పడియోర్ మర్రిచెట్టు వద్ద గుడారాలలో మెస్రం వంశీయుల బస
తరలివచ్చిన ఉమ్మడి జిల్లా వంశీయులు
కితల వారీగా సామూహికంగా వంటలు
అర్ధరాత్రి మొదలైన తూమ్ పూజలు
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 28న మహాపూజతో సంబరం మొదలు కానుంది. ఇప్పటికే పవిత్ర గంగాజలంతో వచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో పడియోర్ జన్మ స్థలమైన మర్రిచెట్టు వద్ద గుడారాలు వేసుకుని బస చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చారు.
రెండు రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళలో ప్రదాన్ కితకు చెందిన వారు కిక్రి వాయిస్తూ నాగోబా, 22 కితల వంశీయుల చరిత్ర చెబుతున్నారు. ఆదివారం ఉదయం మహిళలు కితల వారీగా జొన్న గట్కా, సంప్రదాయ పిండి వంటలు చేసి ఆచారం ప్రకారం నైవేద్యాలు సమర్పింపంచారు.
22 కితల్లో మరణించిన పెద్దల పేరుతో రాత్రి తూమ్ (కర్మకాండ) పూజలు చేపట్టినట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు. మరణించిన వారు ఈ పూజలతో నాగోబా సన్నిధికి చేరినట్లు భావిస్తామని పేర్కొన్నారు.
పూజల్లో జొన్నగట్కా ప్రత్యేకం
పూజల్లో భాగంగా సమర్పించే నైవేద్యంలో జొన్న గట్కాకు ప్రత్యేక స్థానం ఉంది. పూజల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇంటి నుంచి తీసుకువచ్చిన జొన్న పిండితో గట్కా, ఇతర పిండి పదార్థాలు తయారు చేస్తారు. నైవేద్యంగా సమర్పించిన తర్వాత కితల వారీగా పంపిణీ చేసి భోజనం చేస్తారు.
ఆలయానికి చేరిన కుండలు
నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజలకు అవసరమయ్యే సిరికొండలోని గుగ్గిల స్వామి తయారుచేసిన ఏడు రకాల కుండలు ఆదివారం సాయంత్రం ఆలయానికి చేరాయి. మొత్తం 350 మట్టి పాత్రల్లో పెద్ద బాణాలు, సాధారణ కుండలు, మూతలు, కడుముంతలు, దీపాంతలు ఉన్నాయి. వీటిని ఆలయంలో భద్రపరిచారు.
తూమ్ పూజలతో దేవుడి సన్నిధికి..
ఆదివాసీల్లో మరణించిన పెద్దలకు కుటుంబ సభ్యులు తమ కుల దేవతల వద్దకు వెళ్లి తూమ్ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో మరణించిన వారు దేవుడి సన్నిధికి చేరినట్లుగా భావిస్తారు. ఈ పూజల అనంతరమే వంశంలోని తమ కితకు చెందిన కోడళ్ల బేటింగ్ (దేవుడి పరిచయం)తో పాటు ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
నాగోబా జాతరకు దృశ్య రూపం
ఎనిమిదేళ్ల పాటు పరిశోధన చేసిన యంగ్ డైరెక్టర్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రాచీనమైన నాగోబా జాతర గురించి మనకు తెలిసింది ఎంత? అంటూ వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో ఆదిలాబాద్ బాట పట్టారు యంగ్ డైరెక్టర్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్. ఎనిమిదేళ్ల పరిశోధన తర్వాత ‘నాగోబా జాతర’పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. తాను తెలుసుకున్న విషయాలు, చిత్రీకరించిన ఫొటోలతో అందమైన పుస్తకాన్ని కూడా ప్రచురించారామె.
నాగోబా జాతరలోని ప్రతి ఘట్టాన్ని అందంగా చిత్రించారు. ఇందుకు తన పరిశోధనే కారణమంటారామె. ‘సినిమా చిత్రీకరణ ఒక్క టే నాకు తెలిసిన కళ. నా దృష్టికొచ్చిన గొప్ప విషయాన్ని నాకు చేతనైన మాధ్యమంలో ఒక రూపం కల్పించానని చెప్పడానికి గర్వంగా ఉంది’అన్నారు జెన్నిఫర్. ‘గుస్సాడీ’పుస్తకం ఆమెజాన్‌లో ఉంది.
ఈ పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బును ఆమె తీసుకోలేదు. నేరుగా ఆదివాసీల అభ్యు న్నతి కోసం ఏర్పాటు చేసిన నిధికి చేరుతోంది. ‘నాగోబా జాతర’రచన మార్కెట్‌లో విడుదల కావాల్సి ఉంది. ఆదిలా బాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల పరిధిలోని కేస్లాపూర్‌లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నాగోబా జాతర జరగనుంది.
జెన్నిఫర్ హైదరాబాదీ
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన జెన్నిఫర్ ఆల్ఫాన్స్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఆమె తీసిన ‘కచరా’ఫిల్‌్మకు మూడు నంది అవార్డులు వచ్చాయి. ‘స్ట్రేంజర్’సినిమా కేన్స్‌లో స్క్రీన్ అయ్యింది. దానికి 20కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. కమర్షియల్ అడ్వర్‌టైజ్‌మెంట్‌లు చేస్తారు. ఆ డబ్బుతో ఆదివాసీల జీవనం, కళలపై రీసెర్చ్ చేస్తున్నారు.
ఇవి మన సంస్కృతి మూలాలు
హైదరాబాద్‌లోని శిల్పారామంలో గుస్సాడీ నృత్యం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మూలాలను వెతుక్కుంటూ ఆదిలాబాద్ అడవులకెళ్లాను. గుస్సాడీ మీద ఒక డాక్యుమెంటరీ, పుస్తకం తెచ్చాను. 2014 నుంచి ఇప్పటివరకు రెండు డాక్యుమెంటరీలు, రచనలు వచ్చాయి. మూడవది ఆదివాసీ దేవత జంగుబాయి డాక్యుమెంటరీ చిత్రీకరణ దశలో ఉంది.
నా పుస్తకాలను చూసిన మన తెలుగువారు చాలామంది ఆఫ్రికాలో షూట్ చేశారా అని అడిగారు. మన మూల సంస్కృతి అడవి దాటి బయటకు రాకపోతే ఇక ప్రపంచానికి ఏమి చెబుతాం? ప్రపంచదేశాలకు తెలియచేయడానికి ఇంగ్లిష్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. డాక్యుమెంటరీ మన తెలుగుదనాన్ని కోల్పోకూడదని ఆదివాసీల మాటలను అలాగే ఉంచాను. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, ఫిల్మ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment