గోరుముద్దలు తింటున్నప్పుడే ఆకాశంలో చందమామను అందుకోవాలన్న ఆరాటం మనిషిది. అలా అందుకోవాలంటే దగ్గరవ్వాలి. అందుకే అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్ షిప్పులతో ప్రయాణాలు. అలాగాకుండా భూమ్మీద నుంచే చూస్తే.. చందమామ ఎవరికి దగ్గరో తెలుసా? ఏయే దేశాల వారికి దగ్గరగా ఉంటాడో తెలుసా? అసలు అంతరిక్షానికి భూమ్మీద దగ్గరి ప్రాంతమేంటో ఐడియా ఉందా? చందమామపైకి ఇస్రో తాజా ప్రయోగం నేపథ్యంలో ఈ వింతైన విశేషాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్
ఎవరెస్ట్ ఎత్తయినదే.. అయినా..
భూమ్మీద ఏ ప్రాంతం చంద్రుడికి దగ్గరగా ఉంటుందనే ప్రశ్నకు.. ఎవరెస్ట్ శిఖరమే అయి ఉంటుందని చాలా మంది అంచనా వేస్తుంటారు. ఎందుకంటే భూమిపై ఎత్తయిన ప్రాంతం అదేకదా అంటారు. కానీ ఇది కొంత వరకే నిజం.. హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరం భూమి ఉపరితలంపైన మాత్రమే ఎత్తయినవి. భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన ప్రాంతాలూ ఉన్నాయి మరి. అవే చందమామకు, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయి.
భూమి ఆకృతి ఎఫెక్ట్
మన భూమి అచ్చంగా గోళాకారంలో ఉండదు. ధ్రువ ప్రాంతాల వద్ద కాస్త నొక్కినట్టుగా, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉబ్బెత్తుగా.. కాస్త దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. భూమి భ్రమణ వేగం, సూర్యుడి గురుత్వాకర్షణ వంటివే దీనికి కారణం. ఈ కారణం వల్లే భూమి మధ్యభాగం నుంచి చూస్తే.. ధ్రువ ప్రాంతాలు దగ్గరగా, భూమధ్యరేఖ ప్రాంతాలు దూరంగా ఉంటాయి. దీనికితోడు భూమిపైపొరల్లోని హెచ్చుతగ్గులు కూడా భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ.
చంద్రుడికి దగ్గరున్నది ‘మౌంట్ చింబోరాజో’
స్పేస్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదన్న దానిపై అమెరికాకు చెందిన జోసెఫ్ సెన్నె అనే ఇంజనీర్, న్యూయార్క్‌లోని హెడెన్ ప్లానెటోరియం డైరెక్టర్ నీల్ డెగ్రాస్ టైసన్ కలసి అధ్యయనం చేశారు. లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఈక్వెడార్ దేశం పరిధిలోకి వచ్చే ‘మౌంట్ చింబోరాజో’శిఖరం చంద్రుడికి దగ్గర అని తేల్చారు.
దక్షిణ అమెరికా ఖండంలో సుమారు ఏడు దేశాల్లో ఆండీస్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అందులో భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ఈక్వెడార్ పరిధిలో ‘మౌంట్ చింబోరాజో’శిఖరం ఉంది.
ఎవరెస్ట్ ఎత్తు సముద్ర మట్టం నుంచి 8,848 మీటర్లు, అదే చింబోరాజో శిఖరం ఎత్తు 6,268 మీటర్లు మాత్రమే. కానీ ఎవరెస్ట్‌తో పోలిస్తే.. చింబోరాజో చంద్రుడికి 2.4 కిలోమీటర్లు సమీపంలో ఉన్నట్టేనని నిపుణులు లెక్క తేల్చారు.
ఈ దేశాలు కూడా ‘స్పేస్’కు దగ్గర
చిన్న ప్రాంతాల వారీగా కాకుండా దేశాల వారీగా చూస్తే.. ఈక్వెడార్, కెన్యా, టాంజానియా, ఇండోనేసియా వంటివి భూమ్మీద మిగతా దేశాల కన్నా చంద్రుడికి, స్పేస్‌కు దగ్గరగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరిగ్గా భూమి మధ్య నుంచి చూస్తే.. భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ప్రాంతం ఉబ్బెత్తుగా ఉంటుందని, ఈ దేశాలన్నీ ఆ ప్రాంతంలోనే ఉన్నాయని వివరిస్తున్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే.. ఈ దేశాల్లోని జనం చంద్రుడికి సుమారు 21 కిలోమీటర్లు (13 మైళ్లు) దగ్గరగా ఉన్నట్టేనని పేర్కొంటున్నారు.
♦ భూమిపై సముద్ర మట్టం కంటే పైన భాగాల్లో అత్యంత ఎత్తయినది ‘ఎవరెస్ట్’శిఖరమే అన్నది సుస్పష్టం. కానీ సముద్రాలు, భూభాగాలు అన్నింటినీ కలిపి చూస్తే.. భూమ్మీద అతి ఎత్తయిన శిఖరం అమెరికాలోని హవాయ్ దీవుల్లో భాగమైన ‘మౌనాకీ’అగ్నిపర్వత శిఖరమే.
♦ సముద్ర మట్టంపైన మౌనాకీ ఎత్తు 4,205 మీటర్లే. కానీ సముద్రం లోపల మరో 6,000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. అంటే సముద్ర గర్భం నుంచీ చూస్తే.. మౌనాకీ మొత్తం ఎత్తు 10,205 మీటర్లపైనే. అంటే ఎవరెస్ట్ కన్నా సుమారు 1,350 మీటర్లు ఎత్తు ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment