buildings collapse
-
తైవాన్‌లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్‌ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్‌ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్‌లో ఉంది. -
Russia-Ukraine war: ఒడెసాపై ఆగని రష్యా క్రూయిజ్ దాడులు
కీవ్: రణనినాదంతో రంకెలేస్తూ ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దూకిన రష్యా సైన్యం ఒడెసా నగరంపై క్రూయిజ్ క్షిపణి దాడులతో దండెత్తింది. డజన్ల కొద్దీ భవనాలను ధ్వంసం చేసింది. వీటిలో పలు క్షిపణులను ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా అడ్డుకుని నేలకూల్చాయి. కానీ రష్యా దాడిలో ఒడెసాలో గిడ్డంగి కూలడంతో అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ఇళ్లు, దుకాణాలు, కేఫ్‌లు ధ్వంసమయ్యాయి. 13 మందికి గాయాలయ్యాయి. కుప్పకూలిన గిడ్డంగి శిథిలాల కింద ఎవరైనా బతికిఉంటారనే ఆశతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రమటోర్క్, కోస్టియాన్టినీవ్కా సిటీలపైనా రష్యా దాడులు చేసింది. క్రమటోర్క్లో ఇద్దరు పౌరులు చనిపోగా 29 ఇళ్లు కూలిపోయాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కోస్టియాన్టినీవ్కాలో ఒకరు చనిపోయారు. 57 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 16 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా మళ్లీ వైమానిక దాడులను పెంచిందని ఉక్రెయిన్ సైన్యం అధికార ప్రతినిధి బుధవారం చెప్పారు. -
Turkey–Syria Earthquakes: ఎందుకీ భూ ప్రకోపం?
టర్కీ, సిరియాలో శక్తివంతమైన భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భవనాలు నేటమట్టమయ్యాయి. 456 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్, 874 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్, 1,381 కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్, 1,411 కిలోమీటర్ల దూరంలోని ఈజిప్ట్‌లో సైతం భూప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ–మధ్య టర్కీలోని గాజియాన్‌టెప్ సిటీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు మొదలైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టర్కీలో గత 100 ఏళ్లలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 95 శాతం భూభాగం భూకంప ప్రభావితమే భౌగోళికంగా ‘అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్’ ప్రాంతంలో ఉన్న టర్కీలో భూప్రకంపనలు సర్వసాధారణంగా మారాయి. 2020లో 33,000 భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో 332 భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై దాదాపు 4.0గా రికార్డయ్యింది. భూమి పై పొరను టెక్టానిక్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 15 భారీ టెక్టానిక్ ప్లేట్లు (రాతి పొరలు) ఉంటాయి. రెండు పొరల సరిహద్దుల నడుమ ఖాళీ ప్రదేశం ఉంటుంది. కొన్నిచోట్ల ప్లేట్ల మధ్య పగుళ్లు ఉంటాయి. భూ అంతర్భాగంలో సర్దుబాట్ల వల్ల రెండు టెక్టానిక్ ప్లేట్లు బలంగా ఢీకొన్నప్పుడు భారీ భూకంపం సంభవిస్తుందని బ్రిటిష్ ఆర్కియాలాజికల్ సర్వే వెల్లడించింది. యూరేసియన్, ఆఫ్రికన్ ప్లేట్ల చీలిక భాగంలో టర్కీ భూభాగం ఉంది. యూరేసియన్, అనటొలియన్ టెక్టానిక్ ప్లేట్ల నడుమ నార్త్ అనటొలియన్ ఫాల్ట్(ఎన్‌ఏఎఫ్) లైన్ అనే చీలిక ఉంది. రెండు ప్లేట్లు ఢీకొనడంతో ఇక్కడే భూకంపం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఎన్‌ఏఎఫ్ చీలిక దక్షిణ ఇస్తాంబుల్ నుంచి ఈశాన్య టర్కీ దాకా విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. 1999, 2011లోనూ ఈ ప్రాంతం నుంచే భూకంపాలు విస్తరించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 1999 నాటి భూకంపంలో 18,000 మంది, 2011 నాటి భూకంపంలో 500 మందికిపైగా జనం మృతిచెందారు. టర్కీలో ఏకంగా 95 శాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతమే కావడం గమనార్హం. పెద్ద నగరాలైన ఇస్తాంబుల్, ఇజ్‌మీర్‌తోపాటు ఈస్ట్ అనటోలియా కూడా భూకంపం ముప్పును ఎదుర్కొంటున్నాయి. 3 రోజుల క్రితమే చెప్పేశాడు తాజా భూకంపంపై ముందే చెప్పిన ఫ్రాంక్ త్వరలో భారత్‌కూ రావచ్చని హెచ్చరికలు అమ్‌స్టర్‌డ్యామ్: టర్కీ, సిరియాలో వేలాది మందిని బలితీసుకున్న భూకంపం గురించి నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌గీట్స్ అనే పరిశోధకుడు ముందే హెచ్చరించారు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించనుందని, ఇది రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదవుతుందని ఈ నెల 3న ఆయన ట్వీట్ చేశారు. ఆయన జోస్యం నిజమేనని మూడు రోజుల తర్వాత తేలింది. మొదటి భూకంపం తర్వాత కొన్ని గంటలు గడిచాక రెండో భూకంపం సంభవిస్తుందంటూ తన సంస్థ చేసిన ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు. అది కూడా నిజమేనని తేటతెల్లమయ్యింది. త్వరలో భారత్‌తో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్లకు కూడా భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నారు. హూగర్బీట్స్ ‘సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే’ అనే సంస్థలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ భూకంపాలపై అధ్యయనం చేస్తోంది. అయితే, హూగర్బీట్స్ నకిలీ సైంటిస్టు అని పలువురు ట్విట్టర్లో విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాను చెప్పింది వాస్తవరూపం దాల్చడం పట్ల హూగర్బీట్స్ విచారం వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం ఉదయం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. డ్నిప్రొవ్స్కీ ప్రాంతంలోని కీలకమైన మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా ఈ దాడులకు ఒడిగట్టినట్లు భావిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. క్షిపణి దాడులతో పలు ప్రాంతాల్లో 18 వరకు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల మంటలు లేచాయి. ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. కీవ్‌పై జనవరి ఒకటో తేదీ తర్వాత రష్యా దాడులు జరపడం ఇదే ప్రథమం. అంతకుముందు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లోని పారిశ్రామిక ప్రాంతంపై రష్యా రెండు ఎస్–300 క్షిపణులను ప్రయోగించిందని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. కీలక నగరం సొలెడార్ తమ అధీనంలోకి వచ్చిందంటూ రెండు రోజుల క్రితం రష్యా ప్రకటించగా, ఉక్రెయిన్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. రాజధాని కీవ్, ఇతర నగరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా క్షిపణి దాడులకు తెగబడుతుండడంతో ఉక్రెయిన్‌కు అండగా నిలవడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. ట్యాంకులు, శతఘ్ని వ్యవస్థలను ఉక్రెయిన్‌కి పంపిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం నాడు హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సునాక్ మాట్లాడారు. అనంతరం బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఛాలెంజర్ 2 ట్యాంకులు, ఇతర శతఘ్ని వ్యవస్థ సాయంగా అందిస్తామని సునాక్ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే ఎన్ని ట్యాంకులు పంపిస్తారో, ఎప్పటిలోగా అవి ఉక్రెయిన్ చేరుకుంటాయో వెల్లడించలేదు. బ్రిటీష్ ఆర్మీ చాలెంజర్ 2 ట్యాంకులు నాలుగు వెంటనే పంపిస్తారని, మరో ఎనిమిది త్వరలోనే పంపిస్తారంటూ బ్రిటన్ మీడియా తెలిపింది. ఉక్రెయిన్‌లో మౌలికసదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు తెగబడుతోంది. -
Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు
కీవ్: దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీలో రష్యా క్షిపణులు గర్జించాయి. క్షిపణి దాడుల్లో 40కిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారని, కనీసం 12 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు గురువారం వెల్లడించారు. ఒకటి సూర్యోదయానికి ముందు, మరొకటి ఉదయం క్షిపణి దాడి జరిగిందని పేర్కొన్నాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్ ప్లాంట్ జపొరిజాజియాలో ఉంది. ఈ ప్లాంట్ సమీపంలోనే రష్యా సైన్యం క్షిపణి దాడులు నిర్వహించడం గమనార్హం. అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా గతంలోనే ఆక్రమించుకుంది. రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. దీనివల్ల రష్యా అధినేత పుతిన్ అణ్వస్త్ర ప్రయోగానికి పాల్పడతారా? అనేది చెప్పడం కష్టమని అన్నారు. అణు దాడికి పుతిన్ సాహసించకపోవచ్చని తాను భావిస్తున్నాని తెలిపారు. సిడ్నీలో లౌవీ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ సదస్సులో జెలెన్స్కీ వీడియో లింక్‌లో ప్రసంగించారు. -
తీరని విషాదాన్ని నింపిన అఫ్గనిస్తాన్ భూకంపం.. 1000 మంది మృతి
కాబూల్: అప్గనిస్తాన్‌లో భూకంపం పెను ప్రళయం సృష్టించింది. తూర్పు అఫ్గనిస్తాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం 1,000 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. దాదాపు 1,500 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఆధీనంలోని స్థానిక మీడియా పేర్కొంది. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే భూకంప తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. వందలాది ఇళ్లు నేలమట్టం రిక్టర్ స్కేల్‌పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం సంభవించిన ప్రాతం మారుమూల పర్వత ప్రదేశం కావడంతో సమాచార లోపం నెలకొంది. దీంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. భూకంపం ధాటికి వందలాది ఇళ్లు, ఇతర భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడటంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. An earthquake of magnitude 6.1 killed more than 900 people in Afghanistan, disaster management officials said, with hundreds injured and the toll expected to grow as information trickles in from remote mountain villages https://t.co/hh63ZvwR6a pic.twitter.com/xUbo7XDB6y — Reuters (@Reuters) June 22, 2022 యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్గనిస్తాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిమీ (27 మైళ్ళు) దూరంలో 51 కిమీ లోతులో సంభవించింది. భూకంపం కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఖోస్ట్ ప్రావిన్స్‌లో కూడా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. భారీ తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు పాక్‌లోని లాహోర్, ముల్తాన్, క్వెట్టా వరకు విస్తరించాయి. పాక్టికా ప్రావిన్స్ పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉంది. దీంతో పొరుగుదేశం పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు BREAKING Death toll from #Afghanistan earthquake reaches 1,000😭😭#earthquake pic.twitter.com/VzHtiyGkus — Kainat Ali🌺 (@Kainatali56) June 22, 2022 సాయం చేయండి తమకు అంతర్జాతీయ సాయం కావాలని తాలిబన్లు ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నాయి. ‘తీవ్రమైన భూకంపం పాక్టికా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాలను కదిలించింది. వందలాది మంది మరణించారు. గాయపడ్డారు. చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి’ అని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరీమి ట్విట్టర్లో పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం ఆ ప్రాంతానికి బృందాలను పంపామని తెలిపారు. కాగా తాలిబన్ల ఆక్రమణతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతున్న అఫ్గన్ ప్రజలను ఈ భూకంపం మరింత దీనస్థితిలోకి నెట్టివేసింది. -
ఇండోనేసియా భూకంపంలో ఏడుగురు మృతి
పసమన్ (ఇండోనేషియా): ఇండోనేసియా సుమత్రా దీవుల్ని శుక్రవారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 85 మంది గాయపడ్డారు. 5 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మలేసియా, సింగపూర్‌లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. పశ్చిమ సుమ త్రా ప్రావిన్స్‌లోని బుకిటింగి పట్టణం భూకం ప కేంద్రంగా ఉంది. భూ ఉపరితలానికి 12 కిలోమీటర్ల దిగువన భూమి కంపించినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. -
హైతీని కుదిపేసిన భూకంపం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య 724కు పెరిగింది. వందలాదిగా నివాసాలు ధ్వంసం కావడంతో మరో 2,800 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా, అనంతర ప్రకంపనల భయంతో ప్రజలు ఇళ్లు వదిలి వీధుల్లోనే జాగారం చేస్తున్నారు. భూకంపంతో తీర పట్టణం లెస్‌కెస్‌తోపాటు గ్రాండ్ అన్స్, నిప్స్ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. స్థానిక ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. హైతీ ప్రధాని హెన్రీ నెల రోజులపాటు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆదివారం రాత్రికి మరణాల సంఖ్య 724కు చేరిందని అధికారులు ప్రకటించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, చర్చిలు కలిపి 860 వరకు ధ్వంసం కాగా, మరో 700 భవనాలకు నష్టం వాటిల్లిందన్నారు. సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి శిథిలాల కింద చిక్కుకున్న అనేక మందిని వెలికి తీయగలిగారు. ఇలా ఉండగా, మరో రెండు రోజుల్లో తుపాను ‘గ్రేస్’ హైతీని తాకనుందనే హెచ్చరికలతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. -
భారీ భూకంపం
మాముజు: భారీ భూకంపం ధాటికి ఇండోనేసియాలోని సులవేసి ద్వీపం వణికిపోయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ప్రభావానికి పలు ఇళ్లు, భవనాలు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అ భారీ భూకంపం కారణంగా 42 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 600 మందికి పైగా గాయాలయ్యాయన్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులు సేకరిస్తు న్నారు. భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా పాక్షికంగా ధ్వంసమైంది. శిథిలాల్లో చిక్కుకున్న పేషెంట్లు, సిబ్బందిని రక్షించేందుకు ఎన్డీఎంఏ ప్రయత్నిస్తోంది. భూకంప బాధితుల కోసం తాత్కాలిక నివాస, భోజన ఏర్పాట్లు చేశారు. ముముజులోని గవర్నర్ బంగళా కూడా ధ్వంసమైందని, శి«థిలాల్లో పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. యంత్ర సామగ్రి లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎన్డీఎంఏ సిబ్బంది తెలిపారు. జకర్తా, మకస్సర్, పలు తదితర నగరాల నుంచి మాముజుకు సహాయ సిబ్బందిని తరలిస్తున్నామని ఎన్డీఎంఏ చీఫ్ బాగస్ పురుహితొ వెల్లడించారు. సులవేసి రాష్ట్రం మాముజు జిల్లా కేంద్రానికి దక్షిణంగా 36 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. సులవేసిలో 2018లో సంభవించిన భారీ భూకంపంలో 4 వేల మంది మరణించారు. -
భారీ వర్షాలకు కూలిన ఇళ్లు
పాములపాడు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడు మట్టి ఇళ్లు నేలకూలాయి. ఈ సంఘటన పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర్లకు చెందిన మట్టి మిద్దెలు కూలాయి. ఈ ప్రమాదంలో ఇండ్లలో నివసించే వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. -
నేపాల్ ఇప్పుడు ఓ శిథిల రాజ్యంil