ఎన్నికలకు పటిష్ట భద్రత
విశాఖపట్నం, న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతం గా నిర్వహించేందుకు మునుపెన్నడు లేనివిధంగా అత్యంత పటిష్టంగా, ప్రణాళికాయుతంగా బందోబస్తు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలలో భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. స్నేహభావంతో పోలీసులు గిరిజనులు చేరువయ్యూరని, మారుమూల గూడేల్లో సద్భావన యూత్రలను పెద్ద ఎత్తున నిర్వహించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించామన్నారు.
ఎన్నికల అవగాహన శిబిరాలలో గిరిజనులు పాల్గొని పోలింగ్‌లో పాలుపంచుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా క్షణాల్లో బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను ఇప్పటికే ఏజెన్సీ అంతటా మొహరించామని తెలిపారు.
మావోయిస్టులు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్న ఎన్నికలపై తప్పుడు ప్రకటనలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. గిరిజన సంక్షేమానికి ఎన్నికలు ఎంతో దోహదపడతాయన్నారు. సమర్ధమైన గిరిజన నాయకులు ప్రజల ముందుకు వస్తారని, వారి ద్వారా మన్యం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అతి తక్కువ సభ్యులు కలిగిన మావోయిస్టులు ముఖ్యంగా నిరక్షరాస్యులు ప్రజలను తమ చేష్టల ద్వారా భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు.
మావోయిస్టుల మాయమాటలు గిరిజనులు వినే స్థితిలో లేరని తెలిపారు. మావోయిస్టులను నమ్ముకుంటే తమ గ్రామాలు అభివృద్ధి చెందవనే విషయూన్ని మన్యం ప్రజలు ఇప్పటికే గ్రహించారన్నారు. ఈ ఎన్నికల్లో గిరిజనం తీర్పు తమకు అనుకూలం కావనే సంకేతాలను మావోయిస్టులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.