Theories
-
చంద్రుడు మన మామ కాదా?
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’, ‘మామా.. చందమామా..’ అని పాటలున్నాయి. ‘కార్తీక పున్నమి వేళలోనా..’ అంటూ గీతాలూ ఉన్నాయి.. చంద్రుడి వెన్నెల తగలగానే రూపమే మారిపోయే జానపద కథలు మరెన్నో ఉన్నాయి.. ఏ దేశం, ఏ సంస్కృతి అనే తేడా లేకుండా చంద్రుడు మనందరికీ అంత దగ్గరైపోయాడు. కానీ చంద్రుడు మనవాడు కాదని, అంతరిక్షంలో తిరుగుతూ ఉంటే.. భూమి లాగేసి పట్టేసుకుందని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. దీన్ని బలపర్చే పలు ఆధారాలనూ చూపుతున్నారు. చంద్రుడు ఎక్కడివాడు? భూమికి ఎలా దొరికిపోయాడు? ఆ సిద్ధాంతం ఏం చెబుతోంది? దానికి ప్రాతిపదిక ఏమిటనే వివరాలు తెలుసుకుందామా..భూమి నుంచి ఏర్పడిందనే అంచనాతో..చందమామ మన భూమి నుంచే ఏర్పడిందనేది ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతం. దాని ప్రకారం.. సూర్యుడు, ఇతర గ్రహాలు ఏర్పడిన కొత్తలో.. అంగారకుడి పరిమాణంలో ఉన్న ‘థియా’అనే గ్రహం భూమిని ఢీకొట్టిందని, అప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి విసిరివేయబడిన శకలాలు ఒకచోట చేరి చంద్రుడు రూపుదిద్దుకున్నాడు. భూమి గురుత్వాకర్షణ వల్ల గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిద్ధాంతాన్ని అందరూ విశ్వసిస్తున్నా.. ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఓ ‘బైనరీ గ్రహాల జంట’లో భాగమైన చంద్రుడిని భూమి లాగేసుకుని ఉంటుందని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా?చందమామ మిస్టరీలు ఎన్నో..నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపై నుంచి తెచ్చిన సుమారు 363 కిలోల రాళ్లు, మట్టిపై పరిశోధనలు చేశారు. ఆ రాళ్లు, మట్టిలో ఉన్న రసాయన సమ్మేళనాలలో కొన్ని భూమ్మీది తరహాలోనే ఉండగా.. మరికొన్ని చాలా విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. భూమి నుంచే చంద్రుడు ఏర్పడితే.. ఆ రసాయన సమ్మేళనాలు ఎక్కడివనే సందేహాలు ఉన్నాయి. మరో గ్రహం భూమిని ఢీకొట్టడంతో అంతరిక్షంలోకి ఎగిసిపడిన పదార్థాలన్నీ కాలక్రమేణా ఒకచోటికి చేరి చంద్రుడు ఏర్పడినట్టు పాత సిద్ధాంతం చెబుతోంది. కానీ అలా ఎగసిపడిన పదార్థాలు.. శని చుట్టూ ఉన్న వలయాల తరహాలో భూమి మధ్య భాగానికి ఎగువన (భూమధ్య రేఖ ప్రాంతంలో) కేంద్రీకృతం కావాలని... అవన్నీ కలిసిపోయినప్పుడు చంద్రుడు కూడా భూ మధ్య రేఖకు ఎగువనే ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చంద్రుడు భూమధ్య రేఖ కన్నా ఏడు డిగ్రీలు ఎగువన, వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. మరో తోడు నుంచి చంద్రుడిని లాగేసుకుని.. సౌర కుటుంబంలో, అంతరిక్షంలో అక్కడక్కడా ‘బైనరీ’ వ్యవస్థలు ఉంటాయి. అంటే కొంచెం అటూ ఇటుగా సమాన పరిమాణం ఉన్న ఖగోళ పదార్థాలు (ఆస్టరాయిడ్లు, గ్రహాల వంటివి..) రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఆ రెండూ కలసి.. ఏదైనా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అలాంటి బైనరీ వ్యవస్థలో చంద్రుడు భాగమని కొత్త సిద్ధాంతం చెబుతోంది. ఆ బైనరీ మరుగుజ్జు గ్రహాలు భూమికి సమీ పం నుంచి వెళ్లినప్పుడు.. అందులోని చంద్రుడిని భూమి గురుత్వాకర్షణ శక్తితో లాగేసుకుందని, రెండో మరుగుజ్జు గ్రహం అంతరిక్షంలోకి విసిరివేయబడిందని పేర్కొంటోంది. అలా లాగేసుకోవడం సాధ్యమేనా? విశ్వంలో బైనరీ వ్యవస్థలు ఉండటం, అప్పుడప్పుడూ అలాంటి వాటిలోంచి ఒకదానిని పెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటివి లాక్కోవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దీనికి ‘బైనరీ ఎక్సే్ఛంజ్ క్యాప్చర్’గా పేరుపెట్టారు. ఇలా బైనరీ వ్యవస్థ నుంచి ఒకదాన్ని లాక్కున్నప్పుడు.. రెండో గ్రహం/ఆస్టరాయిడ్ వేగంగా విసిరివేసినట్టుగా వెళ్లిపోతుంది.నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్.. అలా లాగేసుకున్నదే! మన సౌర కుటుంబంలోనే అలాంటివి ఎన్నోసార్లు జరిగాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డారెన్ విలియమ్స్ తెలిపారు. ‘‘ఉదాహరణకు నెప్ట్యూన్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో అతిపెద్దదైన ‘ట్రిటాన్’కూడా ఒకప్పుడు బైనరీ వ్యవస్థలో భాగమే. నెప్ట్యూన్ తనకు దగ్గరగా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు.. ట్రిటాన్ను లాగేసుకుందని ఇప్పటికే గుర్తించారు. అంతేకాదు ట్రిటాన్ ఉపగ్రహం నెప్ట్యూన్ చుట్టూ.. దాని మధ్యరేఖ ఎగువన కాకుండా, 67 డిగ్రీలు వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. మన చంద్రుడు కూడా అలా వంపు తిరిగిన కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నాడు. చంద్రుడిని భూమి లాగేసుకుందనే దానికి ఇదొక ఆధారం..’’అని డారెన్ విలియమ్స్ వెల్లడించారు. కొత్త సిద్ధాంతం సందేహాలను తీర్చుతోందా? ‘‘బైనరీ వ్యవస్థ నుంచి లాగేసుకున్న గ్రహాలు/ ఆస్టరాయిడ్లు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగాలి.. లాక్కున్న గ్రహం నుంచి మెల్లగా దూరంకావాలి.. అనే రూల్స్ కూడా ఉన్నాయి. వాటిని మా సిద్ధాంతం బలపరుస్తోంది..’’అని శాస్త్రవేత్త విలియమ్స్ తెలిపారు.మొదట్లో చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరిగేవాడని.. అయితే భూమి టైడల్ ఫోర్స్ వల్ల మెల్లగా వృత్తాకార కక్ష్యకు చేరాడని వివరించారు. ఆ ఫోర్స్ వల్లే చంద్రుడి ఒకవైపు భాగం ఎప్పుడూ భూమివైపే ఉండేలా..‘టైడల్ లాక్’అయిందని తెలిపారు. అంతేకాదు చంద్రుడు సగటున ఏటా మూడు సెంటీమీటర్ల మేర భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడని గుర్తు చేశారు. ఎవరేం సిద్ధాంతాలు తెస్తేనేం? ఎప్పుడో కోట్ల ఏళ్లనాటి మాట అది. ఏది కరెక్టో, ఏదికాదో కాదుగానీ.. మనుషులు పుట్టేనాటికే చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. అంటే మన మామ చందమామే!– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
WHO: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!
చైనా ల్యాబ్ లీక్ కారణంగా కరోనా వచ్చిదంటూ యూఎస్ వాదిస్తుండగా.. అవాస్తవం అని చైనా పదే పదే తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మూలాలు గురించి మీకు తెలిసిందే చెప్పండని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అన్ని దేశాలను కోరింది. 2019లో చైనాలో వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. లక్షల్లో మరణాలు సంభవించగా, దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టుకునే పరిస్థితకి దారితీసింది కూడా. ఈ కారణాల రీత్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారి పుట్టుక గురించి బహిర్గతం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాదు దీని గురించి అంతర్జాతీయ దేశాలతో పంచుకోవడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇప్పడు నిందలు వేసుకోవడం ముఖ్యం కాదని, ఈ మహమ్మారి ఎల ప్రారంభమైంది అనేదానిపై అవగాహన పెంచుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులను నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈ కోవిడ్-19 మూలాన్ని గుర్తించడానికి సంబంధించిన ఏ చిన్న ప్రణాళికను డబ్ల్యూహెచ్ఓ వదిలిపెట్టలేదని నొక్కి చెప్పారు. ఈ విషయంలో వాస్తవాలు కావాలి 2021లో యూఎన్ ఈ మహమ్మారి మూలం తెలుసుకోవడానికి సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్(ఎస్‌ఏజీఓ) గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన డేటాను చైనా పంచుకోవాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించమని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అలాగే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఈ విషయమై చైనా అగ్రనాయకులతో పలుమార్లు చర్చించినట్లు కూడా తెలిపారు. ఇలాంటి విషయాలను రాజకీయాలు చేయొద్దని అది పరిశోధనలను కష్టతరం చేస్తుంది, ఫలితంగా ప్రపంచ సురక్షితంగా ఉండదని చెప్పారు. ఇటీవలే యూఎస్‌లోని ప్రముఖ ఎనర్జీ డిపార్ట్‌మెట్ కరోనా మూలానికి వ్యూహాన్ ల్యాబ్ లీకే ఎక్కువగా కారణమని నివేదిక కూడా ఇచ్చింది. అదీగాక ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లోనే అత్యున్నత అధికారులు ఉండటంతో ఈ నివేదిక ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు డబ్ల్యూహెచ్ఓలోని అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ..ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు, దీర్ఘకాల కోవిడ్‌తో జీవిస్తున్న వారి కోసం ఇదేలా ప్రారంభమైందనేది తెలుసుకోవడం నైతికంగా అత్యంత ముఖ్యం. శాస్త్రీయ అధ్యయనంలో ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడటానికి ఈ సమాచారం పంచుకోవడం అత్యంత కీలకం అని అన్నారు. -
సిద్ధాంతాల కోసం పోరాడిన అంబేద్కర్
గుంటూరు ఎడ్యుకేషన్ సమాజంలో పాతుకుపోయిన అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడారని దళిత ఉద్యమనేత డాక్టర్ కత్తి పద్మారావు కొనియాడారు. స్థానిక ఏసీ కళాశాలలోని జేడీ శీలం సెమినార్ హాల్లో ఆదివారం దళిత ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. ముత్యం అధ్యక్షతన జరిగిన సభలో కత్తి పద్మారావు మాట్లాడుతూ కుల, మత, వర్గాలతో నిండిపోయిన సమాజాన్ని మార్చగల ఆయుధం ఒక్క విద్య మాత్రమేనని గాఢంగా నమ్మిన అంబేద్కర్ ఉన్నత చదువులతో అంతులేని విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారని చెప్పారు. రాజ్యంగాన్ని రూపొందించేందుకు నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అంబేద్కర్‌ను మించిన మేధావి మరొకరు కనపించలేదన్నారు. దళితులు విద్యావంతులుగా ఎదిగినప్పుడే సమాజం వారిని గుర్తిస్తుందని చెప్పారు. ప్రపంచం మొత్తం కార్లమార్క్స్ సిద్ధాంతాలను ప్రమాణికంగా తీసుకుని ముందుకెళ్తున్న సమయంలో అంబేద్కర్ 22 ఏళ్ల వయసులో కుల వ్యవస్థ నిర్మూలనపై రాసిన సిద్ధాంత గ్రంథం ప్రపంచం దృష్టిని భారతదేశం వైపు మరల్చిందన్నారు. కుల, మతాలు లేని నవ భారత నిర్మాణం కోసం అధ్యాపకులు కృషి చేసి విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య జార్జ్ విక్టర్ మాట్లాడుతూ దళితులు తమ హక్కులను పోరాడి సాధించుకున్నప్పుడే రాజ్యాధికారాన్ని సైతం కైవసం చేసుకోగలరని చెప్పారు. దళితులు కేవలం హక్కుల గురించే గాక దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. వైజాగ్‌లోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పసల సుధాకర్ మాట్లాడుతూ సామాజిక, మానవీయ శాస్త్రాల అధ్యయనంతోనే దళితులు విశాల దృక్పథాన్ని అలవర్చుకోగలరన్నారు. ఉన్నత విద్యతో పాటు న్యాయ శాస్త్రంలో పట్టభద్రులుగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ప్రకాష్, ఎయిడెడ్ అధ్యాపకులు పాల్గొన్నారు. -
సంతోషమే జీవితప్రయోజనం!
గ్రంథపు చెక్క మానవులందు జ్ఞానము అంకురించినది మొదలు ‘‘నేను ఎవ్వడను? ఎచ్చట నుండి వచ్చితిని? ఎచ్చటికి పోవుచున్నాను? మరణమే నా స్థితికి అంత్యమా లేక మరనంతర జీవితము కలదా? మానవకోటి యందు ఇట్టి వివిధత్వమునకు కారణములేమి? సృష్టికర్త ఉన్నాడా? ఉండిన యే ఉద్దేశముతో ఇట్టి విచిత్రమైన సృష్టిని గావించు చున్నాడు. ఒకడు సుఖింపనేల, మరి యొకడు దుఃఖింపనేల? ఇట్టి ప్రశ్నలు, విచారములు, సంశయములు పొటమరించు చుండెను. నాటి నుండి నేటి వరకు ఇట్టి ప్రశ్నలడుగబడుచున్నవి. ఒక్కొక్క దేశమున ఒక్కొక్కకాలమున ఒక్కొక్క మతము ఇటువంటి సమస్యల చిక్కు విడదీయ ప్రయత్నించినది. తన పుట్టు పూర్వోత్తరములు తెలిసికొను ఇచ్చ ప్రతి మానవునకును సహజముగ నుండును. ఇట్టి విషయములనే ఖయ్యాము తన రుబాయతులలో చర్చించియున్నాడు. పాశ్చాత్యవిమర్శకులు కొందరు ఖయ్యామును ఎపిక్యుర్ అని పేర్కొనిరి. వాడుకలో ఎపిక్యుర్ అనగా పరచింతన లేని భోగలాలసుడు. ఎపిక్యురస్ సిద్ధాంతములు ఒకటి రెండు విషయములలో తప్ప ఖయ్యాము నమ్మకముల కంటే భిన్నముగా ఉండును. ‘‘శరీరం భౌతికం. ఆత్మ భౌతికమైన సూక్ష్మశరీరం. ఆత్మ దేహమున వ్యాపించి యుండును. దేహముతోడ ఆత్మయు నశించును. మరణాంతర జీవితం లేదు. సంతోషమే జీవిత ప్రయోజనము. విధి యనునది లేదు. మానవుని అదృష్టము తన చేతిలో యున్నది’’ అని ఎపిక్యురస్ చెప్పెను. ఎపిక్యురసు, ఖయ్యాముల భావములు చాలావరకు పరస్పర విరుద్ధములు. ఎపిక్యురసు నిరీశ్వరవాది, ఖయ్యాము ఈశ్వరవాది. అతడు విధి లేదని చెప్పును. ఇతడు మన సుఖదుఃఖములు విధినిర్ణీతములని సిద్ధాంతీకరించును. - దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ నుంచి. (సెప్టెంబర్ 11 దువ్వూరి వర్థంతి) -
వారికి సిద్ధాంతాలు లేవు
విశాఖపట్నం:మావోయిస్టులకు సిద్ధాంతాలు లేవని, ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయారని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ ఒక ప్రకటనలో అన్నారు. ఇప్పటికే మావోయిస్టుల దుశ్చర్యలకు విసిగిపోయిన సాగులు గ్రామస్తులు వారిని తరిమి కొట్టారని పేర్కొన్నారు. గతంలో ఇలాం టి సంఘటనలు అనేకం జరిగాయన్నారు. అయినా వారిలో మార్పు రాలేదన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు పునరాలోచించుకోవాలని,రోడ్లు వేయకుండా అభివృద్ధిని ఏవిధంగా సాధిస్తారోప్రజలకు వివరించాలని ఎస్పీ కోరారు. మంగళవారం రాత్రి ఏపీఎఫ్‌డీసీకి చెం దిన కాఫీ పల్పర్ యూనిట్‌ను, దానికి సంబంధించిన గోడౌన్, యంత్రాలను ధ్వంసం చేయ డం దుర్మార్గమన్నారు. దీంతో అనేక మంది గిరిజనులు ఉపాధి కోల్పోయారన్నారు. ఏజెన్సీ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా మూరుమూల ప్రాంతాలకు రోడ్లు కావాలన్నారు. అప్పుడేవిద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పండించే, సేకరించే పంటలను మైదానానికి తీసుకువెళ్లి గిట్టుబాటు ధరకు అమ్ముకునే వీలు కలుగుతుందన్నారు. ఇంత చిన్న అంశం మావోయిస్టులకు అర్థం కాదా అని ఎస్పీ ప్రశ్నించారు. మావోయిస్టుల చర్యలను గిరిజన యువతీయువకులు, విద్యార్థులు, వివిధ వ్యాపార వర్గాలతోపాటు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు.