవస్థ నిర్భయంగా, పక్షపాతరహితంగా, పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని నూటికి ఎనభైమందిగా వున్న బహుజనులు కోరుకుంటున్నారు.
వ్యాసకర్త హైకోర్టు న్యాయవాది,
ఆంధ్రప్రదేశ్‌ కన్వీనర్, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ ‘ మొబైల్‌ : 98498 5656

శ్రీ తాను పవిత్రమైన పునాదులపై నిలిచి ఉన్నట్లుగా తనకు తానుగా భావిస్తున్న భ్రమలనుంచి భారత న్యాయవ్యవస్థ బయటకు రావలసిన సమయం ఆసన్నమైంది. ఈ నిజాన్ని చెప్పడంవల్ల మన ప్రజాస్వామ్యం అంతమైపోదు. పైగా, అది ప్రజాస్వామ్య పునాదులను బలంగా నిలపగలుగుతుంది. రాజ్యాంగంలోని విభాగాల్లో ప్రజలకు అత్యంత తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవ్యవస్థ తనలోని లోటుపాట్లపై ఇకనైనా తనిఖీకి, దర్యాప్తుకు అవకాశం ఇవ్వడం ద్వారానే మన ప్రజాస్వామ్యం గుబాళిస్తుంది.

డిస్నీ మూవీ జంగల్‌ బుక్‌ (1967)లో ఒక ఆసక్తికరమైన దృశ్యం ఉంది. కా అనే పేరున్న ఒక కొండచిలువ అందులో ప్రధాన పాత్ర అయిన మౌగ్లీని బొంగురు గొంతుతో వశీకరణకు గురి చేస్తుంది. 
‘నేను క్లిష్ట సమయాల్లో సాయం చేయని 
నీ స్నేహితుల్లాంటి దాన్ని కాను
నీవు నన్ను నమ్మవచ్చు
నన్ను నమ్ము, నన్ను మాత్రమే నమ్ము
కళ్లు మూసుకో, నాపై నమ్మకం ఉంచు
నీ చుట్టు నేను ఉన్నాననే ఎరుకతో..
ప్రశాంతంగా, గాఢంగా నిద్రపో’
మౌగ్లీ ప్రత్యర్థి పక్షంలో ఉండే కా ది ఒక సంక్లిష్ట పాత్ర. ఒక అరేళ్ల బాలిక కళ్లు విప్పార్చి ఈ ప్రామాణిక కార్టూన్‌ మూవీని చూస్తున్నప్పుడు పై పాటలో చెప్పినదానికి భిన్నంగా ఆ కొండచిలువను నమ్మకూడదని స్పష్టంగా అనిపిస్తుంది. అందునా ప్రశ్నించడానికి వీలులేని విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్పే జీవిని అసలు నమ్మకూడదనే సహజానుభూతి ఆ సినిమా చూస్తున్నంతవరకు మీకు కలుగుతూ ఉంటుంది. మన ప్రజాస్వామిక వ్యవస్థలోని అత్యంత శక్తివంతమైన విభాగం అదే రీతిలో మనల్ని కోరుతోంది. పైగా చట్టంగా దానికి పవిత్రతను కల్పించి, కోర్టు వ్యవహారాల నేర ధిక్కరణగా పేర్కొంటూ ఆయుధంగా మలిచింది. దాన్ని ఇష్టానుసారం వినియోగిస్తున్న చరిత్ర వున్నా కోర్టు ధిక్కరణ భావన నిలకడగా కొనసాగుతూనే వుంది. ఇది న్యాయస్థానాన్ని పరిరక్షించుకునేందుకుగానీ, న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీసే, దూషించే వ్యాఖ్యలనుంచి రక్షించుకునేందుకుగానీ ఉద్దేశించిన చట్టం కాదని సుప్రీంకోర్టు పదే పదే చెబుతూ వస్తోంది. అది కేవలం న్యాయవ్యవస్థ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వుంటుందని... దానిద్వారా తమకు న్యాయం లభిస్తుందని పరంపరగా ప్రజల్లో వుండే విశ్వాసానికి విఘాతం కలగకుండా చూసేందుకు మాత్రమేనని నొక్కి చెబుతూ వచ్చింది.  

అయితే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ని కోర్టు ధిక్కార చర్యకింద దోషిగా ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఆగ్రహం, ఖండనలు సహజంగానే వెలువడ్డాయి. కోర్టు ధిక్కారం ఎంత వక్రీకరణలకు గురవుతోందో వాక్‌ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణకు సంబంధించి మనకున్న ప్రాథమికహక్కుకు అది ఎంత భంగకరంగా మారిందో చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. సుప్రీంకోర్టు పెంచిపోషించిన కోర్టు ధిక్కారం అనే భావన మొత్తం న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్నే దెబ్బతీస్తోంది. కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజా విశ్వాసం దెబ్బతినేలా చేయడం సమంజసమేనా? స్వయంగా సుప్రీంకోర్టు 1995లో ఒక తీర్పు సందర్భంగా ఇదే విషయమై హెచ్చరించిందని మర్చిపోరాదు. ఈ 21వ శతాబ్ది ప్రజాస్వామ్యంలో ఏ న్యాయవ్యవస్థ అయినా సరే తనపై పౌరుల నమ్మకమే అంతరించిపోయేలా ఇలాంటి అస్పష్టమైన, నిరంకుశ దృక్పథాలను కలిగి ఉండటమే పెద్ద అసంగతమైన విషయం.

తన మౌలిక పునాదుల్లో ప్రజా విశ్వాసానికి అగ్రస్థానం ఇస్తున్నట్లు న్యాయవ్యవస్థ చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్నది జవాబుదారీతనం లేని, పారదర్శకతలేని,  ప్రజాప్రాతినిధ్యం ఏమాత్రం లేని తరహాలో న్యాయవ్యవస్ద పనితీరు కొనసాగటమే. న్యాయవ్యవస్థను పీడిస్తున్న రెండు ప్రధాన సంస్థాగత అంశాలను చర్చించడం ద్వారా దానిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పరిరక్షించాలని ప్రకటిస్తున్న కోర్టుధిక్కార చట్టానికి సంబంధించిన తాత్విక పునాదే ఇప్పుడు సమస్యాత్మకంగా ఎలా మారిపోయిందన్న విషయాన్ని ఇక్కడ ఎత్తిచూపడానికి ఈ కథనం ప్రయత్నిస్తోంది. మొదటిది. సమగ్ర డాక్యుమెంటేషన్, న్యాయవిచారణ క్రమాలను నిక్షిప్తం చేయడం అనే ప్రాథమిక ప్రక్రియలోనే న్యాయవ్యవస్థ ఎలా విఫలమవుతోందన్ని అంశాన్ని ఈ కథనం శోధిస్తుంది. ఇలాంటి రికార్డులు ఉనికిలో లేకపోవడం వల్ల న్యాయవ్యవస్థ తప్పులకు జవాబుదారీతనం లేకపోవడం, వెనుకబడిన ప్రజానీకానికి న్యాయం జరగకుండా అడ్డుకోవడం సులభంగా జరిగిపోతోంది. రెండు. జవాబుదారీతనం నుంచి న్యాయ కార్యాలయాలు వేరుపడిపోతున్నాయనే అంశాన్ని ఈ కథనం పరిశీలిస్తుంది. 

కోర్టు రికార్డులు
ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు ధిక్కార విచారణ ద్వారా వెలుగులోకి వచ్చిన న్యాయవ్యవస్థకు సంబంధించిన బాధాకరమైన వాస్తవాల్లో ఒకటి ఏదంటే, కోర్టు విచారణలకు సంబంధించిన సమగ్రమైన రాతప్రతులు, రికార్డులు లేకపోవడం. భారత రాజ్యాంగం ప్రకారం కోర్టు రికార్డులు అనే ప్రాతిపదికనే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ కోర్టు ధిక్కారచర్యలకు గాని శిక్షించే అధికారాన్ని కలిగి ఉన్నాయి. కోర్టు రికార్డులు అంటే సాక్ష్యాలను డాక్యుమెంట్‌ రూపంలో భద్రపర్చే న్యాయచర్యలు, ప్రక్రియలు. ఈ రికార్డులే న్యాయస్థానాల ముందు విచారణ ప్రక్రియలకు సాధికారిక పత్రాలవుతాయి. కోర్టు రికార్డులు అని చెబుతున్నవి వాటి నిజమైన అర్థంలో కోర్టులకు అందుబాటులో ఉండటం లేదని ప్రశాంత్‌ భూషణ్‌ కేసులో సాగిన న్యాయప్రక్రియ సాక్ష్యాధారమై నిలిచింది.

భూషణ్‌ కౌన్సిల్‌ సీనియర్‌ అడ్వకేట్‌ దుష్యంత్‌ దావే మౌఖికంగా చెప్పిన అనేక అంశాలకు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల్లో కానీ ఆదేశాల్లో కానీ చోటు లేకుండా పోయింది. ఇది న్యాయస్థానాన్ని బాగా ఇబ్బందిపెట్టింది. కోర్టు విచారణలను (ఆడియో రికార్డింగు, లైవ్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌) సమగ్రంగా డాక్యుమెంట్‌ చేయగలిగిన సాంకేతిక సాధనాలు దశాబ్దాలుగా అందుబాటులో ఉంటున్నప్పటికీ ఈ విషయంలో న్యాయవ్యవస్థ వైఫల్యం కనబడుతోంది. ఇతర దేశాల న్యాయవ్యవస్థలతో పోలిస్తే భారత న్యాయవ్యవస్థ డాక్యుమెంటేషన్‌కి సంబంధించి సమర్థ వ్యవస్థలను చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.  

దీనికి సంబంధించి మీడియా పాత్రను ప్రశంసించడానికి బదులుగా న్యాయస్థానాల్లో మీడియా ఉనికినే కోర్టు వ్యతిరేకిస్తోందన్నది వాస్తవం. లాక్‌ డౌన్‌ కాలంలో మీడియాకు ఆన్‌ లైన్‌ విచారణలను అందించే ఏర్పాట్లు కల్పించడంలో సుప్రీంకోర్టు విఫలమైంది. సుప్రీంకోర్టు ఆవరణలోని మీడియా రూమ్‌లనుంచి న్యాయ విచారణను పరిశీలించడానికే జర్నలిస్టులను పరిమితం చేశారు. మీడియా పదేపదే అభ్యర్థించినప్పటికీ న్యాయవిచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన లింకులను కోర్టు అందించలేదు. పైగా జర్నలిస్టులకు కోర్టు నుంచి అనుకోని విమర్శలు ఎదురయ్యాయి. 2020 ఆగస్టు 25న జరిగిన ఒక విచారణ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా లీగల్‌ న్యూస్‌ పోర్టల్స్‌లో ఏకపక్ష రిపోర్టింగు గురించి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ అలాంటి రిపోర్టింగు గురించి నిర్దిష్ట ఉదంతాలను ఆయన పేర్కొనలేదు.

ప్రశాంత్‌ భూషణ ఉదంతం కానీ, లాక్‌ డౌన్‌ కాలంలో జర్నలిస్టులకు న్యాయవిచారణ ప్రక్రియను వినే అవకాశంపై ఆంక్షలు విధించడం అనేవి మన న్యాయవ్యవస్థలో అసాధారణంగా జరుగుతున్న ఘటనలు కావు. మీడియా పదేపదే అభ్యర్థిస్తు వస్తున్నప్పటికీ తన కార్యాలయ ఆవరణలోకి సూర్యకాంతి చొరబడటానికి కూడా అనుమతించని రీతిలో భారతీయ న్యాయవ్యవస్థ స్పష్టంగా వ్యతిరేకతను ప్రదర్సిస్తూ వచ్చింది.  సమగ్ర కోర్టు రికార్డులు లేకపోవటం తీవ్ర పర్యవసానాలకు దారితీస్తోంది. తక్షణ ప్రాతిపదికన చూస్తే కోర్టు తీర్పులను ఉద్దేశపూర్వకంగా, అవాంఛనీయంగా తొలగిస్తున్నారు, మౌఖికంగా చెప్పినవాటిని అనిర్దిష్టంగా రికార్డు చేస్తున్నారు. కోర్టు గదిలో చేసిన ప్రకటనలను యధాతథంగా సంగ్రహించడంలో తీర్పులు విఫలమౌతున్నాయి. ఆడియో రికార్డింగుకు తావు లేకపోవడం వల్ల న్యాయమూర్తులు చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలు వారిని శిక్షకు దూరం చేస్తున్నాయి. న్యాయ విచారణ ప్రక్రియను సరైనవిధంగా రికార్డు చేసి పదిలపర్చనందునే ధర్మాసనాలు పాక్షికత, వివక్షను ప్రదర్శించడానికి కారణం అవుతున్నాయి.

న్యాయస్థానమే సుప్రీమ్‌
ఉన్నత న్యాయమూర్తుల నియమాకాన్ని 1993 నుంచి సుప్రీంకోర్టు నెలకొల్పిన కొలీజియం ద్వారా నిర్వహిస్తున్నారు. న్యాయమూర్తుల నియామకం విషయంలో ప్రభుత్వ నియంత్రణను తప్పించడానికి ఇలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే జడ్జీల నియామక ప్రక్రియ విషయంలో కూడా తనిఖీ జరగటం లేదని గుర్తించాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించిన వివరాలను చారిత్రకంగానే ప్రజలకు తెలీకుండా చేస్తున్నారు. జడ్జీల నియామకం, బదిలీలపై న్యాయ సమీక్షకు కూడా తావు లేకుండాపోయింది. హైకోర్టులకు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను నియమించడంలో బంధుప్రీతికి సంబంధించిన అనుమానాలు కొన్ని సందర్భాల్లో బహిర్గతమైనప్పటికీ వాటిపై కనీస విచారణ జరిపించే సిస్టమ్‌ కూడా మన న్యాయవ్యవస్థలో లేదు. 45 సంవత్సరాలకు పైబడిన వారినే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలన్న నిబంధనను అతిక్రమించి ఇటీవలే కొన్ని నియమకాలు జరగడం తెలిసిందే. వయోపరిమితిని ఎందుకు సడలించాల్సి వచ్చిందో కోలీజియం తీర్మానించినా ఈ అతిక్రమణ ప్రాతిపదికను ప్రజలకు బహిర్గతం చేయలేదు.

అన్నిటికంటే మించి హైకోర్టులలో, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల దుష్ప్రవర్తనకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నత న్యాయవ్యవస్థను న్యాయప్రక్రియనుంచే వేరు చేస్తున్నాయి. జడ్జీల దుష్ప్రవర్తన ఉదంతాలపై స్వతంత్ర దర్యాప్తు అథారిటీ లేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదులను ఇన్‌ హౌస్‌లోనే పరిశీలిస్తామంటూ 1997లోనే ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా కాకుండా న్యాయమూర్తులే ఈ ఫిర్యాదులపై విచారణ చేస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడినట్లవుతుందని సుప్రీంకోర్టు ఆనాడే వ్యాఖ్యానించింది. ఒకవేళ న్యాయమూర్తి తప్పు చేశారని తేలినా పార్లమెంటులో అభిశంసన ద్వారా మాత్రమే తనను తొలగించే అవకాశం ఉంది. రాజ్యాంగ న్యాయస్థానంలోని జడ్జిని తొలగించే ప్రక్రియను ఈ అభిశంసన యంత్రాగం ఒక్కసారి కూడా ఇంతవరకు వినియోగించలేదు. 

అనేక కారణాలవల్ల న్యాయవ్యవస్థపై అవిశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే న్యాయమూర్తులకు అపరిమితాధికారాలను కట్టబెట్టుతున్న ప్రక్రియనుంచి న్యాయస్థానాలను తరలించాల్సి ఉంది. న్యాయమూర్తులపై నిరంతర తనిఖీ, దర్యాప్తు చేసే వ్యవస్థ ఉనికిలోకి రావాలి. తమ చర్యలను ప్రశ్నించేవారిపై కోర్టుధిక్కారం మోపి శిక్షిస్తున్న న్యాయవ్యవస్థను దాని భూస్వామ్య అవశేషాలనుంచి బయటకు లాగాలి. ప్రజాప్రాతినిధ్యానికి అతి తక్కువ అవకాశం ఉంటున్న న్యాయవ్యవస్థకు ఉన్న తిరుగులేని అధికారమే దానిపై అనుమానాలకు దారితీస్తోంది. 

తనపై దర్యాప్తుకు, తనిఖీకి అనుమతించే ప్రగతిశీల చర్యలను చేపట్టడం ద్వారా మాత్రమే న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించగలదు. తాను సేవిస్తున్న ప్రజలకు జవాబుదారీగా ఉండటం ద్వారానే అది తన ఔన్నత్యాన్ని నిలుపుకోగలదు. తాను పవిత్రమైన పునాదులపై ఉన్నట్లుగా తనకుతానుగా భావిస్తున్న భ్రమలనుంచి భారత న్యాయవ్యవస్థ బయటకు రావలసిన సమయం ఆసన్నమైంది. ఈ నిజాన్ని చెప్పడం వల్ల మన ప్రజాస్వామ్యం అంతమైపోదు కాకపోగా అది ప్రజాస్వామ్య పునాదులను బలంగా నిలపగలుగుతుంది. జేఎమ్‌ బ్యారీ చెప్పినట్లుగా ప్రపంచమంతా విశ్వాసం, నమ్మకంపైనే ఆధారపడి ఉంది. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజల పరిరక్షణ కోసం ఇప్పుడున్న స్థానం నుంచి బలమైన పునాదులమీద నిలబడటాన్ని మన న్యాయవ్యవస్థ ఇప్పటికైనా గుర్తిస్తుందని ఆశిద్దాం.
వ్యాసకర్త బాంబే హైకోర్టు న్యాయవాది 
(ది వైర్‌ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement