సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కుంటాల జలపాతంపై మళ్లీ ‘హైడల్’ కుట్ర మొదలైంది. ఓ వైపు రాష్ట్ర విభజనకు వేగంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టు సంస్థ కుంటాలపై జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి పావులు కదుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్‌లో మకాం వేసిన సదరు కాంట్రాక్టర్, జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులతో కుమ్మక్కై అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తుండటంపై నిరసన వ్యక్తమవుతోంది.
ఇదే క్రమంలో అటవీశాఖ నుంచి అనుమతులు లేవనేదే హైడల్ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి కాగా, సదరు కాంట్రాక్టర్ ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి మేరకు తాజాగా అటవీశాఖ సర్వే నిర్వహించడం మళ్లీ వివాదాస్పదం అవుతోంది. కుంటాల జలపాతంపై ఎట్టి పరిస్థితుల్లో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదంటూ గిరిజన, ఆదివాసీ, ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకు సన్నద్ధం అవుతున్నాయి.
13 ఏళ్లుగా పట్టువీడని రాజీ పవర్ సంస్థ
కుంటాలపై విద్యుత్తు ప్రాజెక్టు వద్దని పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నా రాజీ పవర్ ప్లాంట్ సంస్థ, ఆ సంస్థకు మద్దతునిస్తున్న రాజకీయ నాయకులు పదమూడేళ్లుగా పట్టువీడటం లేదు. ఉద్యమాలు ఉధృతంగా సాగితే కొంతకాలం ఊర్కోవడం, ఆ తర్వాత మళ్లీ ప్రయత్నాలు చేయడం వారికి పరిపాటిగా మారింది. ఈ పద్ధతిలోనే పర్యాటక, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక వనసంరక్షణ సమితి అనుమతులను ఒక్కొక్కటిగాా పొందిన సదరు కాంట్రాక్టరు అటవీశాఖ అనుమతులపైనా ఇటీవలే పట్టు సాధించారు. ఇదిలా వుండగా జలపాతంపై జలవిద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని 1999లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు మండలి(ఏపీఎస్‌ఈబీ) ప్రకటన జారీ చేసింది.
కుంటాల జలపాతంపై ఆరు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మూడు సంస్థలు తమ తమ నివేదికలను ఏపీఎస్‌ఈబీకి అందజేశాయి. మూడు ప్రాజెక్టుల నివేదికలను పరిశీలించిన అధికారులు ‘రాజీ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ’కు దీని బాధ్యతలను అప్పగించారు. అయితే గిరిజన, ఆదివాసీ, ప్రజాసంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గి మళ్లీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
ఆందోళనకు సిద్ధమైన ప్రజాసంఘాలు
కుంటాల జలపాతంపై నిర్మించ తలపెట్టిన ఆరు మెగావాట్ల విద్యుత్తుకు 10 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుందని నిపుణులు లెక్కగట్టారు. 2.50 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయదలచిన ఈ ప్రాజెక్టు కోసం నిర్మాణ సంస్థ మొదట గిరిజనులు, ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రయత్నాలు సాగించింది. పచ్చని అడవిలో చిచ్చుపెట్ట వద్దని అదివాసీ, గిరిజన సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నా సదరు సంస్థ అధినేత కొందరు స్థానిక నేతల అండదండలతో హైదరాబాద్‌లో ‘పవర్’ ఉపయోగించారు. జిల్లాలో ఓ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న సదరు కాంట్రాక్టరు సర్వే నివేదిక కోసం అటవీశాఖ ఉన్నతాధికారులపై తాజాగా ఒత్తిడి చేస్తుండటం వివాదాస్పదంగా మారింది.
దీంతో రెండు రోజులుగా జిల్లాలో కుంటాల జలపాతం పరిరక్షణ కమిటీ, తెలంగాణ విద్యావంతుల వేదికలతోపాటు ఆదివాసీ, గిరిజన సంఘాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. కుంటాలపై ఎట్టి పరిస్థితుల్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించేది లేదని శుక్రవారం విద్యావంతుల వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ పిట్టల రవిందర్ నేరడిగొండ, కుంటాలలో ప్రజాసంఘాలతో సమావేశం నిర్వహించారు. గిరిజన, ఆదివాసీ, ప్రజలు, ప్రజాసంఘాలతో త్వరలోనే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ప్రకటించారు.
మళ్లీ కుట్ర
Published Sat, Nov 16 2013 4:36 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement