
సాక్షి, సిర్పూర్ కాగజ్‌నగర్: వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. చీకటి ఉన్న చోటనే వెలుగులు నింపాలని చెప్పుకొచ్చారు. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. జిల్లాలో జాతీయ రహదారి 363ని గడ్కరీని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ..‘జాతీయ రహదారులతో దేశాన్ని అనుసంధానిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్రమంత్రిగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నేను ఇంజనీర్‌ను కాదు.. కానీ, 13 డాక్టరేట్లు వచ్చాయి. చీకటి ఉన్న చోటనే వెలుగులు నింపాలి. అమృత్ సరోవర్ పేరుతో నీటి నిల్వను పెంచుతున్నాం. తెలంగాణలో కూడా నీటి నిల్వలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే విదర్భ ప్రాంతంలో పనిచేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అభివృద్ధి చేస్తామన్నారు.

అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీని పెంచడం మోదీ సర్కార్ లక్ష్యం. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5వేల కి.మీ దాటింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.3,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ రహదారుల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ సమయం భారీగా తగ్గాయి. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం అంకితభావంతో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 7 టెక్స్‌టైల్ పార్కులు మంజూరు చేస్తే తెలంగాణకు కూడా ఒకటి దక్కింది. రూ.6,330 కోట్లతో రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించుకున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేశాం. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని మోదీ ప్రభుత్వం అందజేస్తోంది అని చెప్పుకొచ్చారు.