ఇల్లెందు : ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయానికి విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. రూ. 1.22 కోట్ల బిల్లు బకాయి ఉండడంతో మంగళవారం రాత్రి విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. వీధి దీపాలకు సంబంధించి రూ 92లక్షలు, కార్యాలయానికి సంబంధించి విద్యుత్ బకాయి, నీటి సరఫరా విభాగానికి సంబంధించి రూ. 30 లక్షల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. కార్యాలయానికి సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
టార్చి లైట్ల వెలుగులో, సెల్‌ఫోన్‌ల లైట్లతో విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. నెలల తరబడి బిల్లు చెల్లించకపోవడం, పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో పక్క ఈ విషయంపై మున్సిపల్ అధికారులు విద్యుత్‌శాఖపై ఎదురు దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మున్సిపల్ పరిధిలోని విద్యుత్ స్తంభాలకు చెల్లించాల్సిన ట్యాక్స్ లక్షల్లో ఉండటంతో విద్యుత్‌శాఖకు నోటీసులు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ ఏఈ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.
ఖమ్మం పీఐయూ సబ్ డివిజన్ కార్యాలయానికి కూడా...
ఖమ్మం జడ్పీసెంటర్ : గ్రామాల ప్రగతికి బాటలు వేయాల్సిన ఇంజనీరింగ్ కార్యాలయాలు అంధకారంలో మగ్గుతున్నాయి. విద్యుత్ బకాయి చెల్లించని కారణంగా జిల్లా పరిషత్ ఆవరణంలోని ఖమ్మం పీఐయూ సబ్ డివిజన్ కార్యాలయం ఆ శాఖ అధికారులు మంగళవారం సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ కార్యాలయం సిబ్బంది అంధకారంలో ఉన్నారు.
ఈ కార్యాలయంలో పనులన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతుంటాయి. విద్యుత్ సరఫరా లేని కారణంగా కార్యాలయంలోని పనులన్నీ నిలిచిపోయాయి. ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇన్వర్టర్ల సహాయంతో కొంత సేపు పనులు నిర్వహించినప్పటికీ అనంతరం అవి కూడా షట్‌డౌన్ అయ్యాయి. దీంతో సిబ్బంది ఖాళీగా ఉన్నారు. ఒకే ఆవరణలో పీఐయూ, పీఆర్‌ఐకి చెందిన విభాగాలు పనిచేస్తుంటాయి.
విద్యుత్ సరఫరా నిలిపివేతతో రెండు విభాగాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. వీటిని పర్యవేక్షించాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సైతం కార్యాలయానికి రాకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌శాఖాధికారులు మాత్రం నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశామని పేర్కొన్నారు.
ఇల్లెందు మున్సిపాలిటీకి పవర్ కట్
Published Wed, Oct 1 2014 3:19 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement