చంద్రుడు మన మామ కాదా? | Scientists Bring A New Theory On The Moon, Earth Captured The Moon From Binary System | Sakshi
Sakshi News home page

చంద్రుడు మన మామ కాదా?

Published Sun, Nov 17 2024 5:16 AM | Last Updated on Sun, Nov 17 2024 11:01 AM

Scientists bring a new theory on the moon

ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా? 

తెరపైకి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు 

ఓ ‘బైనరీ గ్రహాల జంట’ నుంచి  చందమామను భూగురుత్వాకర్షణ

శక్తి లాక్కుందని చెబుతున్న వైనం 

మన సౌర కుటుంబంలో అలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగినట్లు వెల్లడి 

భూమి టైడల్‌ ఫోర్స్‌ వల్ల మెల్లగా దీర్ఘవృత్తాకార కక్ష్య నుంచి వృత్తాకార కక్ష్యకు చేరినట్లు వివరణ 

‘చందమామ రావే.. జాబిల్లి రావే..’, ‘మామా.. చందమామా..’ అని పాటలున్నాయి. ‘కార్తీక పున్నమి వేళలోనా..’ అంటూ గీతాలూ ఉన్నాయి.. చంద్రుడి వెన్నెల తగలగానే రూపమే మారిపోయే జానపద కథలు మరెన్నో ఉన్నాయి.. ఏ దేశం, ఏ సంస్కృతి అనే తేడా లేకుండా చంద్రుడు మనందరికీ అంత దగ్గరైపోయాడు. కానీ చంద్రుడు మనవాడు కాదని, అంతరిక్షంలో తిరుగుతూ ఉంటే.. భూమి లాగేసి పట్టేసుకుందని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. దీన్ని బలపర్చే పలు ఆధారాలనూ చూపుతున్నారు. చంద్రుడు ఎక్కడివాడు? భూమికి ఎలా దొరికిపోయాడు? ఆ సిద్ధాంతం ఏం చెబుతోంది? దానికి ప్రాతిపదిక ఏమిటనే వివరాలు తెలుసుకుందామా..

భూమి నుంచి ఏర్పడిందనే అంచనాతో..
చందమామ మన భూమి నుంచే ఏర్పడిందనేది ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతం. దాని ప్రకారం.. సూర్యుడు, ఇతర గ్రహాలు ఏర్పడిన కొత్తలో.. అంగారకుడి పరిమాణంలో ఉన్న ‘థియా’అనే గ్రహం భూమిని ఢీకొట్టిందని, అప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి విసిరివేయబడిన శకలాలు ఒకచోట చేరి చంద్రుడు రూపుదిద్దుకున్నాడు. 

భూమి గురుత్వాకర్షణ వల్ల గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిద్ధాంతాన్ని అందరూ విశ్వసిస్తున్నా.. ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఓ ‘బైనరీ గ్రహాల జంట’లో భాగమైన చంద్రుడిని భూమి లాగేసుకుని ఉంటుందని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా?
చందమామ మిస్టరీలు ఎన్నో..
నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపై నుంచి తెచ్చిన సుమారు 363 కిలోల రాళ్లు, మట్టిపై పరిశోధనలు చేశారు. ఆ రాళ్లు, మట్టిలో ఉన్న రసాయన సమ్మేళనాలలో కొన్ని భూమ్మీది తరహాలోనే ఉండగా.. మరికొన్ని చాలా విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. భూమి నుంచే చంద్రుడు ఏర్పడితే.. ఆ రసాయన సమ్మేళనాలు ఎక్కడివనే సందేహాలు ఉన్నాయి.  మరో గ్రహం భూమిని ఢీకొట్టడంతో అంతరిక్షంలోకి ఎగిసిపడిన పదార్థాలన్నీ కాలక్రమేణా ఒకచోటికి చేరి చంద్రుడు ఏర్పడినట్టు పాత సిద్ధాంతం చెబుతోంది. 

కానీ అలా ఎగసిపడిన పదార్థాలు.. శని చుట్టూ ఉన్న వలయాల తరహాలో భూమి మధ్య భాగానికి ఎగువన (భూమధ్య రేఖ ప్రాంతంలో) కేంద్రీకృతం కావాలని... అవన్నీ కలిసిపోయినప్పుడు చంద్రుడు కూడా భూ మధ్య రేఖకు ఎగువనే ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చంద్రుడు భూమధ్య రేఖ కన్నా ఏడు డిగ్రీలు ఎగువన, వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. 

మరో తోడు నుంచి చంద్రుడిని లాగేసుకుని.. 
సౌర కుటుంబంలో, అంతరిక్షంలో అక్కడక్కడా ‘బైనరీ’ వ్యవస్థలు ఉంటాయి. అంటే కొంచెం అటూ ఇటుగా సమాన పరిమాణం ఉన్న ఖగోళ పదార్థాలు (ఆస్టరాయిడ్లు, గ్రహాల వంటివి..) రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. 

అదే సమయంలో ఆ రెండూ కలసి.. ఏదైనా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అ­లాంటి బైనరీ వ్యవస్థలో చంద్రుడు భాగ­మని కొత్త సిద్ధాంతం చెబుతోంది. ఆ బైనరీ మరుగుజ్జు గ్రహాలు భూమికి సమీ పం నుంచి వెళ్లినప్పుడు.. అందులోని చంద్రుడిని భూమి గురుత్వాకర్షణ శక్తితో లాగే­సుకుందని, రెండో మరుగుజ్జు గ్రహం అంతరిక్షంలోకి విసిరివేయబడిందని పేర్కొంటోంది. 

అలా లాగేసుకోవడం సాధ్యమేనా? 
విశ్వంలో బైనరీ వ్యవస్థలు ఉండటం, అప్పుడప్పుడూ అలాంటి వాటిలోంచి ఒకదానిని పెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటివి లాక్కోవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దీనికి ‘బైనరీ ఎక్సే్ఛంజ్‌ క్యాప్చర్‌’గా పేరుపెట్టారు. ఇలా బైనరీ వ్యవస్థ నుంచి ఒకదాన్ని లాక్కున్నప్పుడు.. రెండో గ్రహం/ఆస్టరాయిడ్‌ వేగంగా విసిరివేసినట్టుగా వెళ్లిపోతుంది.

నెప్ట్యూన్‌ ఉపగ్రహం ట్రిటాన్‌.. అలా లాగేసుకున్నదే! 
మన సౌర కుటుంబంలోనే అలాంటివి ఎన్నోసార్లు జరిగాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డారెన్‌ విలియమ్స్‌ తెలిపారు. ‘‘ఉదాహరణకు నెప్ట్యూన్‌ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో అతిపెద్దదైన ‘ట్రిటాన్‌’కూడా ఒకప్పుడు బైనరీ వ్యవస్థలో భాగమే. నెప్ట్యూన్‌ తనకు దగ్గరగా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు.. ట్రిటాన్‌ను లాగేసుకుందని ఇప్పటికే గుర్తించారు. 

అంతేకాదు ట్రిటాన్‌ ఉపగ్రహం నెప్ట్యూన్‌ చుట్టూ.. దాని మధ్యరేఖ ఎగువన కాకుండా, 67 డిగ్రీలు వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. మన చంద్రుడు కూడా అలా వంపు తిరిగిన కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నాడు. చంద్రుడిని భూమి లాగేసుకుందనే దానికి ఇదొక ఆధారం..’’అని డారెన్‌ విలియమ్స్‌ వెల్లడించారు. 

కొత్త సిద్ధాంతం సందేహాలను తీర్చుతోందా? 
‘‘బైనరీ వ్యవస్థ నుంచి లాగేసుకున్న గ్రహాలు/ ఆస్టరాయిడ్లు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగాలి.. లాక్కున్న గ్రహం నుంచి మెల్లగా దూరంకావాలి.. అనే రూల్స్‌ కూడా ఉన్నాయి. వాటిని మా సిద్ధాంతం బలపరుస్తోంది..’’అని శాస్త్రవేత్త విలియమ్స్‌ తెలిపారు.

మొదట్లో చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరిగేవాడని.. అయితే భూమి టైడల్‌ ఫోర్స్‌ వల్ల మెల్లగా వృత్తాకార కక్ష్యకు చేరాడని వివరించారు. ఆ ఫోర్స్‌ వల్లే చంద్రుడి ఒకవైపు భాగం ఎప్పుడూ భూమివైపే ఉండేలా..‘టైడల్‌ లాక్‌’అయిందని తెలిపారు. అంతేకాదు చంద్రుడు సగటున ఏటా మూడు సెంటీమీటర్ల మేర భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడని గుర్తు చేశారు. 

ఎవరేం సిద్ధాంతాలు తెస్తేనేం? ఎప్పుడో కోట్ల ఏళ్లనాటి మాట అది. ఏది కరెక్టో, ఏదికాదో కాదుగానీ.. మనుషులు పుట్టేనాటికే చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. అంటే మన మామ చందమామే!

– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement