
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య 724కు పెరిగింది. వందలాదిగా నివాసాలు ధ్వంసం కావడంతో మరో 2,800 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా, అనంతర ప్రకంపనల భయంతో ప్రజలు ఇళ్లు వదిలి వీధుల్లోనే జాగారం చేస్తున్నారు. భూకంపంతో తీర పట్టణం లెస్‌కెస్‌తోపాటు గ్రాండ్ అన్స్, నిప్స్ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. స్థానిక ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. హైతీ ప్రధాని హెన్రీ నెల రోజులపాటు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆదివారం రాత్రికి మరణాల సంఖ్య 724కు చేరిందని అధికారులు ప్రకటించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, చర్చిలు కలిపి 860 వరకు ధ్వంసం కాగా, మరో 700 భవనాలకు నష్టం వాటిల్లిందన్నారు. సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి శిథిలాల కింద చిక్కుకున్న అనేక మందిని వెలికి తీయగలిగారు. ఇలా ఉండగా, మరో రెండు రోజుల్లో తుపాను ‘గ్రేస్’ హైతీని తాకనుందనే హెచ్చరికలతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment