కీవ్: రణనినాదంతో రంకెలేస్తూ ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దూకిన రష్యా సైన్యం ఒడెసా నగరంపై క్రూయిజ్ క్షిపణి దాడులతో దండెత్తింది. డజన్ల కొద్దీ భవనాలను ధ్వంసం చేసింది. వీటిలో పలు క్షిపణులను ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా అడ్డుకుని నేలకూల్చాయి. కానీ రష్యా దాడిలో ఒడెసాలో గిడ్డంగి కూలడంతో అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ఇళ్లు, దుకాణాలు, కేఫ్‌లు ధ్వంసమయ్యాయి. 13 మందికి గాయాలయ్యాయి.
కుప్పకూలిన గిడ్డంగి శిథిలాల కింద ఎవరైనా బతికిఉంటారనే ఆశతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రమటోర్క్, కోస్టియాన్‌టినీవ్కా సిటీలపైనా రష్యా దాడులు చేసింది. క్రమటోర్క్‌లో ఇద్దరు పౌరులు చనిపోగా 29 ఇళ్లు కూలిపోయాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కోస్టియాన్‌టినీవ్కాలో ఒకరు చనిపోయారు. 57 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 16 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా మళ్లీ వైమానిక దాడులను పెంచిందని ఉక్రెయిన్ సైన్యం అధికార ప్రతినిధి బుధవారం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment