మావోలకు టీడీపీ నేతల సహకారం.. నిఘా వైఫల్యం | TDP Leaders Helps Maists In Mla Murder Visakhapatnam | Sakshi
Sakshi News home page

మావోలకు టీడీపీ నేతల సహకారం.. నిఘా వైఫల్యం

Published Wed, Oct 3 2018 8:07 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

TDP Leaders Helps Maists In Mla Murder Visakhapatnam - Sakshi

మావోల తూటాలకు బలైన కిడారి, సోమ (ఫైల్‌)

ఇద్దరు ప్రముఖుల హత్యకు స్కెచ్‌ వేశారు.. పలుమార్లు మాటేశారు.. ఇంకెన్నోసార్లు రెక్కీలు చేశారు.. అయినా పోలీస్‌ వ్యవస్థ పసిగట్టలేకపోయింది.. నిఘా వ్యవస్థ నిద్రపోయింది.. సొంత పార్టీ నేతలే ఉప్పందిస్తున్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులూ పట్టుకోలేకపోయాయి..

ఇన్ని వైఫల్యాల ఫలితమే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యాకాండ.. సిట్‌ విచారణలో ఇవే అంశాలు ఒక్కొక్కటిగా నిర్థారణ అవుతున్నాయి.. హత్యాకాండ అనంతరం అరకు, డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్ల విధ్వంసంలోనూ పలువురు మావోయిస్టులు పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

వీటన్నింటికీ మించి.. ఒత్తిడితోనో, బెదిరింపులవల్లో.. ఏ కారణాలతోనో.. టీడీపీ కిందిస్థాయి నేతలే మావోలకు వేగులుగా, ఇన్‌ఫార్మర్లుగా మారి.. తమ అగ్రనేతల కదలికల సమాచారాన్ని మావోలకు చేరవేయడం.. హత్యాకాండ కోసం వచ్చిన దళ సభ్యులకు భోజన, వసతి కల్పించినట్లు తేటతెల్లడం కావడం కలకలం రేపుతోంది.ఈ హత్యల్లో ప్రతిపక్షం కుట్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలను రాజకీయ లబ్ధికోసం చేసినవిగా తేల్చేస్తున్నాయి. 

విశాఖపట్నం : అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు మావోలు పలుమార్లు ప్రయత్నించినా పోలీసులు పసిగట్టలేకపోయారన్న వాదన తెరపైకి వచ్చింది. నాలుగైదుసార్లు ప్రయత్నించిన వారు.. చివరికి లివిటిపుట్టు వద్ద సెప్టెంబర్‌ 23న సాధించగలిగారని అంటున్నారు. అక్కడికి సరిగ్గా రెండు రోజుల ముందు సెప్టెంబర్‌ 21న పెదబయలు మండలం పెదగూడ

పంచాయతీలోని కోయాపల్లిలో కిడారి, సోమలను హతమార్చేందుకు మావోలు మాటు వేశారని.. ఆరోజు కిడారి వచ్చినా, సోమ రాకపోవడంతో  వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అంతకు ముందు బొంగరం సమీపంలోని కుంటమామిడి వద్ద కూడా ప్రయత్నించి విఫలమయ్యారంటున్నారు. బలమైన ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ ఉందని గొప్పగా చెప్పుకునే పోలీసులు వీటిలో ఏ ఒక్కదాన్నీ పసిగట్టలేకపోవడం తలదించుకునేలా చేసింది.  

టీడీపీ నేతల సహకారంతోనే స్కెచ్‌
టీడీపీ సీనియర్‌ నాయకుడు, తూటంగి మాజీ ఎంపీటీసీ యేడెల సుబ్బారావు, అతని భార్యతోపాటు కొందరు కిడారి, సోమ అనుచరులు సహకరించడంతో మావోల పని సులువైంది. వారి సహకారంతోనే స్కెచ్‌ వేసి కిడారి, సోమలను రప్పించేలా లివిటిపుట్టు వద్ద ఉచ్చు పన్ని, మాటు వేశారు. ఈ కేసును విచారిస్తున్న సిట్‌ బృందం ఇదే నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. సుబ్బారావు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. పోతంగి పంచాయతీ అంత్రిగుడకు చెందిన కమల, శోభన్‌ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఘటనకు ముందురోజు(శనివారం) రాత్రి సాధారణ దుస్తుల్లో ఉన్న ఇద్దరు మావోలకు అన్నం పెట్టినట్లు విచారణలో కమల అంగీకరించినట్టు తెలుస్తోంది. శోభన్‌ కూడా ఇదే విషయం విచారణలో చెప్పినట్లు సమాచారం.

వీరితో పాటు తాజాగా మాజీ మావోయిస్టు కామరాజు సోదరుడు, టీడీపీ నాయకుడైన బిసోయి మూర్తి, టీడీపీకే చెందిన తూటంగి దతూర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ కుంతర్ల సుబ్బారావులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. టీడీపీ మాజీ ఎంపీపీ ధనేరావును ఇప్పటికే విచారిస్తున్న పోలీసులు.. మరింత సమాచార సేకరణలో భాగంగా వ్యూహాత్మకంగా అతడ్ని మంగళవారం బయటకు పంపినట్లు చెబుతున్నారు. మరో వైపు లివిటిపుట్టు పరిసర గ్రామాలకు చెందిన సుమారు పదిమందిని అదుపులోకి తీసుకొని విలువైన సమాచారం రాబట్టినట్లు తెలిసింది. వీరిందరిపై కేసులు నమోదు చేసే అవకాశాలుండగా.. అంతా టీడీపీకీ చెందినవారే కావడంతో కేసులు నమోదు చేస్తే ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయోనన్న ఆందోళన సిట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ హత్యాకాండ వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నవేనని తేల్చేస్తున్నాయి.

విధ్వంసంలోనూ మావోలు?
లివిటిపుట్టులో హత్యాకాండ అనంతరం డుంబ్రిగుడ, అరుకు పోలీస్‌ స్టేషన్లపై జరిగిన దాడి, దహనంలోనూ మావోల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్‌ దుస్తుల్లో కొంతమంది మావోలు ఆందోళనకారులతో కలిసిపోయి పోలీస్‌స్టేçషన్లపై దాడికి ఆజ్యం పోశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూతవేటు దూరంలోనే అరుకు పోలీసులు, ఏపీఎస్‌పీ బలగాలు ఉన్నప్పటికీ ఆందోళనకారుల్లో కలిసి ఉన్నారన్న భయంతోనే ముందడుగు వేయలేకపోయారంటునారు. విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మావోలు కాల్పులకు దిగడం లేదా బాంబులు వేసే ప్రమాదముందని, అదే జరిగితే భారీగా ప్రాణనష్టం వాటిల్లే ముప్పును గుర్తించే వెనకడుకు వేయాల్సి వచ్చిందని ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

మరోపక్క కిడారి, సోమలు హత్యకు గురైన విషయం క్షణాల్లోనే మీడియా ద్వారా పోలీస్‌ ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ వారు సకాలంలో స్పందించకపోవడం వల్లే మావోలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి నలువైపుల నుంచి కూంబింగ్‌ చేపట్టి ఉంటే కొంతమందైనా మావోలు చిక్కేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement