టర్కీ, సిరియాలో శక్తివంతమైన భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భవనాలు నేటమట్టమయ్యాయి. 456 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్, 874 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్, 1,381 కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్, 1,411 కిలోమీటర్ల దూరంలోని ఈజిప్ట్‌లో సైతం భూప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ–మధ్య టర్కీలోని గాజియాన్‌టెప్ సిటీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు మొదలైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టర్కీలో గత 100 ఏళ్లలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
95 శాతం భూభాగం భూకంప ప్రభావితమే
భౌగోళికంగా ‘అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్’ ప్రాంతంలో ఉన్న టర్కీలో భూప్రకంపనలు సర్వసాధారణంగా మారాయి. 2020లో 33,000 భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో 332 భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై దాదాపు 4.0గా రికార్డయ్యింది. భూమి పై పొరను టెక్టానిక్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 15 భారీ టెక్టానిక్ ప్లేట్లు (రాతి పొరలు) ఉంటాయి. రెండు పొరల సరిహద్దుల నడుమ ఖాళీ ప్రదేశం ఉంటుంది. కొన్నిచోట్ల ప్లేట్ల మధ్య పగుళ్లు ఉంటాయి. భూ అంతర్భాగంలో సర్దుబాట్ల వల్ల రెండు టెక్టానిక్ ప్లేట్లు బలంగా ఢీకొన్నప్పుడు భారీ భూకంపం సంభవిస్తుందని బ్రిటిష్ ఆర్కియాలాజికల్ సర్వే వెల్లడించింది. యూరేసియన్, ఆఫ్రికన్ ప్లేట్ల చీలిక భాగంలో టర్కీ భూభాగం ఉంది.
యూరేసియన్, అనటొలియన్ టెక్టానిక్ ప్లేట్ల నడుమ నార్త్ అనటొలియన్ ఫాల్ట్(ఎన్‌ఏఎఫ్) లైన్ అనే చీలిక ఉంది. రెండు ప్లేట్లు ఢీకొనడంతో ఇక్కడే భూకంపం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఎన్‌ఏఎఫ్ చీలిక దక్షిణ ఇస్తాంబుల్ నుంచి ఈశాన్య టర్కీ దాకా విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. 1999, 2011లోనూ ఈ ప్రాంతం నుంచే భూకంపాలు విస్తరించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 1999 నాటి భూకంపంలో 18,000 మంది, 2011 నాటి భూకంపంలో 500 మందికిపైగా జనం మృతిచెందారు. టర్కీలో ఏకంగా 95 శాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతమే కావడం గమనార్హం. పెద్ద నగరాలైన ఇస్తాంబుల్, ఇజ్‌మీర్‌తోపాటు ఈస్ట్ అనటోలియా కూడా భూకంపం ముప్పును ఎదుర్కొంటున్నాయి.
3 రోజుల క్రితమే చెప్పేశాడు
తాజా భూకంపంపై ముందే చెప్పిన ఫ్రాంక్
త్వరలో భారత్‌కూ రావచ్చని హెచ్చరికలు
అమ్‌స్టర్‌డ్యామ్: టర్కీ, సిరియాలో వేలాది మందిని బలితీసుకున్న భూకంపం గురించి నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌గీట్స్ అనే పరిశోధకుడు ముందే హెచ్చరించారు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించనుందని, ఇది రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదవుతుందని ఈ నెల 3న ఆయన ట్వీట్ చేశారు. ఆయన జోస్యం నిజమేనని మూడు రోజుల తర్వాత తేలింది. మొదటి భూకంపం తర్వాత కొన్ని గంటలు గడిచాక రెండో భూకంపం సంభవిస్తుందంటూ తన సంస్థ చేసిన ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు. అది కూడా నిజమేనని తేటతెల్లమయ్యింది. త్వరలో భారత్‌తో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లకు కూడా భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నారు. హూగర్‌బీట్స్ ‘సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే’ అనే సంస్థలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ భూకంపాలపై అధ్యయనం చేస్తోంది. అయితే, హూగర్‌బీట్స్ నకిలీ సైంటిస్టు అని పలువురు ట్విట్టర్‌లో విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాను చెప్పింది వాస్తవరూపం దాల్చడం పట్ల హూగర్‌బీట్స్ విచారం వ్యక్తం చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment