earthquakes
-
ఢిల్లీ, బిహార్ లో కంపించిన భూమి
-
టిబెట్‌ను వణికించిన భూకంపం
బీజింగ్: చైనాలోని అటానమస్ ప్రాంతం టిబెట్‌లో మంగళవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.05 గంటల సమయంలో చోటుచేసుకున్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. దీని తీవ్రత డింగ్రీ కౌంటీలోని జిగాజెపై ఎక్కువగా పడింది. అక్కడ నివాస భవనాలు కూలడం వంటి ఘటనల్లో కనీసం 126 మంది ప్రాణాలు కోల్పోగా మరో 188 మంది క్షతగాత్రులయ్యారు. అయితే, భూకంప తీవ్రత 7.1 వరకు ఉందని అమెరికా జియోలాజికల్ విభాగం అంటోంది.ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, అధికారులు ఆహార పదార్థాలు, మంచినీరుతోపాటు కాటన్ టెంట్లు, కాటన్ కోట్లు, కిల్టులు, బెడ్లు తదితరాలను హుటాహుటిన పంపించారు. జిగాజె ప్రాంతాన్ని షిగస్తె అని కూడా పిలుస్తారు. ఇది భారత్‌తో సరిహద్దులకు సమీపంలోనే ఉంటుంది. టిబెట్‌లోని పవిత్ర నగరాల్లో షిగస్తె ఒకటి. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా తర్వాతి స్థానంగా భావించే పంచన్ లామా ఉండేది షిగస్తెలోనే. భూకంప కేంద్రం డింగ్రి కౌంటీలోని త్సొగోలో ఉంది.భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం నేపాల్‌లోని లొబుట్సెకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భూ ప్రకంపనల ప్రభావంతో నేపాల్‌లోని కవ్రెపలన్చౌక్, సింధుపలన్చౌక్ ధడింగ్, సొలుకుంభు జిల్లాలతోపాటు రాజధాని కఠ్మాండులోనూ కరెంటు స్తంభాలు, చెట్లు, భవనాలు కదిలాయి. ఇళ్లలో వస్తువులు శబ్దాలు చేస్తూ పడిపోవడంతో జనం భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. -
ముండ్లమూరును వదలని భూప్రకంపనలు
ముండ్లమూరు (దర్శి): ప్రకాశం జిల్లా ముండ్లమూరులో సోమవారం మళ్లీ భూమి కంపించింది. ఉదయం 10:24 గంటల సమయంలో భూకంప రాగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైంది. సోమవారం రాత్రి మరో రెండుసార్లు ముండ్లమూరు, మారెళ్ల గ్రామాల్లో భూమి కంపించింది. రాత్రి 8:16 గంటలకు, 8:19 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. నివాసాల్లోని ప్రజలు, దుకాణాల్లోని వ్యాపారులు ఒక్కసారిగా వచ్చిన శబ్దానికి ఏం జరిగిందోననే భయంతో బయటకు పరుగులు తీశారు. మ్యాప్‌లో ముండ్లమూరు–ఉమామహేశ్వరపురం మధ్య భూకంప కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా శని, ఆది, సోమవారాల్లో ఉదయం ఒకే సమయంలో భూకంపం రావడం, రాత్రి మరో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునేవారు సైతం ప్రతిరోజు వస్తున్న భూకంపంపై ఆందోళన చెందుతున్నారు. ముండ్లమూరులో ఈ నెలలో 4, 21, 22, 23 తేదీల్లో భూకంపం వచ్చింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మోడల్ స్కూల్ భవనం పాక్షికంగా దెబ్బతింది. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లలో ఉండాలంటే భయపడుతున్నారు. చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు. ముండ్లమూరులో ఏర్పడిన భూకంపం గుండ్లకమ్మ నది ప్రాంతంలో కేంద్రీకృతమై వచ్చిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శనివారం ఉదయం 10:35 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1గా నమోదైంది. ఆదివారం ఉదయం 10:41 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 2.1గా, సోమవారం 10.24 గంటల సమయంలో నమోదైన భూకంప తీవ్రత 1.8గా నమోదైంది. పరిశోధన చేయాలి ముండ్లమూరులో వరుసగా మూడుసార్లు భూకంపం రావడంపై శాస్త్రవేత్త రాఘవన్ కొన్ని వివరాలు అందజేశారు. వరుసగా మూడుసార్లు ఒకే సమయంలో ఎందుకు వచ్చిందో పరిశోధన చేస్తే తెలుస్తుందన్నారు. అక్కడకు దగ్గరలో రిజర్వాయర్లు, గుండ్లకమ్మ వంటి నదుల్లో రీసెర్చ్ చేయాల్సి ఉందన్నారు. ముండ్లమూరు ప్రాంతంలో వచ్చిన భూకంపాన్ని హైడ్రోశాస్మసిటీగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. ‘భూకంపం స్వామ్ లోపల వీక్ జోన్ ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే తరుచూ ఇదే ప్రాంతంలో ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంది’ అన్నారు. ఈ ప్రాంతంలో పరిశోధన చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు.కలెక్టర్‌కు నివేదించాంభూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కలెక్టర్ అడిగిన నివేదికలు పంపించాం. దానిపై కలెక్టర్ నుంచి వచ్చే ఉత్తర్వులు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.– శ్రీకాంత్, తహసీల్దార్ ఆందోళనగా ఉందిఉదయం 10.30 గంటల సమయంలో మూడు రోజులుగా వరుస భూకంపాలు వస్తున్నాయి. రోజూ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనగా ఉంది. – శ్రీనివాసరావు, వ్యాపారి, ముండ్లమూరుబెంచీలు బాగా ఊగాయి చాలా భయం వేసి చెట్టు కిందే కూర్చుని చదువుకుంటున్నాం. పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్కూల్లో పిల్లలంతా బయటకు పరుగులు తీశాం. మూడు రోజులుగా ఇదే జరుగుతోంది. పిల్లలందరూ భయంతో ఉన్నారు. – నవ్యశ్రీ, మోడల్ స్కూల్ విద్యార్థిని -
Iceland: అగ్ని పూలు
ఐస్లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలను వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్‌ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరసగా ఇది మూడోసారి. దీంతో దగ్గర్లోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీచేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బిలం బద్దలై వందల మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళిని ఎగజిమ్మింది. దీంతో తీరనగరం గ్రాండావ్ లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
తెలంగాణలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో కలకలం రేగింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి ప్రకంపనలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూ ప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఢిల్లీలో భూ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ ప్రాంతంలో ఉంది. దీంతో దేశరాజధానితో పాటు పంజాబ్, చండీగఢ్, జమ్మూకశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కొద్దిసేపు భూమి కంపించింది. పాక్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. -
Earthquakes: జపాన్ తీరంలో రెండు భూకంపాలు
టోక్యో: జపాన్ సముద్ర తీరంతో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. గురువారం అర్థగంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. మొదటి భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రత, రెండో భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతో నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జీయోలాజీకల్ సర్వే(USGS) తెలిపింది. జపాన్‌లోని కురిల్ దీవుల్లో గురువారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మొదటి భూకంపం నమోదు కాగా, రెండో భూకంపం మధ్యాహ్నం 3.07 గంటల సమయంలో సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జీయోలాజీకల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు భూకంపాలు సముద్రంతో 23.8 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపింది. అయితే రెండు సార్లు సంభవించిన ఈ భూకంపాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆధికారులు వెల్లడించారు. -
నేపాల్‌లో మరోసారి భూకంపం
కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్ ప్రజలను మరోసారి భూకంపం భయపెట్టింది. శుక్రవారం భూకంపం సంభవించిన పశ్చిమ నేపాల్‌లోని జజర్కోట్ పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4.31 గంటల సమయంలో భూమి కంపించింది. ఆ తర్వాత 4.40 సమయంలో 4.5 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు నమోదయ్యాయి. తాజా భూకంప కేంద్రం జజర్కోట్ జిల్లాలోని రమిదండాలో ఉందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాజధాని కఠ్మాండులోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకు న్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. తాజా భూకంపంతో వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో గత శుక్రవారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 157కు చేరుకుంది. -
ఉత్తర భారతదేశంలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలో శుక్రవారం రాత్రి భూప్రకంపలను సంభవించాయి. నేపాల్‌లో సంభవించిన తీవ్ర భూకంపం ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. ఉత్తర ప్రదేశ్, బిహార్, హరియాణా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలిసింది. నేపాల్‌లో భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదయ్యింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు నేపాల్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు తెలియజేసింది. నేపాల్‌లో భూకంపం చోటుచేసుకోవడం గత నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి. నేపాల్‌లో తాజా భూకంపంలో ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. -
ఆండ్రాయిడ్ ఫోన్లలో భూకంప హెచ్చరికలు!
న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు వారు ఉంటున్న ప్రాంతంలో సంభవించబోయే భూకంపానికి సంబంధించిన తక్షణ సమాచారాన్ని అలర్ట్‌ల రూపంలో గూగుల్ అందించనుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో ‘ఎర్త్‌క్వేక్ అలర్ట్’ సందేశ సేవలను ప్రారంభించనుంది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ), జాతీయ భూకంప కేంద్రాల సమన్వయంతో కొత్తగా ‘ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్’ను భారత్‌లో మొదలుపెట్టనుంది. ‘యూజర్లు ఉంటున్న ప్రాంతంలో ఒకచోట భూకంపం వస్తే దానికి పసిగట్టి వెంటనే ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అలర్ట్‌లు మెరుపువేగంతో వెళతాయి’ అని గూగుల్ బుధవారం ఒక బ్లాగ్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్ 5, ఆపై అప్డేటెడ్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఇన్స్టాల్ అయిన ఫోన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
Jaipur: అరగంట గ్యాప్‌లో మూడు భూకంపాలు!
ఢిల్లీ: వరుస భూకంపాలతో రాజస్థాన్ రాజధాని, పింక్ సిటీ జైపూర్ ఉలిక్కిపడింది. పొద్దుపొద్దున్నే కేవలం అరగంట గ్యాప్‌లోనే మూడు భూకంపాలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. శుక్రవారం వేకువ ఝామున జైపూర్ కేంద్రంగా.. 4.09ని ప్రాంతంలో పదికిలోమీటర్ల లోతున ఒకటి, . 4.22ని. ప్రాంతంలో 3.1 తీవ్రతతో ఐదు కిలోమీటర్ల లోతున ఇంకొకటి, 4.25 ప్రాంతంలో 3.4 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతున మరొకటి.. మొత్తం మూడుసార్లు భూమి కంపించింది. స్వల్ప ప్రకంపనలే అయినా.. ప్రజలు వణికిపోయారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని భయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఇక ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకంపనల విషయాన్ని రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సైతం ట్విటర్ ద్వారా ధృవీకరించారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు ట్విటర్లో పోస్ట్ అవుతున్నాయి. మరోవైపు మణిపూర్‌లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. What a scary day to witness such high magnitude #earthquake in #Jaipur. Please be safe! pic.twitter.com/hGDgfCHYtL — Jahnvi Sharma (@JahnviSharma01) July 20, 2023 #earthquake See the dogs on the street in deep sleep suddenly waking up #jaipur #भूकंप pic.twitter.com/oGYz942g9i — Rameshwar Singh (@RSingh6969a) July 20, 2023 जयपुर में तेज़ भूकंप के झटके महसूस किए गए हैं। I hope you all are safe! #Jaipur #earthquake pic.twitter.com/FWAEvBTw7A — Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) July 20, 2023 -
భూమికి నాలుగు పొరలే కాదు.. ఐదో పొర కూడా! దాని ఆకృతి ఎలా ఉందంటే?
అశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహమూ ఉన్నట్టుగా, భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పొర ఉందట! భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగుచూసిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు.. భూమి తాలూకు ఇన్నర్ కోర్ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్దకాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్ స్కేల్‌పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు. చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. ఇన్నర్ కోర్ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి. మరింత సమాచారం కోసం ఆ తరంగాల ప్రయాణ సమయాల్లో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయట పడిందని చెబుతున్నారు! ఇది భూమి లోలోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్ కోర్ తాలూకు కేంద్ర స్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి ‘అత్యంత లోపలి ఇన్నర్ కోర్’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూ కేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన సమాచారం వెలుగుచూడొచ్చని చెబుతున్నారు. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. 20 ఏళ్ల కిందే సూత్రీకరించినా.. నిజానికి భూమి లోలోతుల్లో ఇలాంటి ఒక లోహపు గోళం ఉందని 20 ఏళ్ల కిందే సైంటిస్టులు అంచనా వేశారు. బహుశా అది ఇన్నర్ కోర్ తాలూకు లోలోతుల్లో దాగుండవచ్చని సూత్రీకరించినట్టు ఏఎన్‌యూ తాలూకు రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌లో పని చేస్తున్న డాక్టర్ థాన్సన్ వివరించారు. ఇప్పుడు దానికి సంబంధించి తిరుగులేని రుజువులు లభించడం తమను ఆశ్చర్యానందాలకు లోను చేస్తోందన్నారు. మనకిప్పటిదాకా తెలిసిన భూమి తాలూకు నాలుగు పొరలు క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇలా వెలుగు చూసింది భూకంపం సంభవించినప్పుడు దాని తరంగాలు భూ కేంద్రకం గుండా సరిగ్గా భూమి అవతలి వైపు దూసుకెళ్తాయి. అనంతరం వెనుదిరిగి భూకంప కేంద్రం వద్దకు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో అలస్కాలో సంభవించిన ఓ భూకంపాన్ని పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. దాని తాలూకు తరంగాలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం గుండా భూమి అవతలి వైపునకు చొచ్చుకుపోయి తిరిగి అలస్కాలోని భూకంప కేంద్రం వద్దకు చేరుకున్నాయి. ఈ తరంగాల ప్రయాణ మార్గాన్ని లోతుగా పరిశీలించే క్రమంలో ఇన్నర్ కోర్‌లోని ఐదో లోహపు పొర ఉనికి తొలిసారిగా వెలుగు చూసిందని పరిశోధక బృందం తాజాగా వివరించింది. ‘‘ఈ భూకంప తరంగాల ప్రయాణ ధోరణిని నిశితంగా గమనించాం. అవి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర అంతర్భాగం నుంచి అలస్కా వైపు తిరిగొచ్చే క్రమంలో ఐదు చోట్ల నిర్దిష్ట ప్రతిస్పందనలు వెలువరిస్తూ ప్రయాణించినట్టు తేలింది. అలా ఐదో పొర ఉనికి బయట పడింది. ఇది వాస్తమేనని పలు ఇతర భూకంపాల తాలూకు తరంగాల ప్రయాణ ధోరణులను పరిశీలించిన మీదట నిర్ధారణ అయింది’ అని చెప్పుకొచ్చింది. ఐదో పొర కూర్పు ఇన్నర్ కోర్ లోతుల్లో ఉన్న ఐదో పొర ఇనుము–నికెల్ లోహ మిశ్రమంతో కూడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఇన్నర్ కోర్‌లోని పదార్థాల గుండా భూకంప తరంగాలు ఎలా దూసుకెళ్తాయో, నెమ్మదిస్తాయో వివరంగా తెలుసుకునే అనిసోట్రోఫీ ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్టు వారు వివరించారు. ‘ఈ తరంగాలు భూ కేంద్రం సమీపంలోని పలు ప్రాంతాలను భిన్న కోణాల్లో పదేపదే స్పృశించాయి. ఇన్నర్ కోర్ లోపలి ఘనాకృతి బయటి పొరతో పోలిస్తే భిన్నంగా ఉండొచ్చు. భూమి ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాల వల్ల ఇన్నర్ కోర్లో ఈ ఘనాకృతి రూపుదిద్దుకుని ఉంటుంది’ అని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భయంపుట్టిస్తున్న భూకంపాలు.. ముందే తెలుసుకునేందుకు ‘డాస్’ ప్రయోగాలు
తుపాను వస్తుందని, చేపల వేటకు వెళ్లొద్దని రెండు వారాల ముందే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అగ్ని పర్వతం బద్దలవుతుందని వారం ముందే సమాచారం వస్తోంది. పిడుగులు ఎక్కడ పడతాయో మొబైల్ ఫోన్లకు సమాచారం అందుతోంది. కానీ.. క్షణాల్లో భారీ విధ్వంసం సృష్టించే భూకంపాలను ముందుగా పసిగట్టలేకపోతున్నాం. ఇప్పుడు దీనిపైనే శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ముందస్తుగా భూకంపాల తీవ్రతను తెలుసుకొని, ప్రాణ నష్టాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టారు. కె.జి. రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): ప్రస్తుతం సిస్మోమీటర్ ద్వారా కేవలం కొన్ని సెకన్ల ముందు మాత్రమే భూకంపాలను తెలుసుకుంటున్నాం. అప్పటికే ఘోరం జరిగిపోతోంది. తుర్కియే, సిరియాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం దెబ్బకు వేలాది మంది చనిపోయారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఇలా భారీ నష్టం జరగకుండా ఆప్టిక్ కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంపాల తీవ్రతని కొన్ని గంటల ముందుగానే తెలుసుకొనేలా చేస్తున్న ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ (జియోసైన్సెస్) చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే భూకంపాల వల్ల కలిగే భారీ ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. ఏమిటీ ప్రయోగం! ప్రపంచంలో ఏటా 20 వేలకు పైగా భూకంపాలు నమోదవుతున్నాయి. సగటున రోజుకు 50 ప్రకంపనలు, వస్తుంటాయి. వీటి సమాచారాన్ని సిస్మోమీటర్ ద్వారా తీసుకుంటున్నారు. భూకంప తీవ్రతని రిక్టర్ స్కేల్‌పై కొలుస్తున్నారు. ఇప్పుడు కేబుల్స్ ద్వారా భూకంపాల తీవ్రత సమాచారాన్ని ముందుగానే సేకరించేందుకు డిస్ట్రిబ్యూటెడ్ ఎకౌస్టిక్ సెన్సింగ్ (డాస్) వ్యవస్థని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం టెలీకమ్యూనికేషన్స్ కోసం భూమి లోపల ఏర్పాటు చేస్తున్న ఈ ఆప్టిక్ కేబుల్స్‌కు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన కదలికలను గుర్తించే సామర్థ్యం ఉందని, వీటి ద్వారా భూమి లోపల సంభవించే భూకంప తరంగాలను, అగ్నిపర్వత విస్ఫోటనాలను ముందుగానే గుర్తించొచ్చనేది పరిశోధకుల ఆలోచన. ‘‘ఈ కేబుల్స్‌ను నిరంతరం గమనించి, వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరిస్తే భూకంప తీవ్రతను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది’’ అని జర్మన్ రీసెర్చ్ సెంటర్(జియోసైన్సెస్)లో పనిచేసే జియోసైంటిస్ట్ ఫిలిప్స్ జోసెట్ వివరించారు. ఎలా సాధ్యమవుతుంది? తొలుత డాస్ ద్వారా ఇటలీలోని ఎట్నా అగ్నిపర్వతం కార్యకలాపాల్ని పరిశీలించారు. పర్వతం బద్దలయ్యేందుకు కొంత ముందుగా వచ్చే ప్రారంభ కంపనల సమాచారాన్ని ఇది చేరవేసింది. ఇదే తరహాలో భూకంపాలు జరిగినప్పుడు భూ అంతర్భాగంలో జరిగే ప్రాథమిక కదలికల్ని గుర్తించవచ్చు. అంటే.. సెకనుకు 3.7 మైళ్ల వేగంతో ప్రయాణించే ప్రాథమిక భూకంప ప్రకంపనాలు (పి–తరంగాలు) నమోదైన వెంటనే కేబుల్ వ్యవస్థ ద్వారా సమాచారం అందుతుంది. ఈ పి–తరంగాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగదు. ఆ తర్వాత సెకనుకు 2.5 మైళ్ల వేగంతో వచ్చే సెకండరీ తరంగాలు (ఎస్–వేవ్స్) వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుంది. మొదటి తరంగాల సమాచారం స్టేషన్ల నుంచి రాగానే.. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5 కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే భారీ ప్రమాదం సంభవిస్తుందని పసిగడతారు. వెంటనే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపిస్తారు. మాగ్నిట్యూడ్ 4.5 కంటే ఎక్కువ ఉంటే గూగుల్ షేక్ అలెర్ట్ ద్వారా హెచ్చరికలు పంపే వ్యవస్థని రూపొందించారు. దీనికి గూగుల్‌తో భాగస్వామ్యమైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు. తుర్కియే, సిరియాకంటే ముందు వచ్చిన అతి పెద్ద 10 భూకంపాలు ► మొదటిది దక్షిణ అమెరికాలోని చిలీలో 1960 మే 22న వచ్చింది. ఇదే అతి తీవ్రమైనది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 9.5గా నమోదైంది. దీనివల్ల దూసుకొచ్చిన తరంగాలు దాదాపు భూమి మొత్తం ప్రయాణించాయి. 1,655 మంది మరణించగా 3 వేల మంది క్షతగాత్రులయ్యారు. 550 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ► 1964 మార్చి 28న అలస్కాలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనిని గుడ్ ఫ్రైడే భూకంపం అని కూడా పిలుస్తారు. 131 మంది చనిపోయారు. ► 2004 డిసెంబర్ 26న సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీగా మారింది. ఇది 14 దేశాలపై ప్రభావం చూపింది. 2,27,900 మంది మృత్యువాత పడ్డారు. ► 2011 మార్చి 11న జపాన్‌లోని సెండాయ్‌లో 9.0 తీవ్రతతో భూకంపం వచ్చిన అనంతరం సునామీ కూడా సంభవించింది. 10 వేల మందికి పైగా విగతజీవులయ్యారు. ► 1952 నవంబర్ 4న రష్యాలోని కంచట్కా (హవాయి దీవులు)లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 10 లక్షల అమెరికన్ డాలర్ల ఆస్తినష్టం సంభవించింది. ► 2010 ఫిబ్రవరి 27న చిలీలోని బయోబియో ప్రాంతంలో వచ్చిన భూకంపం తీవ్రత 8.8గా నమోదైంది. ఈ ప్రమాదంలో 600 మంది చనిపోయారు. ► 1906 జనవరి 31న ఈక్వెడార్ ఆఫ్ కోస్ట్‌లో 8.8 తీవ్రతతో భూకంపం, దాని వెంటే వచ్చిన సునామీ కారణంగా 500 మంది మృత్యువాత పడ్డారు. ► 1965 ఏప్రిల్ 2న అలస్కాలోని రాట్ ఐలాండ్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 8.7గా నమోదైంది. ► 2005 మార్చి 28న ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 1,313 మంది మృత్యువాత పడగా, 500 మంది గాయపడ్డారు. -
సూర్యాపేట జిల్లాలో స్వల్ప భూకంపం
హుజూర్నగర్: సూర్యాపేట జిల్లాలో ఆదివారం స్వల్ప భూకంపం వచ్చింది. చింతలపాలెం మండలంలోని తమ్మారం, వెల్లటూరు, చింతలపాలెం, గుడిమల్కాపురం, దొండపాడు, వజినేపల్లి తదితర గ్రామాలతో పాటు మేళ్లచెరువు మండలంలో ఉదయం 7.30 గంటల సమయంలో 3 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత సుమారు 3.1 మాగ్నిటూడ్గా నమోదైనట్లు తెలిసింది. గతంలో 2020, జనవరి మొదటి వారంలో 4 మాగ్నిటూడ్గా నమోదైంది. 2022లో కూడా పలు మార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఈ నేపథ్యంలో మళ్లీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Turkey-Syria earthquakes: శిథిలాల కింద 12 రోజులు...
అన్‌టాకియా: తుర్కియే, సిరియాను భూకంపం కుదిపేసి 12 రోజులు గడుస్తున్నా ఇంకా కొందరు శిథిలాల కింద నుంచి మృత్యుంజయులుగా బయట పడుతున్నారు. హతాయ్ ప్రావిన్స్‌లోని అన్‌టాకియా నగరంలో కుప్పకూలిన అపార్ట్మెంట్ శిథిలాల కింద 296 గంటలుగా ఇరుక్కున్న ఒక కుటుంబంలో ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. సిమెంట్ పెళ్లల కింద క్షణమొక యుగంలా గడిపిన ఒక కుటుంబంలోని ముగ్గురి మూలుగులు ఉన్న సహాయ సిబ్బంది వారిని బయటకి తీశారు. వీరిలో భార్యాభర్తలిద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ఉంటే వారి 12 ఏళ్ల కుమారుడి ప్రాణాలు మాత్రం వైద్యులు కాపాడలేకపోయారు. రెండు దేశాల్లోనే భూకంప మృతుల సంఖ్య 44 వేలు దాటింది. తుర్కియేలో మొత్తం 11 ప్రావిన్స్‌లకు గాను రెండు తప్ప తొమ్మిది ప్రావిన్స్‌లలో సహాయ చర్యలు నిలిపివేసినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. భూకంప బాధితుల కోసం అమెరికా నుంచి వచ్చిన సహాయ సామగ్రిని టర్కీలోని అడెనా ఎయిర్ బేస్ వద్ద ట్రక్కుల్లోకి చేరేయడంలో యూఎస్ సైనిక సిబ్బందికి సాయం చేస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్. భూకంప ప్రభావిత ప్రాంతాలను ఆదివారం ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. -
సాయమే లక్ష్యం: రంగంలోకి భారత్‌కు చెందిన జూలీ.. రోమియో.. హానీ.. రాంబో
సిరియా, టర్కీలో భయంకర ప్రకృతి విలయం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా దాదాపు 24వేలకు పైగా మంది మృత్యువాతపడ్డారు. రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని సహయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఈ క్రమంలో అనే దేశాలకు చెందిన టీమ్స్ సహయక చర్యల్లో పాల్గొన్నాయి. భారత్ కూడా అందరి కంటే ముందే సహాయక చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్మీ యుద్ధ విమానాల్లో అక్కడికి వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారుఉ. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన డాగ్ స్క్వాడ్లు కూడా రంగంలోకి దిగాయి. నలుగురు సభ్యుల డాగ్ స్క్వాడ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటోంది. ఎన్డీఆర్ఎఫ్ స్క్వాడ్‌లోని నాలుగు లాబ్రడార్ శునకాలు ఉన్నాయి. జూలీ, రోమియో, హానీ, రాంబో కుక్కులు తుర్కియే భూకంప బాధితుల్ని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఈ నాలుగు జాగిలాలతో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్లాయి. కాగా, స్నిఫింగ్‌లో ఈ డాగ్ స్క్వాడ్ ఎంతో స్పెషల్. రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా వాళ్లు శిక్షణ పొందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఈ డాగ్ స్క్వాడ్ వెంటనే పసిగడుతుంది. మరోవైపు.. విపత్కర వాతావరణంలోనూ ఇండియన్ డాగ్ స్క్వాడ్ బాధితుల్ని గుర్తించడం విశేషం. ఇక, టర్కీలో ఉష్ణోగ్రతలు మైనస్ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భూకంపం కారణంగా టర్కీ ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే టర్కీలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డొగ్లోని చెప్పారు. భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్ ప్లేట్ పశ్చిమ వైపు, మరో ప్లేట్ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు. వాలీబాల్ ఆట కోసం అడియామాన్‌కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్లో బస చేశారు. -
Turkey–Syria Earthquakes: ఎందుకీ భూ ప్రకోపం?
టర్కీ, సిరియాలో శక్తివంతమైన భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భవనాలు నేటమట్టమయ్యాయి. 456 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్, 874 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్, 1,381 కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్, 1,411 కిలోమీటర్ల దూరంలోని ఈజిప్ట్‌లో సైతం భూప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ–మధ్య టర్కీలోని గాజియాన్‌టెప్ సిటీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు మొదలైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టర్కీలో గత 100 ఏళ్లలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 95 శాతం భూభాగం భూకంప ప్రభావితమే భౌగోళికంగా ‘అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్’ ప్రాంతంలో ఉన్న టర్కీలో భూప్రకంపనలు సర్వసాధారణంగా మారాయి. 2020లో 33,000 భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో 332 భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై దాదాపు 4.0గా రికార్డయ్యింది. భూమి పై పొరను టెక్టానిక్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 15 భారీ టెక్టానిక్ ప్లేట్లు (రాతి పొరలు) ఉంటాయి. రెండు పొరల సరిహద్దుల నడుమ ఖాళీ ప్రదేశం ఉంటుంది. కొన్నిచోట్ల ప్లేట్ల మధ్య పగుళ్లు ఉంటాయి. భూ అంతర్భాగంలో సర్దుబాట్ల వల్ల రెండు టెక్టానిక్ ప్లేట్లు బలంగా ఢీకొన్నప్పుడు భారీ భూకంపం సంభవిస్తుందని బ్రిటిష్ ఆర్కియాలాజికల్ సర్వే వెల్లడించింది. యూరేసియన్, ఆఫ్రికన్ ప్లేట్ల చీలిక భాగంలో టర్కీ భూభాగం ఉంది. యూరేసియన్, అనటొలియన్ టెక్టానిక్ ప్లేట్ల నడుమ నార్త్ అనటొలియన్ ఫాల్ట్(ఎన్‌ఏఎఫ్) లైన్ అనే చీలిక ఉంది. రెండు ప్లేట్లు ఢీకొనడంతో ఇక్కడే భూకంపం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఎన్‌ఏఎఫ్ చీలిక దక్షిణ ఇస్తాంబుల్ నుంచి ఈశాన్య టర్కీ దాకా విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. 1999, 2011లోనూ ఈ ప్రాంతం నుంచే భూకంపాలు విస్తరించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 1999 నాటి భూకంపంలో 18,000 మంది, 2011 నాటి భూకంపంలో 500 మందికిపైగా జనం మృతిచెందారు. టర్కీలో ఏకంగా 95 శాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతమే కావడం గమనార్హం. పెద్ద నగరాలైన ఇస్తాంబుల్, ఇజ్‌మీర్‌తోపాటు ఈస్ట్ అనటోలియా కూడా భూకంపం ముప్పును ఎదుర్కొంటున్నాయి. 3 రోజుల క్రితమే చెప్పేశాడు తాజా భూకంపంపై ముందే చెప్పిన ఫ్రాంక్ త్వరలో భారత్‌కూ రావచ్చని హెచ్చరికలు అమ్‌స్టర్‌డ్యామ్: టర్కీ, సిరియాలో వేలాది మందిని బలితీసుకున్న భూకంపం గురించి నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌గీట్స్ అనే పరిశోధకుడు ముందే హెచ్చరించారు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించనుందని, ఇది రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదవుతుందని ఈ నెల 3న ఆయన ట్వీట్ చేశారు. ఆయన జోస్యం నిజమేనని మూడు రోజుల తర్వాత తేలింది. మొదటి భూకంపం తర్వాత కొన్ని గంటలు గడిచాక రెండో భూకంపం సంభవిస్తుందంటూ తన సంస్థ చేసిన ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు. అది కూడా నిజమేనని తేటతెల్లమయ్యింది. త్వరలో భారత్‌తో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్లకు కూడా భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నారు. హూగర్బీట్స్ ‘సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే’ అనే సంస్థలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ భూకంపాలపై అధ్యయనం చేస్తోంది. అయితే, హూగర్బీట్స్ నకిలీ సైంటిస్టు అని పలువురు ట్విట్టర్లో విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాను చెప్పింది వాస్తవరూపం దాల్చడం పట్ల హూగర్బీట్స్ విచారం వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లాస్టిక్ భవంతి
ప్లాస్టిక్ చెత్త ప్రపంచవ్యాప్త సమస్య. పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తలో రీసైక్లింగ్ జరుగుతున్నది చాలా తక్కువే! రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించు కుంటున్న సందర్భాలు మరింత అరుదు.రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించుకున్న తీరుకు ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనమే ఉదాహరణ. ఇది తైవాన్ రాజధాని తైపీ నగరంలో ఉంది. ‘ఎకో ఆర్క్’ పేరిట నిర్మించిన ఈ భవంతి ముందు భాగంలోని నిర్మాణమంతా రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో చేపట్టడం విశేషం. ఏకంగా పదిహేను లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో ఈ నిర్మాణం చేపట్టారు. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను నేరుగా వాడకుండా, వాటిని కరిగించి, మళ్లీ బాటిల్స్‌గా తయారు చేసి ముందుభాగం నిర్మాణానికి ఉపయోగించారు. వీటిని ఒకేరకమైన ఆకృతిలో, ఒకే పరిమాణంలో తయారు చేశారు. దీనివల్ల వీటిని సులువుగా ఉక్కుఫ్రేమ్లో ఒకదానినొకటి జోడించి, చతురస్రాకారపు ప్యానెళ్లుగా అసెంబుల్ చేసి, పటిష్ఠంగా భవంతిని నిర్మించారు. భవనంలోని మిగిలిన భాగాలను రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించారు.ఈ భవంతికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో రాత్రివేళ వెలిగే 40వేల ఎల్ఈడీ బల్బులకు కావలసిన మొత్తం విద్యుత్తును సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ద్వారా అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లు పారదర్శకంగా ఉండటం వల్ల పగటివేళలో వెలుతురు కోసం విద్యుత్ బల్బులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. కాబట్టి దీనివల్ల వాతావరణంలోని కర్బన ఉద్గారాల సమస్య కూడా పెద్దగా ఉండదు.కాంక్రీట్ భవంతితో పోల్చుకుంటే, దీని బరువు సగాని కంటే తక్కువగానే ఉంటుంది. అలాగని దీని దారుఢ్యాన్నేమీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటారా? తుపానులు చెలరేగినప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులనైనా ఈ భవంతి ఇట్టే తట్టుకోగలదు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం, నిప్పు తగులుకోకుండా దీనికి ప్రత్యేకమైన రసాయన కోటింగ్ కూడా పూశారు. కాబట్టి, తుపానులు, అగ్నిప్రమాదాల వల్ల ఈ భవంతికి వచ్చే ముప్పేమీ ఉండదు.తైపీలో ఏడేళ్ల కిందట జరిగిన అంతర్జాతీయ ప్రదర్శన కోసం అర్థర్ హువాంగ్ అనే డిజైనర్ ఈ భవంతిని ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. తైవాన్‌లో ఏటా చెత్తలోకి చేరుకుంటున్న 45 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమతో, పట్టుదలతో ఈ భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణం కోసం 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) ఖర్చయింది. ఇస్మాయిల్ -
జోషీ మఠ్‌లో ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ!
జోషిమఠ్. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు చిరపరిచితమైన పేరు. ఉత్తరాఖండ్‌లో అత్యంత పురాతమైన పట్టణం పూర్తిగా కనుమరుగయ్యే రోజులు దగ్గరకొస్తున్నాయి. జోషిమఠ్‌లో వందలాది ఇళ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భూమిలోంచి నీళ్లు ఉబుకుబుకి పైకి వస్తున్నాయి. ఈ పట్టణం నిట్టనిలువుగా భూమిలోకి కుంగిపోవడమే దీనికి కారణం. ఏదో ఒక రోజు జోషిమఠ్ మునిగిపోవడం ఖాయమని దశాబ్దాల క్రితమే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని జోíషీమఠ్‌లో ప్రజలు గత కొద్ది రోజులుగా ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. దాదాపుగా 600 ఇళ్లు బీటలు వారాయి. నేలకింద నుంచి ఇళ్లల్లోకి నీరు వచ్చేస్తోంది. భూమి కింద నుంచి శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు వణికిపోతున్నారు. చార్ధామ్ యాత్రికుల కోసం హెలాంగ్ నుంచి మార్వారి వరకు రోడ్డుని వెడల్పు చేసే ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ముప్పు ముంచుకొచ్చింది. దీంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రంగంలోకి దిగారు. రహదారి నిర్మాణాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. జోషీమఠ్ పరిస్థితిపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. అక్కడి 600 కుటుంబాలను తక్షణం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. శనివారం అక్కడ పర్యటించనున్నారు. దాంతో విపత్తు సహాయక బృందాలు ప్రజల్ని తరలిస్తున్నాయి. ఎందుకీ ముప్పు ? జోషీమఠ్ పట్టణం కొండల్లో ఏటవాలుగా ఉన్నట్టు ఒకవైపు ఒరిగి ఉంటుంది. అత్యంత పురాతనమైన కొండచరియలపై ఇళ్లు నిర్మించడంతో పునాదులు బలంగా లేవు. అడపా దడపా భూ ప్రకంపనలు పలకరిస్తూనే ఉంటాయి. రైని ప్రాంతంలోని అలకనంద నదికి వరదలు వచ్చినప్పుడల్లా జోíషీమఠ్‌లో మట్టిని బలహీనపరుస్తోంది. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టవద్దని ఎందరో నిపుణులు హెచ్చరించినా మన ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్ని పేల్చేయడం, ఇష్టారాజ్యంగా తవ్వకాలు, చెట్లు నరికేయడం వంటి చర్యలు జోíషీమఠ్ పట్టణాన్ని ప్రమాదంలో పడేశాయి. ఎన్టీపీసికి చెందిన తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అతి పెద్ద ముప్పుగా పరిణమించింది. గత ఏడాది ఈ ప్రాజెక్టు దగ్గర ఆకస్మిక వరదలు సంభవించి 200 మంది మరణించిన విషయం తెలిసిందే. ఏడాది పొడవునా చార్ధామ్ యాత్ర చేయడానికి వీలుగా హెలోంగ్ నుంచి మార్వారి వరకు 20కి.మీ. మేర చేపట్టిన రహదారి వెడల్పు చేసే ప్రాజెక్టు ముప్పుని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ నిర్మాణాలన్నీ తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. సమస్యకి శాశ్వతమైన పరిష్కారాలు కనుగొనే వరకు చిన్నపాటి తవ్వకాలు కూడా చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది జోషీమఠ్‌కి ముప్పుని తొలిసారి గుర్తించారు. చమోలిలో ప్రమాదకరంగా కొండచరియలు విరిగిపడినప్పుడు జోíషీమఠ్‌లో ఇళ్లు బీటలు వారాయి. అప్పట్నుంచి ఏదో ఒక రూపంలో ప్రమాదాలు వస్తూనే ఉన్నాయి. దీనికి గల కారణాలపై బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ పట్టణం ఉన్న ప్రాంతంలో సహజసిద్ధంగా వచ్చే ముప్పుతో పాటు మానవ తప్పిదాలు కారణమని తేల్చింది. 50 ఏళ్ల క్రితమే ప్రమాదం గుర్తించిన నిపుణులు జోషీమఠ్ పూర్తిగా మునిగిపోతుందని 50 ఏళ్ల క్రితమే నిపుణులు అంచనా వేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో తరచూ వరదలు రావడానికి గల కారణాలు అన్వేషించడానికి ఏర్పాటు చేసిన మిశ్రా కమిటీ 1976లో ఇచ్చిన నివేదికలో జోíషీమఠ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ విషయాన్ని ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వృద్ధులు కథలుగా చెబుతున్నారు. జోషిమఠ్ కనుమరుగైపోతుందా అన్న ఆందోళనలో స్థానికులు దినమొక గండంగా బతుకుతున్నారు. కుప్పకూలిన జోషిమఠ్ ఆలయం జోషీమఠ్: హిమాలయాల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లోని జోíషీమఠ్‌లో ఓ ఆలయం శుక్రవారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానికులు చెప్పారు. ఆలయ గోడలు పగుళ్లు వారుతుండటంతో 15 రోజుల క్రితమే మూసివేసినట్లు చెప్పారు. సింగ్‌ధర్ వార్డులోని చాలా ఇళ్లు బీటలు వారుతుండటంతో 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అదేవిధంగా, అక్కడికి సమీపంలోనే ఉన్న జల విద్యుత్ కేంద్రంలో పనిచేసే 60 కుటుంబాలను కూడా మరో చోటికి తరలించారు. మర్వారీలోని జలాశయం బీటలు వారి నీరు ధారాళంగా మూడు రోజులుగా దిగువకు వస్తుండటంతో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. చార్‌ధామ్‌లో కొనసాగుతున్న బైపాస్ రోడ్డు, జల విద్యుత్ ప్రాజెక్టు పనులను, ఔలి రోప్ వే సేవలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఏడాది కాలంగా భూమి కుంగిపోతోంది. పక్షం రోజులు గా భూమి కుంగుబాటు మరీ ఎక్కువైంది. ఏమిటీ జోషీమఠ్ ? హిమాలయాల్లోని ప్రకృతి అందాలకు నెలవు ఈ పట్టణం. చమోలి జిల్లాలో బద్రీనాథ్, హేమ్‌కుంద్ సాహిబ్ మధ్య 6 వేల అడుగుల ఎత్తులో జోషీ మఠ్ ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఈ పట్టణం ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుడు ఎనిమిదో శతాబ్దంలో జోíషీమఠ్‌లోనే జ్ఞానోదయం పొందారని ప్రతీతి. ఇప్పటికే అత్యధిక భూకంపం ముప్పు ఉన్న కేటగిరి జోన్–5లో ఈ ప్రాంతం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రాల గుండె చప్పుడు విందాం!
వాషింగ్టన్: వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ముంపు భయం వెంటాడుతోంది. వీటన్నింటికి మానవుల అత్యాశే కారణమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సముద్రాల గుండె ఘోష వినేందుకు ఐర్లాండ్‌కు చెందిన కళాకారిణి సియోభాన్ మెక్‌డొనాల్డ్ నడుం బిగించారు. సముద్రాల అడుగు భాగంలో సంభవించే భూకంపాలు, విరిగిపడే కొండ చరియలు, జీవజాలం మనుగడ, కాలుష్యం, కరిగిపోతున్న మంచు గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సముద్రం వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లు(హైడ్రోఫోన్స్) జార విడుస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌ల్యాండ్, కెనడా మధ్య ఉన్న డెవిస్ అఖాతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటిదాకా 12 మైక్రోఫోన్లను జారవిడిచారు. ఈ ప్రయోగానికి అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ మైక్రోఫోన్లు రెండేళ్లపాటు సముద్రంలోనే ఉంటాయి. 2024లో బయటకు తీస్తారు. ఇవి ప్రతి గంటకోసారి సముద్ర అడుగు భాగంలోని శబ్దాలను స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ శబ్దాలన్నింటిని కలిపి ఒక ఆడియోను రూపొందిస్తారు. ఇది ‘సముద్ర జ్ఞాపకం’గా మెక్‌డొనాల్డ్ అభివర్ణించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ విపత్తుల విషయంలో ఇదే మొట్టమొదటి సైన్స్, ఆర్ట్స్ ఉమ్మడి ప్రయోగమని చెబుతున్నారు. సముద్రాల గుండె చప్పుడు వినడం ద్వారా భూమిపై సమీప భవష్యత్తులో సంభవించే విపరిణామాలను ముందే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ లాంటిదేనని మెక్‌డొనాల్డ్ అన్నారు. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పిందని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకం ఆపేసినా సరే గ్రీన్‌ల్యాండ్‌లో 110 క్వాడ్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయి సముద్ర మట్టం 27 సెంటీమీటర్లు(10.6 అంగుళాలు) పెరుగుతుందని అంచనా. -
గుజరాత్‌పై కుట్రలు
భుజ్: గుజరాత్ వరుస ప్రాకృతిక విపత్తులతో అల్లాడుతున్న సమయంలో రాష్ట్రాన్ని దేశంలోనే గాక అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చాలా కుట్రలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ వాటన్నింటినీ అధిగమించి పారిశ్రామికంగా, ఇతరత్రా కూడా రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని కొనియాడారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం కచ్ జిల్లాలో రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘2001 కచ్ భూకంపం మాటకందని విషాదం. ఆ విలయాన్ని అవకాశంగా మార్చుకుని కచ్‌ను పునర్నిర్మించుకుంటామని అప్పుడే చెప్పాను. దాన్నిప్పుడు సాధించి చూపించాం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెక్స్టైల్ ప్లాంట్, ఆసియాలో తొలి సెజ్ తదితరాలకు కచ్ వేదికైంది. దేశ రవాణాలో 30 శాతం ఇక్కడి కాండ్లాం, ముంద్రా పోర్టుల గుండానే జరుగుతోంది. దేశానికి కావాల్సిన ఉప్పు 30 శాతం కచ్‌లోనే తయారవుతోంది’’ అని మోదీ చెప్పారు. ‘‘భూకంపం వచ్చినప్పుడు నేను గుజరాత్ సీఎంను కాను. సాధారణ బీజేపీ కార్యకర్తను. రెండో రోజే కచ్ చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా’’ అని గుర్తు చేసుకున్నారు. భూకంపానికి బలైన 13 వేల మందికి స్మృత్యర్థం నిర్మించిన రెండు స్మారకాలను ప్రారంభించారు. ఆ సమయంలో అనేక భావాలు తనను ముప్పిరిగొన్నాయని చెప్పారు. స్మృతి వన్ స్మారకాన్ని అమెరికా ట్విన్ టవర్స్ స్మారకం, జపాన్‌లోని హిరోషిమా స్మారకంతో పోల్చారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని చెప్పారు. దాని స్ఫూర్తితోనే కేంద్ర స్థాయిలో అలాంటి చట్టం వచ్చిందన్నారు. అవగాహన పెరగాలి పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని మోదీ అన్నారు. ఈ దిశగా పోషన్ అభియాన్, జల్ జీవన్ మిషన్ బాగా పని చేస్తున్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ను పౌష్టికాహార నెలగా జరుపుకుంటున్నట్టు గుర్తు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస అంగీకరించడాన్ని గుర్తు చేశారు. ‘‘ఏళ్లుగా విదేశీ అతిథులకు మన తృణధాన్యపు వంటకాలను రుచి చూపిస్తూ వస్తున్నా. వారంతా వాటి రుచిని ఎంతో ఆస్వాదించారు. ముడి ధాన్యం అనాది కాలం నుంచి మన సాగులో, సంస్కృతితో, నాగరికతలో భాగం’’ అన్నారు. ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను దేశ ప్రజలంతా గొప్ప జోష్‌తో జరుపుకున్నారంటూ హర్షం వెలిబుచ్చారు. లెక్కలేనన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలున్న ఇంత పెద్ద దేశం తాలూకు సమష్టి శక్తి ఎంత బలవత్తరమైనదో ప్రపంచానికి చూపారన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ దేశంలో మూలమూలలా అమృత ధార పారుతోందన్నారు. ఈశాన్య భారతం వంటి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి కొత్త వెలుగులు తెచ్చిందని చెప్పారు. ‘‘డిజిటల్ ఇండియా ద్వారా వాటికి అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన సదుపాయాలు ప్రతి గ్రామానికీ చేరాయి. ఫలితంగా డిజిటల్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత మారుమూల జోర్సింగ్ గ్రామానికి పంద్రాగస్టు నుంచే 4జీ సేవలందుతున్నాయి’’ అంటూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. సమర యోధుల త్యాగాలను కళ్లముందుంచే స్వరాజ్ సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రజలంతా చూడాలన్నారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని తనకు పూర్తి నమ్మకముందని పునరుద్ఘాటించారు. -
వైజాగ్ @ సేఫ్ జోన్
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. రాత్రంతా కురిసిన భారీ వర్షంతో భారంగా నిద్రలేస్తున్న వేళ.. ఒక్కసారిగా అలజడి... సరిగ్గా ఉదయం 7.13 గంటలకు భారీ శబ్దం వినిపించింది. ఉలిక్కిపడిన ప్రజలు.. 5 సెకన్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలతో బయటికి వచ్చారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాలి కంటే వేగంగా.. వైజాగ్‌లో భూకంపం అనే వార్త దావానలంలా వ్యాపించింది. అయితే.. విశాఖలో భూకంపాల వచ్చే తీవ్రత అత్యంత స్వల్పమని.. ప్రజలెవ్వరూ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు! రిక్టర్ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం భూమి లోపల 12 కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయి. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే నష్టం వాటిల్లుతుంది. భూ అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాలలోని కొన్ని భాగాలలో సమస్యలు ఏర్పటంతో ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపాలు ఏర్పడతాయి. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం అధికంగా ఉంటుంది. జోన్–2లో విశాఖ జిల్లా.. భూకంపాల తీవ్రత ఉన్న ప్రాంతాలను జోన్లలో విభజిస్తారు. జోన్–1 అంటే చిన్న స్థాయి ప్రకంపనలు కూడా వచ్చే శాతం అతి స్వల్పంగా ఉంటుందనీ.. జోన్–2లో స్వల్ప ప్రకంపనలు వస్తాయని.. జోన్–3లో భూకంప తీవ్రత స్వల్పంగా ఉంటుందనీ.. జోన్–4లో భారీగా ప్రమాదం ఉంటుందని విభజించారు. విశాఖ జిల్లా భూకంపాల విషయంలో జోన్–2 (లో రిస్క్ ఏరియా)లో ఉంది. కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు, భూగర్భ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 1967 మార్చి 27న ఒంగోలులో నమోదైన 5.4 తీవ్రత ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. అది కూడా రిక్టర్ స్కేలుపై 6 దాటలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 26 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. 200 ఏళ్లలో ఐదు సార్లు మాత్రమే.. విశాఖలో ప్రకంపనలు రావడం అత్యంత అరుదుగా చరిత్ర చెబుతోంది. గత 200 ఏళ్ల కాలంలో కేవలం 7 సార్లు మాత్రమే భూ ప్రకంపనలు విశాఖలో వచ్చాయని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో అత్యధికం 4.3 కాగా.. అత్యల్పం ఆదివారం వచ్చిన 1.8 కావడం గమనార్హం. భూ ప్రకంపనలు చివరిసారిగా 1984లో వచ్చినట్లు వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖలో ప్రకంపనలు ఎందుకు..? విశాఖపట్నం ప్రాంతంలో ప్రీ కేంబ్రియన్ అనే కాలానికి చెందిన రాళ్లు ఉన్నాయి. ఇవి 300 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. భూ అంతర్భాగంలో ఉన్న రాళ్లు చోర్నకైట్ అనే శిలలు ఒక పగులు ద్వారా వ్యాపించాయి. మధురవాడ, మద్దిలపాలెం, సిరిపురం, గవర్నరు బంగ్లా, ఆర్టీసీ కాంప్లెక్స్, నీలమ్మ వేపచెట్టు, జ్ఞానాపురం, ఎన్ఏడీ, ఎయిర్‌పోర్టు, గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి వరకు ఈ శిలలు వ్యాపించాయి. సముద్రంలోకి కొంత భాగం కూడా చోర్నకైట్ శిలలున్నాయి. ఈ శిలలు అప్పటికే ఉన్న ఖోండలైట్ శిలల్లోకి చొచ్చుకొని వచ్చి రూపాంతరం చెందాయి. ఈ విధంగా చొచ్చుకొని రావడం వల్ల టెక్టానికల్లీ వీక్ జోన్(సున్నితమైన ప్రాంతం)గా భౌగోళికంగా చెబుతారు. ఈ చోర్నకైట్ శిలలకు, దాన్ని ఆనుకొని ఉన్న ఖోండలైట్ శిలలకు మధ్య జరిగిన సర్దుబాటు వల్ల ఈ ప్రకంపనలు వచ్చాయి. భూకంపాల గురించి భయపడొద్దు.. విశాఖ జిల్లా చాలా సురక్షిత ప్రాంతం. జోన్–2 పరిధిలో ఉన్నందువల్ల ఇక్కడ భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. విశాఖ భూ అంతర్భాగంలో అతి పెద్ద రాక్ బ్యారియర్ ఉంది. చోర్నకైట్, ఖోండలైట్ శిలల మధ్య జరిగిన పునఃసర్దుబాటు కారణంగా భారీ శబ్దం ఏర్పడి ప్రకంపనలు వచ్చాయి. పురాతన కాలంలో ఏర్పడడడం వల్ల ప్రస్తుతం ఈ రాక్ జోన్ అంత యాక్టివ్ జోన్ కాదు. విశాఖపట్నంలో ప్రకంపనల వరకే పరిమితం తప్ప భారీగా ఇళ్లు కూలిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి భారీ నష్టం వంటి పరిస్థితులు దాదాపు శూన్యం. ప్రజలెవ్వరూ ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. – ప్రొ.ఎం.జనార్దనరావు, ఏయూ జియాలజీ విభాగం గౌరవ ప్రొఫెసర్, నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి -
మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ త్వరలోనే మరో అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించనుంది. స్మార్ట్ఫోన్లనుపయోగించి ముందుగానే భూకంపాలను గుర్తించగల టెక్నాలజీని షావోమీ అభివృద్ధి చేస్తోంది. అందుకు సంబంధించిన పేటెంట్ హక్కులను షావోమీ రిజిస్టర్ చేసింది. ‘ మెథడ్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ రియలైజింగ్ సెసిమిక్ మానిటరింగ్ ఆఫ్ మొబైల్ డివైజెస్’ పేరిట ఒక రిపోర్ట్‌ను షావోమీ ప్రచురించింది. భూకంపాలను గుర్తించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగించబడుతుందని గిజ్మోచైనా నివేదించింది. చదవండి: SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా? ఈ టెక్నాలజీలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్ గుర్తించిన డేటాను భూకంప ప్రాసెసింగ్ యూనిట్‌కు బదిలీచేస్తోంది. అంతేకాకుండా స్మార్ట్ఫోన్లలో ఏర్పాటుచేసిన టెక్నాలజీతో ముందుగానే భూకంపాలను గుర్తించడంతో పాటు, హెచ్చరికలను కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో షావోమీ సౌండ్‌నుపయోగించి స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేసే పేటెంట్‌ను కూడా తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
విశాఖ సురక్షితం.. ఉపద్రవం ఉత్తదే
సాక్షి, విశాఖపట్నం: ‘‘దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో అత్యంత సురక్షిత నగరాల్లో విశాఖ ముందు వరుసలో ఉంటుంది. వందేళ్ల తర్వాత ఒకటి రెండు అడుగులు సముద్రమట్టం పెరిగినా ముంపునకు గురవుతుందన్న ఆందోళనైతే ఏమాత్రం లేదు..’’ ఇదీ జాతీయ సముద్ర అధ్యయన సంస్థ(ఎన్ఐఓ) విశ్రాంత శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు తేల్చి చెబుతున్న మాట. ‘నాసా’ అధ్యయనం ప్రకారం సముద్ర మట్టం పెరుగుతుందన్న ఆందోళన ఉన్నప్పటికీ అది స్వల్పంగా ముందుకు చొచ్చుకు వచ్చే వరకు మాత్రమే ప్రభావం ఉంటుంది కానీ విశాఖకు ముంపు ముప్పు ఉందన్న అవాస్తవ ప్రచారాలను ఎవరూ విశ్వసించవద్దని సూచిస్తున్నారు. భూతాపంతో.. నానాటికీ పెరుగుతున్న భూతాపం మానవాళిని అంపశయ్యపై ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ (ఐపీసీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. భూతాపం వల్ల ఉత్తర ధృవంలోని ఆర్కిటిక్ సముద్రంలో పలకలు క్రమంగా కరుగుతూ నీరుగా మారి సముద్రంలో చేరుతున్నాయని, దీనివల్ల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతాయని పేర్కొంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2100 సంవత్సరంలో దేశంలోని కొచ్చి, భావ్‌నగర్, ముంబై, మంగళూరు, చెన్నైతో పాటు విశాఖపట్నంలోనూ సముద్ర మట్టాలు పెరిగే ముప్పు ఉందని హెచ్చరించింది. అయితే దీన్ని పట్టుకుని విష కథనాలు వండి వార్చేస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు నాసా చెప్పిన నిజమేంటి..? విశాఖకు నిజంగానే ఉపద్రవం ఉందా? అనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం.. నాసా ఏం చెప్పిందంటే..? 1988 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు, సముద్ర స్థితిగతులు, కర్బన ఉద్గారాలు మొదలైన అంశాలపై ఐపీసీసీ అధ్యయనం చేసి ఐక్యరాజ్యసమితికి నివేదిక అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా భూతాపం పెరుగుతుండటం వల్ల భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పు ఎదురుకానుందని ఈ ఏడాది సర్వేలో హెచ్చరించింది. హిమనీ నదాలు కరిగి సముద్రంలో కలుస్తుండటం ఒక పరిణామమైతే, రుతుపవనాల్లో మార్పులు, భారీ తుపాన్లు కారణంగా వరదనీరు సముద్రంలోకి భారీగా చేరి నీటి మట్టాలు పెరగనున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నంలో రానున్న వందేళ్లలో 1.77 అడుగుల ఎత్తున సముద్ర నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నది సారాంశం. విశాఖలో వాస్తవమేంటి..? నాసా చెప్పింది నిజమే. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రం ఉప్పొంగనుంది. ఫలితంగా మట్టాలు పెరిగి ముందుకు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. 2019లో ఎన్ఐవో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2100 నాటికి ప్రస్తుత సముద్ర మట్టం కంటే 70 సెంటీమీటర్లు పెరిగే సూచనలున్నాయని వెల్లడించింది. ఇదే విషయాన్ని ఐపీసీసీ స్పష్టం చేసింది. ఇదే జరిగితే కోస్తా తీరంలో వందల కిలోమీటర్లు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే మరో 500 లేదా 600 ఏళ్ల వరకూ విశాఖకు ముంపు ముప్పు లేదన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే విశాఖ నగరం సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. వందేళ్ల తర్వాత నీటి మట్టం పెరిగేది కేవలం 1.77 అడుగులు. అంటే 0.532 మీటర్లు మాత్రమే. . దీనివల్ల విశాఖ మునిగిపోయే ప్రమాదం ఏమాత్రం లేదని శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు స్పష్టం చేస్తున్నారు. తీరం కోతకు గురవడం సాధారణమని పేర్కొంటున్నారు. విశాఖకు భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదాలు లేవు. టెక్టానిక్స్ ప్రకారం లక్షల సంవత్సరాలకు జరగవచ్చన్నది ఒక అంచనా మాత్రమేనని చెబుతున్నారు. తీరం ఎందుకు కోతకు గురవుతుంది..? పరిశ్రమలు, వాహనాలు, యంత్రాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి వాయువులు భూ ఉపరితల వాతావరణంలో వలయంలా ఏర్పడ్డాయి. ఈ వలయం భూమి నుంచి బయటకు వెళ్లాల్సిన ఉష్ణోగ్రతను బంధించేయడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని చెబుతారు. పోర్టులు, రిగ్గులు, హార్బర్లు కారణంగా సముద్రంలో సహజసిద్ధంగా ఉన్న నీటి గమనంపై ప్రభావితం చూపుతున్నాయి. దీనివల్ల ఇసుక ప్రవాహానికి అవరోధం ఏర్పడి కొన్ని తీరాల్లో మేట వేయడం, మరికొన్ని తీరాలు కోతకు గురవడం జరుగుతున్నాయి. దీంతో పాటు వరదలు, హిమనీ నదాల నుంచి నీటి ప్రవాహం పెరుగుతుండటం వల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. ఆ నివేదిక ఓ అంచనా మాత్రమే.. ఐపీసీసీ నివేదికలు కేవలం వాతావరణంలో మార్పులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయే కానీ శాస్త్రీయపరంగా రుజువైనవి కాదన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగే అవకాశాలున్నాయి. అదంతా దీర్ఘకాలిక ప్రభావం. ఇప్పటికిప్పుడు విశాఖ మునిగిపోయేంత ప్రమాదమేమీ లేదు. పైగా సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల అలాంటి భయాందోళనలు అనవసరం. హిమనీ నదాలు కరగడం వల్ల వచ్చే నీరు మయన్మార్ తీరంపై ముందుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఓ సంస్థ నివేదికను పట్టుకుని ఇప్పటికిప్పుడు విశాఖ మునిగిపోతుందని ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదు. – ప్రొ.సునీత, డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రాలాజీ, ఓషనోగ్రఫీ పూర్వ హెచ్ఓడీ తీర భద్రతకు ప్రమాదం లేదు కోస్తా తీరంలో 2000 మీటర్ల వరకూ జరుగుతున్న పరిణామాలు, సముద్రంలో మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏటా కొద్ది సెం.మీ. మేర సముద్ర మట్టం పెరుగుతుంది. దీనివల్ల తీరం కోతకు గురవుతుంది తప్ప నగరం మునిగిపోయేంత ప్రమాదం ఉండదు. ఎప్పుడో వందేళ్లకు సముద్రం కొంత ముందుకు వచ్చినా బీచ్ రోడ్డు వరకూ వచ్చే ఆస్కారం ఉంది తప్ప నగరంలోకి చొచ్చుకు రాదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. గ్లోబల్ వార్మింగ్ మూలంగా తీరంలోని పారాదీప్, బంగ్లాదేశ్ తీరాలు ఎక్కువ కోతకు గురవుతాయి. తూర్పు కనుమలు ఉండటం వల్ల విశాఖ నగరానికి, తీర భద్రతకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. – డా. కేఎస్ఆర్ మూర్తి, ఎన్ఐఓ రిటైర్డ్ సైంటిస్ట్ కోతను నియంత్రించే అవకాశాలున్నాయా? తీరం కోతను నియంత్రించేందుకు అనేక అవకాశాలున్నాయి. దీనిపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఆ ప్రాంత తీరం, భౌగోళిక, సముద్రం పరిస్థితులను అనుసరించి వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ప్రస్తుతం విశాఖ తీరంలో డ్రెడ్జింగ్ చేపడుతున్నారు. కోతకు గురికాకుండా చాలా ప్రాంతాల్లో సీ వాల్స్ (సముద్రపు గోడలు) నిర్మిస్తున్నారు. బీచ్ ఫ్రంట్ రీ డెవలప్మెంట్లో భాగంగా ఆర్కే బీచ్‌లో 3 కి.మీ. మేర సీవాల్ నిర్మించేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సీఆర్‌జెడ్ అనుమతులు రావాల్సి ఉంది. కోతను నియంత్రించేందుకు అనుసరిస్తున్న వివిధ పద్ధతులు ఇవీ.. గ్రోయెన్స్: సముద్ర ప్రవాహ అవక్షేప కదలికలను పరిమితం చేస్తూ కోతకు గురవుతుండగా ఏర్పాటు చేసే దృఢమైన హైడ్రాలిక్ నిర్మాణమిది. చెక్క, కాంక్రీట్ లేదా రాతితో గ్రోయెన్స్ నిర్మిస్తారు. స్పెయిన్‌లోని కేటలోనియా, నెదర్లాండ్స్, ఇంగ్లండ్, బ్రిటిష్ కొలంబియా, పోలాండ్ బీచ్‌లలో ఏర్పాటు చేశారు. కర్వ్డ్ సీ వాల్: అలల తీవ్రతను తగ్గించి తీరం కోతకు గురికాకుండా కర్వ్డ్ సీ వాల్స్ నిర్మిస్తారు. వక్రంగా ఉండే ఈ గోడలు కెరటాల తీవ్రతను బలహీనపరచడం ద్వారా ఇసుక కొట్టుకుపోకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా తీరం కోతకు గురికాదు. యూకే, పోలాండ్లోని బీచ్‌లలో వీటిని నిర్మించారు. మౌండ్ సీవాల్: కాంక్రీట్ బ్లాక్స్, రాళ్లతో తక్కువ ధరతో వీటిని నిర్మించవచ్చు. ఈ బ్లాక్స్‌ను అలలు తాకి.. బ్లాక్స్ మధ్యలో ఉన్న ఖాళీల్లోకి వెళ్లడం వల్ల వాటి తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా తీరం కోతకు గురికాకుండా ఉంటుంది. ఇవి నెదర్లాండ్స్, ఇంగ్లండ్ తీరాల్లో ఉన్నాయి. బ్రేక్ వాటర్: అలలను ఒడ్డుకు చేరకముందే చీల్చడం వల్ల వాటి తీవ్రత తగ్గి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా కోత సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇందుకు బ్రేక్‌వాటర్ సిస్టమ్‌ను అవలంబిస్తున్నారు. రాళ్లు, కాంక్రీట్ దిమ్మెలతోనూ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇవి విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోనూ, పోర్టు పరిసరాల్లో ఉన్నాయి. వెర్టికల్ సీ వాల్: సముద్రంలో ఆటుపోట్ల సమయంలో తరంగాల ఉధృతిని తట్టుకునేందుకు వీటిని నిర్మిస్తారు. భారీ అలలను కూడా నియంత్రించగల సామర్థ్యం వెర్టికల్ సీ వాల్స్కి ఉంటుంది. ఇవి ప్రస్తుతం ఆస్ట్రేలియా, ముంబై తీరాల్లో ఉన్నాయి. -
పులిచింతల ప్రాజెక్టు వద్ద భూప్రకంపనలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెలంగాణ వైపు చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూమి మూడు సార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై మొదటిసారి 2.3, రెండోసారి 2.7, మూడో సారి 3.0గా నమోదైనట్టు అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లా వైపు జడపల్లిమోటుతండా, కంచుబోడుతండాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. పులిచింతలలో పెరుగుతున్న నీటి నిల్వ స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు అనంతరం పులిచింతల ప్రాజెక్టులో నీటినిల్వను పెంచుతున్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రాజెక్టులో నీటిమట్టం 139.33 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో నీరు 9.307 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు, పూర్తి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 36.47 టీఎంసీలు అవసరం. స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేసే సమయానికి 5 టీఎంసీలున్న నీరు ఆదివారం రాత్రికి 9.307 టీఎంసీలకు చేరడంతో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొట్టుకుపోయిన 16వ నంబరు గేటును బయటకు తీయడానికి మరికొంత సమయం పడుతుందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్ విలేకరులతో చెప్పారు. శ్రీశైలం జలాశయంలో 210.5133 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 311.7462 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి 50,662 క్యూసెక్కుల ప్రవాహం పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతోంది. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.799 టీఎంసీల నీరున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగనర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. పులిచింతల నుంచి ఒక గేటు ద్వారా 12,341 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 17,148 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లను మూసివేసి, కృష్ణా డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. -
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కంపించిన భూమి
సాక్షి, సూర్యాపేట: చింతలపాలెం మండల కేంద్రంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతలపాలెం వాసుల్ని వరుస భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆదివారం ఉదయం రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 7:40, 8:20 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 1.8గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్ ధ్రువీకరించారు. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భూమి కంపించడంతో జనం ఇళ్లల్లోనుంచి పరుగులు పెట్టారు. -
Earth Day: తల్లీ భూదేవి
తన మీద వొత్తిడి కలిగించినందుకే కర్ణుడిని భూమాత శపించిందట. భూమి ఇక పాపం మోయలేదు అనుకున్నప్పుడల్లా దేవదూతో, ప్రవక్తో ఉదయించారు రక్షణకు. ఒక నాగలి మొనకు సీతనే ఇచ్చింది ఈ తల్లి. తన కడుపున పంటలు, పాలుగారే నదులు మోసుకుంటూ తిరుగుతుంది రోజుకు 24 గంటలు. గోడ మీద పిల్లలు పిచ్చిగీతలు గీసినా ఒక అందం ఉంటుంది. కాని భూమి మీద మనిషి గీస్తున్న పిచ్చిగీతలు వినాశకరమైనవి. తల్లి భూదేవిని ప్రతి బిడ్డా కాపాడుకోవాలి. ఇంట్లో ప్రతి తల్లి ఈ విషయమై పాఠం చెప్పాలి. వశం తప్పిన పిల్లాణ్ణి దండించైనా సరే దారికి తేవాలి. అందరి కోసం ధరిత్రి. ధరిత్రి కోసం అందరూ. పురాణాలు ఎప్పుడూ సంకేతాలలోనే మాట్లాడతాయి. ‘భూమ్మీద పాపం పెరిగిపోయినప్పుడల్లా అవతరించమని దేవుణ్ణి రుషులు మొరపెట్టుకున్నారని’ చెబుతాయి. భూమికి భారం పెరగకూడదని పురాణాలు ముందునుంచి చెబుతూ వస్తున్నాయి. భూమి క్షోభ పడకూడదని కూడా చెబుతూ వచ్చాయి. భూమ్మీద నేరాలు, ఘోరాలు, పాపాలు పెరిగినప్పుడు భూమి రోదిస్తుంది. ఆ రోదన మంచిది కాదు. కనుక ఆ పాపాల్ని రూపుమాపే అవతారపురుషులు అవసరమవుతారు. ఇక్కడ పాపాలు అంటే మనిషికి అపకారం చేసే పాపాలు మాత్రమే కాదు. ప్రకృతికి అపకారం చేసే పాపాలు కూడా. ఇవాళ భూమ్మీద ప్రకృతి పరంగా పెరిగిన పాపాల కంటే మించి పాపాలు లేవు. ప్రకృతి వెంటనే తిరిగి మాట్లాడదని, వెంటనే తిరిగి ప్రతీకారం తీర్చుకోదనే ధైర్యంతో మనిషి ఇది చేస్తాడు. చెట్టును నరికితే చెట్టు వెంటనే గొడ్డలి పట్టుకుని వెంట పడదు. నదికి అడ్డంగా ఆనకట్ట కడితే నది బయటకు వినపడేలా శాపాలు పెట్టదు. పర్వతాలను పిండి పిండి చేసి చదును చేస్తే అవి కన్నెర్ర చేస్తున్నట్టు కనిపించవు. కాని ఒకరోజు వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు శిలల కింద నక్కి ఉండాల్సిన విష క్రిములు బయటపడి మనుషుల మీద దాడి చేస్తాయి. సముద్రాల కింద భూకంపాలు వచ్చి అంతులేని జలరాశి భూమిని ముంచెత్తుతుంది. నదులు ఉగ్రరూపం ధరించి ఊళ్లలోకి వస్తాయి. పర్వతాలు తమ కొండ చరియలు కూల్చి దారులు మూసేస్తాయి. అడవులు తమకు తామే ఎండిపోతాయి. నేల తడారిపోయి లోలోపల ముడుచుకుపోతుంది. మన దగ్గర డబ్బుంటుంది.. నీరు ఉండదు. డబ్బుంటుంది.. తిండి ఉండదు. డబ్బుంటుంది.. మంచి గాలి ఉండదు. భూమి తాలూకు సకల సరంజామాను పాడు చేసి భూమ్మీద ఉండాలని మనిషి మాత్రమే అనుకుంటాడు. అది ఏ తార్కిక శాస్త్రం ప్రకారం కూడా సాధ్యం కాదు. భూమికి నువ్వు గౌరవం ఇస్తే భూమి నీకు జీవితం ఇస్తుంది. తల్లి భూదేవి జీవం ఇచ్చేది ఏదైనా తల్లే. భూమి జీవం ఇస్తుంది. విత్తు వేస్తే ఫలం ఇస్తుంది. లోతుకు తవ్వితే జలం ఇస్తుంది. నీ నివాసపు గోడకు గుణాద్రం అవుతుంది. నీ ప్రయాణానికి వీపు అవుతుంది. నీ సమూహానికి ఊరు అవుతుంది. తల్లి మాత్రమే ఇవన్నీ చేయగలుగుతుంది. బిడ్డలకు పచ్చటి చేల తోడు ఇస్తుంది. అందుకే భూమిని మనిషి తల్లిగా చేసుకున్నాడు. తల్లిగా ఆరాధించాడు. కాని క్రమక్రమంగా నేటి కొందరు కొడుకులకు మల్లే ఆ తల్లి గొప్పదనాన్ని మరిచాడు. ఆమె పట్ల చూపించాల్సిన ప్రేమను మరిచాడు. తల్లి ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును కూడా దాటే స్థితికి తెచ్చాడు. తల్లి ఏమంటుంది? భూమి తల్లి చెప్పేది మనిషి విననపుడు ప్రతి స్త్రీ భూమితల్లిగా మారి కుటుంబం నుంచి భూమి పట్ల ఎరుక కలిగించే సంస్కారాన్ని పాదు చేయాలి. పిల్లలకు మొక్కలు నాటడం నేర్పాలి. నీరు వృధా చేయకపోవడం నేర్పాలి. విద్యుత్తును ఆదా చేయడం నేర్పాలి. కాగితాన్ని వృధా చేయకూడదని నేర్పాలి. పరిసరాలు మురికి మయం చేయకూడదని నేర్పాలి. అనవసర ఇంధనం వృథా చేసే పద్ధతులను పరిహరించాలని చెప్పాలి. కారు అవసరమే. సైకిల్ తొక్కడం కూడా చాలా అవసరం అని తల్లి చెప్పాలి. ఏసి అవసరమే. కాని కిటికి తెరిచి ఆ వచ్చే గాలికి సహించేంత వేడిని సహించడం కూడా అవసరమే అని చెప్పాలి. ఆహార దుబారా, దుస్తుల దుబారా, ప్లాస్టిక్ దుబారా ఇవన్నీ తగ్గించి తద్వారా భూమి తల్లికి భారం తగ్గించాలని చెప్పడం అవసరమే అని చెప్పాలి. అమ్మ చెప్తేనే కొన్ని మాటలు చెవికి ఎక్కుతాయి. కొన్నిసార్లు అమ్మ గట్టిగా చెప్తే. ఆ తల్లి ఆదర్శం ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. అందరూ వచ్చి అక్కడి పేపర్ ప్లేట్లను తీసుకుని భోజనం చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌కు ఆహ్వానం అందుకున్న ఒక తల్లి తన భర్త, ఇద్దరు పిల్లలతో వచ్చింది. ఒక సంచిని తోడుగా తెచ్చింది. ఆ సంచిలో నాలుగు స్టీల్ ప్లేట్లు ఉన్నాయి. ఆ స్టీల్ ప్లేట్లలో తను, భర్త, ఇద్దరు పిల్లలు భోం చేశారు. వారు ఎంత తినగలరో అంతే ప్లేట్లలో పెట్టుకున్నారు. భోజనం పూర్తయ్యాక ఎక్కువ నీళ్లు అవసరం లేకుండా ఆ ప్లేట్లు శుభ్రమయ్యాయి. తిరిగి ఆ స్టీల్ ప్లేట్లను వారు సంచిలో పెట్టుకుని వెళ్లిపోయారు. వాళ్లు నాలుగు పేపర్ ప్లేట్ల వృధాను తగ్గించారు. తిన్నంతే తినడం వల్ల ఆహార దుబారా, తక్కువ నీటిని వాడటం వల్ల నీటి దుబారా తగ్గించారు. ఇవి చిన్న ప్రయత్నాలు. కాని ఇవి మొత్తం భూమి మీద భారం తగ్గించేవే. ఆ నాలుగు పేపర్ ప్లేట్లకు ఎంత చెట్టు గుజ్జు అవసరం. అలా అందరూ చేస్తే ఎంత అడవి మిగులుతుంది. ఆలోచించాలి. అంటే ప్రతి చిన్న పనిలోనూ భూమికి సంబంధించిన ఎరుక ఉండాలి. ఈ పని భూమికి భారం అవుతుందా మేలు అవుతుందా అనేది ఆలోచించాలి. తల్లులే జాతికి సంస్కారాలు నేర్పుతూ వచ్చారు. భూమి తల్లిని కాపాడుకోవాలనే సంస్కారాన్ని కూడా వారి ఒడి నుంచి తొలిపాఠంగా అందించాలి. అది నేటి నుంచే మొదలు కావాలి. – సాక్షి ఫ్యామిలీ -
నిపుణుల కమిటీ చెప్పినట్లే రాజధానిలో భూ ప్రకంపనలు
తాడికొండ: నిపుణుల కమిటీ చెప్పినట్లుగానే అమరావతి రాజధానిలో భూ ప్రకంపనలు వస్తున్నాయని, ఆ నివేదికను తుంగలో తొక్కిన పాపం చంద్రబాబుదేనని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 151వ రోజు కొనసాగుతున్న దీక్షల్లో పలువురు ప్రసంగించారు. గతంలో శివరామకృష్ణన్ కమిటీతో పాటు పలు కమిటీలు ఇది లోతట్టు ప్రాంతమే గాక, భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని, భారీ నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా లేదని, కుంగిపోతుందని నిపుణుల కమిటీలు చెప్పాయని తెలిపారు. అయితే బాబు అండ్‌కో తమ స్థార్థం కోసం ఆ నివేదికలను పెడచెవిన పెట్టి మూర్ఖంగా రాజధాని నిర్మాణం చేశారని విమర్శించారు. రాజధాని పర్యటనకు వచ్చిన.. సినిమాల్లేని సినీ నటుడు శివాజీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని, రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే.. తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఓ టీవీ చానల్లో దోపిడీ చేసి.. విదేశాలకు పారిపోవాలని చూసిన శివాజీ ఇప్పటికే జైలు ఊచలు లెక్కించాడని, రాజధాని భూముల స్కామ్‌లో ఉన్న నిందితులంతా జైలు ఊచలు లెక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, బేతపూడి సాంబయ్య, మాదిగాని గురునాధం, గంజి రాజేంద్ర, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి, కొలకలూరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటకలో పేలుడు బీభత్సం
శివమొగ్గ: కర్ణాటకలో శివమొగ్గ జిల్లా కేంద్రానికి సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు మాత్రం ఆరుగురు చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొరుగునున్న దావణగెరె, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఓ మోస్తరు భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భూకంప భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషాదంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా సానుభూతి తెలిపారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కొందరు కార్మికులు లారీలో సుమారు 50 బాక్స్‌ల డైనమైట్లు, జిలెటిన్ కడ్డీలను వేసుకుని వస్తుండగా పేలుడు చోటుచేసుకుంది. ఆ తీవ్రతకు లారీ ఆనవాళ్లు లేకుండా పోయింది. మృతదేహాలు మాంసం ముద్దలుగా అర కిలోమీటర్ దూరం వరకు పడిపోయా యి. సమీపంలో ఉన్న బోలెరో వాహనం కాలి బూడిదైంది. చుట్టుపక్కల ఉన్న విద్యుత్ లైన్ల వైర్లు తెగిపడ్డాయి. ఆ ప్రాంతంలో మంటలతో పాటు కొండలా దట్టమైన దుమ్ము ధూళి కమ్ముకుంది. ఇక్కడ పని చేస్తున్న వారిలో అనేక మంది కార్మికులు బిహార్, అసోంకు చెందిన వారని స్థానికులు తెలిపారు. కనీసం ఆరుగురు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా కనీసం 10–15 మంది చనిపోయి ఉంటారని స్థానికులు అంటున్నారు. కాగా, మృతుల్లో ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంనకు చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. క్రషర్ యజమాని సుధాకర్, క్వారీ నిర్వాహకుడు నరసింహ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన ఐదుగురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
కూకట్‌పల్లిలో భూప్రకంపనలు...
హైదరాబాద్: కూకట్‌పల్లిలో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. బుధవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లిలోని అస్బెస్టాస్ కాలనీలో రెండుసార్లు స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిసింది. నాలుగు సెకన్ల పాటు భారీ శబ్దంతో వైబ్రెషన్స్ వచ్చాయని స్థానికులు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చామని కాలనీవాసులు వెల్లడించారు. ఇక భూమి కంపించడానికి గత కారణాలు తెలుసుకోవాలిసిదిగా స్థానికులు అధికారులను కోరుతున్నారు. -
హిమాలయాలకు భారీ భూకంప ముప్పు
న్యూఢిల్లీ: భారతదేశానికి పెట్టని కోటలా ఉన్న హిమాలయాలకు భారీ భూకంపాల ముప్పు ఉందని తాజా అధ్యయనం తేల్చింది. హిమాలయాల శ్రేణిలో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని చెప్పింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్‌కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ నిపుణుతో కూడిన బృందం ఈ విషయాలను వెల్లడించింది. ‘అరుణాచల్ ప్రదేశ్ నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకూ వ్యాపించి ఉన్న హిమాలయాల శ్రేణిలో గతంలోనూ భారీ భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. మా పరిశోధనలో తేలిన ప్రకారం మన తరంలోనే రాబోయే భారీ భూకంపాన్ని చూసే అవకాశం ఉంది. ఎంత లేదన్నా 100 సంవత్సరాల్లోపే పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని పరిశోధనలో పాల్గొన్న జియాలజీ, సిస్మోలజీ నిపుణుడు వెస్నౌస్కీ చెప్పారు. -
హైదరాబాద్.. సేఫ్ సిటీ
మన నగరం సురక్షితమైనదే. తీవ్ర భూకంపాలకు ఇక్కడ అవకాశాలు తక్కువే. బోరబండలో శుక్రవారం రాత్రి సంభవించింది అతి సూక్ష్మ ప్రకంపనలే. ఇది రిక్టర్ స్కేలుపై 1.5 మ్యాగ్నట్యూడ్ మాత్రమే రికార్డు అయ్యింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలోనూ ఇక్కడ సూక్ష్మ భూ ప్రకంపనలు వచ్చాయి. ఇక్కడి ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నాం. కొన్నిచోట్ల సెస్మోగ్రాఫ్(భూకంప లేఖిని) యంత్రాలు ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఉప్పల్/జూబ్లీహిల్స్/వెంగళరావునగర్: నగరంలోని బోరబండలో శుక్రవారం రాత్రి వచ్చిన భూ ప్రకంపనలు చాలా సూక్ష్మమైనవే. రిక్టర్ స్కేలుపై 1.5 మ్యాగ్నట్యూడ్ మాత్రమే రికార్డు అయ్యిందని సీఎస్ఐఆర్–ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్టు డాక్టర్ శ్రీనగేష్ స్పష్టం చేశారు. ఎక్కడైతే భూ పొరల్లో పగుళ్లు, రాళ్లు ఒత్తిడులకు గురవుతాయో అక్కడే భూకంపాలు, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. భూమి పొరల్లోని కిలోమీటరు నుంచి రెండు కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు ఏర్పడితే మనకు శబ్ధాలు వినిపిస్తాయని, శబ్ధాలు వచ్చినప్పుడల్లా భయాందోళనకు గురికావడం సహజమేనన్నారు. అయితే ఎవ్వరూ దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... బోరబండలో భూ ప్రకంపనలు కొత్తేమీ కాదు. 2017లోనూ ఇదే తరహాలో ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో ఇక్కడ యంత్రాలు అమర్చి అధ్యయనం చేశాం. ఒకటి రెండు కిలోమీటర్ల లోపలే ప్రకంపనలు ఏర్పడ్డాయని గుర్తించాం. – శుక్రవారం రాత్రి బోరబండలో భూమి లోపలి పలకల మధ్య వచ్చిన ఒత్తిడిలు, రాళ్లలో పగుళ్ల కారణంగా ప్రకంపనలు జరిగి ఇలాంటి శబ్ధాలు వినిపించాయి. 1995–96లో కూడా జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ప్రకంపనలే వచ్చాయి. గత 55 ఏళ్లుగా హైదరాబాద్ ఉప్పల్‌లోని ఎన్జీఆర్ఐ భూకంప క్షేత్రంలో ఏర్పాటు చేసిన యంత్రాలలో నమోదైన రికార్డులను అధ్యయనం చేయగా పెద్దగా చెప్పుకోదగ్గ భూకంపాలు నమోదు కాలేదు. మేడ్చల్‌లో మాత్రం 1985లో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదు అయ్యింది. 2017 నుంచి ఇప్పటి వరకు బోరబండలోనే దాదాపుగా 135 సార్లు ప్రకంపనలు వచ్చాయి. అవి కేవలం 0.5, 0.2 మధ్యలోనే వచ్చాయి. బోరబండలోనే భూప్రకంపనలు రావడానికి గల కారణాలను విశ్లేషిస్తే..ఇక్కడ భూమి పొరల్లో వత్తిడి ఎక్కువగా ఉంది. అందుకే ప్రకంపనలు వస్తున్నాయి. వీటితో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైనందున భూ పొరల్లో కూడా ఒత్తిడి, సర్దుబాట్లు వచ్చి ఇలాంటి ప్రకంపనలు వస్తున్నాయి. సేఫ్ భూకంపాలు అంటే.. సేఫ్ భూకంపాలు అంటే అతి సూక్ష్మ తీవ్రత గల ప్రకంపనలుగా గుర్తిస్తాం. ఈ ప్రకంపనల వల్ల ఆస్తినష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగదు. కేవలం హిమాలయాల్లాంటి పర్యత శ్రేణుల్లో మాత్రమే పెద్ద పెద్ద భూకంపాలు నమోదవుతాయి. బోరబండలో కానీ హైదరాబాద్‌లో కానీ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేదు. కానీ భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణాలు సాగడం మరింత సురక్షితం. మాట్లాడుతున్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, డిప్యూటీ మేయర్ బోరబండలో సెస్మోగ్రాఫ్ల ఏర్పాటు బోరబండలో శనివారం నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)కు చెందిన శాస్త్రవ్తేత్తల బృందం పర్యటించింది. బోరబండ ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్–3లోని సాయిబాబానగర్, ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్–4, సైట్–5లలోని జయవంత్‌నగర్, వెంకటేశ్వరకాలనీ, అంబేద్కర్‌నగర్, అన్నానగర్, పెద్దమ్మనగర్, ప్రభుత్వ నాట్కో ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాలతో పాటు చుట్టు పక్కన ఉన్న బస్తీల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వారి నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు శేఖర్, నరేష్, సురేష్‌లు మాట్లాడుతూ ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఇక్కడ వచ్చింది సూక్ష్మ ప్రకంపనలేనని పేర్కొన్నారు. భూమి లోపల శబ్దాలు రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి పరిశోధన సాగుతుందన్నారు. ఈ మేరకు నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాయిబాబానగర్ కమ్యూనిటీహాల్, ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్–4,5లకు చెందిన కమ్యూనిటీహాల్లో మొత్తం మూడు సెస్మోగ్రాఫ్ (భూకంపలేఖిని) పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 24 గంటల్లో పూర్తి సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పర్యటనలో డిప్యూటీమేయర్ బాబాఫసియుద్దీన్, ఖైరతాబాద్ తహశీల్దారు హసీనాబేగం, ఉప కమిషనర్ ఏ.రమేష్ ఉన్నారు. -
దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది: సుచరిత
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు తీర ప్రాంతం ఒక వరమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థిక ప్రగతి, అభివృద్ధికి చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ కార్యాలయంలో ‘ఎర్టీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టం’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేస్తోందన్నారు. ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రకృతి విపత్తు కూడా ఉంటుంది కాబట్టి, ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను తీసుకు వచ్చామని హోంమంత్రి తెలిపారు. (దృష్టి మళ్లించడానికే ఆ దిక్కుమాలిన రాతలు..!) ఏదైనా విపత్తు సంభవించే ప్రమాదం ఉన్నప్పుడు ముందస్తుగా అప్రమత్తం చేస్తే ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడవచ్చన్నారు. విపత్తు ముందుగా తెలుసుకునే రాష్ట్రంగా ఏపీ...దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. తుఫానులు, వరదలు, భూకంపం, ఉప్పెనలు, సునామీలు, భారీ అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, నష్టాల తీవ్రతను తగ్గించేందుకు ఈ ముందస్తు హెచ్చరికలు చాలా ఉపయోగపడతాయని హొంమంత్రి సుచరిత పేర్కొన్నారు. (రణ్‌బీర్‌ను మరోసారి ప్రశంసించిన బిగ్‌బీ) -
7.7 తీవ్రతతో భారీ భూకంపం
-
కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం
హవానా: కరేబియన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది. జమైకా, క్యూబాలను కూడా భూ ప్రకంపనలు తాకాయి. కరేబియన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. జార్జ్ టౌన్‌లోని కేమాన్ దీవులలో 0.4 అడుగుల సునామీ నమోదైంది. కానీ డొమినికన్ రిపబ్లిక్‌లోని పోర్ట్ రాయల్, జమైకా లేదా ప్యూర్టో ప్లాటా దగ్గర సునామీ కనిపించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా 6.1 తీవత్రతో సంభవించిన భూకంపం నుంచి పెద్దగా సునామీ ముప్పు ఏమీ లేదని పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం నుంచి సముద్ర తీర ప్రాంతానికి 300 కిలోమీటర్ల వరకు సునామీ తరంగాలు వస్తున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. క్యూబా, హోండూరస్, మెక్సికో, కేమన్, దీవులతోపాటు బెలిజ్, జమైకాలోని పలు ప్రాంతాలకు సునామీ ప్రమాదం పొంచి వుందని పేర్కొంది. గ్రాండ్ కేమన్లోని ఓగియర్లో నివసించే అలెక్ పుల్టర్ మాట్లాడుతూ ఇది తాను చూసిన మొట్టమొదటి భూకంపం కాదని, అయితే ఇది ఇప్పటివరకు అతిపెద్ద భూకంపం అని తెలిపారు. -
ఎక్కడో బద్దలైతే ఇక్కడ కంపిస్తుంది!
సాక్షి, హైదరాబాద్: వేల మైళ్ల దూరంలో అగ్నిపర్వతం బద్దలైతే మన దగ్గర భూమి కంపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూప్రకంపనలకు అదే కారణమన్న విషయాన్ని కొట్టిపారేయలేమని వారు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఆ ప్రభావం కారణంగా కంపనాలు చోటుచేసుకోవచ్చని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగం విశ్రాంత అధిపతి ప్రొఫెసర్ జి.రాందాస్ అభిప్రాయపడుతున్నారు. ‘కచ్చితంగా అదే కారణం అని చెప్పలేకున్నా.. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూఅంతర్భాగంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమై భూ పొరల్లో చలనం ఏర్పడుతుంది. దీంతో భూ ఫలకాలు కదిలి పరస్పరం ఢీకొని ప్రకంపనలు జరిగే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్భవించిన ప్రకంపనలకు అది కారణం కాదని కూడా చెప్పలేం’అని పేర్కొన్నారు. క్వారీ పేలుళ్ల వల్ల మాత్రం ఈ ప్రకంపనలు ఏర్పడలేదని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రమాదమేమీ కాదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలు భూకంప ప్రభావిత ప్రాంత పరిధిలో ఉన్నాయి. కానీ, ప్రమాదకర జోన్లో మాత్రం లేవు. ప్రస్తుతం భూమి కంపించిన ప్రధాన ప్రాంతమైన సూర్యాపేట పరిసరాలు సహా తెలంగాణ పరిధి భూకంప ప్రభావం అంతగా లేని రెండో జోన్ పరిధిలో ఉండగా, ఏపీ ప్రాంతం రెండో జోన్లో, విజయవాడ పరిసరాలు లాంటి కొన్ని ప్రాంతాలు మూడో జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ, ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు కావటం కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇంత తీవ్రతతో భూమి కంపించలేదు. జోన్ పరిధి మారనుందా.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రమాదం కాని జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ తాజా ప్రకంపనలు కొంత శక్తిమంతమైనవే. అంత తీవ్రతతో మళ్లీ కొన్నిసార్లు ప్రకంపనలు వస్తే మాత్రం కచ్చితంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గుర్తించాల్సి ఉంటుంది. ప్రమాదం తరచూ సంభవించదు. కానీ ఉన్నట్టుండి భారీ ప్రకంపనలు చోటు చేసుకుంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అలా అని భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. మళ్లీ ఆ స్థాయి ప్రకంపనలు తక్కువ సమయంలో పలుసార్లు ఏర్పడితేనే ఆందోళన చెందాలి. అమరావతి వైపు వస్తే భారీ నష్టమే.. ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా వెల్లటూరు కేంద్రంగా ఏర్పడ్డ భూ ప్రకంపనలు తెలంగాణ వైపు ప్రభావం చూపాయి. కానీ, ప్రకంపనల దిశ అమరావతి వైపు ఉండి ఉంటే అక్కడ కచ్చితంగా నష్టం జరిగి ఉండేది. ఇక్కడ నమోదైన 4.7 ప్రభావం అమరావతి పరిసరాల్లో ఏర్పడితే భవనాలు కూలి ఉండేవి. తెలంగాణ వైపు గట్టి నేల ఉండటంతో పాటు, సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తుతో భూమి ఉపరితలం ఎగుడు దిగుడుగా ఏర్పడి ఉంది. భూమి పొరల్లో కలిగిన మార్పులే దీనికి కారణం. అవి భూకంప తరంగాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రకృతిసిద్ధ ఏర్పాటు అమరావతివైపు లేదు. ఫలితంగా ప్రకంపనల ప్రభావం తగ్గదు. సాధారణంగా రిక్టర్‌స్కేల్‌పై 4 నమోదైతే భారీ నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఢిల్లీ ప్రమాదకర 4వ జోన్ పరిధిలో ఉన్నా, అక్కడి నేల గట్టిది. ఫలితంగా ఢిల్లీ కంటే విజయవాడ పరిసరాలే ప్రమాదకరంగా మారతాయి. అప్పుడే హెచ్చరించారు ఎన్జీఆర్ఐ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త చడ్డా గతంలోనే విజయవాడ పరిసరాలపై భూకంప ప్రభావం ఉండే అవకాశం ఉండొచ్చని హెచ్చరించారు. గరిష్టంగా రిక్టర్‌స్కేల్‌పై 6.5 వరకు నమోదయ్యే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. కానీ అది ఎప్పుడోతప్ప నమోదయ్యే అవకాశం లేదన్నారు. నదీ సంగమాల ప్రభావం కూడా ప్రకంపనాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుందని, మూసీ–కృష్ణా సంగమం ఉండే సూర్యాపేట జిల్లా పరిధిలో భూగర్భంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కృష్ణాతీరం కూడా దీనికి మినహాయింపు కాదు. మేం వజ్రాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పరిశోధన జరిపినప్పుడు, భూమి పొరల్లో భారీ పగుళ్లున్న విషయాన్ని గుర్తించాం. భూగర్భంలోని కోర్ ప్రాంతంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమైనప్పుడు అది ఈ పగుళ్ల నుంచే వెలుపలికి వస్తుంది. అది ప్రకంపనలకు అవకాశం ఇస్తుంది. విజయవాడ చుట్టు ఇలాంటి భారీ పగుళ్లు దాదాపు 22 వరకు ఉన్నట్టు గతంలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడవైపు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన బోరు తవ్వకాలు మంచిది కాదు ప్రస్తుతం హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ల కోసం 1,200 నుంచి 2 వేల అడుగుల వరకు బోర్లు వేస్తున్నారు. అలాగే నీటి ప్రవాహానికి ఉన్న సహజసిద్ధ మార్గాలను మూసేస్తున్నారు. ఈ రెండు చర్యలు భూమి పొరల్లో మార్పులకు కారణమవుతాయి. అవి కూడా భూకంపాలకు అవకాశం కలిగించొచ్చు. ఈ తీరును నిరోధించే చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే ఎప్పటికైనా ప్రమాదాలు తప్పవు. -
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
సాక్షి, అమరావతి బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. వేకువజామున 2.37 నుంచి 2.50 గంటల మధ్య కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచి బయటకు పరుగులు తీశారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో, తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో మంచాలు అటూ ఇటూ ఊగాయి. ఎత్తులో ఉన్న సామాన్లు, వస్తువులు కింద పడ్డాయి. దీనికి తోడు పెద్దగా శబ్దాలు కూడా రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపంగా భావించి ఇళ్లల్లోంచి పిల్లా, పాపలతో రోడ్లపైకి పరుగెత్తారు. భూకంపం సంభవిస్తుందన్న భయంతో పలువురు ఉదయం వరకు మళ్లీ ఇళ్లల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూప్రకంపనలు కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతోపాటు విజయవాడ నగరంలోని భవానీపురం, విద్యాధరపురం, గుంటూరు జిల్లా మాచవరం, బెల్లంకొండ, పిడుగురాళ్ల, అచ్చంపేట, తాడికొండ, క్రోసూరు, నాదెండ్ల, సత్తెనపల్లి తదితర మండలాల్లో అలజడి రేపాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వెలటూరులో ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైనట్టు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) గుర్తించింది. కాగా శనివారం టర్కీలో భారీ భూకంపం సంభవించిన కొన్ని గంటలకే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉండొచ్చని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ టర్కీ మన దేశానికి చాలా దూరంలో ఉండడం వల్ల దాని ప్రభావం కాదని నిపుణులు స్పష్టం చేశారు. నెల రోజుల్లో 300 సార్లు.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో గత నెల రోజులుగా భూమి కంపిస్తోంది. ఒక్కోరోజు పదుల సంఖ్యలో ప్రకంపనాలు వస్తుండటం, ప్రజల భయాందోళనలతో ఈ నెల 12న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చింతలపాలెం మండలంలోని దొండపాడుతోపాటు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి వద్ద సిస్మోగ్రాఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి ఇప్పటివరకు 300 సార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. అయితే.. తీవ్రత 2.5 దాటలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సంభవించిన భూప్రకంపనల తీవ్రత హైదరాబాద్ నగరాన్నీ తాకింది. అయితే దీని తీవ్రత నగరంలో తక్కువగానే ఉంది. బోయిన్పల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో కొందరి ఇళ్లల్లో వస్తువులు కిందపడిపోయాయి. -
ఇరాన్‌ను వణికించిన భూకంపాలు
టెహ్రాన్: ఇరాన్ సైనికాధికారి ఖాసిం సులేమానీని అమెరికా పొట్టన పెట్టుకున్న అనంతరం ఇరాన్ వరుస విషాద ఘటనలతో అల్లాడుతోంది. సులేమాని అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దాదాపు170మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఉక్రెయిన్‌కు చెందిన ప్యాసింజర్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో సిబ్బంది సహా మొత్తం ప్రయాణికులు మరణించారు. ఇది ఇలా వుండగానే ఇరాన్‌లోని రెండు ప్రాంతాల్లో 5.5, 4.9 తీవ్రతతో రెండు ఏరియాల్లో భూమి కంపించింది. బోరాజ్జన్ బుషేర్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని బుషెహ్ర్ అణు కర్మాగారం సమీపంలో బుధవారం 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదికలు తెలిపాయి. మరో ఘటనలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇరాన్ ఖోరాసన్-ఇ రజావి ప్రావిన్స్‌లో మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్లో 5.8 గా నమోదైందని ప్రెస్ టివి నివేదించింది. ఉదయం 7.59 గంటలకు 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ప్రావిన్షియల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హోజ్జతాలి షయాన్ఫార్ తెలిపారు. క్షతగాత్రులు, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేనప్పటీకీ ఎక్కువ ప్రాంతం ప్రభావితమైందని చెప్పారు. తమ సర్వే బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. సహాయ రక్షణ చర్యలు చేపట్టామని, బాధిత ప్రాంతంలో రక్షక బలగాలను మోహరించినట్టు తెలిపారు. కాగా మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడిచేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార దాడి తప్పదన్న తరహాలో స్పందించిన తరువాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. చదవండి : ఇరాన్లో కుప్పకూలిన విమానం అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు ఇరాన్ దాడి : భగ్గుమన్న చమురు -
జకార్తా జలవిలయం!
జకార్తా: ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ..‘దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కలిమంతన్కు తరలించేందుకు పార్లమెంటు అనుమతి కోరుతున్నాను. రాజధాని అంటే కేవలం ఓ జాతికున్న గుర్తింపు మాత్రమే కాదు. అది దేశం సాధించిన ప్రగతికి చిహ్నం కూడా’ అని విడోడో తెలిపారు. ఏకంగా అధ్యక్షుడే ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి చాలా ముఖ్యమైన కారణముంది. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితులే కొనసాగితే, 2050 నాటికి నగరంలోని మూడో వంతు ప్రాంతం సముద్రగర్భంలోకి జారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో రాజధానిని తరలించాలని ఇండోనేసియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలకుల వైఫల్యమే శాపం.. కోటి మందికిపైగా ప్రజలు నివసిస్తున్న జకార్తా భూకంపాలు అధికంగా సంభవించే జోన్లో ఉంది. చిత్తడినేలపై నిర్మితమైన ఈ నగరానికి సమీపంలో 13 నదులు కలుస్తున్నాయి. పాలకులు జకార్తా నిర్మాణం సమయంలో తాగునీటి సరఫరాపై దృష్టి సారించకపోవడం ఈ నగరం పాలిట శాపంగా మారింది. నీటి సరఫరా జరగకపోవడంతో పరిశ్రమలు, ప్రజలు తమ అవసరాల కోసం బోర్లు వేసి భూగర్భ జలాన్ని విచ్చలవిడిగా తోడేశారు. స్థానిక జలాశయాల్లోని నీటిని కోలుకోలేని రీతిలో వాడేశారు. దీంతో చాలాచోట్ల భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీనికితోడు రాజధాని కావడంతో పెద్దఎత్తున ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరిగింది. ఈ చర్యల కారణంగా జకార్తాలో భూమి క్రమంగా కుంగడం ప్రారంభమైంది. ప్రస్తుతం జకార్తాలో ఏటా 25 సెం.మీ. మేర భూమి కుంగిపోతోంది. కొన్నిచోట్లయితే నేల సముద్రమట్టానికి 4 మీటర్ల దిగువకు చేరుకుంది. భూతాపం కారణంగా సముద్రమట్టం పెరుగుతోంది. ఫలించని ప్రయత్నాలు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జకార్తాను కాపాడుకునేందుకు ఇండోనేసియా ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. జవా సముద్రం ఆటుపోట్లను అడ్డుకునేలా ఓ పొడవైన గోడతో పాటు కృత్రిమ దీవులను నిర్మించాలని అధ్యక్షుడు జోకో విడోడో ప్రతిపాదించారు. ఇందుకు రూ.2.84 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ 32 కిలోమీటర్ల మేర భారీ సముద్రపు గోడను, 17 కృత్రిమ దీవులను నిర్మించారు. అయితే ఇది సమస్యకు అనుకున్న పరిష్కారం చూపలేకపోయింది. ఈ భారీ సముద్రపు గోడ నుంచి చాలాచోట్ల నీరు ఊరటం ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల ఈ గోడే నేలలోకి కుంగిపోవడం ప్రారంభించింది. దీంతో రాజధానిని తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చేసింది. అయితే జకార్తాలోని మూడోవంతు ప్రాంతం మునిగిపోతే లక్షలాది మంది ఇండోనేసియా ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. వీరందరికీ ఆశ్రయం కల్పించడం ఇండోనేసియా ప్రభుత్వానికి నిజంగానే సవాలుగా మారనుంది. -
అరుణాచల్‌లో మూడు భూకంపాలు
గువాహటి/ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో ఒకే రోజు వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. శుక్రవారం కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంభవించిన ఈ భూకంపాల తీవ్రత రిక్టరు స్కేలుపై 5.6, 3.8, 4.9గా నమోదైంది. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మొదటి భూకంపం అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో 5.6 తీవ్రతతో మధ్యాహ్నం 2.52 గంటల సమయంలో 10 కి.మీ. లోతులో సంభవించింది. ఈ భూకంప ధాటికి ఇటానగర్, గువాహటి, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, నాగాలాండ్‌లోని దిమాపూర్‌ల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావారణ శాస్త్ర విభాగం వెబ్సైట్ వెల్లడించింది. రెండో భూకంపం 3.8 తీవ్రతతో మధ్యాహ్నం 3.04 గంటల సమయంలో తూర్పు కామెంగ్‌లో 10 కి.మీ. లోతులో సంభవించింది. మూడో భూకంపం 4.9 తీవ్రతతో మధ్యాహ్నం 3.21 గంటల ప్రాంతంలో అరుణాచల్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 95 కి.మీ. లోతులో సంభవించినట్లు పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలు భూకంప పటంలో ప్రమాదకరమైన 5వ జోన్లోకి రావడంతో తరచూ భూకంపాల బారిన పడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
అలస్కాలో అలజడి
-
భూమికి దగ్గరగా పెనువిపత్తు?
భూమి మొత్తాన్ని సెకన్లలో సర్వనాశనం చేయగల విపత్తు మన దగ్గరలోనే ఉందా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. మన పాలపుంతలోనే భూమికి దాదాపు 8000 కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతున్న ఓ ఖగోళ ప్రక్రియ ఇందుకు కారణమవుతోందన్నది వారి అంచనా. అబ్బో.. అంత దూరంలో జరిగే సంఘటన మనలను ఎలా నాశనం చేస్తుందిలే అని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ రెండు నక్షత్రాలు పేలిపోతున్నాయి. అందులో ఒకదాన్నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన గామా కిరణాలతో భూమి సెకన్ల వ్యవధిలో ఆవిరైపోతుందనేది శాస్త్రవేత్తల అంచనా. కీలకమైన, మనందరికీ కొంత స్వాంతన కలిగించే అంశం ఏమిటంటే... ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం ఎవరికీ తెలియదు. సూర్యుడు తన కోటానుకోట్ల ఏళ్ల జీవితకాలంలో వెలువరించే శక్తి మొత్తం కొన్ని సెకన్లలోనే వెలువరించగల సామర్థ్యం ఈ గామా రే బరస్ట్‌లకు సాధ్యం. ఇంధనం మొత్తం ఖర్చయిపోయిన నక్షత్రం పేలిపోయే సూపర్నోవా ఏర్పడినప్పుడు... రెండు నక్షత్రాలు ఒకదానిలో ఒకటి లయమైనప్పుడు ఈ బరస్ట్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇవి విశ్వంలో ఏ మూలలోనో సంభవించే అవకాశం ఉంటుందని.. తాజాగా మాత్రం ఎనిమిది వేల కాంతి సంవత్సరాల దూరంలోనే గుర్తించామని బెంజిమన్ పోప్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఇంత దూరం ఉన్నప్పటికీ గామా రే బరస్ట్ ప్రభావం భూమిపై చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. -
హవాయి గజగజ : చరిత్రలో భారీ భూకంపం
హోనలులు, హవాయి : ఫసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవుల్లో అత్యంత ప్రమాదకరమైన(క్రీయాశీల) అగ్నిపర్వతంగా పేరున్న కిలౌయి అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున లావాను వెదజల్లుతోంది. శనివారం హవాయి దీవుల చరిత్రలో భారీ భూకంపం సంభవించింది. గత నలభై ఏళ్ల ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. రిక్టర్ స్కేలుపై 7.4గా భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) వెల్లడించింది. శుక్రవారం వరుసగా రెండు భూకంపాలు(5.6 ; 6.9 తీవ్రతలతో) సంభవించాయి. దీంతో ద్వీప ప్రజలు భయంతో వణికిపోయారు. తూర్పు హవాయి ద్వీపం వైపు పెద్ద ఎత్తున లావా వస్తుండటంతో ఆ ప్రాంతంలోని 1700 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపాలు సంభవిస్తుండటం వల్ల భూమి నుంచి పెద్ద ఎత్తున సల్ఫర్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఈ వాయువును పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ముక్కు, గొంతులో తీవ్రంగా మంట వచ్చి శ్వాస తీసుకోలేక మనిషి చనిపోవచ్చు. స్వల్పస్థాయి భూకంపాలను కలుపుకుని గత వారం రోజుల్లో హవాయిలో 1000కి పైగా సంభవించాయి. సునామీ అవకాశం లేదు ద్వీపాల్లో అతి భారీ భూకంపాలు సంభవించినప్పుడు సునామీ సంభవించడం సహజం. కానీ, హవాయికి ఆ ముప్పు లేదని సునామీ నిపుణులు చెబుతున్నారు. -
బిల్డింగ్‌ను మడిచేద్దాం..!
భూకంపాలు.. వరదలు వచ్చినప్పుడు జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. ఉండటానికి నిలువ నీడ లేక.. తినేందుకు తిండి లేక అల్లాడిపోతుంటారు. వారికి పునరావాసం కల్పించాలంటే సమయం.. శ్రమ.. డబ్బుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఎప్పుడు ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయో కూడా తెలియదు. ఇలాంటి వారి కోసమే పోలండ్‌కు చెందిన స్కై షెల్టర్ అనే డిజైనర్ కంపెనీ అద్భుతమైన భవనాన్ని డిజైన్ చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఆ భవనాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మడిచి తీసుకెళ్లొచ్చు.. భవనాన్ని ఎలా మడిచేస్తారని ఆశ్చర్యపోకండి.. హీలియం నింపేందుకు అనువైన బెలూన్లతో ఈ భవనాన్ని తయారు చేస్తారు. ఆ బెలూన్ల లోపల ముడుచుకుపోయేలా వీలున్న స్టీలు ఫ్రేముల ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నపుడు ఆ బెలూన్లను దగ్గరికి మడిచి హెలికాప్టర్ల సాయంతో తీసుకెళ్లొచ్చు. బాధితులకు తాత్కాలిక పునరావాసం కల్పించాలనుకుంటే వెంటనే హీలియం వాయువును ఆ బెలూన్లలోకి పంపిస్తే భవనం వ్యాకోచిస్తుంది. ఆ తర్వాత అందులో బాధితులకు ఎంచక్కా పునరావాసం కల్పించవచ్చు. ‘ఇవోలో’అనే పోటీలో ఈ భవనం నమూనా దాదాపు 525 భవన నమూనాలను తోసిపుచ్చి మొదటి స్థానంలో నిలిచింది. -
భారీ భూకంపాలు పునరావృతం
లండన్: భారీ భూకంపాలు నిర్ణీత సమయంలో పునరావృతం అవుతాయా... అంటే అవును అంటున్నారు శాస్త్రవేత్తలు. అస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్బ్రూక్కు చెందిన శాస్త్రవేత్తలు చిలీలోని పలు సరస్సులను పరిశోధించారు. భూకంపాల కారణంగా సరస్సులోని అడుగు భాగంలో భారీగా కొండచరియలు ఏర్పడినట్లు వారి గుర్తించారు. వీటిని విశ్లేషించి 5 వేల ఏళ్ల నాటి భూకంపాల సమాచారాన్ని రూపొందించారు. అంతేకాకుండా భారీ భూకంపాలు (9.5 తీవ్రత పైగా) ప్రతి 292 ఏళ్లకు, తక్కువ తీవ్రత (8) కలిగిన భూకంపాలు ప్రతి 139 ఏళ్లకు పునరావృతం అవుతున్నట్లు గుర్తించారు. దక్షిణమధ్య చిలీలో 1960 ప్రాంతాల్లో 9.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని, దీని వల్ల చిలీ కోస్తా తీరంలో సునామీ ఏర్పడిందని వర్సిటీకి చెందిన జస్పర్ మోర్నాట్ అనే అసోసియేట్ ప్రొఫెసర్ తెలిపారు. ఈ సునామి కారణంగా జపాన్‌లో సుమారు 200 మంది మరణించారని పేర్కొన్నారు. భూకంపాల వల్ల భారీస్థాయిలో శక్తి బయటకు వస్తుందని, ఆ శక్తి ఏర్పడేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందన్నారు. ఈ వివరాలు ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
2018లో పెను భూకంపాల ఉప్పెన
వాషింగ్టన్ : పెను భూకంపాలు ప్రపంచదేశాలను 2018లో అతలాకుతలం చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. భూ పరిభ్రమణంలో చోటు చేసుకున్న స్వల్ప మార్పులే ఇందుకు కారణమని చెప్పారు. మార్పులు చిన్నవే అయినా పరిణామాలు మాత్రం తీవ్రంగా, కనివీని ఎరుగనంతగా ఉంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా అధిక జనావాస ప్రాంతాలపై పెను విపత్తులు విరుచుకుపడాతాయని తెలిపారు. భూ పరిభ్రమణం నెమ్మదించడం వల్ల రోజులో పగటి సమయం ఒక్క మిల్లీ సెకండ్ పాటు తగ్గిందని వెల్లడించారు. మార్పు స్వల్పంగానే ఉన్నా.. భూ అంతర్భాగంలో జరిగే పరిణామాలు పెను విపత్తును సృష్టిస్తాయని చెప్పారు. భూ పరిభ్రమణానికి.. పెను భూకంపాలకు సంబంధం ఏంటి? భూమి పరిభ్రమణానికి, భూకంపాలు రావడానికి మధ్య సంబంధాన్ని గత నెలలో యూనివర్సిటీ ఆఫ్ కొలరెడో ప్రొఫెసర్లు రోగర్ బిల్హమ్, బెండిక్‌లు వివరించారు. భూమి పరిభ్రమించడానికి, భూమి పొరలకు మధ్య బలమైన సంబంధం ఉందని వెల్లడించారు. భూ పరిభ్రమణంలో మార్పులు వస్తే భూమి పొరల్లో కూడా మార్పులు చోటు చేసుకుని విపరీతమైన పరిణామాలకు దారి తీస్తుందని తెలిపారు. 1900 సంవత్సరం నుంచి నేటి వరకూ భూకంప తీవ్రత 7.0 దాటిన వాటిపై తాము చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలిందని చెప్పారు. గత 116 ఏళ్లలో కేవలం ఐదంటే ఐదే సమయాల్లో( ఐదు టైమ్ పిరియడ్లలో) భూకంపాలు సాధారణంగా కంటే ఎక్కువ సార్లు సంభవించాయని వెల్లడించారు. సాధారణ సమయాల్లో ప్రపంచ దేశాల పాలిట పెను విపత్తుగా మారిన భూకంపాల సంఖ్య సంవత్సరానికి 15గా ఉండగా.. తాము పేర్కొన్న ఐదు సమయాల్లో మాత్రం ఏడాదికి సంభవించిన పెను భూకంపాల సంఖ్య 25 నుంచి 30 వరకూ ఉన్నట్లు బిల్హమ్ పేర్కొన్నారు. భూమి పరిభ్రమణం నెమ్మదించడాన్ని అణు గడియారాల ద్వారా గుర్తించొచ్చని చెప్పారు. ఐదేళ్ల పాటు వరుసగా.. కొన్నిసార్లు వరుసగా ఐదేళ్ల కాలం పాటు భూమి పరిభ్రమణం నెమ్మదించిందని బిల్హమ్, బెండిక్‌లు తెలిపారు. ఆ సమయంలో పెను భూకంపాలు మానవాళిపై విరుచుకుపడ్డాయని చెప్పారు. అలాంటి సమయమే ప్రస్తుతం (2013-2018ల మధ్య) జరుగుతోందని వెల్లడించారు. అదృష్టవశాత్తు గడచిన నాలుగేళ్లలో కేవలం ఆరు పెను భూకంపాలను మాత్రమే మనం చవిచూశామని చెప్పారు. 2018 ఆరంభం నుంచి పెను భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. ఏడాది మొత్తంలో దాదాపు 20కుపైగా పెను భూకంపాలు సంభవిస్తాయని చెప్పారు. అయితే, పెను భూకంపాలు ఎందుకు ఉద్భవిస్తున్నాయన్న ప్రశ్నకు సరైన కారణాన్ని శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. ఏయే ప్రదేశాల్లో పెను భూకంపాలు సంభవిస్తున్నాయన్న విషయాన్ని బిల్హమ్ చెప్తూ.. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న జనావాస ప్రాంతాల కేంద్రంగా సంభవిస్తున్నట్లు వెల్లడించారు. -
ఉలిక్కిపడ్డ గన్నవరం
సాక్షి, గన్నవరం : కృష్ణా జిల్లా బుధవారం తెల్లవారుజామున ఒక్కసారి ఉలిక్కిపడింది. గన్నవరం, పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి 10.15 గంటల సమయంలో గన్నవరంతోపాటు కేసరపల్లి, బుద్ధవరం, మర్లపాలెం, విఎన్ పురం, దుర్గాపురం, దావాజీగూడెం, ముస్తాబాద ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో ప్రకంపనల్ని గుర్తించిన ప్రజలు భయంతో బయటకు వచ్చారు. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారికి ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాత్రి 11 గంటల సమయంలో మరోసారి కంపించినట్లు కొందరు తెలిపారు. ఈ ప్రాంతంలో 2015 తర్వాత భూప్రకంపనలు రావడం ఇది రెండోసారి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లావారే వరకూ బిక్కుబిక్కుమంటూ ఆరు బయటే గడిపారు. -
సూర్యగ్రహణంతో భూకంపాలు.. సునామీలు
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 21వ తేదీన ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల భూకంపాలు, సునామీలు, టోర్నడోలు ఏర్పడే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1979 సంవత్సరం తర్వాత ఏర్పడనున్న అతి పెద్ద సూర్యగ్రహణం ఇదేనని వారు చెబుతు న్నారు. ఈ సూర్యగ్రహణం అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో తప్ప భారత్‌లో కనిపించదని తెలిపారు. అమెరికాలో 21న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే.. దాదాపు ఆరు గంటలపాటు ఈ గ్రహణం కొనసాగ నుంది. సుదీర్ఘంగా గ్రహణం ఏర్పడటం వల్ల ఉపరి తలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తగ్గుతాయని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా తగ్గినప్పుడు ఆయా ప్రాంతాల్లో టోర్నడోలు, భూకంపాలు, సునామీలకు ఆస్కారం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా తదితర ప్రాంతాల్లో పగటిపూట ఏర్పడటం వల్ల మనదేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుంది. అందువల్ల ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అంతేగాక ఈ సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఉండబోదన్నారు. అందువల్ల పుకార్లను నమ్మవద్దని సూచించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్‌లపైనే ఉండే అవకాశముం దన్నారు. ఇలాంటి సుదీర్ఘ సూర్యగ్రహణం మళ్లీ 2,500 సంవత్సరంలోనే ఏర్పడుతుందన్నారు. సోమవారం ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం మనుషులు, జంతువులు, వాతావరణంపై ఎలా ఉంటుందోనని నాసా పరిశోధనలు చేస్తోంద న్నారు. ఇప్పటికే అమెరికాలో సూర్యగ్రహణ ప్రభావంతో టోర్నడోల ప్రభావం మొదలైందని చెప్పారు. -
సాగర్ తీరంలో భూ‘ప్రకంపనలు’
మూడు సెకన్లపాటు కంపించిన భూమి - పెద్దగా శబ్దం.. ఇళ్ల నుంచి బయటకు ప్రజల పరుగులు - భూకంప కేంద్రంగా పిన్నవూర గుర్తింపు - రిక్టర్‌స్కేల్‌పై 3.1 మాగ్నిట్యూట్‌గా నమోదు సాక్షి, నల్లగొండ: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం.. నాగార్జునసాగర్ తీరంలో భూమి కంపించింది. నల్లగొండ జిల్లా పెద్దవూర, అనుమల, తిరుమలగిరి, పీఏపల్లి, గుర్రంపోడు మండలాల్లోని పలుగ్రామాల వరకు స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రంగా పెద్దవూర మండలం పిన్నవూరను జాతీయ భూ పరిశోధన కేంద్రం (ఎన్జీఆర్ఐ) గుర్తించింది. సాగర్‌లోని సిస్మొగ్రాఫ్ రిక్టర్‌స్కేల్‌పై కంపన తీవ్రత 3.1 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. భూమి 3 సెకన్లపాటు కంపించడంతో ఈ మండలాల ప్రజలు భయాందోళనతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. బుధవారం 11.25 గంటల నుంచి 12 గంటల మధ్యలో భూమి కంపించింది. పెద్దశబ్దం రావడంతో ఆయా మండలాల్లోని కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు, పాఠశాల తరగతి గదుల్లోని విద్యార్థులు, ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా హాలియా, పెద్దవూర మార్గాల్లో వెళ్లే వాహనాలు కూడా కదుపునకు లోనయ్యాయి. ఏమైందోనని వాహనదారులు కొంతసేపు వాహనాలను రోడ్డుపై నిలిపేశారు. పెద్దశబ్దం రావడానికి ముందు రెండుసార్లు ఉరుముల శబ్దం వచ్చింది. పేలిన శబ్దం వచ్చిందని ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు వచ్చిన ప్రజలు, ఉద్యోగులు.. ఆ తర్వాత భూకంపం వచ్చిందని తెలిసి భయాందోళన చెందారు. గతంలో కూడా సాగర్ తీరంలో భూ ప్రకంపనలు వచ్చినా రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత స్వల్పంగానే నమోదైంది. హాలియా మండలంలోని అనుములవారిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో భవనం పగుళ్లు ఏర్పడడంతో పాటు ప్రహరీ పగుళ్లు తీసింది. హాలియా ఎంఆర్సీ ఉన్నత పాఠశాల భవనంలోని తొమ్మిదో తరగతి గది శ్లాబ్ పైకప్పు భాగంలో మూడు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. పెద్దవూర మండలంలోని పెద్దవూర, బట్టుగూడెం, రామన్నగూడెం తండా, కొత్తలూరు గ్రామాల్లో అక్కడక్కడా ఇళ్ల గోడలు, ప్రహరీ గోడలకు పగుళ్లకు వచ్చాయి. గుర్రంపోడు మండలం మొసంగిలోని ప్రాథమిక పాఠశాలలో తరగతిలో పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఎర్రెడ్లగూడెం గ్రామంలో పది ఇళ్ల గోడలు నెర్రెలు తీశాయి. కంపన కేంద్రం పిన్నవూర నాగార్జునసాగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ సాగర్ పరిసర ప్రాంతంలో మాత్రం ఎక్కడ భూమి కంపించలేదు. పిన్నవూర కేంద్రంగా ఏర్పడిన కంపనంతో 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో భూకంప తరంగాలు ప్రభావం చూపాయి. -
డిసెంబర్‌కల్లా 31 ఎర్త్ అబ్జర్వేటరీలు!
న్యూఢిల్లీ: భూకంపాల సమాచారం పొందేందుకు డిసెంబర్‌కల్లా దేశంలో 31 భూ పరిశీలన కేంద్రాలను భూ విజ్ఞాన శాఖ ఏర్పాటు చేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో ఐదు, హర్యానా, బిహార్‌ల్లో నాలుగేసి, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో మూడేసి, జమ్మూకశ్మీర్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల్లో రెండేసి, ఉత్తరాఖండ్, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, లక్షద్వీప్‌ల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఇవి ఏర్పాటు కానున్నాయి. ఇవి భూ అంతర్భాగ కదలికలను డిజిటల్ సిస్మోగ్రఫీ ద్వారా రికార్డు చేస్తాయి. జాతీయ సిస్మోగ్రాఫికల్ కేంద్రం మొత్తం 84 సిస్మోలాజికల్ పరిశోధనా కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరుస్తోంది. ఒకవేళ భూకంపం సంభవిస్తే ఈ అబ్జర్వేటరీలు అందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ కేంద్రానికి పంపిస్తాయి. అక్కడ నుంచి ఈ సమాచారం ప్రధానమంత్రి కార్యాలయానికి, సెక్రటేరియట్‌కు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకు చేరుతుంది. -
భూకంపాలకు కేంద్రంగా హిమాలయాలు!
జెనీవా: హిమాలయ పర్వతశ్రేణుల్లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది. 2,400 కిలోమీటర్ల మేర ఉన్న పర్వత శ్రేణుల్లో ఈ భూకంపాలు వచ్చే ప్రమాదముందని, భారత్, చైనా సరిహద్దు మధ్యలోనున్న భూటాన్ కూడా భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని పేర్కొంది. భూటాన్ ప్రాంతం భారీ భూకంపాలు సంభవించేందుకు అనువైన ప్రాంతమని అధ్యయన నివేదిక రచయిత, స్విట్జర్లాండ్‌లోని లాసెన్నె యూనివర్సిటీకి చెందిన గియోర్గి హెతెన్యి తెలిపారు. భారీ భూకంపాలు సంభవించే సామర్థ్యం హిమాలయాలకు ఉందని, దీంతో పెద్ద ఎత్తున విధ్వంసం కూడా చోటు చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. 1714లోనూ భారీ భూకంపం భూటాన్‌లో సంభవించిందని, దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదని తెలిపారు. దీనిని బట్టి భూటాన్ భారీ భూకంప ప్రభావిత ప్రాంతమని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు. 2015 ఏప్రిల్‌లో నెపాల్‌లో గోర్ఖా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, 2400 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లోని ప్రతి ప్రాంతంలో భూకంప ప్రమాదం పొంచి ఉందని శాస్త్రీయ అధ్యయనం జరగలేదని, దానికి సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేవు. మిగతా ప్రపంచంతో పెద్దగా సంబంధాలులేకుండా భూటాన్ ఒంటరిగా ఉంటుందని, అక్కడికి శాస్త్రవేత్తలను కూడా చాలా అరుదుగా అనుమితిస్తుందని పేర్కొన్నారు. -
భూకంపాలొస్తే అలర్ట్ చేసే యాప్!
లాస్ ఏంజెలిస్: సరికొత్త మొబైల్ యాప్ ను కాలిఫోర్నియా, బెర్కెలీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. భూకంపాలు సంభవించినప్పుడు ముందుగానే ఈ యాప్ అలర్ట్ చేస్తుంది. కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవిస్తే వెంటనే మొబైల్ యాప్ నుంచి మనం విషయాన్ని పసిగట్టవచ్చని వారు చెబుతున్నారు. ఆ యాప్ పేరు మై షేక్. రాత్రి, పగలు అనే లేకుండా సిగ్నల్స్ ఇవ్వడం ఆ యాప్ ప్రత్యేకథ. గత మూడు నెలల్లో చిలీ, అర్జెంటైనా, మెక్సికో, జపాన్, తైవాన్, న్యూజీలాండ్, నేపాల్, మొరాకో, ఇతర దేశాలలో భూకంపాలు సంభవించినప్పుడు మై షేక్ యాప్ వర్క్ చేసింది. గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) కూడా అలర్ట్ రావడంతో హెల్ప్ చేస్తుందని, ఈ ఫిబ్రవరిలో తొలిసారిగా ప్రయోగం ఫలించిందని వర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. అదే సమయంలో 1.7 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, అందులో 11 వేల ఫోన్ల సమాచారాని తమ డాటా నెట్ వర్క్ కు అనుసంధానం చేసినట్లు చెప్పారు. రిక్టర్ స్కేలుపై 2.5 నుంచి అధిక తీవ్రత భూకంపాలపై అలర్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని వివరించారు. ఏప్రిల్ 16న ఈక్వెడార్ లో సంభవించిన 7.8 తీవ్రత భూకంపాన్ని కూడా ఈ యాప్ గుర్తించిందని, భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో చేసిన సెన్సార్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో మై షేక్ యాప్ ఇన్ స్టాట్ చేసుకోవచ్చని చెప్పారు. కొన్ని రోజుల్లో మరింత సమాచారం అందజేస్తామని వర్సిటీ సైంటిస్టులు పేర్కొన్నారు. -
ఆమె ఓ నడుస్తున్న భూకంపం
మాడ్రిడ్: ఆమె స్పానిష్ డాన్సర్ మూన్ రిబాస్. ఈ భూగోళంపై ఎక్కడ భూకంపం వచ్చిన అదే సమయంలో ఆమెకు తెలిసిపోతుంది. ఆమె భూకంపం తీవ్రత తక్కువ ఉందా, ఎక్కువ ఉందా ? అన్న విషయాన్ని కూడా ఇట్టే చెప్పగలరు. ఇందులో తాంత్రిక విద్యేమీ లేదు. యాంత్రిక విద్య తప్ప. ఆమె తన మోచేతి ప్రాంతంలో చర్మం కింద ఓ చిప్‌ను అమర్చుకున్నారు. దాన్ని ఆపిల్ యాప్‌కు అనుసంధానించారు. ఆ యాప్‌ను ప్రపంచంలోని అన్ని జియాలోజికల్ మానిటర్స్‌కు కనెక్ట్ చేశారు. ఆయా ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలను జియాలోజికల్ మానిటర్స్ గుర్తించి సకాలంలో ఆపిల్ యాప్‌కు వాటి డేటాను పంపిస్తుంది. డేటీను యాప్ రిసీవ్ చేసుకున్న క్షణంలోనే రిబాస్ చేతిలో దాగిన చిప్ గ్రహిస్తుంది. దాన్ని చిప్ వైబ్రేషన్ రూపంలో రిబాస్కు తెలిసేలా చేస్తోంది. భూ ప్రకంపనల స్థాయిని బట్టి వైబ్రేషన్స్ తీవ్రత ఉంటుంది. మూన్ రిబాస్ మూడేళ్ల క్రితం తన చర్మంలో భూప్రకంపనలను గుర్తించే చిప్‌ను అమర్చుకున్నారు. 2015, ఏప్రిల్ నెలలో నేపాల్‌లో భారీ భూకంపం సంభవించినప్పుడు ఆమె నిద్రపోతున్నారు. అక్కడ భూప్రకంపనలు వచ్చిన సమయంలోనే ఆమె చేతిలోని చిప్ బయ్..మంటూ వైబ్రేషన్స్‌ను పెద్ద ఎత్తున విడుదల చేసింది. దాని తీవ్రతకు ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్ర లేచారు. ఆపిల్ యాప్ ద్వారా భూకంపం ఎక్కడ వచ్చిందో ఆసక్తికొద్దీ తెలుసుకున్నారు. ఆ క్షణం తాను భూకంపం వచ్చిన ప్రాంతంలోనే ఉన్నట్లు భ్రమపడ్డానని, భవనాలు పెళపెళమంటూ కూలుతున్న శబ్దాలను అనుభూతి చెందానని ఆమె తెలిపారు. నేపాల్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపంలో 8,000 మంది మరణించడం, దాదాపు 21,000 వేల మంది గాయపడడం తెల్సిందే. వృత్తిరీత్యా డాన్సర్ అయిన ఆమె ఎందుకు తన చేతిలో భూకంపాలను గుర్తించే చిప్‌ను పెట్టుకున్నారంటే డాన్స్‌లో ఓ వెరైటీని క్రియేట్ చేయడానికి మాత్రమే. ప్రపంచంలో ఎప్పుడూ ఏదో చోట భూ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. ఆ ప్రకంపనల తీవ్రతనుబట్టి చేతిలోని చిప్ వైబ్రేషన్స్‌ను విడుదల చేసినప్పుడు ఆమె వాటికి అనుగుణంగా డాన్స్ చేస్తారు. లైవ్ షో లేనప్పుడు డాన్స్‌ను కంపోజ్ కూడా చేసుకుంటారు. అన్ని భూకంపాలు చెడ్డవి కావని, భూకంపాల పట్ల మానవ దృక్పథం మారాలని, అవి రావడం ప్రకృతి సహజ ధర్మంగా భావిస్తే మంచిదని కూడా ఆమె చెప్పారు. మూన్ రిబాస్ ఎప్పుడు తనను తాను ‘సైబోర్గ్ ఆర్టిస్ట్’ అని చెప్పుకుంటారు గానీ మిత్రులు మాత్రం ఆమెను నడుస్తున్న భూకంపం అని పిలుస్తుంటారు. -
భూమికి డేంజర్ బెల్స్!
భూకంప క్రియాశీలక దశలోకి భూమి! బీజింగ్: వరుస భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. మొన్న జపాన్ (7.3 తీవ్రత), నిన్న ఈక్వెడార్(7.8) భూ విలయ విధ్వంసానికి సాక్ష్యాలుగా మిగిలాయి. తాజాగా ఆదివారం పసిఫిక్ ద్వీప దేశం టోంగాలోనూ రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది. వనౌతు, మయన్మార్, అఫ్గానిస్తాన్, ఫిలిప్పీన్స్... ఇలా పలు దేశాల్లో ఇటీవల భూకంపాలు చోటు చేసుకున్నాయి. పలు సందర్భాల్లో సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. వీటికి తోడు తక్కువ తీవ్రతతో నిత్యం ఎక్కడో ఓ చోట భూమి కంపిస్తూనే ఉంది. ఈ భూ ప్రకోపం ఇంతటితో ఆగుతుందా? లేక... మరింత శక్తిమంతమైన, ప్రపంచాన్నే కకావికలు చేయగల భారీ స్థాయి భూ విస్ఫోటనానికి ఈ వరుస భూకంపాలు సంకేతాలా? భూగ్రహం మరోసారి భూకంప క్రియాశీలక దశలోకి వెళ్తోందా? భూ భౌతిక శాస్త్రవేత్తలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న ప్రశ్నలివి!! భూమి క్రమంగా భూకంప క్రియాశీలక దశలోకి వెళ్తోందా అన్న అంశంపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కచ్చితంగా ఔనని సమాధానం చెప్పలేమని అమెరికా జియలాజికల్ సర్వేకు చెందిన భూ భౌతిక శాస్త్రవేత్త రాండీ బల్ద్విన్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పుడైనా భూకంపాలకు అవకాశం ఉంటుందని, కాకపోతే వేర్వేరు జోన్లలో సంభవించే భూకంపాలకు పరస్పర సంబంధముందా అన్నదానిపై స్పష్టమైన నిర్ధారణ లేదని అన్నారు. కానీ ఇటీవలి వరుస భూకంపాలు కచ్చితంగా మున్ముందు సంభవించబోయే మరో మెగా భూకంపానికి హెచ్చరికల్లాంటివని కొలరాడొ వర్సిటీకి చెందిన భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్త రోజర్ బిల్హమ్ స్పష్టం చేశారు. భూగర్భంలో మార్పుల వల్ల సమీప భవిష్యత్తులో రిక్టర్ స్కేల్‌పై 8 పాయింట్ల తీవ్రతను మించిన కనీసం మరో నాలుగు భూకంపాలు భూమిని కుదిపేసే ప్రమాదముందని హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో కాకపోయినా కాస్త ఆలస్యంగానైనా మరో మెగా భూకంప ప్రమాదం పొంచే ఉందన్నారు. అయితే ఇలాంటి మెగా భూకంపాలు రావడం అత్యంత అరుదని అమెరికా జియలాజికల్ సర్వే పేర్కొంటోంది. కాకపోతే అది అసాధ్యం మాత్రం కాదనడం గమనార్హం. ఇటీవలి భూకంపాల తీవ్రత సాధారణ స్థాయిలోనే ఉన్నా, ఆ ప్రాంతాలపై ఇంకా లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 90 శాతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే 20వ శతాబ్దంలోని మొదటి 60 ఏళ్లలో ఎక్కువ భూకంపాలు వచ్చా యి. 8.5 కన్నా ఎక్కువ తీవ్రతతో 7 భూకంపాలొచ్చాయి. ఇండోనేసియా, జపాన్ల భౌగోళిక ప్రాంతం సర్కమ్-పసిఫిక్ భూకంప ప్రాంతంలో ఉన్నందున అక్కడ భూకంపాలు వస్తుంటాయంటున్నారు. ఈ ప్రాంతం అమెరికా పసిఫిక్ తీరం, చైనాలోని తైవాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వరకు విస్తరించి మూడొంతుల భూకంప శక్తిని విడుదల చేస్తుంది. దీన్ని ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ అంటారు. ఇది 40 వేల కి.మీ. మేర విస్తరించి ఉంది. ప్రపంచంలోని మొత్తం భూకంపాల్లో 90 శాతం ఇక్కడే వస్తుంటాయి. ఇక్కడ టెక్టానిక్ పలకలు కదలడం నిత్యకృత్యం. భారీభూకంపాల దశలోకి టిబెట్! చైనాలోని ఖింగాయ్-టిబెట్ పీఠభూమిలోని దక్షిణాది ప్రాంతాల్లో భూతత్వం ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటుందని, ఆ ప్రాంతం ఇ ప్పుడు భారీ భూకంపాల దశలోకి ప్రవేశిస్తోందని చైనా భూకంప కేంద్రానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ పరిశోధకుడు జుజివే చెప్పారు. -
ఆసియా దేశాలు ప్రకృతి విపత్తులకు నెలవు!
పారిస్: ఆసియాలోని పలు దేశాలు, నగరాలు తుపానులు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ దేశాల కన్నా ఆఫ్రికాలోని ఉపసహారా ప్రాంతాల ప్రజల కు ఎక్కువ హాని పొంచి ఉన్నట్లు రిస్క్ అనలిస్ట్స్ వెరిస్క మ్యాపుల్క్రాఫ్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. దక్షిణాసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని దాదాపు 140 కోట్ల మంది ప్రజలు వరదలు, తుపానులు, సముద్రాలు ఉప్పొంగడం, భూకంపాల్లో ఏదో ఒక విపత్తు బారిన పడుతున్నారని పేర్కొంది. బంగ్లాలో 100% మంది ప్రజలకు ముప్పు పొంచి ఉండగా, భారత్‌లో 82 శాతం, పాక్‌లో 70 శాతం మంది విపత్తుల బారిన పడతారంది. వీటితో పాటు చైనా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లోని అధిక ప్రజలు కూడా ప్రమాదంలో ఉన్నారని వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలో ఈ విపత్తుల కారణంగా అధిక మరణాలు సంభవించడమే కాకుండా గాయాలు, రోగాల బారిన పడుతున్నారు. -
అండమాన్ నికోబార్ దీవుల్లో 8 భూకంపాలు
అండమాన్ నికోబార్ దీవులను 8 భూకంపాలు వణికించాయి. వీటిలో రెండు భారీ భూకంపాలు కూడా ఉన్నాయి. ఆదివారం రాత్రి సమయంలో ఇవి వచ్చాయి. భారీ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5కు పైగా నమోదైంది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదు. మరోవైపు.. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల్లో కూడా రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో మరో భూకంపం భూమికి పది కిలోమీటర్ల లోతున సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపాలన్నీ భూమికి 35-60 కిలోమీటర్ల లోతున నమోదయ్యాయి. గతంలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో పలుమార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రాంతంతో పాటు ఇండోనేషియాలో కూడా భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. -
ఖాట్మాండ్లో భూకంపం
ఖాట్మాండ్ : దేశంలో వరుస భూకంపాలతో నేపాలీలు వణికిపోతున్నారు. మంగళవారం ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో వరుసగా రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు తెల్లవారుజామున 4.20 గంటలకు ఖాట్మాండ్‌లోని కీర్తిపూర్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదు అయిందని జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత అంటే ఉదయం 10.24 గంటలకు మరోసారి భూమి కంపించిందని తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు అయిందని పేర్కొంది. భూకంప కేంద్రం ఖాట్మాండ్లో గుర్తించినట్లు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న నేపాల్‌లో సంభవించిన భూకంపంలో తొమ్మిది వేల మంది మరణించిన సంగతి తెలిసిందే. -
'మహిళలు జీన్స్ వేసుకోవడం వల్లే భూకంపాలు'
భూకంపాలు ఎందుకు వస్తాయన్నది శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. భూమి పొరల్లోపల జరిగే మార్పుల కారణంగానని వాళ్లు అంటుంటే.. పాకిస్థాన్‌లోని ఓ ఉగ్రవాద నాయకుడు మాత్రం అబ్బే అది కాదంటున్నారు. మహిళలు జీన్సు ప్యాంట్లు వేసుకోవడం వల్లే ద్రవ్యోల్బణం దగ్గర నుంచి భూకంపాల వరకు వస్తున్నాయని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ అన్నారు. పాకిస్థాన్ వ్యాప్తంగా జీన్సు ప్యాంట్లు వేసుకునే మహిళలపై సైనిక ఆపరేషన్ ప్రారంభించాలని పాక్ సైన్యాన్ని కోరారు. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీమాట చెప్పారు. తాలిబన్లు పాకిస్థాన్‌కు శత్రువులు కారని, అందువల్ల తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ మీద సైనిక ఆపరేషన్ చేయడం అనవసరమని ఆయన చెప్పారు. -
భూకంపం ఇతివృత్తంగా శాన్ ఆండ్రియాస్
భూకంపాల విళయ తాండవం ఎలా ఉంటుందో ఈ మధ్య నేపాల్‌లో సంభవించిన సంఘటనను ప్రత్యక్షంగా చూశాం. అలాంటి భయానక భూకంపం ఇతి వృత్తం తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం శాన్ ఆండ్రియాస్. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్స్ బ్రదర్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇది.అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపాందిన ఈ చిత్రాన్ని బాడ్ పయోటక్ దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే మహా నగరం కాలిపోర్నియా.అత్యధిక జనాభా నివశించే ఆ నగరంలో సంభవించిన భారీ భూకంప బీభత్సమే శాన్ ఆండ్రియాస్ చిత్రం . దక్షిణ కాలిఫోర్నియాలోని భూకంప పరిశోధన సంస్థలో ముఖ్య అధికారి, ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు,హెలికాప్టర్ పెలైట్ భూకంప బాధితుల్ని ఎలా రక్షించే ప్రయత్నం చేశారు. చివరికి ఏమైంది? పలు ఉత్కంఠ భరిత సన్నివేశాల రూపకల్పనగా శాన్ ఆండ్రియాస్ చిత్రం ఉంటుందని వార్నర్ బ్రదర్స్ నిర్వాహకులు అన్నారు. ది మమ్మి రిటర్న్స్,ది స్కూర్పింన్ కింగ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-6,7 సిరీస్ చిత్రాల ఫేమ్ డాని జాన్సన్ హీరోగా నటించిన ఈచిత్రం 29న ఆంగ్లం, తమిళ భాషల్లో విడుదల కానుంది -
న్యూగినియాలో మరోసారి భూకంపం
సిడ్నీ: పపువా న్యూగినియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. దీని ప్రభావంతో అక్కడి సముద్ర తీరం ప్రకంపనలతో వణికిపోయింది. అలలతో పోటెత్తింది. కాగా ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. మే 1వ తేదీన కూడా న్యూగినియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. -
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు
అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను శుక్రవారం భూకంపాలు వచ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్‌బ్లెయిర్‌కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఈ భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. భూమికి 10 కిలోమీటర్ల లోతున ఇది వచ్చినట్లు తెలిపారు. అయితే, దీనివల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించినట్లు మాత్రం సమాచారం లేదు. ఇక పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొకోపో నగరానికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉంది. ఇదే ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా ఏమీ లేవు. -
భూకంపాల్ని డాల్ఫిన్స్ ముందే గ్రహిస్తాయా..?
-
ప్రతి నిమిషమూ కంపనమే!
ప్రతి నిమిషానికీ ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉంటుంది! ప్రపంచంలో ప్రతియేటా కనీసం 8,000 మంది భూకంపాలకు బలి అవుతున్నారని అంచనా. రిక్టర్ స్కేల్‌పై 3.0 కన్నా ఎక్కువ స్థాయిలో నమోదయ్యే భూకంపాలు ఏడాదికి కనీసం 8000 సంభవిస్తూ ఉంటాయి. అంతకన్నా తక్కువస్థాయి భూకంపాలు వందలకొద్దీ వచ్చిపోతున్నా వాటి ప్రభావం ఎక్కడా కనిపించదు. భూ దక్షిణార్ధగోళం వైపు కన్నా ఉత్తరార్ధగోళంలోనే ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. ఎక్కువగా భూకంపాలను ఎదుర్కొనేది జపనీయులు. జపాన్ పరిధిలో వారానికి కనీసం ఒకసారి అయినా భూకంపం సంభవిస్తూనే ఉంటుంది. జపనీయుల నమ్మకం ప్రకారం భూకంపాలు ‘నమజు’గా పిలుచుకొనే ఒక క్యాట్‌ఫిష్ వల్ల సంభవిస్తాయి. ప్రాచీన గ్రీకుల విశ్వాసం ప్రకారం భూకంపం సముద్రదేవుడయిన పొసేడియన్ ఆగ్రహానికి ప్రతిరూపం. అలాగే భూమి లోపల నుంచి భయంకరమైన గాలులు వస్తాయనీ, అవే భూకంపాలకు కారణమనీ గ్రీకులు విశ్వసించేవారు. ఇతరగ్రహాలు, ఉప గ్రహాలపై కూడా కంపాలు తప్పవని అంతరిక్ష శాస్త్రజ్ఞులు అంటారు. చంద్రుడిపై కూడా ఇవి నమోదవ్వడాన్ని గుర్తించారు. చందమామపై సంభవించే వీటిని ‘మూన్ క్వేక్స్’అంటారు. చాలా రకాల జీవజాతులకు భూకంపాలను గుర్తించే శక్తి ఉందని జీవశాస్త్ర పరిశోధకులు అంటారు. కుక్కలు, ఎలుకలు, కోళ్లు మొదలైనవి భూకంపాలను ముందుగానే గుర్తిస్తాయి. ‘జర్నల్ ఆఫ్ జువాలజీ’ అధ్యయనం ప్రకారం కప్పలు భూకంపాలను ముందుగానే గ్రహించి, దాని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి దూరంగా ప్రయాణం ప్రారంభిస్తాయి! కాలిఫోర్నియాలోని పార్క్ఫీల్డ్ను ‘ది ఎర్త్‌క్వేక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా వ్యవహరిస్తారు. రెండు టెక్టానిక్ ప్లేట్ల కలయిక వద్ద ఉన్న ఆ ప్రాంతంలో తీవ్రంగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఏనాటికి అయినా భూకంపంతో తీవ్ర ప్రభావం పడగల నగరమని కాలిఫోర్నియా విషయంలో ఆందోళనలున్నాయి. భూ స్వభావాన్ని బట్టి భూకంపాలు సంభవించే అవకాశాలు ఉంటాయని మొట్ట మొదట సూత్రీకరించింది అరిస్టాటిల్. రెండువేల సంవత్సరాల క్రితం చైనా పరిశోధకుడు జాంగ్హెంగ్ తొలిసారి ఎర్త్‌క్వేక్ డిటెక్టర్‌ను కనుగొన్నాడు. దాదాపు ఆరువందల కిలోమీటర్ల ఆవల సంభవించే భూకంపాలను కూడా అది గుర్తించగలదు. 1935లో అమెరికన్ పరిశోధకుడు చార్లెస్ రిక్టర్ భూకంపాన్ని కొలిచే ‘రిక్టర్ స్కేల్’ రూపొందించారు. భయోత్పాతాన్ని కలిగించిన భూకంప ఛాయాచిత్రాలకు ప్రపంచ వ్యాప్త ఆదరణ ఉంటుంది. ఫొటోల ద్వారా వార్తల్లోకెక్కిన భూకంపాల్లో 1906లో కాలిఫోర్నియాలో సంభవించినదే తొలి బీభత్సం. -
భయకంపం
3,00,000 2010 జనవరి 12న కరీబియన్ దేశమైన హైతీలో సంభవించిన భూకంపం.. మూడు లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైనా.. భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. 2,42,000 1976లో ఉత్తర చైనాలోని హెబియిలో 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం.. 2.42 లక్షల మందిని బలి తీసుకుంది. 2008లో నైరుతి చైనాలోని సిచౌన్లో 8.0 తీవ్రతతో నమోదైన భూకంపంలో 87,000 మంది గల్లంతయ్యారు. ప్రకృతి శాపం మానవాళిని వణికించే అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు మాత్రమే. భూకంపాలు ఎలా వస్తాయో తెలుసుకున్న శాస్త్రవేత్తలు, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం కచ్చితంగా చెప్పలేకపోవడమే ఇందుకు కారణం. ఏం జరుగుతోందో గ్రహించేలోగా అంతా జరిగిపోతుంది. భూకంపాలను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానం కోసం దశాబ్దాల తరబడి పరిశోధనలు సాగుతున్నా, ఇప్పటి వరకు ఆశాజనకమైన ఫలితాలేవీ లేవు. ఎలా సంభవిస్తాయి?: భూమి ఉపరితలం అకస్మాత్తుగా కదిలిపోవడాన్నే భూకంపం అంటారు. చాలాసార్లు ప్రకంపనలు ఏర్పడినా మనకు తెలియవు. భూమి నిర్మాణం మూడు పొరలతో ఏర్పడి ఉంది. అట్టడుగు పొర విపరీతమైన వేడిగా ఉంటుంది. అక్కడ ఇనుము కరిగిన స్థితిలో సలసలలాడుతూ ఉంటుంది. అట్టడుగు పొర చుట్టూ వ్యాపించిన మధ్య పొరలో కఠిన శిలలు ఉంటాయి. ఆ శిలలన్నీ అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవు. ఆ శిలలు భారీ పలకలుగా వ్యాపించి ఉంటాయి. వాటిని ‘టెక్టానిక్ ప్లేట్స్’ అంటారు. భూమి అట్టడుగున ఉండే వేడి కారణంగా ‘టెక్టానిక్ ప్లేట్స్’ నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ భారీ రాతి పలకలు ఒకదానిని మరొకటి పెనువేగంతో ఒరుసుకుంటూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే ప్రకంపనలు ఏర్పడతాయి. వాటినే భూకంపాలు అంటాం. ‘టెక్టానిక్ ప్లేట్స్’ కదలికల కారణంగా భూమి అట్టడుగున కొన్ని బలహీన ప్రదేశాలు ఏర్పడ్డాయి. ఇవి ‘టెక్టానిక్ ప్లేట్స్’ సరిహద్దుల వద్ద ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. చిలీ నుంచి ఉత్తర అమెరికా తీరం, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ పరిసర ప్రాంతాలతో కూడిన ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’, మధ్యధరా ప్రాంతం, భారత్‌లోని హిమాలయ ప్రాంతం, గంగా-బ్రహ్మపుత్ర తీర ప్రాంతం, కచ్ ప్రాంతం, అండమాన్-నికోబార్ దీవులు వంటివి ఇలాంటి బలహీన ప్రదేశాలే. భూమి అడుగున ఉన్న పొరలలో ఏర్పడే కదలికలతో పాటు అగ్నిపర్వతాల్లో తలెత్తే మార్పుల వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఉపరితలం అడుగున కాకుండా, సముద్రగర్భంలో ఏర్పడే భూకంపాలు సునామీలకు దారితీస్తాయి. ఏం జరుగుతుంది?: భూకంపాల వల్ల విధ్వంసం మాత్రమే కాదు, భూమి ఉపరితలంపై కాలక్రమంలో పెనుమార్పులూ సంభవిస్తాయి. తీవ్రమైన భూకంపం ధాటికి దేశాలకు దేశాలే భౌతికంగా అవి ఉన్న చోటి నుంచి మరో చోటికి కదిలిపోతాయి. ఉదాహరణకు వందకోట్ల ఏళ్ల కిందట అమెరికా ఇప్పుడు ఉన్న ప్రదేశంలో లేదు. చాలా ఖండాలదీ అదే పరిస్థితి. శతకోటి సంవత్సరాల కిందట అవి ఉన్న ప్రదేశం నుంచి భౌతికంగా చాలా దూరం జరిగిపోయాయి. భూమి అడుగున ఉన్న ‘టెక్టానిక్ ప్లేట్స్’ కదలికల ఫలితంగానే ఇవి క్రమేపీ దూరం దూరంగా జరిగాయి. అంతేకాదు, భూమి ఉపరితలంపై పర్వతాలు, లోయలు కూడా వాటి ఫలితంగానే ఏర్పడ్డాయి. భూమి అడుగునున్న లావా భారీస్థాయిలో ఎగజిమ్మి, ఉపరితలానికి చేరుకోగా అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. భూమి అడుగున ఉండే ‘టెక్టానిక్ ప్లేట్స్’ దాదాపు 50 మైళ్ల మందాన ఉంటాయి. ఇవి ఏడాదికి కనీసం అర అంగుళం నుంచి కొన్ని అంగుళాల మేరకు ఏదో ఒక దిశలో కదులుతాయి. ఒక టెక్టానిక్ ప్లేట్ ఏడాదికి అర అంగుళం చొప్పునే కదిలిందనుకుంటే, పదేళ్లకు ఐదు అంగుళాలు, ఆ లెక్కన పదిలక్షల ఏళ్లకు 8 మైళ్ల దూరం కదులుతుంది. గడచిన కోటాను కోట్ల సంవత్సరాల వ్యవధిలో భూమిపై ఉన్న ఖండాలకు ఖండాలే తాము ఉన్న చోటి నుంచి మైళ్లకు మైళ్లు జరిగిపోయాయి. ఐదేళ్ల కిందట న్యూజిలాండ్‌లో సంభవించిన భూకంపం ధాటికి ఉపరితలంపై ఏకంగా పదకొండు అంగుళాల చీలిక ఏర్పడింది. పది భూప్రళయాలు.. నేపాల్‌ను వణికించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.9గా నమోదైంది. చరిత్ర పుటలు తిరిగేస్తే.. ఎన్నో భూకంపాలు ప్రపంచ దేశాలను విలవిల్లాడేలా చేశాయి. 1. చిలీ: 1960 మే 22; భూకంప తీవ్రత: 9.5 ఈ భారీ భూకంపం 1,655 మందిని పొట్టన పెట్టుకుంది. 20 లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. 2. అలాస్కా: 1964 మార్చి 28; తీవ్రత: 9.2 భూకంపం వల్ల సునామీగా ఉప్పొంగిన సముద్ర కెరటాలు 128 మందిని బలిగొన్నాయి. 311 మిలియన్ డాలర్ల ఆస్తిన ష్టం జరిగింది. ప్రాణనష్టం ఎక్కువగా జరగకపోయినా.. చరిత్రలో ఇది రెండో అతిపెద్ద భూకంపంగా నిలిచిపోయింది. 3. ఇండోనేసియా: 2004 డిసెంబర్ 26; తీవ్రత: 9.1 హిందూ మహా సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం.. దక్షిణాసియాతో పాటు తూర్పు ఆఫ్రికాలోని 14 దేశాలను కుదిపేసింది. 2.30 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. సునామీ తాకిడికి చెన్నై సహా భారత్‌లోని దక్షిణ తీరప్రాంతంలో 18,000 మందికి పైగా జలసమాధి అయ్యారు. 4. జపాన్: 2011 మార్చి11;తీవ్రత: 9.0 జపాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. సునామీ ధాటికి న్యూక్లియర్ రియాక్టర్స్ తీవ్రంగా దెబ్బతినడంతో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి ఏర్పడింది. 5.రష్యా: 1952 నవంబర్ 4; తీవ్రత: 9.0 కామ్చత్క పెనిన్సులాలో సంభవించిన భూకంపం పసిఫిక్ మహా సముద్ర అలలను సునామీ కెరటాలుగా మార్చేసింది. 6. చిలీ: 2010 ఫిబ్రవరి 27, తీవ్రత: 8.8 పసిఫిక్ మహాసముద్రం అంచున 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 521 మంది ప్రాణాలు కోల్పోయారు. 7. ఈక్వెడార్: 1906 జనవరి 31; తీవ్రత: 8.8 పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన సునామీ.. ఈక్వెడార్తోపాటు కొలంబియా తీరప్రాంతాన్ని కకావికలం చేసింది. రెండు వేల మంది చనిపోయారు. 8. ర్యాట్ ఐలాండ్, అలస్కా: 1965 ఏప్రిల్ 2; తీవ్రత: 8.7 భూకంప తీవ్రత కన్నా.. సునామీ ఎక్కువగా కలవరపెట్టింది. 9. ఇండోనేషియా: 2005 మార్చి 28; తీవ్రత: 8.6 సమత్రా దీవుల్లో కంపించిన భూమి.. కడలిలో కల్లోలాన్ని సృష్టించింది. శ్రీలంక వరకు భీకరమైన అలల తాకిడితో అలజడి రేపింది. 10. అస్సాం, టిబెట్: 1950 ఆగస్ట్ 15, తీవ్రత: 8.6 అస్సాం, టిబెట్ సరిహద్దులో సంభవించిన ఈ భూకంపంలో 800 మంది మరణించారు. భూకంపం.. దాని తీవ్రత.. భూకంపాలకు సంబంధించిన వార్తలు వెలువడినప్పుడల్లా రిక్టర్ స్కేల్‌పై ఎంత నమోదైందో ఆ తీవ్రత తెలుస్తుంది. రిక్టర్ స్కేల్‌పై ఎంత తీవ్రత నమోదైతే, వాస్తవంగా ఎంత నష్టం వాటిల్లుతుందో ఆ వివరాలు వార్తల్లో ఉండవు. తీవ్రమైన భూకంపాలు అణుబాంబు పేలుళ్లకు సమానమైన నష్టాన్ని కలిగిస్తాయి. రిక్టర్ టీఎన్టీ పేలుడుతో ఎన్ని అణుబాంబులకు స్కేల్ విడుదలయ్యే శక్తి సమానం? 4.0 1 కిలోటన్ను ఒక చిన్న అణుబాంబు 5.0 32 కిలోటన్నులు నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు 6.0 1 మెగాటన్ను 10 నాగసాకి అణుబాంబులు 7.0 32 మెగాటన్నులు భారీ థర్మోన్యూక్లియర్ ఆయుధం (100 అణుబాంబులు) 8.0 1 గిగాటన్ను 1000 అణుబాంబులు 9.0 32 గిగాటన్నులు 10 వేల అణుబాంబులు నేపాల్ భూకంపం ఎలా వచ్చింది? నేపాల్‌లో భూకంపం ఎలా సంభవించిందనే దానిపై అమెరికా భూగర్భ అధ్యయన సంస్థ వివరాలు వెల్లడించింది. భారత టెక్టానిక్ ప్లేట్, దానికి ఉత్తరానే ఉన్న యూరేసియా టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగానే ఈ భూకంపం ఏర్పడింది. నేపాల్ రాజధాని కఠ్మాండుకు ఈశాన్యాన 50 మైళ్ల దూరంలో శనివారం భూకంపం ఎందుకు సంభవించిందంటే, భారత టెక్టానిక్ ప్లేట్ ఏడాదికి రెండు అంగుళాల వేగంతో యూరేసియా టెక్టానిక్ ప్లేట్‌ను తాకింది. ఈ భూకంప కేంద్రం భూమికి కేవలం ఏడు మైళ్ల అడుగున ఉంది. అందువల్లనే చాలా దూరం వరకు ప్రకంపనలు వ్యాపించాయని అమెరికా భూగర్భ అధ్యయన సంస్థ చెబుతోంది. నేపాల్ భూకంపం ఫలితంగా శనివారం పొరుగునే ఉన్న భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, టిబెట్లలో ప్రకంపనలు ఏర్పడ్డాయి. మంచుకొండలే ముంచును.. హిమాలయాల చెంతన ఉన్న నేపాల్.. తీవ్ర భూకంపాలు సంభవించే డేంజర్ జోన్లో ఉందంటున్నారు భూగర్భ పరిశోధకులు. భూమి అంతరాల్లోని టెక్టానిక్ పలకల రాపిడి భూకంపాలకు అసలు కారణం. ఇండియన్ టెక్టానిక్ పలక, సెంట్రల్ ఆసియా భూభాగానికి సంబంధించిన యూరేసియా టెక్టానిక్ పలక భారీగా ఢీ కొట్టుకోవడం వల్లే హిమాలయా పర్వతాలు ఏర్పడ్డాయి. భూగర్భంలోని ఈ రెండు బలమైన పొరలు తరచూ రెండు అంగుళాలు అటు ఇటుగా కదులుతుంటాయి. అలాంటి సందర్భాల్లో భూకంపాలు సంభవించే అవకాశాలున్నాయి. ఈ రెండు పలకలు కాస్త గట్టిగా ఢీకొంటే భారీ భూవిలయం తప్పదు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ పరిధిలో ఉన్న హిమాలయాలు ఏర్పడిన సందర్భంలోనే.. భూగర్భంలో కొన్ని తేడాలు ఏర్పడ్డాయంటున్న శాస్త్రవేత్తలు.. ఆ అంతరాల్లోని తేడాలు సర్దుబాటయ్యే క్రమంలో భూకంపాలు ఏర్పడతాయని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన మంచుకొండల కు దగ్గరగా ఉన్న నేపాల్‌కు భూప్రకోపం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. జననష్టం దృష్ట్యా భారత భూభాగంపై సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాలు కాశ్మీర్ భూకంపం: అక్టోబర్ 8, 2005 ప్రభావిత ప్రాంతాలు: జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ జననష్టం: దాదాపు 86,000 మంది. వీరిలో 80శాతం మంది పీవోకేలో ఉన్నవారే. గుజరాత్ భూకంపం జనవరి 26, 2001 ప్రభావిత ప్రాంతం: కచ్ జిల్లా జననష్టం: 20,000 మంది కాంగ్రా భూకంపం: ఏప్రిల్ 4, 1905 ప్రభావిత ప్రాంతం: హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయ జననష్టం: దాదాపు 20,000 మంది లాతూర్ భూకంపం: సెప్టెంబర్ 30, 1993 ప్రభావిత ప్రాంతాలు: మహారాష్ట్రలోని లాతూర్, ఉస్మానాబాద్ జననష్టం: 9,000 మంది మానవుల నిర్వాకాలూ కారణమే.. భూమి లోలోపలి పొరల్లో కదలికలు, అగ్నిపర్వతాలలో తలెత్తే మార్పులు పూర్తిగా ప్రకృతిపరమైనవి. వాటిని ఎలాగూ నియంత్రించలేం. అయితే, మానవుల నిర్వాకాల వల్ల కూడా కొన్నిసార్లు భూకంపాలు సంభవిస్తుంటాయి. విచ్చలవిడిగా గనులు తవ్వేసి, వాటిలోని ఖనిజాలను ఖాళీచేసి వదిలేశాక, అవి కుప్పకూలిన సందర్భాల్లో స్వల్పస్థాయి భూకంపాలు సంభవిస్తుంటాయి. భూగర్భంలో అణుపరీక్షలు నిర్వహించడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. భారీ డ్యాముల వెనుక రిజర్వాయర్లలో భారీ పరిమాణంలో నీటిని నిల్వచేయడం వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగా కూడా భూకంపాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని కోయినా డ్యామ్ వద్ద 1967లో ఏర్పడిన భూకంపం ఇలాంటిదే. కోయినా డ్యామ్ నిర్మాణం 1963లో పూర్తవగా, రిజర్వాయర్ నీటితో నిండుతున్న సమయంలో చాలాసార్లు ప్రకంపనలు ఏర్పడ్డాయి. చివరకు 1967లో తీవ్ర భూకంపమే సంభవించి, 200 మంది మరణించారు. ఆ భూకంపం ఫలితంగా కోయినా డ్యామ్‌కు కూడా బీటలుపడ్డాయి. భవనాల వల్లే భారీ నష్టం భూకంపాల కారణంగా ఎవరూ మరణించరు, భవనాల కారణంగానే మరణిస్తారు అని నిపుణులు అంటారు. భూకంపాలు సంభవించినప్పుడు భారీ భవనాలలో కాకుండా, ఆరుబయట ఉన్నవారు సురక్షితంగా ఉంటారు. భూకంపాలను తట్టుకునే రీతిలో భవనాలను నిర్మించడం వల్ల ఈ నష్టాన్ని నివారించవచ్చు. భవనాల పునాదులకు, ఫ్లోరింగ్‌కు మధ్య బేరింగ్లు ఏర్పాటు చేయడం, గోడల నిర్మాణంలో మార్పులు చేయడం వంటి చర్యల ద్వారా భూకంపాల నుంచి భవనాలు కూలిపోకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై కొలుస్తారు. రిక్టర్ స్కేల్‌పై 3 కంటే తక్కువగా నమోదయ్యే భూకంపాలు దాదాపు ప్రతిరోజూ సంభవిస్తుంటాయి. అవి సంభవించినట్లు కూడా ఎవరికీ తెలియదు. రిక్టర్ స్కేల్‌పై 3-5 వరకు నమోదయ్యే భూకంపాలను స్వల్పస్థాయి నుంచి ఒక మోస్తరు భూకంపాలుగానే పరిగణిస్తారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5-7 వరకు ఉంటే ఒక మోస్తరు నుంచి తీవ్ర భూకంపాలుగా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా, 7-8 వరకు నమోదయ్యే భూకంపాలను పెను భూకంపాలుగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏడాదికి ఒకటైనా పెను భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి పెను భూకంపాల కారణంగానే భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లుతాయి. ఇప్పటి వరకు రిక్టర్ స్కేల్‌పై 10 వరకు నమోదైన భూకంపం ఒక్కటైనా సంభవించలేదు. అలాంటిదే సంభవిస్తే, అప్పుడు వాటిల్లే నష్టాన్ని ఊహించడమే అసాధ్యం. -
భూకంపాలను గుర్తించే జంతువులు
భూకంపం రావడానికి ముందు పశుపక్ష్యాదుల ప్రవర్తనలో తేడాలొస్తాయని మన పెద్దలు చెబుతారు. ఇంతకాలం దీనికి శాస్త్రీయమైన ఆధారాలేవీ దొరకలేదు. ఇప్పుడు దొరికాయి. కొన్ని క్షణాలో, గంటల ముందోకాదు.. కొన్ని రోజుల ముందే వాటి ప్రవర్తనలో తేడాలొస్తాయని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ కనుగొన్నారు. పెరూలోని యనచాగ జాతీయ పార్క్‌లో ఏర్పాటుచేసిన కెమెరాలను విశ్లేషించడం ద్వారా ఆయన ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని కాంటమానాలో 2011లో రెక్టర్ స్కేల్‌పై 7 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం వచ్చింది. ఆ కాలానికి సంబంధించి జాతీయ పార్కులోని కెమెరాలు తీసిన దృశ్యాలను డాక్టర్ రాచెల్ గ్రాంట్ లోతుగా అధ్యయనం చేశారు. పెను భూకంపానికి 23 రోజుల ముందు నుంచే జంతువుల ప్రవర్తనలో వచ్చిన మార్పులను ఆయన గ్రహించారు. 15 రోజుల ముందు వాటిలో కలకలం రేగింది. సరిగ్గా ఆ భూకంపానికి ఐదు రోజుల ముందు అవి ఎలాంటి కదలికలు లేకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. అంటే అప్పటికే ఓ ప్రళయం రాబోతుందన్న స్పృహ వాటికి కలిగిందన్నమాట. భూకంపానికి ముందు, భూ పొరల్లో, ముఖ్యంగా రాళ్ల దిగువన ఏర్పడిన కదలికల వల్ల భూ ఉపరితలంపై, భూవాతావరణంలోని గాలిలో అయాన్ల చలనం ఏర్పడుతుంది. 15 రోజుల ముందు నుంచే అయాన్ల చలనం ప్రారంభమవుతుంది. దీనివల్ల జంతువులపై సెరొటోనియం సిండ్రోమ్ ప్రభావం కలుగుతుంది. అంటే రక్త ప్రసారంలో సెరొటోన్ల స్థాయి హఠాత్తుగా పెరుగుతుంది. అది పెరగడం వల్ల జంతువుల శరీరంలో అలసట, గుండెలో తెలియని గుబులు, అర్థంకాని మానసికాందోళన కలుగుతాయి. అందువల్ల జంతువుల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షుల్లోనే ఈ మార్పులు ఎక్కువగా సంభవిస్తాయని, వాటి ప్రవర్తనను గమనించడం ద్వారా భూకంపం తీవ్రతను గుర్తించవచ్చని రాచెల్ వివరించారు. పెను భూకంపాలను ఇక ముందు వారం, పది రోజుల ముందుగానే నిపుణులు గుర్తించేందుకు రాచెల్ అధ్యయనం ఎంతగానో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సిటీ సేఫ్
భూకంపాలతో భయం లేదు స్వల్ప భూ ప్రకంపనలు సాధారణమే ఇప్పటి వరకూ ప్రాణ నష్టం లేదు భారీ భవన నిర్మాణాల్లో జాగ్రత్తలు అవసరం ఉప్పల్: నగర ం నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ...ఒక్కసారిగా కలకలం.. కాళ్ల కింద భూమి కదిలినట్లు...తాము కూర్చున్న చోటులోనూ కదలిక వచ్చినట్టు భావన. అంతలోనే ఇళ్లలో భద్రపరిచిన వంట పాత్రలు... ఇతర సామగ్రి ఒక్కసారిగా కింద పడటం.. అంతటా అలజడి. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందన్న భయం. కట్టుబట్టలతో వీధుల్లోకి వచ్చిన జనం... అరగంట తరువాత అర్థమైంది.. తమను అలా ‘కదిలించింది’ భూకంపమని. శుక్రవారం రాత్రి 10.36 గంటల సమయంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ పరిసరాల్లో నాలుగు సెకన్ల పాటు వచ్చిన భూ ప్రకంపనలతో జనం హడలిపోయారు. కొన్ని ప్రాంతాల ప్రజలకు అర్థరాత్రి వరకూ...మరికొన్ని చోట్ల తెల్లవారుఝాము వరకూ కంటిపై కునుకు లేదు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైందని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పేర్కొంది. హైదరాబాద్ పరిసరాల్లో భూమి కంపించటం కొత్తేమీ కాదంది. నిత్యం భూ పలకల్లో కదలికలు సర్వసాధారణమేనని... హైదరాబాద్ అత్యంత సేఫ్ జోన్లో ఉందని శనివారం స్పష్టం చేసింది. నగరంలో శుక్రవారం వచ్చిన భూ కదలికలు చాలా స్వల్పమైనవని చెప్పింది. నిర్మాణాల్లో అప్రమత్తం.. నగరంలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలన్నీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్లలో నమోదైనవే. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో భూ లోపలి కదలికలు విస్తృతంగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా భవన నిర్మాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరుగకుండా ఉండేలా నిర్మాణాలు డిజైన్ చేసుకోవచ్చని, స్వల్ప ప్రకంపనలు వచ్చినా బహుళ అంతస్తుల నిర్మాణాల్లో కొన్ని సందర్భాల్లో నష్టాలకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నష్టం లేదు: శ్రీనగేష్, ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్త ఇలాంటి స్వల్ప ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లబోదని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ డి.శ్రీనగష్ తెలిపారు. ఉప్పల్‌లోని ఎన్జీఆర్ఐకి దక్షిణ, పశ్చిమ దిశగా 26 కిలో మీటర్ల వ్యాసార్థంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయన్నారు. -
భూ అయస్కాంత క్షేత్రాలపై ప్రపంచ దేశాల పరిశోధన
నేటి నుంచి 9 రోజులపాటు వర్క్‌షాప్ చౌటుప్పల్: ప్రకృతి విపత్తులు, సునామీలు, భూకంపాలను ముందుగా పసిగట్టేందుకు, భూగర్భంలోని ఖనిజ, చమురు నిక్షేపాలను గుర్తించేందుకు భూ అయస్కాంత క్షేత్రాలపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం 150 కేంద్రాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులోభాగంగా భూ అయస్కాంత క్షేత్ర పరిశీలనకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం శివారులో ఉన్న 105 ఎకరాల విస్తీర్ణంలో 2012లో ఈ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ అత్యంత ఆధునికమైన డిజిటల్ మాగ్నటోమీటర్ను ఏర్పాటు చేశారు. ఇందులో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ అయస్కాంత క్షేత్ర మార్పులపై ప్రతి నిమిషానికి 120 నమూనాలు నమోదవుతాయి. వీటి ఆధారంగా నిరంతరం పరిశోధనలు జరుగుతుంటాయి. వచ్చే 10 వేల ఏళ్లలో దక్షిణ, ఉత్తర ధ్రువాలు తారుమారు వచ్చే 10 వేల ఏళ్లలో దక్షిణ, ఉత్తర ధృవాలు పరస్పరం మారుతున్నాయి. గతంలో 70 వేల ఏళ్ల క్రితం ఇలా జరిగింది. సాధారణంగా 50 వేల ఏళ్లకోసారి ఇలా మారుతుంటాయి. ఆ సమయంలో భూమిలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే అంశంపై ఈ వర్క్‌షాప్‌లో పరిశోధనలు చేయనున్నారు. -వైజే.భాస్కర్‌రావు, డెరైక్టర్, ఎన్జీఆర్ఐ -
చైనా, గ్రీస్, టర్కీలలో భూకంపాలు
బీజింగ్:చైనా, గ్రీస్, టర్కీ దేశాల్లోని పలు ప్రాంతాల ప్రజలను శనివారం భూకంపాలు వణికించాయి. నైరుతి చైనాలోని ఇంగ్జియాంగ్ కౌంటీలో ఉదయం రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. పలు పట్టణాల్లో 9,412 ఇళ్లు, రోడ్లు ధ్వంసం కాగా 12 మంది గాయపడ్డారు. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం 12 కి.మీ. లోతులో ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శనివారం మధ్యాహ్నం గ్రీస్, టర్కీ తీరాల వద్ద సముద్రంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర గ్రీస్, పశ్చిమ టర్కీలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. వేలాది మంది ప్రజలు భయకంపితులయ్యారు. టర్కీలోని ఓ దీవితోపాటు వివిధ చోట్ల 266కు పైగా మంది గాయపడ్డారు. థెసాలోనికాకు 210 కి.మీ. దూరంలో సముద్రంలో 10 కి.మీ. లోతులో ఈ భూకంపం ఏర్పడిందని అధికారులు తెలిపారు. -
పాకిస్థాన్‌లో భూకంపం
ఆగ్నేయ పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆ ఘటనలో ఒకరు మరణించగా, 30మంది గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ వెల్లడించింది. సింధ్‌లోని దౌర్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున 3.50కి భూమీ కంపించిందని... రిక్టార్ స్కేల్‌పై 4.5గా భూకంప తీవ్రత నమోదైందని తెలిపింది. మరి కొద్ది సేపటికే మళ్లీ భూమి కంపించిందని రిక్టార్ స్కేల్‌పై 4.6గా దాని తీవ్రత నమోదైందని వెల్లడించింది. భూకంప తీవ్రతకు కొన్ని జనం ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారని.... కొన్ని ప్రాంతాలలో నివాసాలపై కప్పులు కూలిపోయానని తెలిపింది. భూకంపం నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే నేడు జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
చైనా భూకంపం: 47 మంది మృతి