విద్యుత్‌కు అంతరాయం
► కలపాక 400 కేవీలో సాంకేతిక లోపం
► 900 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
► జిల్లా వ్యాప్తంగా అత్యవసరలోడ్ రిలీఫ్’
► ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యుత్ కోత
సమయం సరిగ్గా తెల్లవారుజాము 3.55 నిమిషాలు.. ఏసీలు, ఫ్యాన్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో జిల్లా ప్రజలు ఉస్సూరంటూ నిద్రలేచారు. పది నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుందిలే అని ఎదురుచూశారు. గంటలు గడిచినా నిరీక్షణ తప్పలేదు.
విద్యుత్ అంతరాయంతో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఏడుగంటల అనంతరం విద్యుత్ పునరుద్ధరించినప్పటికీ సాయంత్రానికి కూడా గ్రిడ్ అనుసంధానం జరగకపోవడంతో ఫలితం దక్కలేదు. కోట్లాది రూపాయల నష్టం ఏర్పడింది.
విద్యుత్ లోడ్ రిలీఫ్ కారణంగా విశాఖ మీదుగా రాకపోకలు సాగించాల్సిన 16 రైళ్లు గంట ఆలస్యంగా నడిచాయి. పలు ైరె ళ్లు దువ్వాడ దరిలో, మరికొన్ని గోపాలపట్నంలో ఆగిపోగా.. తక్కిన రైళ్లు విశాఖ స్టేషన్‌కే పరిమితమయ్యాయి.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘పంచాయతీరాజ్ దివస్’ కార్యక్రమానికీ కరెంట్ తిప్పలు తప్పలేదు. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సగం నుంచే ప్రసారమైంది. జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో మోదీ ప్రసంగం ప్రసారం కావలసివుండగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సాధ్యం కాలేదు.
టీవీలు మూగబోయాయి. సెల్‌ఫోన్లు చార్జింగ్ తాగేశాయి. ఉక్కపోతతో ఒళ్లంతా మండిపోతోంది. ఇదీ ఆదివారం రోజున జిల్లా ప్రజల అవస్థలు. పరవాడ మండలం కలపాకలోఏపీ ట్రాన్స్‌కో పరిధిలో నడుస్తున్న 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో తెల్లవారుజామున సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
సాక్షి, విశాఖపట్నం: చిన్న సమస్య అనుకున్నది పెద్ద తంటాయే తెచ్చిపెట్టింది. విశాఖ జిల్లాతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో కూడా చీకట్లు నింపింది. కలపాక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బస్‌బార్‌కు సంబంధించిన కెపాసిటర్ ఓల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. 5 గంటల వరకూ పెందుర్తి ఫీడర్ పని చేసింది. డైరీ ఫాంకు అక్కడి నుంచే విద్యుత్ సరఫరా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత లోడ్ పెరిగి అదికూడా ఆగిపోయింది. అదే కాదు దాదాపు 32 విద్యుత్ సబ్‌స్టేషన్లు తొలుత ట్రిప్ అయ్యాయి. లోడ్ పెరగడంతో మిగతా 50 సబ్‌స్టేషన్ల పరిధిలోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.అసలే మండిపోతున్న ఎండలు, మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోయారు.
900 మెగావాట్ల విద్యుత్‌కు అంతరాయం:
జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నాలుగు జిల్లాలకు సరఫరా అయ్యే సుమారు 900 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. 400 కేవీ దెబ్బతినడంతో దాని ప్రభావం వల్ల నాలుగు జిల్లాల్లోని 132 కేవీ, సబ్‌స్టేషన్లు 200లకు పైగా ట్రిప్ అయ్యాయి. దీంతో అత్యవసర లోడ్ రిలీఫ్‌ను ‘ఏపీఈపీడీసీఎల్’ ప్రకటించింది. ట్రాన్స్‌కో అధికారులు హుటాహుటిన మరమ్మతులు ప్రారంభించారు. ఉదయం 7గంటలకే 600 మెగావాట్లు సరఫరా పునరుద్ధరించారు. సాయంత్రం 5.30 గంటలకు సమస్యను పూర్తిగా పరిష్కరించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (ఓఅండ్‌సీఎస్) పివివి సత్యనారాయణ ప్రకటించారు.
వేధించిన ఓల్టేజ్ సమస్య:
పవర్ గ్రిడ్‌లో లోపం తలెత్తి దానిని పునరుద్ధరించే క్రమంలో ఓల్టేజ్ సమస్యలు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా డిమాండ్ తగ్గిపోవడంతో హై ఓల్టేజ్ పెరిగిపోయింది. 132 కేవీ సబ్‌స్టేషన్లను ట్రాన్స్‌కో పునరుద్ధరించి సరఫరా అందిస్తుంటే ఏపీఈపీడీసీఎల్ అధికారులు తమ పరిధిలోని 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల ను చార్జ్ చేస్తుంటే లోడ్ పెరిగిపోయి ఒక్కసారిగా ఫీడర్లు ట్రిప్ అవ్వడం ప్రారంభమైంది. ఇది అధికారులకు సవాలుగా మారింది. చేసేది లేక ‘అత్యవసర లోడ్ రిలీఫ్’ విధించారు.ఫీడర్ల వారీగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ ఓ ల్టేజ్‌ను బ్యాలెన్స్ చేశారు. అనంతరం ఒకేసారి పలు ఫీడర్లు టార్జ్ చేయడం ద్వారా పంపిణీని సమన్వయం చేయగలిగారు. ఈ ప్రక్రియలో వినియోగదారులకు వచ్చిపోయే విద్యుత్‌తో ఇబ్బందులు తప్పలేదు.
ఇది రెండోసారి..
ఈ నెల 10వ తేదీన కూడా ట్రాన్స్‌కో పరిధిలోని 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ దెబ్బతిని మూడు రోజులపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తాజాగా 400 కేవీ దెబ్బతింది. పరవాడ ప్రాంతంలో భారీ పరిశ్రమలు ఉండటం వల్ల కాలుష్యం ఏర్పడి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఇప్పుడు కూడా అదే కారణంతో 440 బస్‌బార్ కట్ అయ్యిందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎస్‌విఆర్ కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు.