అరుణ ,చలపతి
ఆపరేషన్ లివిటిపుట్టులో మావోయిస్టు కీలకనేత చలపతి పాల్గొన్నారా?.. ఆయనే స్వయంగా ఆపరేషన్‌ను పర్యవేక్షించారా??.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. గత నెల 23న జరిగిన ఈ హత్యాకాండలో మహిళా మావోయిస్టు నేత అరుణ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారని.. మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలో చలపతి వ్యూహం రచించినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. అయితే లోతుగా జరిగిన సిట్ విచారణలో చలపతి పాత్ర స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా హత్యాకాండలో పాల్గొనకపోయినా.. దళంతో కలిసి వచ్చి కాస్త దూరంగా ఉండి పర్యవేక్షించారని సమాచారం. మరోవైపు మీడియాను వెంట తీసుకెళితే మావోయిస్టులు దాడికి పాల్పడరన్న వ్యూహంతోనే కిడారి తన కాన్వాయ్ వెంట మీడియా ప్రతినిధులను తీసుకెళ్లినా.. అది ఫలించలేదు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యోదంతంపై సిట్ జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో గత నెల 23న మావో యిస్టులు వారిద్దరినీ దారుణంగా కాల్చిచంపిన ఘటనలోమావోయిస్టు మహిళా నేత అరుణ కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా ఆమె భర్త, మావోయిస్టు కీలక నేత చలపతి కూడా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సిట్ అధికారులు తేల్చారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతో చలపతి దగ్గరుండి ఆపరేషన్ విజయవంతం చేసినట్టు తెలుస్తోంది. కాల్పుల పనిని మహిళా మావోలకు అప్పజెప్పి చలపతి మాత్రం కాస్త దూరంలోనే నిలబడినట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. చలపతి, అరుణల నాయకత్వంలో ఆ రోజు ఉదయమే నందాపూర్ కమిటీకి చెందిన సుమారు 30మంది మావోయిస్టులు లివిటిపుట్టు చేరుకున్నారు. అక్కడకు మరో ముప్‌పై మంది మిలీషియా సభ్యులు చేరుకున్న తర్వాత ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారని అంటున్నారు.
ఏజెన్సీ టీడీపీ నేతలే ఉప్పందించారు..
కిడారికి సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలే మావోలకు ఉప్పందించారని సిట్ అధికారులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చినట్టు తెలుస్తోంది. అయితే కిడారి వెన్నంటి తిరిగిన టీడీపీ నేతలు ఒక్కసారిగా మావోలతో కుమ్మక్కై ఎందుకు పక్కాగా సమాచారం అందించారన్న దానిపై మాత్రం సిట్ అధికారులకు స్పష్టత రాలేదు. వ్యాపార లావాదేవీల్లో అంతర్గత విభేదాలా.. పార్టీ ఫిరాయించిన తర్వాత టీడీపీలోని ఓ వర్గంతో వచ్చిన అంతరాలా.. అన్నది ఇప్పటికీ తేలలేదని అంటున్నారు. మొత్తానికి ఏజెన్సీకి చెందిన, కిడారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన టీడీపీ నేతలే మావోలకు ఎప్పటికప్పుడు ఆయన కదలికలపై సమాచారం ఇచ్చినట్టు మాత్రం సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మీడియా ప్రతినిధుల సాక్షిగానే...
ఆ రోజు కిడారి మీడియా వారిని తన వెంట తీసుకువెళ్లడం వాస్తవమేనని సిట్ తేల్చింది. మీడియా ప్రతినిధులు ఉంటే దాడికి మావోయిస్టులు వెనుకంజ వేస్తారన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కిడారి వారిని వెంటబెట్టుకు వెళ్లారని అంటున్నారు. ఓ ప్రధాన పత్రిక విలేకరితోపాటు ముగ్గురు స్థానిక విలేకరులు ఆయన్ను అనుసరించారని తెలుస్తోంది. ఆయన కారుకు ముందు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు విలేకరులు, కారు వెనుక మరో టూవీలర్‌పై ఇద్దరు విలేకరులు అనుసరించారు. కిడారి వాహనానికి ముందున్న విలేకరులు అక్కడ మావోలు కాపుకాయడం చూసి తమ బండి ఆపకుండా వెళ్ళిపోయారు. కిడారి వాహనం వెనుక అనుసరిస్తున్న ఇద్దరు మీడియా విలేకరులను మాత్రం మావోలు అడ్డగించినట్టు తెలిసింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు వారిని అక్కడే కూర్చోబెట్టి ఆ తర్వాతే వదిలిపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో సిట్ అధికారులు సదరు విలేకరులను విచారించినట్టు తెలిసింది. కాగా, ఆ రోజు ఆపరేషన్‌లో లివిటిపుట్టు గ్రామస్తుల పాత్ర ఏమీ లేదని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు.
సిట్ నివేదికను సర్కారు బయటపెడుతుందా?
స్వయంగా అధికార తెలుగుదేశం నేతలే దగ్గరుండి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను కాల్చి చంపించిన వ్యవహారాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక సిట్ అధికారులు మధనపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ టీడీపీ నేతలు అందించిన సమాచారంతోనే మావోలు పక్కా వ్యూహంతో మెరపుదాడి చేయగలిగారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైంది. అయితే వాస్తవ నివేదిక బయటపెడితే సర్కారు తీరు ఎలా ఉంటుందోనన్న ఆందోళన విచారణ అధికారులను వెంటాడుతోంది. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం విచారణ కొనసాగిస్తామని, ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో సిట్ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment