కాలిఫోర్నియాకు పెను భూకంపం ముప్పు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతానికి పెను భూకంపం వచ్చే ప్రమాదం బాగా పెరిగిందని, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8 అంతకంటే ఎక్కువ తీవ్రతతోనే వస్తుందని అమెరికా జియాలోజికల్ తాజా సర్వే వెల్లడించింది. తాజా గణాంకాలను తీసుకొని కొత్త పద్ధతిలో భూకంపం వచ్చే అవకాశాలను పరిశీలించగా రానున్న 30 ఏళ్ల కాలంలో 99 శాతం కాలిఫోర్నియాను పెను భూకంపం కుదిపేయనుందని తాజా నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన సదరన్ కాలిఫోర్నియా ఎర్త్‌క్వేక్ సెంటర్ డైరెక్టర్ టామ్ జోర్డాన్ మంగళవారం తెలిపారు. భూకంపానికి కారణమయ్యే పసిఫిక్ ప్లేట్, ఉత్తర అమెరికా ప్లేట్‌లు కాలిఫోర్నియాలోనే కలుసుకుంటున్నాయని, అవి కలిసే చోట ఎగుడు, దిగుడుగావున్న ఖాళీ (ఫాల్ట్) ప్రాంతం సర్దుబాటయ్యే క్రమంలో భూకంపం రాకతప్పదని ఆయన వెల్లడించారు. ఈ రెండు ప్లేట్స్ కలుసుకునే చోటు శాన్ ఆండ్రియాస్ ప్రాంతంలో ఉండడం వల్ల దీన్ని ‘శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‘గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు. యూసీఈఆర్‌ఎఫ్-3’ (యూనిఫామ్ కాలిఫోర్నియా ఎర్త్‌క్వేక్ రప్చర్ ఫోర్‌కాస్ట్) పేరిట అమెరికా జియాలోజికల్ సర్వే తాజా నివేదికను విడుదల చేసింది.
సీస్మాలోజి, జియాలోజీ, జియోడెసీ, పేలియోసీస్మాలజీ, ఎర్త్‌క్వేక్ ఫిజిక్స్, ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఎంతో మంది నిపుణుల పరిశీలించి ఆమోదించిన తర్వాతనే యూసీఈఆర్‌ఎఫ్-3 నివేదికను విడుదల చేశారు. 2008లో విడుదల చేసిన యూసీఈఆర్‌ఎఫ్ నివేదిక ప్రకారం అప్పటి నుంచి 40 ఏళ్ల కాలంలో 6.7 తీవ్రతతో పెను భూకంపం వచ్చే ప్రమాదం 4.7 శాతంగా ఉంది. ఇప్పుడు విడుదల చేసిన మూడవ నివేదిక ప్రకారం రానున్న 30 ఏళ్ల కాలంలో (ఎప్పుడైనా) 8, అంతకన్నా ఎక్కువ తీవ్రతతో పెను భూకంపం వచ్చే ముప్పు శాస్త్రీయంగా ఏడు శాతం ఉంది. ఏడు శాతం అంటే దాదాపు 99 శాతం భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
1906, ఏప్రిల్ 18వ తేదీ ఆదయం 5.12 గంటలకు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు మూడు వేల మంది మరణించారు. ఆ భూకంపానికి దాదాపు 80 శాతం శాన్‌ఫ్రాన్సిస్కో తుడిచిపెట్టుకు పోయింది. అమెరికా చరిత్రలోనే ఇప్పటి వరకు అంతటి పెను భూకంపం రాలేదు. కానీ కాలిఫోర్నియా ప్రాంతంలో రానున్న భూకంపం మాత్రం అంతగా ఊహించనంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండును పెను భూకంపం కుదిపేయబోతోందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. నెల రోజుల క్రితం కూడా హెచ్చరించారు. ఇన్ని రోజుల్లోగా లేదా ఇన్ని రోజుల మధ్య వస్తుందని వారు తేల్చి చెప్పలేక పోవడం వల్లనే నేడు అక్కడ అపార నష్టం చోటుచేసుకుంది.