![Ukraine Russia War: Major dam breached in southern Ukraine, unleashing floodwaters - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/8/070620230534-AP06_07_2023_0.jpg.webp?itok=KHElMbOh)
వరద నీటితో నిండా మునిగిపోయిన ఖేర్సన్‌లోని వీధులు
ఖేర్సన్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దురాక్రమణకు దిగాక ఇన్నాళ్లూ బాంబుదాడులకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకుని వలసపోయిన జనం ఇప్పుడు వరదరూపంలో వచ్చిన జలఖడ్గం దాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీపర్ నదీ ప్రవాహంపై నిర్మించిన కఖోవ్కా ఆనకట్ట, జలవిద్యుత్ ప్లాంట్‌పై బాంబుల వర్షం నేపథ్యంలో డ్యామ్ బద్దలై వరదనీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలు జలమయమయ్యాయి. కొందరు ఇళ్లపైకి ఎక్కి అక్కడే గడిపారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ మొదలుపెట్టి స్థానిక పాలనా యంత్రాంగాలు పౌరులను వేరే చోట్లకు హుటాహుటిన తరలిస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ఆవిష్కతమయ్యాయి.
దొరికింది తీసుకెళ్తూ ఏదో ఒకదాంట్లో వలసపోతూ..
చేతికందినంత నిత్యావసర వస్తువులు తీసుకుని మిలటరీ ట్రక్కులు, రాఫ్ట్‌లపై ఎక్కి జనం ఓవైపు వలసపోతుంటే శతఘ్ని పేలుళ్ల చప్పుళ్లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఇంకొందరు బస్సుల్లో, రైళ్లలో వెళ్లిపోయారు. డ్యామ్ కుప్పకూలి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దాడికి కారకులు ఎవరో తెలియరాలేదు. మీరంటే మీరని ఉక్రెయిన్, రష్యాలు పరస్పర దూషణలు మాత్రం ఆపట్లేవు. కొంతకాలంగా రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న ఈ డ్యామ్ పరిసరాల్లో తరచూ బాంబు దాడులు జరుగుతున్నాయి. రణక్షేత్రంగా మారిన ఈ ప్రాంతంపై ఇరుపక్షాల్లో ఒకరు పొరపాటున భారీ దాడి చేసిఉంటారని, నిర్లక్ష్యం కూడా అయి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆగకుండా వస్తున్న వరదనీటితో దిగువ ప్రాంతాల్లో వచ్చే 20 గంటల్లో మరో మూడు అడుగులమేర నీరు నిలుస్తుందని అధికారుల ఆందోళన వ్యక్తంచేశారు. విస్తారమైన ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రిజర్వాయర్‌లలో కఖోవ్కా డ్యామ్ కూడా ఒకటి. గత ఏడాది రష్యా ఆక్రమించిన ఖేర్సన్ ప్రాంతంలోనే ఈ డ్యామ్ ఉంది. ఖేర్సన్ సిటీకి కేవలం 44 మైళ్లదూరంలో ఈ డ్యామ్ ఉండటంతో ఇప్పటికే వరదనీరు సిటీలోకి ప్రవేశించింది. వరదనీటి మట్టం పెరిగితే ఖేర్సన్‌కు కష్టాలు పెరుగుతాయి. డ్యామ్ పూర్తిగా పాడవలేదని, ఇంకా చాలా నీరు నిల్వ ఉందని, కొద్దిరోజుల్లో మొత్తం డ్యామ్ నేలమట్టమైతే మరో దఫా వరద ఖాయమని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా అప్‌డేట్‌లో పేర్కొంది. ఈ శాఖ తరచూ యుద్ధసమాచారాన్ని అందరితో పంచుకుంటోంది.
తాగేందుకు నీరే లేదు: జెలెన్‌స్కీ
‘కుట్ర పన్ని రష్యా ఈ డ్యామ్‌ను నేలమట్టం చేసింది. వేలాది మంది ప్రజలకు కనీసం తాగు నీరు లేకుండా పోయింది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ టెలిగ్రామ్‌లో పోస్ట్‌చేశారు.
ఇది రష్యా పనే: అమెరికా మేథో సంస్థ
‘నీపర్ దిగువ ప్రాంతాలను వరదమయం చేస్తే రష్యాకే మేలు. ఉక్రెయిన్ సేనలు మళ్లీ ఆప్రాంతాలను చేజిక్కించుకోకుండా ఆలస్యం చేయడం రష్యా ఎత్తుగడ. అందుకే తమకు కొంచెం నష్టం జరుగుతుందని తెల్సికూడా ఇలా డ్యామ్‌ను పేల్చేసింది’ అని రక్షణ, విదేశీవ్యవహారాల విశ్లేషణ మేథోసంస్థ, అమెరికాకు చెందిన లాభాపేక్షలేని ‘స్టడీ ఆఫ్ వార్’ వ్యాఖ్యానించింది.
పొంచి ఉన్న ధరాఘాతం
గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు నూనె, ఇతర ఆహార ఉత్పత్తుల్ని భారీ స్థాయిలో పండిస్తూ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చడంలో ఉక్రెయిన్ కీలక భూమిక పోషిస్తోంది. డ్యామ్ వరదనీటితో పంట నష్టం వాటిల్లి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు తగ్గి డిమాండ్ పెరిగి ధరలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. డ్యామ్ కూలిన ఈ కొద్ది గంటల్లోనే గోధుమ ధరలు 3 శాతం ఎగబాకాయి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని కొన్ని దేశాలు ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులపై ఆధారపడు తున్నాయి. డ్యామ్ కూల్చివేత కారణంగా కలిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని రష్యా, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు. డ్యామ్‌ను బాగుచేసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఈ యుద్ధతరుణంలో ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment