
కాఠ్మాండ్: నేపాల్‌లో భారత్ చేపట్టిన జలవిద్యుత్ కేంద్రం అరుణ్-3 కార్యాలయం వద్ద ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. కొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందనగా ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలియ రాలేదని, దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాగా మే11న ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉంది.
కాఠ్మాండ్‌కు సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని తుమ్లింగ్టర్ ప్రాంతంలో 900 మెగావాట్ల సామర్థ్యంతో అరుణ్-3 జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. 2020లో ఈ ప్రాజెక్టు వినియోగంలోకి రావాల్సి ఉంది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో బాంబు పేలుడు జరిగింది. పేలుడు కారణంగా కార్యాలయం కాంపౌడ్ వాల్ దెబ్బతిన్టటు చీఫ్ డిస్ట్రిక్ట్ అధికారి శివరాజ్ జోషి తెలిపారు. నేపాల్‌లోని భారతీయ ఆస్తులపై పేలుడు జరగడం నెల రోజుల్లో ఇది రెండోసారి. ఈనెల 17న బిరాట్‌నగర్‌లోని భారత రాయబార కార్యాలయం ఫీల్డ్ ఆఫీస్ సమీపంలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలింది.
నేపాల్‌లో భారత్ చేపట్టే అరుణ్-3 జలవిద్యుత్ కేంద్రంపై ఇరు దేశాలు 2014 నవంబర్ 25న సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశీ జలవిద్యుదుత్పత్తి రంగంలోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నేపాల్ భావించింది.
Comments
Please login to add a commentAdd a comment