major earthquake
-
తైవాన్‌లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్‌ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్‌ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్‌లో ఉంది. -
అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం
-
ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న అధ్యయనం
వాషింగ్టన్: జమ్మూకశ్మీర్ ను పెను భూకంపం చుట్టేయనుందనీ, లక్షల కొద్దీ ప్రజలను పొట్టనపొట్టుకునే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. హిమాలయ పర్వత శ్రేణుల భూఅంతర్భాగంలతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు తేలాయని పరిశోధకులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై ఎనిమిది కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదముందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఓరిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనంలో ఈ సంచలన విషయాలు తేలాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన యాన్ గావిల్లోట్ తెలిపారు. కశ్మీర్‌లోని రియాసి ఫాల్ట్ (ఆసియా, భారత్ ఫలకాలు కలిసే చోటు)లో జరుగుతున్న పరిణామాల వల్లే భారీ ప్రకంపనలు వస్తాయని వారు అంచనావేశారు. రియాసి ఫాల్ట్ కదలికలపై సుదీర్ఘ పరిశోధన అనంతరం తాము ఈ అంచనాలకు వచ్చామని పరిశోధకులు చెబుతున్నారు .గత 4,000 ఏళ్ల నుంచీ ఇక్కడ ఎలాంటి భారీ ప్రకంపనలు రాలేదని, ఫలితంగా విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశముందని తెలిపారు. అయితే ఇతర ఫలకాలు కలిసే చోట్లతో పోలిస్తే.. రియాసి ఫాల్ట్ అంత క్రియాశీలంగాలేదని వారు వెల్లడించారు. భూకంపం సంభవించే ప్రమాదం ఉందా లేదా అనే ప్రశ్నేలేదని కానీ ఎప్పుడు వస్తుందనేదే తమ ముందున్న ప్రధాన సవాల్ అని యాన్ గావిల్లోట్ వివరించారు. రియాసీ ఫాల్ట్ కి సమీపంలో చీనాబ్ నదిపై అనేక డ్యామ్‌లు , మరోవైపు డజన్ల కొద్దీ సొరంగాలు , వంతెనల గుండా వెళ్లే ముఖ్యమైన రైలు రోడ్లు ఉండడం మరింద ప్రమాదకర పరిణామమన్నారు. దీని మూలంగా , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సమీపంలోని బాలకోట్ బాగ్ లో 2005 సం.రంలో సంభవించిన భూకంపం కంటే ఎక్కువ తీవ్రతతో ప్రమాదం ముంచుకు రానుందని నష్టం కూడా అంతే భారీ స్థాయిలోఉంటుందని ఆయన హెచ్చరించారు. -
కాలిఫోర్నియాకు పెను భూకంపం ముప్పు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతానికి పెను భూకంపం వచ్చే ప్రమాదం బాగా పెరిగిందని, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8 అంతకంటే ఎక్కువ తీవ్రతతోనే వస్తుందని అమెరికా జియాలోజికల్ తాజా సర్వే వెల్లడించింది. తాజా గణాంకాలను తీసుకొని కొత్త పద్ధతిలో భూకంపం వచ్చే అవకాశాలను పరిశీలించగా రానున్న 30 ఏళ్ల కాలంలో 99 శాతం కాలిఫోర్నియాను పెను భూకంపం కుదిపేయనుందని తాజా నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన సదరన్ కాలిఫోర్నియా ఎర్త్‌క్వేక్ సెంటర్ డైరెక్టర్ టామ్ జోర్డాన్ మంగళవారం తెలిపారు. భూకంపానికి కారణమయ్యే పసిఫిక్ ప్లేట్, ఉత్తర అమెరికా ప్లేట్లు కాలిఫోర్నియాలోనే కలుసుకుంటున్నాయని, అవి కలిసే చోట ఎగుడు, దిగుడుగావున్న ఖాళీ (ఫాల్ట్) ప్రాంతం సర్దుబాటయ్యే క్రమంలో భూకంపం రాకతప్పదని ఆయన వెల్లడించారు. ఈ రెండు ప్లేట్స్ కలుసుకునే చోటు శాన్ ఆండ్రియాస్ ప్రాంతంలో ఉండడం వల్ల దీన్ని ‘శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‘గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు. యూసీఈఆర్ఎఫ్-3’ (యూనిఫామ్ కాలిఫోర్నియా ఎర్త్‌క్వేక్ రప్చర్ ఫోర్కాస్ట్) పేరిట అమెరికా జియాలోజికల్ సర్వే తాజా నివేదికను విడుదల చేసింది. సీస్మాలోజి, జియాలోజీ, జియోడెసీ, పేలియోసీస్మాలజీ, ఎర్త్‌క్వేక్ ఫిజిక్స్, ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఎంతో మంది నిపుణుల పరిశీలించి ఆమోదించిన తర్వాతనే యూసీఈఆర్ఎఫ్-3 నివేదికను విడుదల చేశారు. 2008లో విడుదల చేసిన యూసీఈఆర్ఎఫ్ నివేదిక ప్రకారం అప్పటి నుంచి 40 ఏళ్ల కాలంలో 6.7 తీవ్రతతో పెను భూకంపం వచ్చే ప్రమాదం 4.7 శాతంగా ఉంది. ఇప్పుడు విడుదల చేసిన మూడవ నివేదిక ప్రకారం రానున్న 30 ఏళ్ల కాలంలో (ఎప్పుడైనా) 8, అంతకన్నా ఎక్కువ తీవ్రతతో పెను భూకంపం వచ్చే ముప్పు శాస్త్రీయంగా ఏడు శాతం ఉంది. ఏడు శాతం అంటే దాదాపు 99 శాతం భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 1906, ఏప్రిల్ 18వ తేదీ ఆదయం 5.12 గంటలకు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు మూడు వేల మంది మరణించారు. ఆ భూకంపానికి దాదాపు 80 శాతం శాన్ఫ్రాన్సిస్కో తుడిచిపెట్టుకు పోయింది. అమెరికా చరిత్రలోనే ఇప్పటి వరకు అంతటి పెను భూకంపం రాలేదు. కానీ కాలిఫోర్నియా ప్రాంతంలో రానున్న భూకంపం మాత్రం అంతగా ఊహించనంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండును పెను భూకంపం కుదిపేయబోతోందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. నెల రోజుల క్రితం కూడా హెచ్చరించారు. ఇన్ని రోజుల్లోగా లేదా ఇన్ని రోజుల మధ్య వస్తుందని వారు తేల్చి చెప్పలేక పోవడం వల్లనే నేడు అక్కడ అపార నష్టం చోటుచేసుకుంది.