hydroelectric project
-
ఉక్రెయిన్ను ముంచెత్తిన వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దురాక్రమణకు దిగాక ఇన్నాళ్లూ బాంబుదాడులకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకుని వలసపోయిన జనం ఇప్పుడు వరదరూపంలో వచ్చిన జలఖడ్గం దాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీపర్ నదీ ప్రవాహంపై నిర్మించిన కఖోవ్కా ఆనకట్ట, జలవిద్యుత్ ప్లాంట్‌పై బాంబుల వర్షం నేపథ్యంలో డ్యామ్ బద్దలై వరదనీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలు జలమయమయ్యాయి. కొందరు ఇళ్లపైకి ఎక్కి అక్కడే గడిపారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ మొదలుపెట్టి స్థానిక పాలనా యంత్రాంగాలు పౌరులను వేరే చోట్లకు హుటాహుటిన తరలిస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ఆవిష్కతమయ్యాయి. దొరికింది తీసుకెళ్తూ ఏదో ఒకదాంట్లో వలసపోతూ.. చేతికందినంత నిత్యావసర వస్తువులు తీసుకుని మిలటరీ ట్రక్కులు, రాఫ్ట్‌లపై ఎక్కి జనం ఓవైపు వలసపోతుంటే శతఘ్ని పేలుళ్ల చప్పుళ్లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఇంకొందరు బస్సుల్లో, రైళ్లలో వెళ్లిపోయారు. డ్యామ్ కుప్పకూలి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దాడికి కారకులు ఎవరో తెలియరాలేదు. మీరంటే మీరని ఉక్రెయిన్, రష్యాలు పరస్పర దూషణలు మాత్రం ఆపట్లేవు. కొంతకాలంగా రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న ఈ డ్యామ్ పరిసరాల్లో తరచూ బాంబు దాడులు జరుగుతున్నాయి. రణక్షేత్రంగా మారిన ఈ ప్రాంతంపై ఇరుపక్షాల్లో ఒకరు పొరపాటున భారీ దాడి చేసిఉంటారని, నిర్లక్ష్యం కూడా అయి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగకుండా వస్తున్న వరదనీటితో దిగువ ప్రాంతాల్లో వచ్చే 20 గంటల్లో మరో మూడు అడుగులమేర నీరు నిలుస్తుందని అధికారుల ఆందోళన వ్యక్తంచేశారు. విస్తారమైన ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రిజర్వాయర్లలో కఖోవ్కా డ్యామ్ కూడా ఒకటి. గత ఏడాది రష్యా ఆక్రమించిన ఖేర్సన్ ప్రాంతంలోనే ఈ డ్యామ్ ఉంది. ఖేర్సన్ సిటీకి కేవలం 44 మైళ్లదూరంలో ఈ డ్యామ్ ఉండటంతో ఇప్పటికే వరదనీరు సిటీలోకి ప్రవేశించింది. వరదనీటి మట్టం పెరిగితే ఖేర్సన్కు కష్టాలు పెరుగుతాయి. డ్యామ్ పూర్తిగా పాడవలేదని, ఇంకా చాలా నీరు నిల్వ ఉందని, కొద్దిరోజుల్లో మొత్తం డ్యామ్ నేలమట్టమైతే మరో దఫా వరద ఖాయమని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా అప్డేట్లో పేర్కొంది. ఈ శాఖ తరచూ యుద్ధసమాచారాన్ని అందరితో పంచుకుంటోంది. తాగేందుకు నీరే లేదు: జెలెన్స్కీ ‘కుట్ర పన్ని రష్యా ఈ డ్యామ్‌ను నేలమట్టం చేసింది. వేలాది మంది ప్రజలకు కనీసం తాగు నీరు లేకుండా పోయింది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టెలిగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ఇది రష్యా పనే: అమెరికా మేథో సంస్థ ‘నీపర్ దిగువ ప్రాంతాలను వరదమయం చేస్తే రష్యాకే మేలు. ఉక్రెయిన్ సేనలు మళ్లీ ఆప్రాంతాలను చేజిక్కించుకోకుండా ఆలస్యం చేయడం రష్యా ఎత్తుగడ. అందుకే తమకు కొంచెం నష్టం జరుగుతుందని తెల్సికూడా ఇలా డ్యామ్‌ను పేల్చేసింది’ అని రక్షణ, విదేశీవ్యవహారాల విశ్లేషణ మేథోసంస్థ, అమెరికాకు చెందిన లాభాపేక్షలేని ‘స్టడీ ఆఫ్ వార్’ వ్యాఖ్యానించింది. పొంచి ఉన్న ధరాఘాతం గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు నూనె, ఇతర ఆహార ఉత్పత్తుల్ని భారీ స్థాయిలో పండిస్తూ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చడంలో ఉక్రెయిన్ కీలక భూమిక పోషిస్తోంది. డ్యామ్ వరదనీటితో పంట నష్టం వాటిల్లి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు తగ్గి డిమాండ్ పెరిగి ధరలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. డ్యామ్ కూలిన ఈ కొద్ది గంటల్లోనే గోధుమ ధరలు 3 శాతం ఎగబాకాయి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని కొన్ని దేశాలు ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులపై ఆధారపడు తున్నాయి. డ్యామ్ కూల్చివేత కారణంగా కలిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని రష్యా, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు. డ్యామ్‌ను బాగుచేసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఈ యుద్ధతరుణంలో ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. -
బ్రహ్మపుత్రపై చైనా భారీ ప్రాజెక్టు
బీజింగ్: తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారక ముందే చైనా మరో వివాదానికి తెరలేపింది. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు గురువారం ఆ దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (సీపీసీ) ఆమోదించింది. అందులో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మాణం కూడా ఉంది. గత ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ఆమోదించిన బ్లూ ప్రింట్‌ను ఆ దేశ పార్లమెంటు య«థాతథంగా ఆమోదించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని లీ కెక్వియాంగ్, 2 వేల మందికి పైగా ఇతర నాయకులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్ అటానమస్ రీజియన్ డిప్యూటీ చీఫ్ చె డల్హా ఇప్పటికే వెల్ల డించారు. ఈ డ్యామ్ నిర్మాణానికి సంబం«ధించిన ప్లాన్, ఇతర పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన ఇస్తారని గతంలోనే దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే ఎత్తయిన నది కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. టిబెట్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. జల విద్యుత్ ప్లాంట్లను నిర్మించనుంది. చైనా చర్యలను టిబెట్ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా టిబెట్ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. పశ్చిమ టిబెట్‌లోని హిమానీనదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నదిగా పేరుగాంచింది. చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలో భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బ్రహ్మపుత్రపై నిర్మించే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో త్రీ గోర్జెస్ కంటే మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మెడోగ్ కౌంటీలో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 14 వేల మంది నిరాశ్రయులవుతారని అంచనా. భారత్ ఆందోళనలేంటి? టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో (టీఏఆర్) బ్రహ్మపుత్రపై (యార్లంగ్ సాంగ్‌పొ నది) చైనా తలపెట్టిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కానుంది. దీని నిర్మాణంపై భారత్, బంగ్లాదేశ్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టుల్ని నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కన్నేసింది. అరుణాచల్‌కి సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు. హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపైనా చైనా నియంత్రణ హాంకాంగ్‌పై మరింతగా పట్టు పెంచుకునేలా చైనా అడుగులు ముందుకి వేస్తోంది. అక్కడ ఎన్నికల వ్యవస్థని తన గుప్పిట్లో ఉంచుకునేలా పాట్రియాట్స్ గవర్నింగ్ హాంకాంగ్ తీర్మానాన్ని చైనా పార్లమెంటు గురువారం ఆమోదించింది. దీని ద్వారా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్య తగ్గి, చైనా అనుకూల ప్యానెల్ తమకు నచ్చినవారిని నామినేట్ చేసే అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజాస్వామ్య స్థాపన కోసం హాంగ్‌కాంగ్‌లో వెల్లువెత్తుతున్న ఉద్యమాలను అణచివేతకే చైనా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలొచ్చాయి. ఈ తీర్మానానికి చైనా పార్లమెంటు 2,895–0 ఓట్ల తేడాతో ఆమోదించింది. దీనిని పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మరో పార్లమెంటు సభ్యుడు సమావేశాలకు హాజరు కాలేదు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా చేసిన తీర్మానాలను అక్కడ పార్లమెంటు ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఆమోదిస్తుంది. తీర్మానంపై ఓటు వేస్తున్న జిన్‌పింగ్ -
మోదీ ప్రారంభించాలనుకున్నారు.. అంతలోనే పేలుడు
కాఠ్మాండ్: నేపాల్‌లో భారత్ చేపట్టిన జలవిద్యుత్ కేంద్రం అరుణ్-3 కార్యాలయం వద్ద ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. కొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందనగా ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలియ రాలేదని, దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాగా మే11న ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉంది. కాఠ్మాండ్కు సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని తుమ్లింగ్టర్ ప్రాంతంలో 900 మెగావాట్ల సామర్థ్యంతో అరుణ్-3 జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. 2020లో ఈ ప్రాజెక్టు వినియోగంలోకి రావాల్సి ఉంది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో బాంబు పేలుడు జరిగింది. పేలుడు కారణంగా కార్యాలయం కాంపౌడ్ వాల్ దెబ్బతిన్టటు చీఫ్ డిస్ట్రిక్ట్ అధికారి శివరాజ్ జోషి తెలిపారు. నేపాల్‌లోని భారతీయ ఆస్తులపై పేలుడు జరగడం నెల రోజుల్లో ఇది రెండోసారి. ఈనెల 17న బిరాట్నగర్లోని భారత రాయబార కార్యాలయం ఫీల్డ్ ఆఫీస్ సమీపంలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలింది. నేపాల్‌లో భారత్ చేపట్టే అరుణ్-3 జలవిద్యుత్ కేంద్రంపై ఇరు దేశాలు 2014 నవంబర్ 25న సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశీ జలవిద్యుదుత్పత్తి రంగంలోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నేపాల్ భావించింది. -
రిలయన్స్ పవర్ చేతికి జేపీ గ్రూప్ జల విద్యుత్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: జైప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన మూడు జల విద్యుత్ ప్రాజెక్ట్‌లను అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ పవర్ సొంతం చేసుకోనుంది. ఈమేరకు జేపీ గ్రూప్‌తో ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ పవర్ తెలిపింది. దీనిలో భాగంగా అనుబంధ సంస్థ రిలయన్స్ క్లీన్జెన్(ఆర్సీఎల్) ద్వారా జేపీ గ్రూప్ అనుబంధ కంపెనీ జైప్రకాష్ పవర్ వెంచర్స్(జేపీవీఎల్)తో ప్రత్యేక అవగాహన ఒప్పం దంపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. తద్వారా జేపీవీఎల్‌కు చెందిన జలవిద్యుత్ పోర్ట్‌ఫోలియోలో 100% వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. సుమారు 1,800 మెగావాట్ల నిర్వహణ సామర్థ్యం (ప్రైవేటు రంగంలో దేశంలోనే అత్యధికం) కలిగిన 3 జల విద్యుత్ ప్లాంట్లను జేపీవీఎల్ కలిగి ఉంది. వీటి ఆస్తుల విలువ రూ.10,000 కోట్లుగా అంచనా. -
మళ్లీ కుట్ర
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కుంటాల జలపాతంపై మళ్లీ ‘హైడల్’ కుట్ర మొదలైంది. ఓ వైపు రాష్ట్ర విభజనకు వేగంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టు సంస్థ కుంటాలపై జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి పావులు కదుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్‌లో మకాం వేసిన సదరు కాంట్రాక్టర్, జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులతో కుమ్మక్కై అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తుండటంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో అటవీశాఖ నుంచి అనుమతులు లేవనేదే హైడల్ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి కాగా, సదరు కాంట్రాక్టర్ ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి మేరకు తాజాగా అటవీశాఖ సర్వే నిర్వహించడం మళ్లీ వివాదాస్పదం అవుతోంది. కుంటాల జలపాతంపై ఎట్టి పరిస్థితుల్లో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదంటూ గిరిజన, ఆదివాసీ, ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకు సన్నద్ధం అవుతున్నాయి. 13 ఏళ్లుగా పట్టువీడని రాజీ పవర్ సంస్థ కుంటాలపై విద్యుత్తు ప్రాజెక్టు వద్దని పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నా రాజీ పవర్ ప్లాంట్ సంస్థ, ఆ సంస్థకు మద్దతునిస్తున్న రాజకీయ నాయకులు పదమూడేళ్లుగా పట్టువీడటం లేదు. ఉద్యమాలు ఉధృతంగా సాగితే కొంతకాలం ఊర్కోవడం, ఆ తర్వాత మళ్లీ ప్రయత్నాలు చేయడం వారికి పరిపాటిగా మారింది. ఈ పద్ధతిలోనే పర్యాటక, నీటిపారుదల, ఆర్అండ్బీ, కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక వనసంరక్షణ సమితి అనుమతులను ఒక్కొక్కటిగాా పొందిన సదరు కాంట్రాక్టరు అటవీశాఖ అనుమతులపైనా ఇటీవలే పట్టు సాధించారు. ఇదిలా వుండగా జలపాతంపై జలవిద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని 1999లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు మండలి(ఏపీఎస్ఈబీ) ప్రకటన జారీ చేసింది. కుంటాల జలపాతంపై ఆరు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మూడు సంస్థలు తమ తమ నివేదికలను ఏపీఎస్‌ఈబీకి అందజేశాయి. మూడు ప్రాజెక్టుల నివేదికలను పరిశీలించిన అధికారులు ‘రాజీ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ’కు దీని బాధ్యతలను అప్పగించారు. అయితే గిరిజన, ఆదివాసీ, ప్రజాసంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గి మళ్లీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఆందోళనకు సిద్ధమైన ప్రజాసంఘాలు కుంటాల జలపాతంపై నిర్మించ తలపెట్టిన ఆరు మెగావాట్ల విద్యుత్తుకు 10 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుందని నిపుణులు లెక్కగట్టారు. 2.50 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయదలచిన ఈ ప్రాజెక్టు కోసం నిర్మాణ సంస్థ మొదట గిరిజనులు, ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రయత్నాలు సాగించింది. పచ్చని అడవిలో చిచ్చుపెట్ట వద్దని అదివాసీ, గిరిజన సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నా సదరు సంస్థ అధినేత కొందరు స్థానిక నేతల అండదండలతో హైదరాబాద్‌లో ‘పవర్’ ఉపయోగించారు. జిల్లాలో ఓ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న సదరు కాంట్రాక్టరు సర్వే నివేదిక కోసం అటవీశాఖ ఉన్నతాధికారులపై తాజాగా ఒత్తిడి చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. దీంతో రెండు రోజులుగా జిల్లాలో కుంటాల జలపాతం పరిరక్షణ కమిటీ, తెలంగాణ విద్యావంతుల వేదికలతోపాటు ఆదివాసీ, గిరిజన సంఘాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. కుంటాలపై ఎట్టి పరిస్థితుల్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించేది లేదని శుక్రవారం విద్యావంతుల వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ పిట్టల రవిందర్ నేరడిగొండ, కుంటాలలో ప్రజాసంఘాలతో సమావేశం నిర్వహించారు. గిరిజన, ఆదివాసీ, ప్రజలు, ప్రజాసంఘాలతో త్వరలోనే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ప్రకటించారు.