భూమికి నాలుగు పొరలే కాదు.. ఐదో పొర కూడా! దాని ఆకృతి ఎలా ఉందంటే? | Earth Could Have An Unknown Fifth Shell That Could Clear Up Mysteries | Sakshi
Sakshi News home page

భూమికి నాలుగు పొరలే కాదు.. ఐదో పొర కూడా! దాని ఆకృతి ఎలా ఉందంటే?

Published Fri, Feb 24 2023 4:24 AM | Last Updated on Fri, Feb 24 2023 11:00 AM

Earth Could Have An Unknown Fifth Shell That Could Clear Up Mysteries - Sakshi

అశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహమూ ఉన్నట్టుగా, భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పొర ఉందట! భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగుచూసిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు..

భూమి తాలూకు ఇన్నర్‌ కోర్‌ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్దకాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్‌ స్కేల్‌పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు.

చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. ఇన్నర్‌ కోర్‌ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి. మరింత సమాచారం కోసం ఆ తరంగాల ప్రయాణ సమయాల్లో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయట పడిందని చెబుతున్నారు!

ఇది భూమి లోలోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్‌ కోర్‌ తాలూకు కేంద్ర స్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి ‘అత్యంత లోపలి ఇన్నర్‌ కోర్‌’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూ కేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన సమాచారం వెలుగుచూడొచ్చని చెబుతున్నారు. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. 

20 ఏళ్ల కిందే సూత్రీకరించినా.. 
నిజానికి భూమి లోలోతుల్లో ఇలాంటి ఒక లోహపు గోళం ఉందని 20 ఏళ్ల కిందే సైంటిస్టులు అంచనా వేశారు. బహుశా అది ఇన్నర్‌ కోర్‌ తాలూకు లోలోతుల్లో దాగుండవచ్చని సూత్రీకరించినట్టు ఏఎన్‌యూ తాలూకు రీసెర్చ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌లో పని చేస్తున్న డాక్టర్‌ థాన్సన్‌ వివరించారు. ఇప్పుడు దానికి సంబంధించి తిరుగులేని రుజువులు లభించడం తమను ఆశ్చర్యానందాలకు లోను చేస్తోందన్నారు. మనకిప్పటిదాకా తెలిసిన భూమి తాలూకు నాలుగు పొరలు క్రస్ట్, మాంటెల్, ఔటర్‌ కోర్, ఇన్నర్‌ కోర్‌.

ఇలా వెలుగు చూసింది 
భూకంపం సంభవించినప్పుడు దాని తరంగాలు భూ కేంద్రకం గుండా సరిగ్గా భూమి అవతలి వైపు దూసుకెళ్తాయి. అనంతరం వెనుదిరిగి భూకంప కేంద్రం వద్దకు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో అలస్కాలో సంభవించిన ఓ భూకంపాన్ని పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. దాని తాలూకు తరంగాలు దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రం గుండా భూమి అవతలి వైపునకు చొచ్చుకుపోయి తిరిగి అలస్కాలోని భూకంప కేంద్రం వద్దకు చేరుకున్నాయి.

ఈ తరంగాల ప్రయాణ మార్గాన్ని లోతుగా పరిశీలించే క్రమంలో ఇన్నర్‌ కోర్‌లోని ఐదో లోహపు పొర ఉనికి తొలిసారిగా వెలుగు చూసిందని పరిశోధక బృందం తాజాగా వివరించింది. ‘‘ఈ భూకంప తరంగాల ప్రయాణ ధోరణిని నిశితంగా గమనించాం. అవి దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్ర అంతర్భాగం నుంచి అలస్కా వైపు తిరిగొచ్చే క్రమంలో ఐదు చోట్ల నిర్దిష్ట ప్రతిస్పందనలు వెలువరిస్తూ ప్రయాణించినట్టు తేలింది. అలా ఐదో పొర ఉనికి బయట పడింది. ఇది వాస్తమేనని పలు ఇతర భూకంపాల తాలూకు తరంగాల ప్రయాణ ధోరణులను పరిశీలించిన మీదట నిర్ధారణ అయింది’ అని చెప్పుకొచ్చింది. 

ఐదో పొర కూర్పు 
ఇన్నర్‌ కోర్‌ లోతుల్లో ఉన్న ఐదో పొర ఇనుము–నికెల్‌ లోహ మిశ్రమంతో కూడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఇన్నర్‌ కోర్‌లోని పదార్థాల గుండా భూకంప తరంగాలు ఎలా దూసుకెళ్తాయో, నెమ్మదిస్తాయో వివరంగా తెలుసుకునే అనిసోట్రోఫీ ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్టు వారు వివరించారు. ‘ఈ తరంగాలు భూ కేంద్రం సమీపంలోని పలు ప్రాంతాలను భిన్న కోణాల్లో పదేపదే స్పృశించాయి. ఇన్నర్‌ కోర్‌ లోపలి ఘనాకృతి బయటి పొరతో పోలిస్తే భిన్నంగా ఉండొచ్చు. భూమి ఆవిర్భావ సమయంలో జరిగిన పరిణామాల వల్ల ఇన్నర్‌ కోర్‌లో ఈ ఘనాకృతి రూపుదిద్దుకుని ఉంటుంది’ అని భావిస్తున్నారు. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement