Yellandu
-
ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదంటే ఏమనాలి?
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా... నేటికీ వ్యవసాయ పనులు చేసుకుంటూ... ప్రజా సమస్యలపై పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు గుమ్మడి నరసయ్య (జీఎన్). అటువంటి నాయకుడు మూడుసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని కలిసేందుకు ప్రయత్నించారు. అయినా అపాయింట్మెంట్ ఆయనకు దొరకలేదంటే ఏమనాలి?భూముల సమస్యను ప్రస్తావించేందుకు, చెక్‌డ్యామ్ అవసరాన్నీ, లిఫ్ట్ ఇరిగేషన్ (lift irrigation) పథకాల్లోని సమస్యలను సీఎంని కలిసి విన్నవించేందుకు జీఎన్ ప్రయత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజరవర్గంలో పోడు భూములపై గిజనులకు హక్కులు కల్పించాలనీ, సీఎం ప్రకటించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు ఖాతాల్లో పడలేదనీ, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావటం లేదనే విషయాలపై ఒక వినతి పత్రాన్ని ఇచ్చేందుకు తనకు పరిచయం ఉన్న అధి కారుల ద్వారా సీఎం అపాయింట్మెంట్ కోసం జీఎన్ ప్రయత్నించారు. ముందుగా సీఎం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్నట్టు తెలియటంతో అక్కడికి వెళ్లారు. మధ్యాహ్నం లేదా సాయంత్రంలోపు సీఎం కలిసే అవకాశం ఉందని సిబ్బంది చెప్పడంతో రోజంతా నిలబడి వేచిచూశారు. కానీ, సీఎం ఆయన్ను కలిసేందుకు అనుమతించలేదు.తర్వాత తనకు పరిచయం ఉన్న అధికారులతో సీఎం కార్యా లయానికి ఫోన్ చేయిస్తే... ఏ సమయంలోనైనా సీఎం పిలవ వచ్చనే సమాచారం తెలవడంతో ఆశతో రోజంతా సెక్రటేరియట్ గేట్ బయటే పడిగాపులు కాచారు. దినం గడిచింది కానీ, సీఎం నుంచి పిలుపు రాలేదు. ఆయన నిరాశతో వెనుదిరిగారు. మరోసారి సీఎం నివాసం జూబ్లీహిల్స్‌కు వెళ్లి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఎండలో గంటల తరబడి బయట వేచిచూసినప్పటికీ నర్సయ్యను లోపలికి అనుమతించలేదు. సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ముఖ్యమంత్రిని గమనించిన గుమ్మడి నర్సయ్య సీఎం కాన్వాయ్కి ఎదురెళ్లినా... చూసీచూడనట్టుగా వెళ్లటంతో తీవ్ర అవమానంతో ఆయన వెనుదిరిగారు.ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకుల గూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah) సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. సీపీఐ ఎంఎల్ పార్టీ విప్లవ రాజకీయాల్లో రాష్ట్ర నాయకుడిగా, ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి ఐదు పర్యాయాలు (1983, 1985, 1989, 1999, 2004ల్లో) గెలిచారు. హంగు, ఆర్భాటాలకు తావు లేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యే గడిపారు. ఇప్పటికీ సామాన్య జీవితం గడుపుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ప్రజలతోనే జీవిస్తున్నారు.ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలు ముఖ్య మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయనకు ఏ క్షణమైనా అపాయింట్మెంట్ దొరికేది. 2009లో వైఎస్ రాజ శేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమ్రంతి అయినప్పుడు ఇల్లెందులో గుమ్మడి నర్సయ్య ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డిని కలిసేందుకు వెళ్ళగా రాజశేఖరరెడ్డి లేచి నిలబడి ఎదురు వెళ్లి ‘నర్సన్నా... నీవు ఓడిపోవడం ఏందన్నా!’ అంటూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలం’టూ రాజశేఖరరెడ్డి తన రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించారు. అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాత్రం దొరతనాన్ని ప్రదర్శిస్తున్నారు.చదవండి: బియ్యాల జనార్దన్ సార్ కృషికి గుర్తింపేదీ? కేసీఆర్ దర్శనం కోసం గద్దర్ పడిగాపులు కాసిన ఘటనను వివాదం చేసిన మేధావులు సీఎం నివాసం వద్ద ఫుట్ పాత్‌పై గుమ్మడి నర్సయ్య నిరీక్షిస్తున్న ఫోటోపై ఎందుకు నోరెత్తడం లేదు? ఇప్పటికైనా రేవంత్ తన పొరపాటు గ్రహించి జీఎన్ను పిలిపించుకుని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఈ ఉదంతం ఎప్పటికీ ఆయన పాలనా కాలంపై చెరగని మచ్చలా మిగిలిపోతుంది.– వెంకటేష్, పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మాతృభాషపై మమకారంతో ఓ ఆదివాసీ కుటుంబం పెళ్లి శుభలేఖ (ఉండమీరి పెళ్లి జోడ)ను కోయ భాషలో ముద్రించి ప్రత్యేకత చాటుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka Village) గ్రామానికి చెందిన సున్నం (ఉండం) సాధు సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌లో జీవనం సాగించేవారు. ఆయన మరణానంతరం పెద్ద కుమారుడు బాలరాజు కుటుంబ బాధ్యతలు చూస్తున్నాడు. కాగా, సోదరుడు శ్రీనివాస్ వివాహం లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన చింత వినీతతో మార్చి 2న జరగనుంది. దీంతో సోదరుడి వివాహ ఆహ్వాన పత్రికను కోయ భాషలో (Koya Language) ముద్రించి బంధు మిత్రులకు పంపిణీ చేశారు. కాగా, అంతరించిపోతున్న భాషను బతికించేందుకు బాలరాజు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.చదవండి: వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం -
ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు నమోదు నమోదైంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. ఓ కౌన్సిలర్‌ను ఎమ్మెల్యే కనకయ్య కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎమెల్యే కోరం కనుకయ్య, మరో 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇల్లందు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాస ఓటింగ్‌కు ముందు హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నేపథ్యంలో పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు ఆయనకు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
చెడు ప్రభుత్వం వస్తే చెడే జరుగుతుంది: సీఎం కేసీఆర్
-
పారాచూట్ అభ్యర్థులకు టికెట్ ఇవ్వొద్దని ఆందోళన
-
కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!
సాక్షి, కొత్తగూడెం: ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో అల్లాడుతున్న వినియోగదారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ కూరగాయల వ్యాపారి కుటుంబం ఉపశమనం కలిగించింది. టమాటా ధరచూస్తే నోట మాటరాని పరిస్థితి. పచ్చిమిర్చి ముట్టుకోకుండానే మంటమండుతున్న వేళ ప్రజలెవరూ మార్కెట్ ముఖం చూడకపోవడంతో పలురకాల కూరగాయల ధరలు తగ్గించింది. ఇన్నిరోజులు ధరల దరువుతో వెలవెలబోయిన మార్కెట్లో తాజాగా వినియోగదారుల సందడి నెలకొంది. ఇల్లెందుకు చెందిన కూరగాయల వ్యాపారి యాకూబ్ కుమారులు గౌస్, జానీ, ఖాజా మానవతాదృక్పథంతో ముందుకు వచ్చి ఐదు రకాల కూరగాయల ధరలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. కిలో రూ.60 పలుకుతున్న బెండ, దొండ, సొరకాయ, వంకాయ, ఆలుగడ్డను కేవలం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ విషయమై గౌస్, జానీ, ఖాజా మాట్లాడుతూ కూలీలు, చిరుద్యోగులు కూరగాయలు కొనే పరిస్థితి లేకపోవడంతో తమ తండ్రి స్ఫూర్తితో లాభనష్టాలు చూసుకోకుండా ధరలు తగ్గించినట్లు తెలిపారు. -
ఇల్లందులో వేడెక్కిన రాజకీయం
-
చిట్టీల పేరుతొ చీటింగ్...
-
తల్లయిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ.. పాపకు పేరు పెట్టిన కేసీఆర్
సాక్షి,ఇల్లెందు(కొత్తగూడెం): హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావం రోజు బుధవారం ఉదయం ఆ పార్టీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మార్కెట్ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. బీఆర్ఎస్ ఆవిర్భావం వేళ జన్మించిన బిడ్డకు ‘సుచిత్ర భారత ప్రియ’గా నామకరణం చేయాలని తనను కలిసిన హరిసింగ్ నాయక్‌కు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. హరిప్రియ దంపతులకు ఇరవై ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడం, అదేరోజు దసరా కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: నేతలకు గాలం వేస్తున్న ‘ఈటల’.. ఒక్కొక్కరుగా ‘గులాబీ’ పార్టీకి గుడ్ బై -
మన మైసూర్.. ఇల్లెందు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దసరా ఉత్సవాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు గుర్తొచ్చేది ఇల్లెందు. కర్ణాటకలోని మైసూర్ తరహాలో ఇక్కడ భారీగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా విజయదశమి రోజున జరిగే జమ్మిపూజ, దేవుడి శావ(ఊరేగింపు) చూసేందుకు ఇతర ప్రాంతాల వారు సైతం ఇల్లెందుకు వస్తుంటారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ జరుగుతున్న ఉత్సవాల తీరుతెన్నులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గోవింద్ సెంటర్ చుట్టూ.. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బొగ్గుతవ్వకాలు ఇల్లెందులో ప్రారంభమయ్యాయి. బొగ్గు గనుల్లో పని కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. బొగ్గు తవ్వకం, రవాణా ఇతర పనుల పర్యవేక్షణ కోసం బ్రిటిష్ సిబ్బంది, అధికారులు ఇల్లెందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక బొగ్గు గనులకు, బ్రిటీషర్లకు రక్షణగా నాటి సైన్యాన్ని, ఇతర సిబ్బందిని నిజాం రాజు నియమించాడు. అలా ఇల్లెందులపాడు చెరువు నుంచి ప్రస్తుత గోవింద్ సెంటర్ వరకు ఉన్న ప్రదేశంలో స్థానికులు, బ్రిటీషర్లు, నిజాం సేనలు నివసించేవారు. ఉల్లాసం కోసం భజన బృందాలు సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని ఆ రోజుల్లో చిన్న చిన్న బావులను తవ్వి బొగ్గు వెలికితీసేవారు. ఆ బావుల చుట్టే కార్మికులు ఇళ్లు నిర్మించుకుని ఉండేవారు. ప్రస్తుతం దో నంబర్ బస్తీగా పిలుస్తున్న ప్రాంతాన్ని అప్పుడు బండమీద బాయిగా పిలిచేవారు. అక్కడ రెండో నంబర్ పేరుతో గని ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే కార్మికులు అక్కడే నివసించేవారు. పని ప్రదేశాన్ని మినహాయిస్తే చుట్టూ దట్టమైన అడవిగా ఉండేది. రాత్రివేళ అడవి జంతువుల భయంతో కార్మికులు వణికిపోయేవారు. అంతేకాదు.. దుర్భరమైన పరిస్థితుల మధ్య ప్రాణా లకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేసేవారు. దీంతో వారికి మానసికోల్లాసం కోసం తొలిసారిగా నంబర్ 2 బస్తీ ఏరియాలోని కార్మికుల కుటుంబాలతో కలిసి శ్రీకృష్ణ భజన బృందం ఏర్పడింది. రాత్రివేళ కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఒక చోట చేరి కృష్ణుడి భజన చేసేవారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇల్లెందులోని ఇతర కార్మిక వాడల్లోనూ భజన బృందాలు ఏర్పడ్డాయి. అలా ఇల్లెందులపాడులో హనుమాన్, శ్రీరామ భజన బృందాలు ఏర్పాటయ్యాయి. ఇల్లెందులో జరిగిన దసరా ఉత్సవాలకు హాజరైన ప్రజలు (ఫైల్) మిషన్ స్కూల్ వద్ద జమ్మిపూజ ప్రస్తుతం మిషన్ స్కూల్‌గా పిలుస్తున్న ప్రాంతంలో బ్రిటిష్ అధికారుల వసతిగృహం, మిషన్ హాస్పిటల్ ఉండేవి. ఈ బంగళాల సమీపంలోనే జమ్మిచెట్టు ఉండేది. దసరా రోజున ఈ జమ్మిచెట్టు చెంతన పూజలు నిర్వహించేవారు. దీంతో విజయదశమి నాడు నంబర్ 2 బస్తీకి చెందిన కృష్ణ భజన బృందం, ఇల్లెందుల పాడు నుంచి శ్రీరామ భజన బృందం సభ్యులు కృష్ణుడు, రాముడి ప్రతిమలను కావడి/పల్లకిలో మోసుకూంటూ ఈ జమ్మిచెట్టు మైదానానికి చేరుకునేవారు. అక్కడ సామూహిక భజనతో పాటు జమ్మిపూజలు ఘనంగా జరిగేవి. 1940వ దశకంలో మొదలు గోవింద్ సెంటర్ పరిసర ప్రాంతాల్లోనే అధికంగా నివసించే బ్రిటిష్ కుటుంబాలు, నిజాం ఉద్యోగుల కుటుంబాలు సైతం క్రమంగా ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేవి. అలా 1940వ దశకం నుంచి ప్రభుత్వ, పాలకులంతా కలిసి ఘనంగా దసరా నిర్వహించడం మొదలైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. సందడే సందడి.. ఒకప్పుడు శ్రీరామ, శ్రీ కృష్ణ భజన బృందాలే ఇక్కడికి శావలు తీసుకొచ్చేవి. ఆ తర్వాత ఇతర కాలనీలు, అసోసియేషన్ల తరఫున కూడా శావలు తీసుకురావడం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు శావలు జమ్మిగ్రౌండ్‌కు చేరుకునేవి. జమ్మిపూజకు వచ్చిన భక్తులు చివరి శావ వచ్చేవరకూ ఎదురు చూసేలా ఉండడం కోసం 1993 నుంచి మ్యూజికల్ నైట్ సైతం ఈ వేడుకల్లో భాగమైంది. ఆ తర్వాత డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 2013 నుంచి రావణవధ సైతం ఇక్కడ వేడుకగా నిర్వహిస్తున్నారు. వీఐపీల రాక.. రాష్ట్రంలో విజయదశమి వేడుకలు అంటే ఇల్లెందులోనే అనేంత ఘనంగా జరుగుతాయి. ప్రతీ దసరా కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా వస్తుంటా రు. క్రమంగా ఇల్లెందులో కార్మికుల సంఖ్య తగ్గినా ఉత్సవాల నిర్వహణలో మాత్రం ఏ మార్పూ రాలే దు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం దసరాకు ఇల్లెందు రావడానికి ఆసక్తి కనబరుస్తారు. జమ్మి వేడుకల అనంతరం సమీపంలోని కోటమైసమ్మ జాతరకు పోటెత్తుతారు. విజయదశమి రోజు న పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లలో తెల్లవార్లూ ప్రదర్శనలు ఉంటాయి. దాదాపు 80 ఏళ్లుగా మిషన్ స్కూల్ మైదానంలో జరుగుతున్న ఉత్సవాలను ఈసారి జేకే స్కూల్ గ్రౌండ్‌కు మార్చారు. ఈ కొత్త వేదికలో జమ్మి వేడుకలు ఎలా జరుగుతాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భక్తి భావాన్ని కొనసాగిస్తున్నాం.. మా పూర్వీకులు ప్రతిరోజూ సాయంత్రం శ్రీరామ భజన మందిరంలో స్వామివారిని స్మరిస్తూ భజన చేసేవారు. దసరా ఉత్సవాల సమయంలో రథాన్ని అందంగా అలంకరించి జమ్మి గ్రౌండ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు చేసేవారు. 80 ఏళ్ల క్రితం నాటి ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్నాం. – శ్రీరామ భజన బృందం సభ్యులు, ఇల్లెందు భక్తులను ఉత్సాహ పర్చేందుకే ఇల్లెందులో దసరా, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవాళ్లం. దసరా ఉత్సవాల్లో జమ్మిగ్రౌండ్‌కు వచ్చే భక్తులను ఉత్సాహపర్చేందుకు 1983 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2013 నుంచి రావణ వధ కూడా చేస్తున్నాం. – మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఇల్లెందు భక్తులు ఆశించిన విధంగా దసరా ఉత్సవాలు దశాబ్దాలుగా ఇల్లెందులో దసరా ఉత్సవాలు మైసూర్ తరహాలో కొనసాగుతున్నాయి. గతానికి ఏ మాత్రం తీసిపోకుండా ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకోసం మున్సిపల్ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అందరం కలిసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. – దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్, ఇల్లెందు. -
మూణ్నెళ్ల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే
ఇల్లెందు: క్షణికావేశంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇద్దరిలో భర్త పరిస్థితి విషమంగా ఉంది.. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని నిజాంపేట పంచాయతీ రేపల్లెవాడకు చెందిన భూక్యా వేణు మూడు నెలల కిందట సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలకే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పురుగులమందు తాగేలా చేసింది. వేణు కలుపు నివారణకు కొట్టే మందు తాగగా సంధ్య విత్తనశుద్ధి చేసే మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వారిని ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఖమ్మానికి తరలించారు. వేణు పరిస్థితి విషయంగా ఉంది. వేణుకు తల్లి చీన్యా, సోదరుడు వీరన్న ఉండగా సంధ్యకు మాత్రం తల్లిదండ్రులు లేరు. రేపల్లెవాడలో తన పిన్ని ఇంటి వద్ద ఉండి బీఫార్మసీ వరకు చదువుకుంది. చదవండి: కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
భూకంపం అనుకొని.. రోడ్లపైకి పరుగులు
ఇల్లెందు: భూమి కంపించడంతో ఇళ్లన్నీ ఊగిపోయాయి. అరుపులు, కేకలతో ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. చుట్టూ కమ్ముకున్న పొగతో ఏం జరుగుతుందో అర్థంకాని స్థితిలో ఆందోళనలో పడ్డారు. అయితే ఇదంతా వారికి నిత్యకృత్యంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఓసీ పరిధిలోని ప్రాంతంలో ప్రతిరోజూ మధ్యాహ్నం ఓసీలో బొగ్గు కోసం సింగరేణి అధికారులు బ్లాస్టింగ్ చేపడతారు. ఈ క్రమంలో వాటి శబ్దాలకు శనివారం భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతకాలంగా ఓసీ బ్లాస్టింగ్ శబ్దాలు, భూమి కంపనాలతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సింగరేణి అధికారులకు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని 14, 15, 16 నంబర్ బస్తీలకు చెందినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు దఫాలుగా రోడ్డెక్కి ఆందోళనలు చేసినా పరిష్కారం చూపడం లేదంటున్నారు. ఓసీ బ్లాస్టింగ్లతో గోడలు బీటలు వారి ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. చదవండి: బాస్మతి బియ్యంతో ‘తిన్నంత బిర్యానీ’ -
కట్టుబాటు: రాత్రంతా శవంతో చలిలోనే
సాక్షి, ఇల్లెందు : బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కుల కట్టుబాట్ల పేరుతో తన ఇంటికి రానివ్వకుండా కులపెద్దలు అడ్డుకోవడంతో కుటుంబసభ్యులు రాత్రంతా శ్మశానవాటికలోనే జాగారం చేసిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం విజయలక్ష్మీనగర్లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయలక్ష్మీనగర్ ఏరియాకు చెందిన శానం వేణుగోపాల్ (56), హైమావతి దంపతులు హైదరాబాద్‌కు పదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. వేణు ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వేణు బుధవారం విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆయన స్వస్థలం విజయలక్ష్మీనగర్‌లోని ఇంటికి తీసుకురాగా.. వేణుకు కులంతో సత్సంబంధాలు తెగిపోయాయని, కుల కట్టడి చెల్లించని కారణంగా మృతదేహాన్ని గ్రామంలోకి గానీ, ఇంటికి గానీ తీసుకురావొద్దని కులపెద్దలు ఆంక్షలు విధించారు. దీంతో శ్మశాన వాటికలో గల డంపింగ్ యార్డు షెడ్డులో మృతదేహాన్ని దింపి.. కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రంతా చలిలోనే శవ జాగారం చేశారు. అంత్యక్రియలకు చొరవ చూపిన ప్రజాప్రతినిధులు వేణు మృతదేహాన్ని గ్రామంలోనికి రానివ్వడంలేదన్న సమాచారం అందుకున్న అక్కడి సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సభ్యుడు సురేందర్, ఉప సర్పంచ్ తాండ్ర నాగరాజు, వార్డు సభ్యులు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో కుల పెద్దలు తమ బండారం బయటపడుతుందని భావించి మెల్లగా జారుకున్నారు. అనతరం కరోనాతో మృతి చెంది ఉంటాడని భావిచడం వల్లే గ్రామంలోనికి రానివ్వలేదని కులపెద్దలు మాటమార్చి అంత్యక్రియలకు హాజరయ్యారు. అత్త ఉసురుతీసిన కోడలు ఖిల్లాఘనపురం (వనపర్తి): తరచూ తగాదాలు పెట్టుకుంటోందంటూ ఓ కోడలు గుళికలమందు తాగించి అత్తను హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన పెంటమ్మ (67) తన ఒక్కగానొక్క కుమారుడు శేషయ్యకు మంగనూరు వాసి నాగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం చేసింది. సుమారు ఐదేళ్ల క్రితం కుమారుడు మృతి చెందడంతో కోడలు, ఇద్దరు మనవళ్లతో కలిసి జీవిస్తోంది. అయితే కుటుంబ విషయాలపై అత్త తరచూ తగాదాలు పెట్టుకుంటోందని ఆగ్రహించిన నాగమ్మ బుధవారం ఉదయం తన కుమారుడు నరేశ్‌తో ఖిల్లాఘనపురం నుంచి గుళికలమందు తెప్పించింది. అనంతరం నీటిలో కలిపి అత్తకు తాగించింది. పెంటమ్మ వాంతులు చేసుకోవడం చుట్టుపక్కల వారు గమనించి మహబూబ్‌నగర్‌లోని జనరల్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై గురువారం మృతురాలి అన్న జుర్రు పెంటయ్య ఫిర్యాదు మేరకు కొత్తకోట సీఐ మల్లికార్జున్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. -
కలకలం.. చంద్రన్న అరెస్ట్
ఇల్లెందు : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి పాతూరి ఆదినారాయణ స్వామి అలియాస్ పెద్ద చంద్రన్న, గుంటూరు జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, మరో నాయకుడు దుర్గాప్రసాద్‌ను గుంటూరులో జంగారెడ్డిగూడెం పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో జిల్లాలోని ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఎన్డీ అగ్రనేతల్లో చంద్రన్న ఒక్కరే అజ్ఞాతంలో ఉన్నారు. చంద్రన్న వెంట పార్టీ ఖమ్మం – వరంగల్ ఏరియా కార్యదర్శి అశోక్ సైతం ఉన్నారనే సమాచారంతో పోలీసులు వల విసిరారని, కానీ చంద్రన్న ఒక్కరే పోలీసులకు చిక్కారని ప్రచారం సాగుతోంది.1967 నుంచి అజ్ఞాతంలో ఉంటున్న పెద్ద చంద్రన్నకు ఆదర్శ విప్లవ కమ్యూనిస్టుగా పేరుంది. పార్టీలో నిస్వార్థంగా పని చేసేందుకు తమకు సంతానం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో దంపతులిద్దరూ కు.ని. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. 1967లో ఆవిర్భవించిన సీపీఐ (ఎంఎల్).. గోదావరి పరీవాహక ప్రాంతంలో బలమైన విప్లవ ఉద్యమాన్ని నడుపుతున్న క్రమంలో 1984లో పార్టీలో సైద్ధాంతిక విభేదాల నేపథ్యంలో చీలిక ఏర్పడింది. దీనికి ముందు విప్లవ మేధావి చండ్ర పుల్లారెడ్డి (సీపీరెడ్డి)ని సిద్ధాంతపరంగా ఎదుర్కొన్న వారిలో రాయల సుభాష్‌చంద్రబోస్‌తోపాటు చంద్రన్న కూడా ఉన్నారు. చీలిక అనంతరం ప్రజాపంథాగా ఆవిర్భవించిన పార్టీకి చంద్రన్న, రాయల బోస్, పైలా వాసుదేవరావు నాయకత్వం వహించారు. సీపీ రెడ్డి నేతృత్వంలోని మరో వర్గం విమోచన గ్రూపుగా ఏర్పడింది. ఇందులో కూర రాజన్న, మ«ధు, అమర్, సత్తెన్న, ప్రసాదన్నలు సీపీకి అండగా నిలిచారు. ఇక ప్రజాపంథా కొంత కాలం తర్వాత ఎన్డీగా ఆవతరించింది. ఒక దఫా ఉమ్మడి ఎన్డీకి చంద్రన్న కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా పని చేశారు. అయితే ఎన్డీలోనూ సిద్ధాంత పర విభేధాలు సంభవించి 2013లో చీలిక ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద చంద్రన్న నాయకత్వంలో ‘ఎన్డీ చంద్రన్న వర్గం’, రాయల బోసు నాయకత్వంలో ‘ఎన్డీ రాయల వర్గం’గా ఏర్పడ్డాయి. చంద్రన్న వర్గానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఇల్లెందుకు చెందిన సాధినేని వెంకటేశ్వరరావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా చంద్రన్న సతీమణి పి.లక్ష్మి(టాన్యా) పని చేసున్నారు. అయితే చీలిక అనంతరం ఎన్డీలోని రెండు వర్గాలు కూడా మరింత క్షీణ దశకు చేరుకున్నాయి. మూడో తరానికి మిగిలింది అశోకే.. ప్రస్తుతం 73 సంవత్సరాల వయసున్న చంద్రన్న దాదాపు 53 ఏళ్లు రహస్య జీవితమే గడిపారు. ఆయన అరెస్ట్‌తో తొలితరం విప్లవకారుల్లో ఇక ఎవరూ అజ్ఞాతంలో లేనట్టే. ఇక మూడో తరం నేతల్లో వరంగల్–ఖమ్మం ఏరియా కార్యదర్శి అశోక్ ఒక్కరే అజ్ఞాతంలో ఉన్నారు. అయితే రెండు జిల్లాల్లో పోలీసుల కూంబింగ్ తీవ్రం కావడంతో వేసవికి ముందే ఆయన ఏపీకి వెళ్లినట్లు ప్రచారం సాగింది. అశోక్ గత కొంత కాలంగా పెద్ద చంద్రన్నతో కలిసి సంచరిస్తున్నారని కూడా వాదనలు వినిపిస్తుండడంతో తెలంగాణ–ఏపీ పోలీసులు అశోక్‌పై దృష్టి సారించారని, ఈ క్రమంలోనే చంద్రన్న చిక్కారని తెలుస్తోంది. అరెస్టు పట్ల పలువురి ఖండన.. ఎన్డీ అఖిల భారత కార్యదర్శి ప్రధాన కార్యదర్శి చంద్రన్నను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్ ఖండించారు. 73 ఏళ్ల వయసులోనూ పీడిత ప్రజల కోసం పోరాడుతున్న చంద్రన్న విప్లవ యో«ధుడని పేర్కొన్నారు. పార్టీ నాయకులు వై.సత్యం, రమేష్, రాసుద్ధీన్, సాంబ, గణేష్ తదితరులు ఆందోళన నిర్వహించారు. కాగా, చంద్రన్న అరెస్టును ఎన్డీ(రాయల) రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు మధు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు చండ్ర అరుణ, ఎన్టీ పట్టణ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎన్. రాజు తదితరులు ఖండించారు. చంద్రనన్ను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందులోని పార్టీ కార్యాలయంలో గుమ్మడి నర్సయ్య, మధు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. -
కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
సాక్షి, ఇల్లెందు (భద్రాద్రి కొత్తగూడెం): రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం మండంలోని హనుమంతులపాడు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాను పార్టీని మారాలని నిర్ణయించినట్లు చెప్పారు. రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ దిశంగా ప్రజలు, నాయకులు చూస్తున్నారని తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ పాలనలో సుస్థిరపాలన అందిస్తున్నారని, రాష్ట్రంలోనూ సుస్థిర పాలన కోరకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం పైసా నిధులు కేటాయించలేదని తెలిపారు. ప్రజల వద్దకు రాకుండా వారి కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం ఆయన పాలనకే చెల్లిందన్నారు. జిల్లా నుంచి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగర్‌కు, టెయిల్‌పాండ్‌కు నీటిని తరలించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్‌లో ఈ జిల్లా వాటా ఎంత అని ప్రశ్నించారు. విభజన హామీలు అటకెక్కాయని, ఉక్కు పరిశ్రమ అడ్రస్ లేదని, భూగర్భ గనులు, బొగ్గు నిక్షేపాల వెలికితీతలో కేసీఆర్ మాటలు నీటి మూటలుగా మారాయన్నారు. గిరిజన యూనివర్సిటీ అడ్రస్ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జెపీ లడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ దిశగా జిల్లా, నియెజకవర్గం నుంచి వివిధ పార్టీల నేతలు బీజేపీలోకి చేరేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు కోనేరు చిన్ని మాట్లాడుతూ..జిల్లాలో బీజేపీని తిరుగులేని శక్తిగా మారుస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నాయిని శ్రీనివాస్,భద్రు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు గోపి..?
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : న్యూడెమోక్రసీ వరంగల్ జిల్లా నాయకుడు ధనసరి సమ్మయ్య అలియాస్ గోపిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 31న గుండాల మండలం రోళ్లగడ్డ సమీపంలోని పందిగుట్ట మీద జరిగిన ఎన్కౌంటర్లో లింగన్న మృతి చెందగా గోపి తప్పించుకున్నాడు. ఐదు రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్న గోపిని వరంగల్ సమీపంలోని ఆరెపల్లి వద్ద ఆదివారం అరెస్ట్ చేసినట్లు న్యూడెమోక్రసీ వర్గాలు తెలిపాయి. గోపి పోలీసులకు చిక్కడం ఇదో రెండోసారి. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న ధనసరి సమ్మయ్య(గోపి) 2018 నవంబర్ 30న మహబూబాబాద్‌లో ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వలపన్నారు. తప్పించుకుని ఆటోలో వెళ్తుండగా అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. విడుదలయ్యాక కొంతకాలం సాధారణ జీవితం గడిపి నాలుగు నెలల క్రితమే మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. గోపిని వెంటనే మీడియా ముందు హాజరుపర్చాలని ఎన్డీ జిల్లా నాయకులు చండ్ర అరుణ, జడ సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు తదితరులు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్.నారాయణరావు విడుదల చేసిన ప్రకటనలో గోపిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని కోరారు. -
అదునుచూసి హతమార్చారు..
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : నిన్నటి వరకు ఎన్డీ నేత మధు జైళ్లో.. అదే స్థాయిలో ఉన్న లింగన్న తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ విస్తరణకు సన్నద్ధమవుతున్న వేళ అదును చూసి హతమార్చారని అనుకుంటున్నారు. 2012లో ఎన్డీలో సంభవించిన చీలిక రెండు వర్గాలకు తీరని నష్టంగా మారింది. 2016 నుంచి అగ్రనేతలంగా వరుస అరెస్టుల పర్వం జరిగింది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న గోపీ నుంచి మొదలుకొని విజయ్, రమేష్ వరకు జనజీవనంలో ఉన్న మధు, ఐలయ్య వరకు అంతా అరెస్టు అయిన నేతలే. అయితే పోలీసులు మాత్రం వీరు రెండో దఫా అజ్ఞాతంలోకి వెళ్లటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అజ్ఞాతంలో ఉన్న వారందరినీ లేకుండా చేయాలనే లక్ష్యంలో పోలీసులు వరుస అరెస్టులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న నేతలు మళ్లీ అడివి బాట పడుతుండటంతో ఒక వైపు పీడీ యాక్టులు పెట్టి జైళ్ల పాలు చేయటం, మరొక వైపు భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎన్కౌంటర్లకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. లింగన్న ఎన్కౌంటర్ లాంటి సంఘటనలు ఎన్డీకి కొత్త కాకపోయినప్పటికీ ఈ ఎన్కౌంటర్ ఆ గ్రూపుల్లోని అజ్ఞాత నేతలకు ఒక సంకేతంగా చూపించేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. లింగన్న లాంటి ఓ కీలక నేతను కోల్పోవడటం ఎన్డీకి కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు. సుదీర్ఘకాలం అజ్ఞాతంలో... సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి ప్రజలతో సత్సం బంధాలు కలిగి ప్రజల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలను సునాయాసంగా ప్రజాకోర్టుల ద్వారా పరిష్కరించి అందరినీ మెప్పించి పంపించే నేతను కోల్పోవడం తీరని లోటుగా భావిస్తున్నారు. సిద్ధాంత, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎన్డీకి ఈ తరుణంలో లింగన్నను ఎన్కౌంటర్ రూపంలో కోల్పోవటం కొంత నష్టమేనని చెప్పవచ్చు. 2017 డిసెంబబర్ 7న రఘునాథపాలెం వద్ద అరెస్టు అయిన లింగన్న కొద్ది కాలం జైలు జీవితం గడిపి బయటకు వచ్చి ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో మధు రెండో దఫా హైదరాబాద్‌లో అరెస్టు కావటంతో సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు రావటం తమకు ప్రతికూల పరిస్థితి ఎదురు కావటంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఎంపీటీసీ ఎన్నికల ముందు అజ్ఞాతంలోకి వెళ్లారు. గుండాల మండంలో మెజార్టీ ఎంపీటీసీలను కైవసం చేసుకుని ఎంపీపీని, జెడ్పీటీసీ నిలబెట్టుకున్నారు. అధికార టీఆర్ఎస్ పుంజుకుంటుదని అంతా భావించారు, కానీ ఎంపీపీ, జెడ్పీటీసీ చేజారటం, ఎన్డీ ఖాతాలో జమ కావటం లింగన్న కృషేనని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లింగన్న ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌కు ముందు.. తర్వాత ఏమైంది...? ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్‌కు ముందు ఎన్‌కౌంటర్‌కు తర్వాత ఏమి జరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు అంతుచిక్కటం లేదు. ఎన్‌కౌంటర్‌కు ముందు అక్కడ ఏమి జరిగింది.. ఎన్ని గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగింది.. ఎన్ని రోజుల నుంచి ఆ ప్రదేశంలో విడిది పొందారు.. అన్ని రోజులు ఒకే ప్రదేశంలో విడిది పొందటానికి గల కారణాలు ఏమిటి, అక్కడ విడిది పొందిన సమాచారం ఎంత మందికి తెలుసు, ఆ ప్రదేశం అంత సేఫ్ కానిది అయినా అన్ని రోజులు ఎందుకు అక్కడే విడిది పొందినట్లు, ఎన్కౌంటర్ సమయంలో ఆ స్థలంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, ఎన్కౌంటర్ తర్వాత వారంతా ఎటు వెళ్లారు.. ఇంకా గాయపడిన సభ్యులు ఉన్నారా.. వారంతా ఎన్డీ కంట్రోల్లోకి వచ్చి ఆ రోజు జరిగిన సంఘటన పూర్వాపరాలు వెల్లడించారా లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. రఘునాథపాలెంలో అరెస్టుకు పూర్వమే లింగన్న లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగిన క్రమంలోనే అరెస్టు అయి ఆరు నెలల వరకు ఇంటివద్దనే ఉండి రెండో దఫా అడవిబాట ఎందుకు పట్టాడు.. లింగన్న ఎన్‌కౌంటర్‌పై ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. బాటన్న దళంలో సభ్యుడిగా చేరిన లింగన్న 22 ఏళ్ల కాలంలో జిల్లా కార్యదర్శి, రీజియన్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. -
ఉద్రిక్తంగా గుండాల అటవీ ప్రాంతం
సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ దళ సభ్యుడు మరణించగా.. ఏడుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో దళ సభ్యుడు గాయపడి వరంగల్ వైపు వస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది. దీంతో వరంగల్ జిల్లా పోలీసులు అప్రమత్తమై వర్ధన్నపేట పట్టణం, వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారి పై విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వీరు పోలీసులకు కనిపించిన సమయంలో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ప్రస్తుతం దేవలగూడెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. లింగన్న దళానికి చెందిన ఏడుగురు సభ్యులను పోలీసుల అదుపులోకి తీసున్నారని వారికి ఎటువంటి హాని తలపెట్టవద్దని న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందు పట్టణంలో ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆధ్వర్యంలో సుమారు 300 మంది పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పోలీసులను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దళాలకు, పోలీసుల మధ్య కాల్పుల చోటుచేసుకోవడంతో గుండాల అటవీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. -
తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న గుండాల
సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దేవలగూడెం అడవుల్లో లింగన్న దళానికి, పోలీసులకు మధ్య ఉదయం నుండి భారీ ఎత్తున ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దళ కమాండర్ లింగన్నతో సహా, ఓ దళ సభ్యుడు మరణించినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసులు నిర్థారించాల్సి ఉంది. గత కొంత కాలంగా దేవలగూడెం అటవీ ప్రాంతంలో లింగన్న దళం సంచరిస్తోందన్న సమాచారం పోలీసులు అందింది. దీంతో బుధవారం ఉదయం నుంచి అజ్ఞాత దళాన్ని టార్గెట్‌గా చేసుకుని పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో తుపాకుల మోతతో దేవలగూడెం,గుండాల అటవీప్రాంతం దద్దరిల్లుతోంది. అయితే కాల్పులకు వ్యతిరేకంగా ఇల్లందు పట్టణంలో న్యూడెమోక్రసి నేతలు ర్యాలీ నిర్వహించారు. ఏకపక్షంగా జరుపుతున్న కాల్పులను నిలిపివేయాలంటూ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. -
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్లదాడి
సాక్షి, ఖమ్మం : ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడికి యత్నించారు. కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి ఈ మధ్యనే టీఆర్ఎస్లో చేరిన హరిప్రియ శనివారం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆమెను అడ్డుకున్నారు. ఈ సంఘటన ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో చోటుచేసుందకుంది. ఎమ్మెల్యేను అడ్డుకున్ననేపథ్యంలో వారితో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నా వెనుక ప్రజాబలముంది: హరిప్రియ దాడి ఘటనపై ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ..‘ నెల రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతున్నా. అలాంటిది ఎక్కడాలేని ఘటననలు కామేపల్లి మండలంలో జరుగుతున్నాయి. 11మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. మరి ఎక్కడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. నాపై దాడి చేసినవారిపై ప్రజలు తిరగబడ్డారు. నా వెనుక ప్రజా బలముంది. ఈ రోజు జరిగిన దాడి గిరిజన మహిళల మీద జరిగిన దాడి. టీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటన ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు’ అని అన్నారు. -
ఎమ్మెల్యే హరిప్రియకు ఘన స్వాగతం
సాక్షి, ఇల్లెందు: టీఆర్ఎస్లో చేరడంపై సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లి.. వారం తరువాత నియోజకవర్గానికి తిరుగుముఖం పట్టిన ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆమె రాకను పురష్కరించుకుని అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తొలుత ఇల్లెందు నుంచి బయలు దేరిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బయ్యారం సరిహద్దు నుంచి స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కనగాల పేరయ్య, పులిగళ్ల మాధవరావు, గడ్డం వెంకటేశ్వర్లు, లింగాల జగన్నాధం, బండారి వెంకన్న, మేకల మల్లిబాబు యాదవ్, ప్రముఖ విద్యాసంస్థల అధిపతి దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కొక్కు నాగేశ్వరరావు, ధాస్యం ప్రమోధ్కుమార్, యలమద్ధి రవి, సయ్యద్ ఆజం, సుధీర్తోత్లాలు అగ్ర భాగంలో నడిచారు. నెహ్రూనగర్, ముకుందాపురం, రాజీవ్‌నగర్ తండా, మహబూబాబాద్ క్రాస్ రోడ్డు, ఇల్లెందు కొత్తబస్టాండ్, జగదాంబా సెంటర్ మీదుగా వెళ్లిన ఎమ్మెల్యే.. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందు కొత్త బస్టాండ్ సెంటర్లో కొమురం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగదాంబా సెంటర్లో తెలంగాణ తల్లికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమాల్లో లాకావత్ దేవీలాల్ నాయక్, భావ్‌సింగ్ నాయక్, సూర్నబాక సత్యనారాయణ, దనుంజయ్, జేకే శ్రీను, భింగి వెంకన్న, మునిగంటి శివ, పోషం, వంగా సునిల్, మార్కెట్ రాజు, యలమందల వాసు, మధారమ్మ, వార రవి, ఆంజనేయులు, మెరుగు కార్తీక్ యాదవ్, వెంకటేష్, శ్రీకాంత్, కాంగ్రెస్ నేతలు నందకిశోర్, ఉప్పు శ్రీను, మనోహర్ తివారీ, ఓం, రవిప్రకాష్, దీపక్, ఎల్.కృష్ణ, గాజీ, రాజీవ్, మురళీ, మేకల శ్యాం, కడియాల అనిత,కంభంపాటి రేణుక, మంజ్యా శ్రీను, వత్స వెంకన్న, నూనావత్ లష్కర్, కొక్కు వెంకన్న, నల్ల సత్యనారాయణ,కొక్కు వెంకటేష్, మూల శ్రీనివాస్, వాసవీ రవీందర్, బొల్లి కొమురయ్య,భోజ్యా, జుంకిలాల్, వట్టం రాంబాబు, జీవనకుమారి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు: ఎమ్మెల్యే బానోతు హరిప్రియ రాక కోసం పట్టణంలో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు వాహనాలతో తరలి వెళ్లింది. ఇల్లెందు నుంచి బయ్యారం వరకు దారి పొడవునా ర్యాలీగా తరలి వెళ్లారు. కార్లు, టాటా ఏసీలు, మ్యాజిక్‌లు, ఆటోలు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. పూలమాలలు, శాలువాతో సన్మానం.. టేకులపల్లి: సీఎం కేసీఆర్ఆర్ను కలిసిన తరువాత తొలిసారి టేకులపల్లికి వచ్చిన ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ నాయక్‌ను కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం టేకులపల్లికి వచ్చిన ఆమెను బోడు క్రాస్ రోడ్డు సెంటర్లో పూలు చల్లుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, హరిప్రియ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను గెలిపించిన వారికి, అభిమానంతో స్వాగతం పలికిన వారికి, తన వెంట నడిచేందుకు ముందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోడ బాలు, కంభంపాటి చంద్రశేఖర్, భూక్య లాలు, బాణోతు రామ, కందస్వామి, నల్లమాస రాజన్న, ఎం.శివకృష్ణ, ప్రసాద్, వీరు, శంకర్, కిషన్, సూర్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హరిప్రియకు స్వాగత ఏర్పాట్లు
సాక్షి, ఇల్లెందు: ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ కేసీఆర్, కేటీఆర్‌లతో టీఆర్ఎస్లో చేరడంపై సమాలోచనలు చేసి ఇల్లెందుకు రానున్న సందర్భంగా స్వాగతం పలికేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించారు. దీనిపై శుక్రవారం ఇల్లెందు పెద్దమ్మగుడి వద్ద ఉన్న మామిడితోటలో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఈ సమావేశానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ నేతృత్వం వహించారు. హరిప్రియ టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు రాగా సీఎం కేసీఆర్, పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున ఇక మీదట హరిప్రియను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భావించాలని, ఆ హోదాలో తొలిసారి ఇల్లెందుకు వస్తున్నందున ఘనంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11గంటలకు ఇల్లెందు మండల సరిహద్దు నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో పట్టణంలోనికి ఆహ్వానించాలని నిశ్చయించారు. ఆమెకు తనతో చేరే వారే వెంట ఉంటారనే ఊహాగానాలు తలకిందులవుతూ.. టీఆర్ఎస్లో ఉన్న వారంతా ఆమె వైపే మొగ్గు చూపడం కలిసి వచ్చినట్లయింది. హరిప్రియ స్వాగత సన్నాహాక సభలో నాయకులు పులిగళ్ల మాధవరావు, కనగాల పేరయ్య, ఎస్.రంగనాధ్, గౌరిశెట్టి సత్యనారాయణ, బండారి వెంకన్న, లాకావత్ దేవీలాల్, అజ్మీరా భావ్‌సింగ్ నాయక్, సూర్నపాక సత్యనారాయణ, జేకే శ్రీను, మంచె రమేష్, మేకల మల్లిబాబు యాదవ్, వివిధ మండలాల నేతలు రెంటాల బుచ్చిరెడ్డి, శీలంశెట్టి ప్రవీణ్, తేజావత్ రవి, ఐలయ్య, సోమిరెడ్డి, వేముల వెంకట్, సర్పంచ్‌లో చాట్ల భాగ్యమ్మ, చీమల వీరభద్రం, మునిగంటి శివ, మార్కెట్ రాజు, యలమందల వాసూ, రామచందర్, గిన్నారపు రాజేష్, వంగా సునిల్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే హరిప్రియ గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను వీడుతున్న ఎమ్మెల్యేల జాబితాలో మరొకరు చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం సాయంత్రం ఓ లేఖ విడుదల చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను సీఎం కేసీఆర్‌ను కలసి గిరిజన ప్రాంత అభివృద్ధిపై చర్చించానన్నారు. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడిన మాటలు స్వార్థ రాజకీయం కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రస్ఫుటించాయని, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఆయన విజన్, దాని కోసం ఆయన పడుతున్న తపన తనను మంత్రముగ్ధురాలిని చేశాయని లేఖలో హరిప్రియ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రూపొందించిన ప్రణాళికలు తనను ఆకర్షింపజేశాయని, శతాబ్దాల చరిత్రగల ఇల్లెందు ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, గిరిజనం అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ బాటలో పయనించడమే శ్రేయస్కరమని, అందుకే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌తో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నానన్నారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు, వారికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులతో మాట్లాడానని, అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో హరి ప్రియ పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రమే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అందరూ భావిస్తున్నారని, అందుకే అందరి నిర్ణయం మేరకు కేసీఆర్ బాటలో నడిచి బంగారు తెలంగాణలో భాగమవుతానని ప్రకటించారు. అవసరమైతే కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫారంపై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని లేఖలో హరిప్రియ వెల్లడించారు. -
సబ్సిడీ కోత.. డీలర్లు డీలా
సాక్షి, ఇల్లెందు అర్బన్: పట్టణం, మండలంలోని రేషన్ దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యం సంచుల్లో నాలుగైదు కిలోల కోత ఉంటోంది. దీంతో డీలర్లు నష్టపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే చౌకధర బియ్యం ప్రతీ సంచిలో 50 కేజీలు ఉండాల్సి ఉండగా రేషన్ దుకాణానికి వచ్చే సరికి 43 నుంచి 47కిలోలు మాత్రమే ఉంటోంది. ప్రతీ సంచిలో ఐదారు కిలోల దాక కోత ఉంటుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో 38 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. 60వేలకు పైగా ఆహరభద్రత కార్డులు ఉన్నాయి. దాదాపు 4012 క్వింటాళ్ల బియ్యం ఇల్లెందుకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలతో అర్హులైన లబ్దిదారులకు ఎక్కడి నుంచైనా బియ్యం పొందే వెసులుబాటు ఏర్పడింది. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అనంతరం మిగిలిన స్టాక్ అంతా రాష్ట్ర ఉన్నతాధికారులకు సైతం తెలియజేసేలా ఆన్లైన్లో నమోదవుతోంది. దీంతో అక్రమాలు జరిగే ప్రసక్తే ఉండదు. ఇంత వరకు బాగానే ఉన్నా డీలర్లు బియ్యం కోసం కట్టిన డీడీకి తగినన్ని బియ్యం సరఫరా కావడంలేదు. దీంతో ప్రతి నెల డీలర్లు సొంత ఖర్చుతో 10 నుంచి 15 క్వింటాళ్ల బియ్యాన్ని తీసుకొని ప్రజలకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిబంధనలు బేఖాతరు జిల్లా నుంచి పట్టణంలోని జీసీసీ గోదాముకు వచ్చిన బియ్యాన్ని నిల్వ అనంతరం ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు తూకం వేసి పంపాల్సి ఉంది. కానీ సరాసరి లారీలో నుంచి తిరిగి లారీలోకి తరలించడం, ప్రతీ సంచిలో రంధ్రాల నుంచి బియ్యం పడిపోవడం జరుగుతోంది. దీంతో పాటు గోదాంలకు సరఫరా అయ్యే సమయంలో బియ్యం తూకం వేయకపోవడంతో అవకతవకలకు తావిచ్చినట్టైంది. ఫలితంగా తక్కువ పడిన బియిన్ని భర్తీ చేస్తూ... డీలర్లు నష్టపోతున్నారు. నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తోంది.. రేషన్ దుకాణానికి వచ్చే బియ్యం సంచుల్లో కోత ఉంటోంది. ప్రతీ సంచిలో నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తున్నాయి. అలా చేయకపోవడంతో తూకం తక్కువగా ఉండి డీలర్లు నష్టపోవాల్సి వస్తోంది -స్వరూప, డీలర్ అధికారులు పట్టించుకోవడంలేదు.. గత కొంత కాలం నుంచి మాకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో తూకం తేడాలు ఉంటున్నాయి. సంచుల్లో తక్కువగా బియ్యం వస్తోందని అనేక మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. సంచుల్లో తక్కువగా బియ్యం రావడంతో మేమే స్వయంగా ప్రతి నెలా రెండు, మూడు క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సి వస్తోంది. -కటకం పద్మావతి, డీలర్ -
మృతదేహంతో..
ఇల్లెందు : తమ కుమారుడి ఆత్మహత్యకు కారకుడైన దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ మృతదేహంతో కుటుంబీకులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఇల్లెందులోని 17వ వార్డుకు చెందిన కొమ్ము వెంకటేష్(23) శనివారం సాయంత్రం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు గత 12 ఏళ్లుగా ఇల్లెందులోని ఇద్దరు వ్యాపారుల వద్ద షాపు గుమస్తాగా పనిచేస్తున్నాడు. అనివార్య కారణాలతో వారం రోజులపాటు షాపుకు వెళ్లలేదు. శనివారం వెళ్లాడు. అతనిని యజమానులు దూషించడంతో ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో కుటుంబీకులు నేరుగా జగదాంబ సెంటర్లో వెళ్లి అక్కడ రాస్తారోకోకు దిగారు. వీరికి సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు ఐతా సత్యం, పోట్ల నాగేశ్వరావు వివరాలు తెలుకున్నారు. ఆందోళన కారులను సీఐ సారంగపాణి శాంతింపచేశారు. -
6 ఏరియాలు.. వెనుకంజ
యైటింక్లయిన్‌కాలనీ (పెద్దపల్లి జిల్లా) : నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరో 48 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకు 55.59మిలియన్ టన్ను ల ఉత్పత్తి లక్ష్యం కాగా 50.16 మిలియన్ టన్నులు(90శాతం) మాత్రమే సాధించింది. ఉత్పత్తిలో వెనుకబడిం ది. సింగరేణి వ్యాప్తంగా ఆరు ఏరియాలు వెనకంజలో ఉన్నాయి. భూగర్భ గనులు ఎక్కువగా ఉండటానికి తోడు, ఓసీపీల్లో ఓబీ వెలికితీతలో జాప్యం జరగడం.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యా ల సాధనపై ప్రభావం చూపుతోంది. సంస్థలో అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ కేవలం 18 శాతమే బొగ్గు ఉత్పత్తి సాధించి సంస్థలోనే చివరిస్థానంలో నిలిచింది. 60శాతం ఉత్పత్తితో మందమర్రి ఏరియా చివరినుంచి రెండో స్థానంలో ఉంది. వేసవి కాలం అనుకూల ప్రభావం చూపేనా! ఓసీపీలు ఉన్న ఆర్జీ–2, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల్లో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే అవకాశం కన్పిస్తుండగా, భూగర్భగనులు అధికంగా ఉన్న మిగితా ఏరియాల్లో లక్ష్యాలను సాధించడం కొంచెం కష్టంగానే ముందుకు సాగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వేసవికాలం ఓసీపీల్లో ఉత్పత్తికి అనుకూలంగా ఉండే అవకాశం కన్పిస్తుండటంతో ఎలాగైనా వార్షిక లక్ష్యాలను సాధించాలని పట్టుదలతో అధికారులు, ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు. వందశాతం ఉత్పత్తి లక్ష్యాల్లో.. సింగరేణి వ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి ఆర్జీ–3 ఏరియా 115శాతం బొగ్గు ఉత్పత్తితో ముందంజలో నిలవగా, 105శాతం ఉత్పత్తితో రెండోస్థానంలో మణుగూరు, 103శాతం తో బెల్లంపల్లి మూడోస్థానంలో, వందశాతం ఉత్పత్తితో కొత్తగూడెం నాలుగోస్థానంలో నిలిచాయి. 97శాతంతో ఆర్జీ–1 ఐదోస్థానంలో ఉంది. ఉత్పత్తి వివరాలు లక్షల టన్నుల్లో.. (09.02.18 నాటికి) ఏరియా లక్ష్యం సాధించింది శాతం ఇల్లెందు 46.90 36.49 78 ఆర్జీ–2 61.83 56.14 91 ఏపీఏ 28.20 5.19 18 భూపాలపల్లి 32.66 28.23 86 మందమర్రి 40.15 24.04 60 శ్రీరాంపూర్ 46.32 40.68 88 -
‘పల్లె’వెలుగులెప్పుడో?
ఇల్లెందు : పల్లెల శాపమో..అధికారుల కోపమో.. కానీ నేటికీ అనేక గ్రామాలు పల్లెవెలుగు బస్సులు ఎరుగవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బస్సులు నిండా ప్రయాణికులు ఎక్కక నష్టాలు సంభవిస్తున్నాయని, మినీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. అయితే బస్సు ఎరుగని పల్లెలకు ఈ మినీ బస్సులు ఎంతగానో ఉపయోగం... అలాంటి మినీ బస్సులు ఉన్నా పల్లెలకు మాత్రం రావటం లేదు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇల్లెందు ఒకటి. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా గతంలోని ఎర్రబస్సు ఎరుగని పల్లెలు సబ్ డివిజన్‌కు సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పక్కా రహదారుల్లో బస్సు ఎరుగని పల్లెలుండటం విశేషం. ఈ గ్రామాల నుంచి తమ పంట ఉత్పత్తులు తరలించటం, అవసరమైన ఎరువులు తీసుకొని వెళ్లటం, విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవటానికి పల్లె ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఒకనాడు మారుమూల పల్లెలకు వెళ్లిన బస్సులు కూడా నేడు ఆ పల్లెలకు వెళ్లటం లేదు. 10 ఏళ్ల క్రితం ఇల్లెందు మండలంలోని అమర్సింగ్తండాకు వెళ్లిన బస్సులు నేడు వెళ్లటం లేదు. గతంలో ప్రైవేట్ బస్సులు తిరిగిన దనియాలపాడు గ్రామానికి బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ఇటీవల కాలంలో ధర్మాపురం, పూబెల్లి, రేలకాయలపల్లి, మామిడిగుండాల, లచ్చగూడెం గ్రామాలను బీటీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల ఇల్లెందు నుంచి మాణిక్యారం మీదుగా కొమరారం వరకు మాత్రమే ఏకైక సర్వీసును ప్రవేశపెట్టారు. ఇల్లెందు నుంచి ధర్మాపురం, పూబెల్లి, మొండితోగుల మీదుగా ఇల్లెందుకు బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నా ఈ రూట్లలో ఆర్టీసీ అధికారులు ఏనాడు పరిశీలన చేయలేదు. ఇల్లెందు బస్టాండ్ పరిధిలోని చీమలపాడు, కామేపల్లి, ఊట్కూరు, పూబల్లి, పూసపల్లి, ధర్మాపురం, మామిడిగుండాల, లచ్చగూడెం, రొంపేడు గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. టేకులపల్లి మండలంలో ముత్యాలంపాడు నుంచి తడికెలపూడి, బొమ్మనపల్లి నుంచి కొండెంగులబోడు, మద్రాస్‌తండా, ముత్యాలంపాడు స్టేజీ వరకు పక్కా రహదారులు ఉన్నాయి. అనేక గ్రామాలకు ఇటీవల కాలంలో పీఎంజేఎస్వై, నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈ, ఆర్టికల్ 275 కింద పలు గ్రామాలకు పక్కా రహదారులు ఏర్పాటు చేశారు. అయినా ఈ పల్లెల్లో పల్లెవెలుగులు కనిపించటం లేదు. 30 మంది ప్రయాణికులతో కండక్టర్ లేకుండా వెళ్లే మినీ పల్లె వెలుగు బస్సులను ఈ రూట్లతో తిప్పితే ఆర్టీసీకి ఆదాయం, ప్రయాణికులకు ఉపయోగం ఉంటుంది. ఈ దిశగా మినీబస్ సర్వీసులను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
సీపీ బాట డిప్యూటీ దళ కమాండర్ అరెస్ట్
సాక్షి, ఇల్లందు: సీపీఐ(ఎంఎల్) సీపి బాట(చండ్ర పుల్లారెడ్డి వర్గం) డిప్యూటీ దళ కమాండర్ జోగి భద్రయ్య అలియాస్ సుభాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ ప్రకాశరావు, గుండాల సీఐ గోపి, ఎస్సై ప్రవీణ్‌లు అతడిని శనివారం మీడియా ముందు హాజరుపరిచారు. ఇల్లందు మండలం కొమరారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇతడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఇతని నుంచి ఒక రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ముద్దులొలికే చిన్నారి.. ఎవరికి చెందాలి?
సాక్షి, ఖమ్మం: ఒకవైపు పేగు బంధం, మరో వైపు పెంచిన మమకారం. పేగు తెంచుకుని పుట్టిన వెంటనే కన్నకూతురిని మరొకరికి పెంపకానికి ఇచ్చిన తల్లి మనసు తల్లడిల్లింది. తప్పు తెలుసుకుని కన్నబిడ్డను తిరిగి తెచ్చుకునేందుకు పోలీసులను ఆశ్రయించింది. కంటిపాపలా పెంచుకున్న దత్తపుత్రికను వదులుకునేందుకు పెంచిన తల్లికి మనసు రాకపోవడంతో పంచాయతీ అధికారుల వద్దకు చేరింది. ఏం జరుగుతుందో తెలియక.. ఇద్దరు తల్లులకు తాత్కాలికంగా దూరమై చిన్నారి తన్విత అమ్మ ప్రేమ కోసం అమాయకంగా ఎదురు చూస్తోంది. చిన్నారి తన్విత కోసం ఇద్దరు తల్లులు ఆరాటపడుతున్నారు. పాప తమకు కావాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటు కన్నతల్లి, అటు పెంచిన తల్లి నడుమ చిన్నారి నలిగిపోతోంది. తనను పెంచిన తల్లి దగ్గరకు తీసుకెళ్లాలని అధికారులను అమాయంగా అడుగుతోంది. తన్వితను చూసేందుకు ఇద్దరు తల్లులు రావడంతో ఖమ్మం బాలవికాస్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాపను చూసేందుకు ఇద్దరినీ అధికారులు అనుమతించలేదు. దీంతో వారిద్దరూ అక్కడ బైఠాయించారు. తన బిడ్డను ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కన్నతల్లి మాలోతు ఉమ బెదిరించింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తనకే పాపను ఇవ్వాలని భోరున విలపించింది. పెంచిన తల్లి వేముల స్వరూపకే తన్వితను అప్పగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇద్దరు తల్లులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. డీఎన్ఏ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత పాపను ఎవరికి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. వివాదం ఇదీ.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్నా కిష్టాపురం గ్రామానికి చెందిన మాలోతు ఉమ-భావ్‌సింగ్ దంపతులు ఇల్లెందులోని గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తూ స్టేషన్ బస్తీలో నివాసముంటున్నారు. వీరికి తొలి సంతానంలో పాప పుట్టింది. రెండో సంతానంగా జన్మించిన తన్వితను 2015, జనవరి 28న స్ట్రట్‌ఫిట్ బస్తీకి చెందిన వేముల స్వరూప-రాజేందర్ దంపతులకు దత్తత ఇచ్చారు. ఇందుకోసం తన్విత తల్లి, తండ్రికి రూ. 25 వేలు తీసుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత వచ్చి తన కుమార్తెను ఇచ్చేయాలని ఈ నెల 22న ఇల్లెందు పోలీసులను ఉమ ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే పాపను ఇచ్చేది లేదని పెంచిన తల్లి స్వరూప స్పష్టం చేసింది. రెండున్నరేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న తన్వితను తన నుంచి దూరం చేయడం భావ్యం కాదని ఆమె వాదిస్తోంది. -
ఒక పాప..ఇద్దరు తల్లులు
-
టీఆర్ఎస్ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని తమ పార్టీ ఖండిస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కులం పేరుతో దూషిస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, బెదిరింపులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రోడ్లపై అధికార పార్టీ సహా ఏ రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు పెట్టినా, చివరకు తన ఫ్లెక్సీలు పెట్టినా తొలగించాలని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ గతంలో ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ తన విధుల్లో భాగంగా ఆ ఆదేశాలను పాటిస్తూ ఇటీవల ఇల్లందులో ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రుల ఫ్లెక్సీలు తొలగించారని చెప్పారు. దీనికి రెచ్చిపోయిన టీఆర్ఎస్ నాయకులు కమిషనర్ ఇంటికి వెళ్లి మరీ దాడికి దిగారని తెలిపారు. ఇలా అధికారులపై దాడులు జరిగితే మానసిక స్థైర్యాన్ని కోల్పోతారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. -
ఐదుగురు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్రంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సందర్భంగా ఇక్కడ జోరుగా సాగిన బెట్టింగులను పోలీసులు రట్టు చేశారు. తాజాగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీపైనా బెట్టింగ్ రాయుళ్ల కన్నుపడింది. టీమిండియా ఆడుతున్న మ్యాచులపై భారీగా జరుగుతున్న బెట్టింగ్‌లను మరోసారి పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు బెట్టింగ్‌రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.19,500 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో సీఐ అల్లం నరేందర్ తెలిపారు. నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఎస్ఐ కె. సతీష్ ఐడీ పార్టీకి చెందిన రాజేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో నేడు జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా కీలక మ్యాచ్‌పై పందెపురాయుళ్లు భారీగా బెట్టింగులకు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌రాయుళ్లపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బెట్టింగులు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో నిఘా పెట్టారు. -
కారు డోర్ లాక్.. చిన్నారి మృతి
ఇల్లందు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): ఇల్లందు మండలం మాణిక్యారంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయ్యాయి. దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం ఎవరూ గమనించలేదు. కాసేపైన తర్వాత కుటుంబసభ్యులు గమనించారు. ఈ ఘటనలో విజ్ఞేశ్వరి(5) అనే చిన్నారి మృతి చెందగా..అబిదిక(3) అనే మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
రూ.100 కోసం ఎంతపని చేశాడు..!
ఇల్లెందు: వంద రూపాయల అప్పు.. ఓ నిండు ప్రాణం బలైపోవడానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని సంజయ్‌నగర్‌లో ఉన్న ఓ బెల్టుషాపు నిర్వాహకుడికి హమీద్(45) అనే వ్యక్తి వంద రూపాయలు అప్పు ఉన్నాడు. ఆ అప్పు గురించి ఇద్దరి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం బెల్టు షాపు నిర్వాహకుడి స్నేహితుడు ఒకరు.. హమీద్‌పై దాడిచేశాడు. బలంగా కొట్టడంతో హమీద్ అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. సీఐ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. -
ఆయుధాలు తరలిస్తున్నఇద్దరి అరెస్ట్
ఇల్లందు: అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారులో తరలిస్తున్న 9 ఎంఎం కార్బన్‌తో పాటు 5 బుల్లెట్లను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
బ్యాంకును మోసగించిన వారిపై కేసు
ఇల్లందు (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా ఇల్లందులో నకిలీ పట్టాదార్ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకులో రూ.5లక్షల 36 వేలు రుణం పొందిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లందు తహశీల్దార్ ప్రకాశ్‌రావు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు రికార్డులు తనిఖీ చేయగా బ్యాంకుకు సమర్పించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు నకిలీవని తేలిందన్నారు. ఫలితంగా నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు సృష్టించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఇల్లందు (ఖమ్మం జిల్లా) : ఇల్లందు మండలంలోని మాణిక్యాల- ఎల్లాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో వెంకన్న(32) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు. స్తంభం పైకి ఎక్కి కరెంటు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
ఇల్లందు (ఖమ్మం) : ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా ఇల్లందులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన అజ్మీరా విజయ్ కుమార్(19), బానోతు తేజస్విని(18) స్థానిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కాగా సోమవారం ఉదయం కళాశాలకని బయలుదేరిన వీరిద్దరూ ఇల్లందులోని బొగ్గు రవాణాకు ఉపయోగించే రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పొదల్లో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని విజయ్ కుమార్ తన సోదరుడికి తెలుపడంతో.. అతను సంఘటనా స్థలానికి చేరుకొని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
ఇల్లెందులో భారీ వర్షం
ఇల్లెందు : ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. అలాగే ఇల్లందు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. -
ఆశావర్కర్ల ఆందోళన
ఖమ్మం (ఇల్లందు) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ఆశావర్కర్లు ఇల్లందు మండలంలో ఆందోళనకు దిగారు. ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, ఇంతకుముందున్న బకాయిలు చెల్లించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్యకు వినతి పత్రం సమర్పించారు. -
లారీ కిందకు తోసేసిన ప్రేమోన్మాది అరెస్ట్
ఇల్లెందు (ఖమ్మం): తన ప్రేమను నిరాకరించిందని యువతిని లారీ కిందకు తోసేసిన ప్రేమోన్మాదిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సంధ్యను శేఖర్ అనే యువకుడు లారీ కిందకు నెట్టడంతో ఆమె గాయాల పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా... శనివారం తెల్లవారుజామున అతడు పట్టుబడ్డాడు. అరెస్ట్ వివరాలను డీఎస్పీ ఆర్.వీరేశ్వర్ మీడియాకు తెలిపారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా తనను ప్రేమించలేదనే సంధ్యను లారీ కిందకు నెట్టినట్టు నిందితుడు శేఖర్ తెలిపాడు. తీవ్రంగా గాయపడిన సంధ్య .. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
యువతిని లారీ కిందకు తోసేసి..
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందులో దారుణం జరిగింది. ఓ యువకుడు ఓ యువతిని లారీ కిందకు తోసివేశాడు. లారీ డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు శేఖర్, సంధ్యలకు కాలేజీలో పరిచయముంది. ఇల్లందులో రోడ్డుపై వీరిద్దరూ నడిచి వెళుతుండగా.. ఓ విషయంపై వాగ్వాదం జరగడంతో శేఖర్ హఠాత్తుగా సంధ్యను పక్కగా వస్తున్న లారీ కిందకు తోసివేశాడు. ఈ విషయాన్ని గమనించి వెంటనే బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని లారీ డ్రైవర్ చెప్పాడు. అంతకుముందు ఇద్దరి మధ్య వాదులాట జరిగినట్టు తాను చూశానని తెలిపాడు. నిందితుడు వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. యువతి అపస్మారక స్థితిలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. -
యువతిని లారీ కిందకు తోసేసి..
-
ఇల్లందులో ఉద్రిక్తత
ఇల్లందు (ఖమ్మం) : ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలటీ కేంద్రంలో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలోని పాత కూరగాయల మార్కెట్ స్థానంలో నూతన మార్కెట్ నిర్మించడం కోసం ప్రభుత్వం నుంచి రూ.24 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు గురువారం పాత దుకాణాలను తొలగించేందుకు ప్రయత్నించారు. కాగా ఎప్పటి నుంచో అక్కడే నివాసముంటూ, వ్యాపారాలు చేస్తున్నవారు ఈ దుకాణాల తొలగింపును అడ్డుకున్నారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా, సమయం కూడా ఇవ్వకుండా దుకాణాలు తొలగిస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదే విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మేం ఎన్నోసార్లు దుకాణాలు తొలగిస్తామని దుకాణదారులకు చెప్పామని తెలిపారు. దుకాణాల తొలగింపును నిరసనగా ఒక మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు మహిళను అడ్డుకొని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా మార్కెట్లోని మిగిలిన వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
తెలుగు సంస్కృతిపై మమకారం
* అమెరికా నుంచి వచ్చి ఇల్లెందులో వివాహం ఇల్లెందు: అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించింది. అమెరికా అబ్బాయినే మనుమాడినా తన పూర్వీకుల ఊరైన ఖమ్మం జిల్లా ఇల్లెందులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఇల్లెందుకు చెందిన కొలిశెట్టి నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే లిన్ అనే మహిళను వివాహమాడారు. వీరి కూతురు జయలిన్ సుశీల అప్పుడప్పుడు తాత వెంకటేశ్వర్లు వద్దకు (ఇల్లెందుకు) వచ్చిపోయేది. ఈ క్రమంలో జయలిన్కు పాట్రిక్ కోయల్ బార్కో అనే అ మెరికన్తో నిశ్చితార్థం జరిగింది. అయితే.. తమ పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరగాలని జయలిన్ పట్టుపట్టి వరుడి సహా ఇల్లెందుకు వచ్చి వేదమంత్రాల నడుమ వివాహం చేసుకుంది. -
ఇల్లెందు మున్సిపాలిటీకి పవర్ కట్
ఇల్లెందు : ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయానికి విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. రూ. 1.22 కోట్ల బిల్లు బకాయి ఉండడంతో మంగళవారం రాత్రి విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. వీధి దీపాలకు సంబంధించి రూ 92లక్షలు, కార్యాలయానికి సంబంధించి విద్యుత్ బకాయి, నీటి సరఫరా విభాగానికి సంబంధించి రూ. 30 లక్షల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. కార్యాలయానికి సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టార్చి లైట్ల వెలుగులో, సెల్ఫోన్ల లైట్లతో విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. నెలల తరబడి బిల్లు చెల్లించకపోవడం, పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో పక్క ఈ విషయంపై మున్సిపల్ అధికారులు విద్యుత్‌శాఖపై ఎదురు దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మున్సిపల్ పరిధిలోని విద్యుత్ స్తంభాలకు చెల్లించాల్సిన ట్యాక్స్ లక్షల్లో ఉండటంతో విద్యుత్‌శాఖకు నోటీసులు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ ఏఈ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. ఖమ్మం పీఐయూ సబ్ డివిజన్ కార్యాలయానికి కూడా... ఖమ్మం జడ్పీసెంటర్ : గ్రామాల ప్రగతికి బాటలు వేయాల్సిన ఇంజనీరింగ్ కార్యాలయాలు అంధకారంలో మగ్గుతున్నాయి. విద్యుత్ బకాయి చెల్లించని కారణంగా జిల్లా పరిషత్ ఆవరణంలోని ఖమ్మం పీఐయూ సబ్ డివిజన్ కార్యాలయం ఆ శాఖ అధికారులు మంగళవారం సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ కార్యాలయం సిబ్బంది అంధకారంలో ఉన్నారు. ఈ కార్యాలయంలో పనులన్నీ ఆన్లైన్లో జరుగుతుంటాయి. విద్యుత్ సరఫరా లేని కారణంగా కార్యాలయంలోని పనులన్నీ నిలిచిపోయాయి. ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇన్వర్టర్ల సహాయంతో కొంత సేపు పనులు నిర్వహించినప్పటికీ అనంతరం అవి కూడా షట్‌డౌన్ అయ్యాయి. దీంతో సిబ్బంది ఖాళీగా ఉన్నారు. ఒకే ఆవరణలో పీఐయూ, పీఆర్ఐకి చెందిన విభాగాలు పనిచేస్తుంటాయి. విద్యుత్ సరఫరా నిలిపివేతతో రెండు విభాగాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. వీటిని పర్యవేక్షించాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సైతం కార్యాలయానికి రాకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌శాఖాధికారులు మాత్రం నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశామని పేర్కొన్నారు. -
ముంపు ఎఫెక్ట్ .. ఇల్లెందుకు ఐటీడీఏ ?
ఇల్లెందు : పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయడంతో ఉనికి కోల్పోయిన భద్రాచలం ఐటీడీఏను అక్కడి నుంచి తరలించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే అందుకు అన్ని విధాలుగా అనువైన ప్రదేశం ఇల్లెందేనని, ఈ దిశగానే తరలింపు ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలు సీమాంధ్రలో విలీనం చేసిన నేపథ్యంలో భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ తన అస్తిత్వాన్ని కోల్పోతున్నందున అక్కడి నుంచి తరలించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఐటీడీఏ ప్రస్థానం ఇలా.. మొదట 1974-75 సంవత్సరంలో ఐటీడీఏను ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పాలనా సౌలభ్యం కోసం 1979లో పాల్వంచకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి 1993లో భద్రాచలానికి మార్చారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 29 మండలాలు ఉన్నాయి. భద్రాచలం డివిజన్లోని 8 మండలాలు, పాల్వంచ డివిజన్లో 10, కొత్తగూడెం డివిజన్లో 11 మండలాల పాలన ఈ ఐటీడీఏ నుంచే కొనసాగుతోంది. వీటితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి. 904 గ్రామాలు, 12,175 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భద్రాచలం ఐటీడీఏ కింద 5.61 లక్షల మంది గిరిజనులున్నారు. జిల్లా వ్యాప్తంగా 6.83 లక్షల మంది గిరిజనులు ఉండగా ఐటీడీఏ సబ్ ప్లాన్ పరిధిలోనే 5.61 మంది ఉండడం గమనార్హం. గిరిజనుల అత్యధికంగా వెనుకబడి ఉన్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, గుండాల, పినపాక మండలాలు దీని పరిధిలోనివే. చింతూరు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ గిరిజనులు కొండలపైనే నివసిస్తున్నారు. వీరందరికీ అందుబాటులో ఉండేలా భద్రాచలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అప్పట్లో అధికారులు భావించారు. అయితే నేడు భద్రాచలం డివిజన్ నుంచి కీలకమైన మండలాలు సీమాంధ్రలో కలుపుతూ నిర్ణయం తీసుకోవటంతో ఐటీడీఏ కొనసాగేందుకు సైతం స్థలం లే కుండా పోయింది. భధ్రాచలం, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలల్లో 337 గ్రామాల్లో 2.97 లక్షల జానాభా ఉండగా, ఇందులో 324 గ్రామాలకు చెందిన 1.90 లక్షల మందిని ఆంధ్రలో విలీనం చేస్తున్నారు. కేవలం 13 గ్రామాల్లోని 1.07 లక్షల జనాభా మాత్రమే తెలంగాణలో మిగులుతున్నారు. ఈ నేపథ్యంలో మెజార్టీ గ్రామాల్లో అత్యంత వెనుకబడిన గిరిజనులు నివసించే కీలక మండలాలు ఆంధ్రలో విలీనం చేస్తున్న తరుణంలో ఐటీడీఏను భద్రాచలం నుంచి మరో ప్రాంతానికి తరలించాల్సి వస్తుందనే ప్రచారం సాగుతోంది. ఇల్లెందే అనువైనదా..? ఐటీడీఏను భధ్రాచలం నుంచి పాల్వంచ, ఇల్లెందులలో ఎదో ఒక ప్రాంతానికి తరలించాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇల్లెందులోనే ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. అధికారులు సైతం భద్రాచలం నుంచి ఐటీడీఏను తరలించాల్సి వస్తే ఇల్లెందే అనువైన ప్రదేశ మని భావిస్తున్నట్లు సమాచారం. గిరిజన యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇల్లెందులోని కరెంటాఫీస్ సమీపంలో రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ భవనాన్ని ఐటీడీఏ కార్యాలయానికి ఉపయోగించుకోవచ్చని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని, ఈలోగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. -
నేడే పురపోరు
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది....కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలలో ఆదివారం పోలింగ్ జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 97 వార్డుల్లో 143 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే రెండుమున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీలలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది బరిలో నిలవడంతో అన్నిచోట్ల పోటీ తీవ్రంగానే ఉంది. నాలుగు చోట్ల 1,35,235 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 66,176 మంది, మహిళలు 69,053 మంది ఉన్నారు. కొత్తగూడెంలో అధికంగా 61,266 మంది, మధిరలో తక్కువగా 20,367 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపును అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 166 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తరలించిన ఈవీఎంలు మొరాయిస్తే ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఈవీఎంలను అందుబాటులో ఉంచుతూ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిఘా నీడలో.. పోలీస్ భారీ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు గతంలో కన్నా ఈసారి భద్రతను పెంచారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 108 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో అన్నీ సమస్యాత్మక ప్రాంతాలే. వీటిలో 34 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అలాగే ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 17 పోలింగ్ కేంద్రాలు, మధిర నగర పంచాయతీ పరిధిలో 8, సత్తుపల్లి నగర పంచాయతీలో 17 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి కట్టుదిట్టంగా భద్రతను నిర్వహిస్తున్నారు. 53 కేంద్రాల్లో వెబ్, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 41 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. పోలింగ్ ప్రక్రియలో 796 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శనివారమే ఆయా మున్సిపాలిటీల పరిధిలో రిపోర్టు చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓటరు తీర్పుపైనే ఆశలు.. వరుస ఎన్నికల నేపథ్యంలో ముందుగా జరుగుతున్న మున్సిపల్ తీర్పుపై రాజకీయపార్టీలన్నీ ఆశలుపెట్టుకున్నాయి. అభ్యర్థులు సైతం విజయం కోసం చివరి క్షణం వరకూ అన్ని యత్నాలూ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గీత దాటకుండా.. పోలింగ్ కేంద్రానికి దూరంలో అభ్యర్థుల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ‘గుర్తు.. గుర్తుంచుకోండి..’ అంటూ చివరి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ ఎన్నికల రణ రంగంలో ఓటరన్న చివరకు ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తేలనుంది. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనపోరాటం
ఇల్లెందుఅర్బన్,న్యూస్‌లైన్: ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన బుధవారం రాత్రి మండల పరిధిలోని 21 పిట్ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాయకులగూడేనికి చెందిన కిన్నెర వసంత, 21 పిట్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ సింగారపు నవీన్ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. 21 పిట్ఏరియాలో వసంత టైలరింగ్ నేర్చుకుంటున్న క్రమంలో వారిరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి వసంతను లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని వసంత కోరడంతో వాయిదాలు వేస్తూ తప్పిం చుకు తిరుగుతున్నాడు. ఆరు నెలల క్రితం మకాం వరంగల్‌కు మార్చాడు. అప్పటి నుంచి ఇంటికి తాళం వేసి ఉంటోంది. విషయం తెలుసుకున్న వసంత రోజూ ఫోన్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అనుమానం వచ్చిన బాధితురాలు పెద్ద మనుషులను ఆశ్రయించినా ఫలితంలేకుండాపోయింది. దీంతో విసిగి వేసారిన బాధితురాలు బుధవారం న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. ఆమె ఆందోళనకు తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంనర్సింహరావు మద్దతు పలికారు. వసంత న్యాయం జరిగేంత వరకు తాము కూడా ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. -
పేరుకే పెద్దది
ఇల్లెందుఅర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ : పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా మారింది సింగరేణి ఇల్లెందు ఏరియా ఆస్పత్రి పరిస్థితి. సంస్థ అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్న కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు, పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఫలితంగా కార్మికు లు అరకొర సౌకర్యాలు, సదుపాయాలతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళి తే... సింగరేణి పరిధిలోని ఇల్లెందు ఏరియాలో యాజమాన్యం కొన్నేళ్ల క్రితం ఆస్పత్రిని ప్రారంభించింది. అయితే ఆస్పత్రిలో తగినంత మంది డాక్టర్లు, స్పెషలిస్టులు లేకపోవడంతో కార్మిక కుటుంబాలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 7 డాక్టర్లు, 8 మంది నర్సులు, 16 మంది ఫార్మసిస్టులు, ముగ్గురు వార్డుబాయ్‌లు, ఆయాలు ఉన్నారు. అయితే 7గురు వైద్యుల్లో మహిళా డాక్టర్ ఒక్కరే ఉండడంతో కార్మికుల భార్యలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో తమ వద్దకు వచ్చిన గర్భిణులు, ఇతర మహిళలను డాక్టర్లు కొత్తగూడెం ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్ మణి సెలవుపెట్టిన రోజుల్లో గైనిక్ సమస్యల తో బాధపడుతున్న మహిళలు ఆస్పత్రికి రా వడం లేదని తెలుస్తోంది. కేవలం జ్వరం, బీపీ, షుగర్‌తోపాటు ఇతర చిన్నచిన్న వ్యాధులకు మినహా ఇక్కడ వేరే జబ్బులకు వైద్యం అందడంలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భం దాల్చిన మహిళలు ప్రసవం కో సం 40 కి.మీల దూరంలోని కొత్తగూడెం ఏరి యా వైద్యశాలకు వెళ్లాల్సి వస్తుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, అనేస్థేషి యా, పిల్లల స్పెషలిస్టు, జనరల్ ఫిజిషియన్, అర్ధోపెడిక్ పోస్టులు ఐదేళ్ల నుంచి ఖాళీగా ఉన్నప్పటికీ వాటి నియామకాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కాగా, గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేసి, మహిళల అనారోగ్య సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ఎవరూ పట్టించుకోవడంలేదని కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నెలలో రెండు రోజులు మాత్రమే కొత్తగూడెం ఆస్పత్రి నుంచి వివిధ జబ్బులకు సంబంధించిన స్పెషలిస్టులను పిలిపించి కార్మికులకు మొక్కుబడిగా వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం తక్షణమే స్పందించి ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు. రక్తం ఉండడం లేదు.. స్థానిక వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉన్నా రక్తం ఉండడం లేదని తెలుస్తోంది. గనిలో ఏదైనా ప్రమాదం జరిగితే రక్తం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంటుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రోగులు ఉన్న వార్డుల వెనుక భాగంలో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం. -
ఇల్లెందు సీఐపై బదిలీ వేటు
ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఎస్పీతనిఖీ చేశారు. ఇల్లెందులో ‘జీ’ టైప్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులఇల్లెందు సీఐ కె.రవీందర్‌పై బదిలీ వేటు పడింది. ఆయన పనితీరు సరిగా లేదని, అన్నింటా విఫలమయ్యారని, అందుకే వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు మారుస్తున్న ట్టు ఎస్పీ రంగనాధ్ చెప్పారు. ను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన దొంగతనాలను ఛేదించటంలో, ట్రాఫిక్ నియంత్రణలో, ఫిర్యాదులను పరిష్కరించటంలో, సర్కిల్ పర్యవేక్షణలో ఆయన విఫలమయ్యారని చెప్పారు. అందుకే ఆయనను వీఆర్‌కు మార్చినట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో సమర్థుడైన సీఐని, మరో ఎస్ఐని నియమిస్తామని అన్నారు. ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిందే పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఎస్పీ అన్నారు. అలా జరగనట్టయితే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుదారులు కూడా రసీదులు తీసుకోవాలని సూ చించారు. ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేసి సరైన దర్యాప్తు చేసినట్టయితే ఫిర్యాదుదారుడికి న్యాయం జరుగుతుందని అన్నారు. రౌడీయిజాన్ని సహిం చేది లేదన్నారు. పోలీసు సంక్షేమానికి సముచిత స్థానం కల్పిస్తున్నామని, అనారోగ్యంతో బాధపడే పోలీసులకు వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా వారికి పోలీస్ స్టేషన్లలోనే విధులు అప్పగిస్తున్నామని అన్నారు. జిల్లాలో నక్సలిజం అదుపులో ఉందన్నారు. పోలీస్ ఇంటిలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నామన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, బెల్టు షాపుల నిరోధంపై, మద్యం షాపుల ముందు రోడ్లపై నిలబడి (మద్యం) తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశానంతరం, డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. -
గిరిజనుల మధ్య మైనింగ్ చిచ్చు
ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు మండలంలోని రొంపేడు పంచాయతీ మామిడిగుండాల వద్ద డోలమైట్ మైన్ లీజ్ కోసం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. మైనింగ్‌కు అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం పరస్పరదాడులకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం మధ్యాహ్నం మామిడిగుండాల గ్రామంలో గ్రామ సర్పంచ్ సూర్ణపాక పార్వతి అధ్యక్షతన మైనింగ్ లీజు గ్రామ సభ ఏర్పాటు చేశారు. సర్వేనంబర్ 130/2/ఏలోని 4-80 హెక్టార్లలో డోలమైట్ వెలికి తీసేందుకు 2013 ఫిబ్రవరి 15వ తేదీన గుగులోత్ సోములు, గుగులోత్ రాజేశ్వరిలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మైనింగ్ లీజుకు సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పార్వతి, ఎంపీడీఓ నారాయణమ్మ, ఈఓఆర్డీ బాలాజీ, గ్రామ కార్యదర్శి మహేష్‌లు వివరించారు. ఈ సభలో గ్రామానికి చెంది ముక్తి కృష్ణ తదితరులు జోక్యం చేసుకుని భూమి, యజమాని, పట్టాదారు వివరాలు కావాలని, పిసా చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించాలని కోరారు. రెవెన్యూగ్రామ పరిధిలోని గిరిజనేతరులను గ్రామ సభ నుంచి పంపించాలని అధికారులను కోరారు. ఈ విషయంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ముక్తి కృష్ణ తీవ్రంగా ఆక్షేపించారు. గిరిజన చట్టాలు ఉల్లఘించి 1/70 చట్టం ఉన్నా 2011లో గిరిజనేతరులు పట్టాలు పొందారని మరోమారు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా ఎన్డీ చంద్రన్న వర్గం నేతలు మాజీ ఎంపీపీ ఎదళ్లపల్లి సత్యం, బయ్యారం మండలానికి చెందిన మాజీ సర్పంచ్ సనప పొమ్మయ్య, మోకాళ్ల రమేష్ తదితరులు గ్రామసభలో మాట్లాడుతూ స్థానిక గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చట్టాలను ఉల్లంఘించి మైనింగ్ లీజు పొందేందుకు బినామీలు యత్నిస్తున్నారని, స్థానికేతరులకు పట్టాలు ఇచ్చారని, స్థానిక గిరిజనులకే చెందాల్సిన మైనింగ్లను ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కట్టబెడుతున్నారని అన్నారు. అధికారులు మాత్రం చట్టాలు, పట్టాలు తమకు సంబంధం లేదన్నట్లు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గ్రామ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో మైనింగ్‌కు అనుకూలంగా ఉన్న మామిడి గుండాలకు చెందిన రామకృష్ణ, ప్రభాకర్‌లు జోక్యం చేసుకుని గ్రామసభలో మెజార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని, ఒక్కరి మాటే వినాల్సిన అవసరం లేదని ముక్తి కృష్ణకు అడ్డుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులకు దిగారు. ఈ క్రమంలో సర్పంచ్ పార్వతీ మైనింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో స్థానికులకు, చుట్టుపక్కల గ్రామాల వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అధికారులు తీర్మానంపై సంతకాలు తీసుకుంటుండగా ఓ యువకుడు వచ్చి ఆ పుస్తకాన్ని చింపేశాడు. దీనిని గుర్తించిన మైనింగ్ అనుకూల వర్గం వారు అతనిని పట్టుకుని చితకబాదారు. పోలీసుల ఎదుటే గ్రామస్తులు బాహాబాహీకి దిగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు వారు యత్నించారు. ఈ క్రమంలో ముక్తి కృష్ణ ఆధ్వర్యంలో పలువురు టెంటును తొలిగించి, కుర్చీలు వేసిరి వేశారు. అక్కడి నుంచి వ్యతిరేక వర్గం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోగా, గ్రామసభకు అనుకూల వర్గం తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేశారు. ఏఎస్సై హఫీజ్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. మైనింగ్ గ్రామ సభకు ప్రజలను తరలించి అనుకూలంగా చేతులెత్తించాలని సూచిస్తూ ఆదివారం రాత్రి తమకు వెయ్యి రూపాయలు ఇచ్చారని మామిడి గుండాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యాతండాకు చెందిన దారావత్ నందీలాల్ వివరించారు. మామిడిగుండాల మైనింగ్ లీజు గ్రామసభ ఏకపక్షంగా నిర్వహించారని, స్థానిక గిరిజనులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులతో తీర్మానం చేయించుకున్నారని తుడుందెబ్బ మండల అధ్యక్షులు ఈసం కృష్ణ ఆరోపించారు. గిరిజన చట్టాలు ఉల్లంఘించి పట్టాలు పొందటం, స్థానిక గిరిజనుల భాగస్వామ్యం లేకుండా స్థానికేతరులకు మైనింగ్ లీజు కట్టబెట్టడం వల్ల గిరిజనుల సంపద తరలిపోతుందని, ఈ విషయంలో అధికారులు పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నారని ఎన్డీ చంద్రన్న వర్గం లీగల్ నేతలు ఎదళ్లపల్లి సత్యం, సనప పొమ్మయ్య, మోకాళ్ల రమేష్‌లు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిధ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్తామన్నారు.