వారికి సిద్ధాంతాలు లేవు
విశాఖపట్నం:మావోయిస్టులకు సిద్ధాంతాలు లేవని, ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయారని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ ఒక ప్రకటనలో అన్నారు. ఇప్పటికే మావోయిస్టుల దుశ్చర్యలకు విసిగిపోయిన సాగులు గ్రామస్తులు వారిని తరిమి కొట్టారని పేర్కొన్నారు. గతంలో ఇలాం టి సంఘటనలు అనేకం జరిగాయన్నారు. అయినా వారిలో మార్పు రాలేదన్నారు.
ఇప్పటికైనా మావోయిస్టులు పునరాలోచించుకోవాలని,రోడ్లు వేయకుండా అభివృద్ధిని ఏవిధంగా సాధిస్తారోప్రజలకు వివరించాలని ఎస్పీ కోరారు. మంగళవారం రాత్రి ఏపీఎఫ్‌డీసీకి చెం దిన కాఫీ పల్పర్ యూనిట్‌ను, దానికి సంబంధించిన గోడౌన్, యంత్రాలను ధ్వంసం చేయ డం దుర్మార్గమన్నారు. దీంతో అనేక మంది గిరిజనులు ఉపాధి కోల్పోయారన్నారు. ఏజెన్సీ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా మూరుమూల ప్రాంతాలకు రోడ్లు కావాలన్నారు. అప్పుడేవిద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
పండించే, సేకరించే పంటలను మైదానానికి తీసుకువెళ్లి గిట్టుబాటు ధరకు అమ్ముకునే వీలు కలుగుతుందన్నారు. ఇంత చిన్న అంశం మావోయిస్టులకు అర్థం కాదా అని ఎస్పీ ప్రశ్నించారు. మావోయిస్టుల చర్యలను గిరిజన యువతీయువకులు, విద్యార్థులు, వివిధ వ్యాపార వర్గాలతోపాటు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు.