పేరుకే పెద్దది | no facilities yellandu area hospital | Sakshi
Sakshi News home page

పేరుకే పెద్దది

Published Wed, Dec 25 2013 1:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

no facilities yellandu  area hospital

ఇల్లెందుఅర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ :  పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా మారింది సింగరేణి ఇల్లెందు ఏరియా ఆస్పత్రి పరిస్థితి. సంస్థ అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్న కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు, పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఫలితంగా కార్మికు లు అరకొర సౌకర్యాలు, సదుపాయాలతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళి తే... సింగరేణి పరిధిలోని ఇల్లెందు ఏరియాలో యాజమాన్యం కొన్నేళ్ల క్రితం ఆస్పత్రిని ప్రారంభించింది. అయితే ఆస్పత్రిలో తగినంత మంది డాక్టర్లు, స్పెషలిస్టులు లేకపోవడంతో కార్మిక కుటుంబాలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ప్రస్తుతం ఆస్పత్రిలో 7 డాక్టర్లు, 8 మంది నర్సులు, 16 మంది ఫార్మసిస్టులు, ముగ్గురు వార్డుబాయ్‌లు, ఆయాలు ఉన్నారు. అయితే 7గురు వైద్యుల్లో  మహిళా డాక్టర్ ఒక్కరే ఉండడంతో కార్మికుల భార్యలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో తమ వద్దకు వచ్చిన గర్భిణులు, ఇతర మహిళలను డాక్టర్లు కొత్తగూడెం ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్ మణి సెలవుపెట్టిన రోజుల్లో గైనిక్ సమస్యల తో బాధపడుతున్న మహిళలు ఆస్పత్రికి రా వడం లేదని తెలుస్తోంది. కేవలం జ్వరం, బీపీ, షుగర్‌తోపాటు ఇతర చిన్నచిన్న వ్యాధులకు మినహా ఇక్కడ వేరే జబ్బులకు వైద్యం అందడంలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భం దాల్చిన మహిళలు ప్రసవం కో సం 40 కి.మీల దూరంలోని కొత్తగూడెం ఏరి యా వైద్యశాలకు వెళ్లాల్సి వస్తుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, అనేస్థేషి యా, పిల్లల స్పెషలిస్టు, జనరల్ ఫిజిషియన్, అర్ధోపెడిక్ పోస్టులు ఐదేళ్ల నుంచి ఖాళీగా ఉన్నప్పటికీ వాటి నియామకాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కాగా, గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేసి, మహిళల అనారోగ్య సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ఎవరూ పట్టించుకోవడంలేదని కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నెలలో రెండు రోజులు మాత్రమే కొత్తగూడెం ఆస్పత్రి నుంచి వివిధ జబ్బులకు సంబంధించిన స్పెషలిస్టులను పిలిపించి కార్మికులకు మొక్కుబడిగా వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం తక్షణమే స్పందించి ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు.
 రక్తం ఉండడం లేదు..
 స్థానిక వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉన్నా రక్తం ఉండడం లేదని తెలుస్తోంది. గనిలో ఏదైనా ప్రమాదం జరిగితే రక్తం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంటుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రోగులు ఉన్న వార్డుల వెనుక భాగంలో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement