రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు
ధ్వంసమైన పలు భవనాలు, వంతెనలు, సొరంగాలు
9 మంది మృతి.. 934 మందికి గాయాలు
బొగ్గు గనుల్లో చిక్కుకున్న 70 మంది కార్మికులు
సునామీ హెచ్చరికలు జారీ... తర్వాత ఉపసంహరణ
తైపీ: ద్వీప దేశం తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు.
భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు.
భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు.
జపాన్, చైనాలోనూ ప్రకంపనలు
జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్‌ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది.
భూ విలయాల గడ్డ తైవాన్
కంప్యూటర్ చిప్‌ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment