
సిటీ సేఫ్
భూకంపాలతో భయం లేదు
స్వల్ప భూ ప్రకంపనలు సాధారణమే
ఇప్పటి వరకూ ప్రాణ నష్టం లేదు
భారీ భవన నిర్మాణాల్లో జాగ్రత్తలు అవసరం
ఉప్పల్: నగర ం నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ...ఒక్కసారిగా కలకలం.. కాళ్ల కింద భూమి కదిలినట్లు...తాము కూర్చున్న చోటులోనూ కదలిక వచ్చినట్టు భావన. అంతలోనే ఇళ్లలో భద్రపరిచిన వంట పాత్రలు... ఇతర సామగ్రి ఒక్కసారిగా కింద పడటం.. అంతటా అలజడి. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందన్న భయం. కట్టుబట్టలతో వీధుల్లోకి వచ్చిన జనం... అరగంట తరువాత అర్థమైంది.. తమను అలా ‘కదిలించింది’ భూకంపమని. శుక్రవారం రాత్రి 10.36 గంటల సమయంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ పరిసరాల్లో నాలుగు సెకన్ల పాటు వచ్చిన భూ ప్రకంపనలతో జనం హడలిపోయారు. కొన్ని ప్రాంతాల ప్రజలకు అర్థరాత్రి వరకూ...మరికొన్ని చోట్ల తెల్లవారుఝాము వరకూ కంటిపై కునుకు లేదు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైందని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) పేర్కొంది. హైదరాబాద్ పరిసరాల్లో భూమి కంపించటం కొత్తేమీ కాదంది. నిత్యం భూ పలకల్లో కదలికలు సర్వసాధారణమేనని... హైదరాబాద్ అత్యంత సేఫ్ జోన్‌లో ఉందని శనివారం స్పష్టం చేసింది. నగరంలో శుక్రవారం వచ్చిన భూ కదలికలు చాలా స్వల్పమైనవని చెప్పింది.
నిర్మాణాల్లో అప్రమత్తం.. నగరంలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలన్నీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్‌లలో నమోదైనవే. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో భూ లోపలి కదలికలు విస్తృతంగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా భవన నిర్మాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరుగకుండా ఉండేలా నిర్మాణాలు డిజైన్ చేసుకోవచ్చని, స్వల్ప ప్రకంపనలు వచ్చినా బహుళ అంతస్తుల నిర్మాణాల్లో కొన్ని సందర్భాల్లో నష్టాలకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నష్టం లేదు: శ్రీనగేష్, ఎన్ జీఆర్‌ఐ శాస్త్రవేత్త
ఇలాంటి స్వల్ప ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లబోదని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ డి.శ్రీనగష్ తెలిపారు. ఉప్పల్‌లోని ఎన్‌జీఆర్‌ఐకి దక్షిణ, పశ్చిమ దిశగా 26 కిలో మీటర్ల వ్యాసార్థంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయన్నారు.