Kidari Sarveswara Rao
-
కిడారి హత్యకేసులో సప్లిమెంటరీ చార్జిషీట్
విజయవాడ లీగల్: విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యకేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం విజయవాడ నగర మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. 2018లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ 59 మందిని నిందితులుగా పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలులో ఉన్నారు. ఈ కేసులో 59వ నిందితురాలైన సాకే కళావతి అలియాస్ భవానీపై సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలు చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకూరి పెద్దన్న భార్య, మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలైన కళావతి హత్య చేసిన సమయంలో ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పలు మారణాయుధాలను కళావతి ధరించిందని, కిడారి, సివిరి హత్యలకు పదిహేను రోజుల ముందు డుంబ్రిగూడలో రెక్కీ, బస చేసారని ఎన్ఐఏ తెలిపింది. చదవండి: ఇసుక రీచ్‌ల సబ్ లీజుల పేరిట భారీ మోసం -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్
సాక్షి, విశాఖసిటీ: పార్టీపై నమ్మకంతో గెలిపిస్తే ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గారు. ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతూ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన నేతల తలరాతల్ని ఓటర్లు మార్చారు. విశ్వాసఘాతుకానికి పాల్పడితే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఓటర్లు బుద్ధి చెప్పారు. ఫిరాయింపుదారులు మళ్లీ తలెత్తుకోనివ్వకుండా గుర్తుండిపోయే ఓటమిని రుచిచూపించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించి అధికార టీడీపీకి అమ్ముడు పోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని ఘెర పరాజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. 2014లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గిడ్డిని ఓడించి బుద్ధి చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన భాగ్యలక్ష్మి చేతిలో 40,900 ఓట్ల తేడాతో గిడ్డి ఈశ్వరి ఓటమి పాలైంది. అదే విధంగా అరకులో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014లో విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సర్వేశ్వరరావు స్థానంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టి.. 2019 అరకు ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ అప్పగించింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శెట్టి ఫాల్గుణ ఫిరాయింపు ఎమ్మెల్యే కుమారుడు, తాజా మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ని 33,172 ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. ఎలాంటి సానుభూతి చూపకుండా అరకు ప్రజలు కిడారిని ఇంటికి సాగనంపారు. ఇక అరకు ఎంపీగా వైఎస్సార్సీపీ విజయం సాధించిన కొత్తపల్లి గీత.. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచింది. టీడీపీ, బీజేపీ వైపు చూసిన గీత.. చివరికి జనజాగృతి పార్టీని స్థాపించి విశాఖ ఎంపీగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీకి గీత చేసిన అన్యాయాన్ని గుర్తించుకున్న ప్రజలు.. డిపాజిట్ రాకుండా చేశారు. 12 లక్షల పై చిలుకు ఓట్లు పోలైన విశాఖ ఎంపీ స్థానంలో ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీతకు కేవలం 1,127 ఓట్లు మాత్రమే పోలవ్వడం హాస్యాస్పదం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. -
టీడీపీ నేతలకు మావోల హెచ్చరిక!
అల్లిపురం (విశాఖ దక్షిణం): టీడీపీ మంత్రులు, నాయకులను హెచ్చరిస్తూ సీపీఐ మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం గురువారం రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, గిడ్డి ఈశ్వరిలతో పాటు మండల నాయకులు కొర్ర బలరాం, మామిడి బాలయ్య, ముక్కల మహేష్, వండలం బాలయ్య, నళినిలను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో మన్యంలో నడుస్తోన్న పోలీసు నిర్భందాన్ని ఎత్తివేయకపోతే టీడీపీ నాయకులపై ప్రజలు, సీపీఐ మావోయిస్టు పార్టీ తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విశాఖ మన్యంలో 2017 మే నుండి ‘సమాధాన్’ దాడిలో భాగంగా రాజ్యనిర్బంధం అమలవుతోందని, గ్రామాలపై నిత్యం పోలీసులు దాడులు, అక్రమ అరెస్ట్‌లు, వేధింపులతో మన్యంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం ఆర్వీ నగర్, చాపగట్ట, సిరిబాల ఎస్టేట్ చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు ఏపీఎఫ్డీసీ వద్ద కూలీలుగా పని చేయబోమని, కాఫీ తోటలపై హక్కు తమదేనని గొత్తెత్తినందుకు వారిపై మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేసి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని కైలాసం పేర్కొన్నారు. మే 1వ తేదీ నాడు వంచుల పంచాయితీ పనసలొద్ది, కొత్తవాదురుపల్లి గ్రామాలపై పోలీసులు దాడులు చేసి ఆరుగురు రైతులను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని, వారి విడుదల కోసం ఆ గ్రామాల ప్రజలు రెండు రోజులు పాటు పోలీసుల చుట్టు తిరిగినా వాళ్లని పట్టించుకున్న వాళ్లే లేరన్నారు. -
మంత్రి పదవికి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా
-
పదవికి రాజీనామా చేసిన మంత్రి
అమరావతి: మంత్రి పదవికి టీడీపీ నేత కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేశారు. సీఎంవోకు తన రాజీనామా లేఖను శ్రవణ్ అందజేశారు. సీఎంఓ ద్వారా రాజీనామాను గవర్నర్‌కు పంపారు. సుమారు 8 నెలల క్రితం మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి తెల్సిందే. హత్య జరిగిన తర్వాత 6 నెలల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడంతో ఉప ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సర్వేశ్వర రావు కుమారుడు శ్రవణ్ కుమార్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మంత్రి పదవి చేపట్టి 6 గడిచిపోయినా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధనలకు లోబడే రాజీనామా: కిడారి రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేసినట్లు కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. మంత్రిగా ఆరు నెలల పదవీకాలంలో 3 నెలలు ఎన్నికల కోడ్‌కే పోయిందని చెప్పారు. గిరిజనుడిగా తనకు మంత్రి పదవి దక్కటం సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తనను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారని వాఖ్యానించారు. తన శాఖ ద్వారా గిరిజనుల కోసం ఫుడ్ బాస్కెట్ పథకాన్ని తీసుకురావడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. 6 నెలలే పదవిలో ఉండడంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. -
మావోయిస్టు కామేశ్వరి ఎన్కౌంటర్
పశ్చిమగోదావరి ,జంగారెడ్డిగూడెం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మావోయిస్టు, భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ చంద్రి, అలియాస్ సింద్రి, అలియాస్ రింకీ పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందింది. బుధవారం ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లా పడువా పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, పోలీసు బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు(ఎస్ఓజీ) మధ్య పెద్దెత్తున ఎదురు కాల్పులు జరిగాయి. కోరాపుట్ జిల్లా ఎస్పీ కేవీ సింగ్ తెలిపిన వివరాలు ప్రకారం కోరాపుట్ జిల్లా నందాపూర్ బ్లాక్ పరిధిలో గల హతీబరి పంచాయతీ సమీపంలో కిటువాకమీ అడవుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు, ఎస్‌వోజీ బలగాలతో దాడులు నిర్వహించామన్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, ఎస్‌వోజీ, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని, ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన ధృవీకరించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ రింకీ ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈమె తల్లితండ్రులు శ్రీకాకుళంలో ఉండగా కామేశ్వరిని భీమవరంలో ఒక వ్యక్తికి చ్చి వివాహం చేశారు. కొంతకాలం కామేశ్వరి భర్తతో కాపురం చేయగా, వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోలో కామేశ్వరి కండక్టర్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే మావోయిస్టులపై ఆకర్షితురాలై 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్ టీమ్ సభ్యురాలిగా మారింది. కిడారి, సోమ హత్యోదంతం అనంతరం వీటి వెనుక భీమవరానికి చెందిన కామేశ్వరి అనే మావోయిస్టు పాత్ర ఉందని పోలీసులు పేర్కొన్నప్పుడు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో మావోయిస్టుల వైపు ఎక్కువగా గిరిజనులు ఆకర్షితులై చేరుతుంటారు. అయితే మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టుల్లో చేరడం అరుదు. జిల్లా నుంచి భీమవరంలో కొంత కాలం నివాసం ఉన్న కామేశ్వరి మావోయిస్టుల్లో చేరడం, క్రియాశీలకంగా మారి మావోయిస్టుల్లో ప్రధాన వ్యక్తిగా రూపాంతరం చెందింది. ఈ నేపధ్యంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె హతమైంది. జిల్లా నుంచి ఇలా మావోయిస్టుల్లో చేరి ఎన్‌కౌంట్‌లో హతమైన ఘటనలు గతంలోనూ జరిగాయి. -
మంత్రి పదవి కోల్పోనున్న కిడారి శ్రవణ్ కుమార్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్‌కు సమాచారం అందించింది. కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
‘కిడారికి పట్టిన గతే నీకూ పడుతుంది’
సాక్షి, గుంటూరు : పల్నాడులో మరోసారి మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని హెచ్చరించారు మావోయిస్టులు. యరపతినేనితో పాటు పలువురు టీడీపీ నేతలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేశారు. ఈ లేఖలు దాచేపల్లి మోడ్రన్ స్కూల్ దగ్గర వెలిశాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు దర్శనమివ్వడం చర్చనీయంశంగా మారింది. -
ఎన్ఐఏ కస్టడీకి కిడారి హత్యకేసు నిందితులు
సాక్షి, విజయవాడ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితులు సుబ్బారావు, ఈశ్వరి, శోభన్‌లను నాలుగు రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులకు ఈ నెల 31 వరకు ఎన్ఐఎ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితులను విశాఖపట్నం జైలుకు తరలించారు. కాగా గతేడాది సెప్టెంబర్ 23న కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా డుంబ్రిగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది నవంబర్ 30న ఎన్ఐఏను అదేశించింది. -
కేంద్ర దర్యాప్తు సంస్థకు ఎమ్మెల్యే కిడారి హత్య కేసు
సాక్షి, అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు బదిలీ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విశాఖ జిల్లా డుంబ్రిగుడ పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది నవంబర్ 30న ఎన్ఐఏను అదేశించింది. ఈనెల 6వ తేదీన కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైదరాబాద్ యూనిట్‌కు అప్పగించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టినట్టు అయ్యింది. -
ఆ రోజు పోలీస్స్టేషన్లపై దాడులు..పచ్చ నేతల ప్రకోపమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో సెప్టెంబర్ 23న మావోయిస్టులు మాటు వేసి కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను దారుణంగా కాల్చి చంపారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఘటన జరిగితే సాయంత్రం వరకు లివిటిపుట్టుకు పోలీసులు వెళ్లలేకపోవడం, డుంబ్రిగుడ ఎస్సై అమ్మనరావు వివాదాస్పద వ్యవహారశైలి నేపథ్యంలో అప్పటికే వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో కిడారి, సివేరిల మృతదేహాలను డుంబ్రిగుడ, అరకు పోలీస్స్టేషన్ల సమీపంలోకి తీసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. వందలాదిమంది పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. కంప్యూటర్లు, రికార్డులు సహా ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఖాకీ చొక్కాలు కనిపిస్తే చాలు.. ముందూవెనుకా చూడకుండా చితక్కొట్టేశారు. ఎస్సై సురేష్ సహా మొత్తం 16మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత రెండు పోలీస్స్టేషన్లకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యోదంతంతో భావోద్వేగానికి, ఆవేశానికి లోనైన గిరిజనులే ఇదంతా చేసి ఉంటారని అందరూ భావించారు. అయితే హత్యోదంతంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. కిడారి, సివేరిల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మావోలకు చేరవేసి టీడీపీ నేతలే వారి హత్యకు సహకరించారని బయటపడగా.. హత్యోదంతం తర్వాత పరిస్థితిని అదుపు చేయాల్సిన టీడీపీ నేతలే అమాయకులను రెచ్చగొట్టి దగ్గరుండి అరాచకాలు చేయించారని కూడా తేలింది. అరాచకం సృష్టించింది వీరే.. పోలీస్స్టేషన్లపై దాడి, ధ్వంసం, దహనం కేసుకు సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న మొత్తం 111మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితులు టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే కావడం గమనార్హం. కేసులో ఏ–2గా టీడీపీకి చెందిన అరకు జెడ్పీటీసీ కూన వనజ, ఏ–3గా ఆమె భర్త, టీడీపీ నాయకుడు కూన రమేష్, ఏ–4గా టీడీపీ ఎంపీటీసీ పి.అమ్మన్న, ఏ–5గా టీడీపీ ఎంపీటీసీ కిల్లో సాయిరాం, ఏ–6గా శెట్టి బాబూరావు, ఏ–8 గా సర్పంచ్ కిల్లో రఘునా«థ్, ఏ–9గా అరకు ఎంపీపీ శెట్టి అప్పాలు.. ఇలా 111 మంది నిందితుల్లో అత్యధిక శాతం టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే ఉన్నారు. మాపై పెట్రోలు పోసి కాల్చేయాలని చూశారు.. డుంబ్రిగుడ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ‘ఆ రోజు పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న నన్ను, సహచర కానిస్టేబుల్ భాస్కరరావును పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. బండబూతులు తిట్టారు. వీరిద్దరినీ చంపేయండి.. అని కేకలు వేస్తూ పెట్రోలు క్యాన్లు ఓపెన్ చేసి... పెట్రోలు చల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడ్డాం. మమ్మల్ని పెట్రోలు పోసి కాల్చేందుకు ప్రయత్నించిన వాళ్ళను గుర్తుపడతాం,. ఘటనా స్థలంలో టీడీపీ జెడ్పీటీసీ సహా మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు. పోలీస్స్టేషన్లకు నిప్పంటించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, మమ్మల్ని కాల్చి చంపాలని చూసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి’.. అని డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్.సత్యనారాయణ అదే పోలీస్‌స్టేషన్ ఎస్సైతో పాటు అరకు ఎస్సైకి ఫిర్యాదు చేశారు. అసలు దోషులు టీడీపీ నేతలని తేలడంతో కేసును తొక్కిపెట్టిన పోలీసు అధికారులు గిరిజనులే ఆవేశంలో ఇదంతా చేసి ఉంటారని తొలుత పోలీసులు కూడా భావించారు. అయితే విచారణలో ఫొటోలు, వీడియో ఫుటేజీల సాక్ష్యంగా మొత్తం టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించారని తేలడంతో పోలీసులు అధికారులు నివేదికను తొట్టిపెట్టేశారు. ఇప్పటివరకు అరెస్టుల్లేకుండా కేసు విచారణను నిలిపివేశారు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ హోం మంత్రి చినరాజప్పను కలిసి పోలీస్‌స్టేషన్‌పై దాడి, దహనం కేసులో అరెస్టుల్లేకుండా చూడాలని కోరారు. బాధ్యత గల అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించిన వైనం బట్టబయలు కావడంతో ప్రభుత్వం ఏమేరకు వ్యవహరిస్తుందో చూడాల్సిఉంది. -
తూతూ‘మంత్రం’గా
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ, ఎస్టీ వర్గాల నుంచి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధమైంది! ఈమేరకు శాసనమండలి చైర్మన్ ఫరూక్, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌లకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందచేసినట్లు తెలిసింది. ఆదివారం రోజు ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారిద్దరికీ సమా చారం ఇచ్చినట్లు తెలిసింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలో చూసినా మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ వర్గాలకు ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గ ఏర్పాటు ఎన్నడూ జరగలేదు. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్లు గడిచిపోయిన తరువాత ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు వెళ్లే ముందు మైనారిటీ, ఎస్టీలను మంత్రివర్గంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం ఆ వర్గాలకు సన్మానమా? అవమానమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఓ వ్యక్తిని తెచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే తమను ఎలా గౌరవించినట్లు అవుతుందని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఆయా వర్గాలను గౌరవించడం కాదు అవమానించినట్లుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పదవిస్తే అవమానం మాసిపోతుందా? రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన సలహా మండలి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండటంతో గిరిజన సలహా మండలిని నియమించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేసింది. దీనిపై పోరాడిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత పోరాటంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రి పదవిలోకి తీసుకున్నా ఇన్నేళ్లుగా గిరిజన వర్గానికి సర్కారు చేసిన అన్యాయం, అవమానం మాసిపోదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నిక కాకుండానే మంత్రిగా శ్రవణ్! మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నందున కిడారి శ్రవణ్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సభకూ ఎన్నిక కాకుండానే శ్రవణ్ మంత్రిగా కొనసాగుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ కోడెల ఆఖరి ప్రయత్నం.. విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్న క్యాంటీన్ కోసం రూ.5 లక్షల విరాళాన్ని అందించేందుకు వచ్చిన కోడెల శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలిసింది. రెండు బెర్తులే ఖాళీగా ఉన్నాయని, వాటిని ముస్లిం, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు తన వద్దే ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆ శాఖ తీసుకోవాలని యనమల రామకృష్ణుడికి సూచించినా వివాదాలున్నాయనే కారణంతో ఆయన నిరాకరించారు. రేపు గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం 11.45 గంటలకు ముహూర్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పక్కన గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ)ను ఆదేశించింది. ఫరూక్, కిడారి శ్రవణ్‌లను కేబినెట్లోకి తీసుకోవడంతోపాటు కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కిడారి, సోమను అందుకే హతమార్చాం
విశాఖ సిటీ: బహుళ జాతి సంస్థలకు ఏజెంట్లుగా మారి కోట్లాది రూపాయల ఆదివాసీల సహజ సంపదను కొల్లగొడుతున్నందునే ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చామని మావోయిస్టులు ప్రకటించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ(ఏఓబీఎస్‌జెడ్‌సీ) లెటర్ హెడ్‌పై అధికార ప్రతినిధి జగబంధు పేరుతో శుక్రవారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు కూడా లేటరైట్ పేరుతో బాౖక్సైట్ను దోచుకుంటున్నారని, ఆపకపోతే తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కిడారి, సోమ హత్య జరిగిన వారం రోజుల తర్వాత ఆ హత్యల గురించి ఎర్ర సిరా అక్షరాలతో వచ్చిన లేఖ అబద్ధమని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో లేఖ బయటకు వచ్చినా అందులో కిడారి, సోమ హత్యల గురించి మావోలు చెప్పలేదు. తాజాగా విడుదలైన లేఖలో మాత్రం హతమార్చడానికి దారితీసిన పరిస్థి తులు, జరుగుతున్న మోసాల గురించి వివరిస్తూ.. కమిటీ లెటర్‌హెడ్‌పై లేఖ రావడంతో విశ్వసనీయత చేకూరింది. లేఖలోని సారాంశం.. వారు ఆదివాసీ ద్రోహులు ‘‘కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు ఆదివాసీ నేతలు కానే కాదు. వారు ద్రోహులు. ప్రజాసేవ ముసుగులో మామూలు స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తారు. క్వారీ యజమానులుగా, అరకు, అనంతగిరి, పాడేరు, విశాఖలో ఆస్తుల్ని, భూముల్ని అక్రమంగా గడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తూ, బాక్సైట్ వెలికితీత కోసం జిందాల్, రస్‌అల్‌ఖైమా, అన్‌రాక్‌లకు ఏజెంట్లుగా వ్యవహరించి అక్రమంగా డబ్బు వెనకేసు కున్నారు. సివేరి సోమ ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో ఇలాంటి దళారీ పాత్రలు నిర్వహించి నందుకుగాను, చైనా క్లే తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో డుంబ్రిగూడ మండలం కండ్రుం గ్రామాల ప్రజలంతా ఏకమై వెంటపడి తరి మారు. ప్రజాగ్రహానికి గురైనా తన తీరు మార్చు కోకుండా జిందాల్‌కు ఏజెంటుగా వ్యవహరించ డమే కాకుండా బాౖక్సైట్ విషయంలో ప్రజా వ్యతిరేకిగా వ్యవహరించాడు. సర్వేశ్వరరావు రోజుకో పార్టీని మారుస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా అర్రులు చాచాడు. ఆయన కొన సాగిస్తున్న క్వారీని మూసెయ్యాలనే డిమాండ్‌తో హుకుంపేట మండలం గూడ గ్రామ ప్రజలు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా అధికార అండతో ఏమాత్రం ఖాతరు చెయ్యలేదు. సొంత పార్టీలోనే వాటికి వ్యతిరేకంగా బహిరంగంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. వీరిద్దరూ మెజార్టీ ప్రజల ఆగ్రహానికి గురైన కార ణంగా ప్రజావ్యతిరేకుల్ని, ద్రోహులను అంతం చెయ్యాలనే నిర్ణయంతోనే తమ పార్టీ పీఎల్జీఏ ఆధ్వర్యంలో తీర్పుని అమలు చేశాము’’ అని జగబంధు లేఖలో స్పష్టం చేశారు. అయ్యన్నా.. మైనింగ్ మానుకో తెలుగుదేశం ప్రభుత్వ అండదండలతో తూర్పు కనుమల్లో అటవీ సంపదను బినామీ పేర్లతోనూ, ఆదివాసీ దళారులుగా పుట్టకొకరు తయారై, క్వారీలు, గనుల్ని తెరుస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని తరలిస్తున్నారనీ, దీని వెనుక మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్లున్నారని తెలిపారు. మన్యం ప్రాంత సంపద అక్రమ తరలింపుని తక్షణమే నిలిపెయ్యా లనీ, లేకపోతే.. జరిగే తీవ్ర పరిణామాలకు తామే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని దళారీలను, ప్రజా వ్యతిరేక నాయకుల్ని జగబంధు హెచ్చరించారు. ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ వెలికితీత కోసం జారీ చేసిన జీవో నం.97ని పూర్తిగా రద్దు చెయ్యడమే కాకుండా, అటవీ సంపదని అక్రమంగా దోచుకునే కార్యక్రమాల్ని మానుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. -
మావోల లేఖ: వారు ఆదివాసీలు కాదు.. ద్రోహులు!
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి జగబందు పేరుతో మావోలు లేఖలు విడుదల చేశారు. రాజకీయ నేతలకు, దళారీలను ఆ లేఖలో గట్టిగా హెచ్చరించారు. బాక్సైట్ పేరుతో మంత్రి పబ్బం గడుపుకుంటున్నారు ‘మైనింగ్ మాఫియాగా మారి, ఆదివాసీల ప్రాకృతిక సంపదను అప్పన్నంగా కొల్లగొడుతున్నందుకే అరకు ఎమ్మెల్మే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను హతమార్చాం. కిడారి, సోమాలు ఆదివాసీలు కాదు.. ద్రోహులు, సామ్రాజ్యవాద బహుళ జాతీ కంపెనీలకు దళారులు. కిడారి రోజుకో పార్టీ మారుతూ సంపాదనే ధ్యేయంగా బరితెగించారు. నాతవరం మండలంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు, కొడుకు విజయ్‌లు వాటాలతో పబ్బం గడుపుకుంటున్నారు. మన్య ప్రాంత సంపద అక్రమ తరలింపు ఆపకపోతే జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే’అంటూ మావోలు లేఖలో పేర్కొన్నారు. ఇక గత కొద్ది నెలలుగా ఆంధ్రా-ఒడిశా బార్డర్ (ఏవోబీ) వద్ద మావోయిస్టులు కదలికలు ఏపీ పోలీసులకు చాలెంజ్‌గా మారింది. -
కుట్ర చేసింది టీడీపీ నేతలే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యాకాండకు కుట్రదారులు అధికార టీడీపీ నేతలేనని తేలిపోయింది. మావోయిస్టులకు ఉప్పొందించడమేకాదు.. ఆశ్రయమిచ్చి.. భోజనం పెట్టి వారికి సపర్యలు చేసినట్టుగా విచారణలో స్పష్టమైంది. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే ఈ హత్యాకాండ వెనుక ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందంటూ టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ వారి ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని సిట్ తేల్చేసింది. పైగా అవన్నీ కుట్రపూరిత ఆరోపణలేనని కుండ బద్దలు కొట్టింది. డుంబ్రిగుడ మండలం సర్రాయి గ్రామదర్శినికి వెళుతున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు చుట్టు ముట్టి హతమార్చడం సంచలనమైంది. అనంతరం వారి అనుచరులు, టీడీపీ శ్రేణులు అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. జంట హత్యలు, హింసాకాండలపై విచారణకు విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ బృందం గడిచిన 22 రోజులుగా లోతైన విచారణ జరిపింది. మరోపక్క ఈ ఘటన వెనుక విపక్ష నేతల హస్తం ఉందేమోనంటూ అధికార టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. స్వయంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షాలనుద్దేశించి అన్యాపదేశంగా మాట్లాడితే ఇక విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ నోటికొచ్చిన రీతిలో విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కానీ ఈ హత్యాకాండ వెనుక విపక్ష పార్టీల పాత్ర ఏమాత్రం లేదని..అధికార టీడీపీ నేతల హస్తం ఉన్నట్టుగా సిట్ విచారణలో తేలడంతో వారి పేర్లు బయటకు రానీయకుండా ఒత్తిడి తీసుకొచ్చేందుకు విఫలయత్నం చేశారు. కానీ పక్కా ఆధారాలతో టీడీపీ నేతలు అడ్డంగా సిట్‌కి దొరికిపోవడంతో అధికార టీడీపీ నేతల వాదనలో పసలేదని తేలిపోయింది. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చిన మావోయిస్టులకు సహకంచారంటూ డుంబ్రిగుడ మండల టీడీపీ మండలాధ్యక్షుడు, తూటంగి మాజీ ఎంపీటీసీ సభ్యుడు యేడెల సుబ్బారావు, అతని భార్య ఈశ్వరితో పాటు డుంబ్రిగుడ మండలం ఆంత్రగుడ గ్రామానికి చెందిన గెమ్మిలి శోభన్, గుంటసీమ పంచాయతీ తడ్డ గ్రామానికి చెందిన కొర్రా కమలలు అరెస్ట్ చేసి ఆదివారం కోర్టులో హాజరు పరిచారు. టీడీపీలో క్రియాశీలకంగానే వ్యవహరించిన ఈ నలుగురు గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటక్షన్ గిరిజన రైట్స్ (ఓపీజీఆర్)లో పనిచేశారని గుర్తించారు. కానీ ఈ నలుగురు ఓపీజీఆర్లో పనిచేశారని చెప్పిన సిట్ చీఫ్ ఫకీరప్ప, ఎస్పీ రాహుల్ దేవ్శర్మలు ఎక్కడా వారు టీడీపీతో వారికున్న అనుబంధాన్ని మాత్రం చెప్పలేదు. ఎందుకు చంపారో... సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చంపేందుకు టీడీపీ నేతలు సుబ్బారావు తదితరులే ఉప్పొందించారని చెబుతున్న పోలీసులు ఎందుకు ఆ పని చేసారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. మావోలతో వాళ్లకు సంబం«ధాలున్నాయని చెబుతున్న పోలీసుల వాదనలు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. వాస్తవానికి సుబ్బారావు ఒక్కడే గతంలో ఓపీజీఆర్లో పనిచేశాడు. మిగిలిన వారెవరూ ఈ సంస్థలో పనిచేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికప్పుడు వారు మావోలతో కలిసి కిడారి, సోమలను మట్టుపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. రాజకీయ విభేదాలా? వ్యాపార కారణాలా? మరే ఇతర కారణాలున్నాయా? అనే అంశాలపై పోలీసులు పెదవి విప్పడం లేదు. కేవలం ఉప్పొందించారన్న మాటే తప్ప ఎందుకు చేశారన్న విషయాన్ని మాత్రం పోలీసులు బయటపెట్టలేకపోతున్నారు. సుబ్బారావు ఇంట్లోనే మావోయిస్టుల మకాం టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు సుబ్బారావు ఇంటికి మావోయిస్టులు దాసు, జోగేష్, కిషోర్‌లు కొద్దిరోజుల క్రితం సివిల్ దుస్తుల్లో వచ్చి బస చేశారని, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రకటించడం చూస్తుంటే ఈ జంట హత్యల వెనుక అధికార టీడీపీ నేతల హస్తం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమైంది. 21వ తేదీన సర్రాయి గ్రామదర్శిని ఖరారు కాగానే ఆ సమాచారం మావోయిస్టులకు చేరవేసింది సుబ్బారావేనని తేల్చారు. అంతేకాదు ఘటన జరిగిన రోజు పెద్దసంఖ్యలో లివిటిపుట్టు చేరుకున్న మావోయిస్టులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించింది కూడా సుబ్బారావు దంపతులేనని సిట్ తేల్చింది. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై వారి సానుభూతిపరులుగా ఉంటూ తాము వారు నిర్వహించే సమావేశాలకు హాజరవడమే కాదు..పరిసర గ్రామాలకు వచ్చినపుడల్లా వారికి ఆశ్రయమిస్తూ, భోజన వసతి కల్పించేవారమని విచారణలో సుబ్బారావు అంగీకరించినట్టు సిట్ స్పష్టం చేసింది.అంతే కాదు కిడారి, సోమలను హతమార్చిన రోజున వై జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిం చింది కూడా సుబ్బారావేనని విచారణలో తేలింది. ఇలా రకాలుగా మావోయిస్టులకు పూర్తి సహాయసహకారాలు అందించింది అధికార టీడీపీ నేతలేనని తేలిపోయింది. వీరితో పాటు మరో ఇరువురు పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఘటనలో పాల్గొన్నది 53 మంది.. ఇప్పటి వరకు 300 మందికిపైగా అనుమానితులను విచారించిన పోలీసులు ఈ ఘటనలో 53 మంది పాల్గొన్నట్టుగా గుర్తించి వారిపై హత్యానేరంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం అరెస్ట్ చేసిన సుబ్బారావు తదితరుల నుంచి 8 కరపత్రాలు, రెండు ఎరుపు రంగు బ్యానర్లు స్వాధీనం చేసుకోగా, మధ్యవర్తుల సమక్షంలో పదికిలోల సామర్థ్యం కల్గిన ఓ మందు పాతర, 20మీటర్లు పొడవు గల ఎలక్ట్రికల్ వైరును స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం ఏఒబీ సరిహద్దు లోని ఆండ్రపల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృత్యువాత పడిన మావో అగ్రనేత గాజర్ల రవి భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ జిలానీ బేగం అలియాస్ మీనా ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యాకాండలో 21వ నిందితునిగా గుర్తించారు. ఘటనా స్థలంలో ఉన్న మావోయిస్టు నేతలు చలపతి, అరుణ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించినట్టు వెల్లడించారు. సుబ్బారావు ఇచ్చిన సమాచారంతో లివిటిపుట్టు ఘటన వెనుక మరింతమంది టీడీపీ నేతల హస్తం లేకపోలేదని భావిస్తున్నారు. -
మీనాది హత్యే!
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ కటాఫ్ ఏరియా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మీనా మృతి చెందలేదని, ఇరు రాష్ట్రాల పోలీసులు కాల్చి చంపారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు భవానీ, నిరసన నేతలు బషీద్ ఆరోపించారు. మీనాను పోలీసులు ఈ నెల 11వ తేదీన అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసినా లొంగకపోవడంతో 12వ తేదీన కాల్చి చంపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతంలో అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్నారన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమను మావోయిస్టులు చంపారని అన్నారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా కొరాపుట్, మల్కన్‌గిరి అడవుల్లో కూంబింగ్ నిర్వహించి, మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా చేసుకుని మీనాని చంపారని తెలిపారు. 303 సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ జిల్లాలోని పొచ్చన్నపేటలో మీనాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ జోహార్లు తెలుపుతూ అంతిమ సంస్కారాలు జరిపారు. ఈ అంతిమయాత్రలో వరంగల్ పౌరహక్కుల కార్యకర్త రంజిత్, తెలంగాణ రాష్ట్ర ఎస్ఎల్సీ అధ్యక్షుడు లక్ష్మణ్, మీనా కుటుంబ సభ్యులు సత్యం, భాస్కర్, గాజర్ల రవి, అశోక్, అనిత తదితరులు పాల్గొన్నారు. నలుగురు మావోయిస్టులను కోర్టుకు తరలింపు అలాగే మల్కన్‌గిరి పోలీసుల అదుపులో ఉన్న సుమారు నలుగురు మావోయిస్టులను ఆదివారం కోర్టుకు తరలించినట్టు ఎస్పీ జోగ్గా మోహన్ తెలిపారు. వీరిలో జయంతి అలియాస్ అంజన, గ్లోరి, రాధిక, సుమ అలియాస్ గీత, రాజేష్ కోరా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్! -
సూత్రధారులు టీడీపీ నేతలే
సాక్షి, విశాఖపట్నం/ పెదవాల్తేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టుబెట్టడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉన్నట్టుగా తేటతెల్లమైంది. లివిటిపుట్టు ఘటన వెనుక వైఎస్సార్సీపీ హస్తం ఉందంటూ అధికార టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది. ఈ హత్యోదంతంలో మావోలకు సహకరించిన నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ ఫకీరప్ప, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఆదివారం విశాఖలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు దర్యాప్తు వివరాలను మీడియాకు వివరించారు. టీడీపీ డుంబ్రిగుడ మండల ఉపాధ్యక్షుడు యేడెల సుబ్బారావు–ఈశ్వరి దంపతులతోపాటు గెమ్మిలి శోభన్, కొర్ర కమలలు ఈ ఘటనలో కీలక సూత్రధారులని దర్యాప్తులో తేలిందని వారు తెలిపారు. వీరి సహకారంతోనే మావోయిస్టు పార్టీ కోరాపుట్ డివిజన్ దళం పక్కా వ్యూహంతో ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు గత నెల 23న సర్రాయి వద్ద గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు చుట్టుముట్టి హతమార్చిన విషయం తెలిసిందే. 300 మందిని విచారించిన సిట్: ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి 20 రోజులపాటు సుమారు 300 మందిని సిట్ విచారించింది. కిడారి, సోమలను హతమార్చడంలో మావోలకు ప్రత్యక్షంగా సహకరించినట్టుగా పేర్కొంటూ టీడీపీ నాయకుడు యేడెల సుబ్బారావు, యేడెల ఈశ్వరిలతోపాటు గెమ్మిలి శోభన్, కొర్రా కమలను అరెస్టు చేసిన సిట్ బృందం వారిని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అరెస్టయిన నలుగురూ గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటక్షన్ గిరిజన రైట్స్ (ఓపీజీఆర్) గ్రూపులో పనిచేసినట్టు సిట్ చీఫ్ ఫకీరప్ప వెల్లడించారు. రెండేళ్లుగా వరుస ఎదురు కాల్పులు, లొంగుబాట్లు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినందున ఉనికి చాటుకోవడంతోపాటు ఏజెన్సీలో అలజడిని సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రముఖ వ్యక్తుల రాకపోకల గురించి సమాచారం ఇవ్వాలని మావోయిస్టులు వీరిపై ఒత్తిడి తెచ్చారన్నారు. మందుపాతర స్వాధీనం: నిందితుల నుంచి మావోయిస్టులు ముద్రించిన 8 కరపత్రాలు, రెండు ఎరుపు రంగు బ్యానర్లు స్వాధీనం చేసుకున్నామని సిట్ చీఫ్ తెలిపారు. 10 కిలోల సామర్థ్యం కలిగిన ఓ మందుపాతర, ఎలక్ట్రికల్ వైరును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మావో అగ్రనేతలు చలపతి, అతని భార్య అరుణ ఈ ఆపరేషన్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా తేలిందన్నారు. మీనా 21వ ముద్దాయే ఏవోబీ సరిహద్దులోని ఆండ్రపల్లి వద్ద ఈ నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన మావో అగ్రనేత గాజర్ల రవి భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ జిలానీ బేగం అలియాస్ మీనాను కిడారి, సోమల హత్యాకాండలో 21వ ముద్దాయిగా గుర్తించామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట మావోలు విడుదల చేసిన లేఖపై సందేహాలు వస్తున్నందున ఆ లేఖ అసలుదా? లేక నకిలీదా? అని విచారిస్తున్నామన్నారు. -
ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, పెదబయలు/మల్కన్‌గిరి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు– మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాం డర్ మీనా మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు ఓ మిలీషియా సభ్యు డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత నెల 23న విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చాక మావోల కోసం ఒడిశాలోని మల్కన్‌గిరి ఎస్‌వోజీ, డీఓబీ జవాన్లతోపాటు ఆంధ్రా గ్రేహౌండ్స్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగం గా ఈ నెల 7న ఏవోబీ పరిధిలోని సుంకి అటవీ ప్రాం తంలో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో మావో అగ్రనేతలు తప్పించుకున్నప్పటికీ పెద్ద ఎత్తున మావోయిస్టు డంప్‌ను కోరాపుట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీసు లు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శుక్ర వారం తెల్లవారుజామున చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆండ్రపల్లి–బెజ్జంగి మధ్య అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. పంచాయతీ కేంద్రమైన ఆండ్రపల్లి సమీపంలో ఇరు వర్గాల మధ్య రెండు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల నుంచి కాల్పులు నిలిచిపోయినప్పటికీ పోలీసులు మాత్రం కాల్పులు కొనసాగించారు. అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలు మావోయిస్టు పార్టీ డిప్యూటీ దళ కమాండర్/డివిజన్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న మీనా అలియాస్ జిలానీ బేగం అలియాస్ నిడిగొండ ప్రమీలగా నిర్ధారించారు. మృతురాలు మావోయిస్టు కీలక నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ భార్యగా గుర్తించారు. కిడారి, సోమ జంట హత్య కేసులో మీనా 21 వ ముద్దాయిగా ఉన్నట్టుగా నిర్ధారించారు. గ్రామస్తుల అడ్డగింత మహిళా మావో మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న మావోలను గ్రేహౌండ్స్ పోలీసులు మల్కన్‌గిరికి తరలిస్తుండగా బెజ్జంగి జంక్షన్ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆండ్రపల్లి, పనసపట్టు, జూడం పంచాయతీల్లోని 60 పల్లెలకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా గిరిజనులు మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చారు. గ్రేహౌండ్స్ పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశా రు. పోలీసుల వాహనాలను వెంబడించారు. అదుపులో తీసుకున్నవారిని విడిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రేహౌండ్స్ దళాలను చుట్టుముట్టారు. రామగుడ ఎన్కౌంటర్, లివిటిపుట్టు ఘటనల తర్వాత ఆంధ్రా గ్రేహౌండ్స్ బలగాలే తమ ప్రాంతాల్లోకి వచ్చి గాలింపు చర్యల పేరిట తమను వేధిస్తున్నాయని మండిపడ్డారు. గ్రామాల్లోకి చొరబడి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అకారణంగా గ్రామస్తులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారని, సమాచారం చెప్పడం లేదంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుం దని భావించిన గ్రేహౌండ్స్ బలగాలు గాల్లో కాల్పులు జరిపాయి. దీంతో గిరిజనులు చెదురుమదురు కావడంతో పోలీసు వాహనాలు ముందుకు వెళ్లాయి. అగ్రనేతలు తప్పించుకున్నారు: విశాఖ ఎస్పీ ఏవోబీలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలని, ఆ రోజు ఆపరేషన్‌లో ఆమె కీలకంగా పాల్గొన్నారని చెప్పారు. ఎదురుకాల్పుల ఘటన మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఆమె మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న నలుగురిని అక్కడకు తరలించామని చెప్పారు. ఏవోబీలో నిరంతరాయంగా కూంబింగ్ చేస్తున్నామన్నారు. 50 ఘటనల్లో మీనా: మల్కన్‌గిరి ఎస్పీ మీనా గత 20 ఏళ్లుగా ఏవోబీలో డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేస్తోందని మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గా మోహన్ మిన్నా చెప్పారు. జిల్లాలోని రామగుడ ఎన్కౌంటర్, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ అపహరణ, ఇన్ఫార్మర్స్ నెపంతో హత్యలు ఇలా సుమారు 50 ఘటనల్లో ఆమె ప్రమేయం ఉందన్నారు. మీనాపై ఆంధ్రా ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించిందని తెలిపారు. మల్కన్‌గిరికి తరలింపు ఘటనా స్థలంలో మహిళా మావోలు.. జయంతి అలియాస్ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్ కర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మహిళా మావోయిస్టులూ కటాఫ్ ఏరియా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురితోపాటు మీనా మృతదేహాన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. తప్పించుకున్న మావోల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
ఎన్కౌంటర్: కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు హతం
-
కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్!
సాక్షి, విశాఖ ఏజెన్సీ : ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన మీనా గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
హంతకులెవరైనా శిక్ష తప్పదు : నారా లోకేష్
పాడేరు/అరకులోయ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యకు కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని, ఎవరైనా శిక్ష తప్పదని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం ఆయన పాడేరులోని కిడారి, అరకులో సీవేరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నెల 14న అరకులో నిర్వహించనున్న కిడారి, సోమల స్మారక సం తాప కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిడారి, సోమ ల హత్యల వెనుక ఎవరున్నారో బయటకు వస్తుందని, దీనిపై సిట్ విచారణ కొనసాగుతోందన్నారు. సొంత పార్టీలోని వ్యక్తులే ఈ హత్యలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనివల్లే సిట్ నివేదిక బయటకు రాకుండా చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సొంత ఎమ్మెల్యేను చంపుతారా.. అంటూ నివేదిక రాకుండా మాట్లాడడం, అర్థంపర్థం లేని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక రాకుండా దీనిపై మాట్లాడటం సబబు కాదన్నారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నక్కా ఆనందబాబు పాడేరు, అరకు ప్రాంతాల్లో రోడ్డు మార్గంలో పర్యటించారు. -
చలపతే.. యాక్షన్ దళపతి!
ఆపరేషన్ లివిటిపుట్టులో మావోయిస్టు కీలకనేత చలపతి పాల్గొన్నారా?.. ఆయనే స్వయంగా ఆపరేషన్‌ను పర్యవేక్షించారా??.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. గత నెల 23న జరిగిన ఈ హత్యాకాండలో మహిళా మావోయిస్టు నేత అరుణ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారని.. మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలో చలపతి వ్యూహం రచించినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. అయితే లోతుగా జరిగిన సిట్ విచారణలో చలపతి పాత్ర స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా హత్యాకాండలో పాల్గొనకపోయినా.. దళంతో కలిసి వచ్చి కాస్త దూరంగా ఉండి పర్యవేక్షించారని సమాచారం. మరోవైపు మీడియాను వెంట తీసుకెళితే మావోయిస్టులు దాడికి పాల్పడరన్న వ్యూహంతోనే కిడారి తన కాన్వాయ్ వెంట మీడియా ప్రతినిధులను తీసుకెళ్లినా.. అది ఫలించలేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యోదంతంపై సిట్ జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో గత నెల 23న మావో యిస్టులు వారిద్దరినీ దారుణంగా కాల్చిచంపిన ఘటనలోమావోయిస్టు మహిళా నేత అరుణ కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా ఆమె భర్త, మావోయిస్టు కీలక నేత చలపతి కూడా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సిట్ అధికారులు తేల్చారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతో చలపతి దగ్గరుండి ఆపరేషన్ విజయవంతం చేసినట్టు తెలుస్తోంది. కాల్పుల పనిని మహిళా మావోలకు అప్పజెప్పి చలపతి మాత్రం కాస్త దూరంలోనే నిలబడినట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. చలపతి, అరుణల నాయకత్వంలో ఆ రోజు ఉదయమే నందాపూర్ కమిటీకి చెందిన సుమారు 30మంది మావోయిస్టులు లివిటిపుట్టు చేరుకున్నారు. అక్కడకు మరో ముప్పై మంది మిలీషియా సభ్యులు చేరుకున్న తర్వాత ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఏజెన్సీ టీడీపీ నేతలే ఉప్పందించారు.. కిడారికి సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలే మావోలకు ఉప్పందించారని సిట్ అధికారులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చినట్టు తెలుస్తోంది. అయితే కిడారి వెన్నంటి తిరిగిన టీడీపీ నేతలు ఒక్కసారిగా మావోలతో కుమ్మక్కై ఎందుకు పక్కాగా సమాచారం అందించారన్న దానిపై మాత్రం సిట్ అధికారులకు స్పష్టత రాలేదు. వ్యాపార లావాదేవీల్లో అంతర్గత విభేదాలా.. పార్టీ ఫిరాయించిన తర్వాత టీడీపీలోని ఓ వర్గంతో వచ్చిన అంతరాలా.. అన్నది ఇప్పటికీ తేలలేదని అంటున్నారు. మొత్తానికి ఏజెన్సీకి చెందిన, కిడారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన టీడీపీ నేతలే మావోలకు ఎప్పటికప్పుడు ఆయన కదలికలపై సమాచారం ఇచ్చినట్టు మాత్రం సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మీడియా ప్రతినిధుల సాక్షిగానే... ఆ రోజు కిడారి మీడియా వారిని తన వెంట తీసుకువెళ్లడం వాస్తవమేనని సిట్ తేల్చింది. మీడియా ప్రతినిధులు ఉంటే దాడికి మావోయిస్టులు వెనుకంజ వేస్తారన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కిడారి వారిని వెంటబెట్టుకు వెళ్లారని అంటున్నారు. ఓ ప్రధాన పత్రిక విలేకరితోపాటు ముగ్గురు స్థానిక విలేకరులు ఆయన్ను అనుసరించారని తెలుస్తోంది. ఆయన కారుకు ముందు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు విలేకరులు, కారు వెనుక మరో టూవీలర్‌పై ఇద్దరు విలేకరులు అనుసరించారు. కిడారి వాహనానికి ముందున్న విలేకరులు అక్కడ మావోలు కాపుకాయడం చూసి తమ బండి ఆపకుండా వెళ్ళిపోయారు. కిడారి వాహనం వెనుక అనుసరిస్తున్న ఇద్దరు మీడియా విలేకరులను మాత్రం మావోలు అడ్డగించినట్టు తెలిసింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు వారిని అక్కడే కూర్చోబెట్టి ఆ తర్వాతే వదిలిపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో సిట్ అధికారులు సదరు విలేకరులను విచారించినట్టు తెలిసింది. కాగా, ఆ రోజు ఆపరేషన్‌లో లివిటిపుట్టు గ్రామస్తుల పాత్ర ఏమీ లేదని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. సిట్ నివేదికను సర్కారు బయటపెడుతుందా? స్వయంగా అధికార తెలుగుదేశం నేతలే దగ్గరుండి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను కాల్చి చంపించిన వ్యవహారాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక సిట్ అధికారులు మధనపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ టీడీపీ నేతలు అందించిన సమాచారంతోనే మావోలు పక్కా వ్యూహంతో మెరపుదాడి చేయగలిగారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైంది. అయితే వాస్తవ నివేదిక బయటపెడితే సర్కారు తీరు ఎలా ఉంటుందోనన్న ఆందోళన విచారణ అధికారులను వెంటాడుతోంది. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం విచారణ కొనసాగిస్తామని, ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో సిట్ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి. -
ఏవోబీలో రెండు మావో దళాలు!
సాక్షి,అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోయిస్టులు విసిరిన పంజాకు ఘోరంగా అభాసుపాలైన పోలీసులు సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏకంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టులు పేల్చిన తూట పోలీసు శాఖకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ మావోయిస్టుల అణచివేతకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా డీజీపీ శర్మతో సమావేశమైన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నా రు. దీనిలో భాగంగానే కోరాçపుట్ జిల్లా చిక్కల్‌ములి వద్ద శని, ఆదివారాల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు సం యుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు గాయపడినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ ఎవరనేది నిర్ధారణకు రాలేదు. ఆంధ్రలో దాడులు.. ఒడిశాలో షెల్టర్.. ఒడిశాలో షెల్టర్ తీసుకుని ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చి లక్ష్యాలు నిర్దేశించుకుని మావోయిస్టులు దాడులు చేసేలా కదులుతున్నారు. ఇందుకు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, చలపతి తదితర కీలక నేతలు నేతృత్వం వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఏకంగా మిలటరీ బెటాలియన్ ఉన్నట్టు గుర్తించారు. టెక్నాలజీని ఆశ్రయించిన పోలీసులు మావోయిస్టుల కదలికలను గుర్తించేలా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. అన్ మాన్డ్ ఏరియల్స్(యుఏవీ), డ్రోన్లను వాడుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏవోబీలో స్కానింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రేడియో ట్రాన్సిస్టర్ మాదిరిగా ఉండే పరికరాన్ని ఎతైన ప్రదేశంలో అమర్చి దాని యాంటేనా ద్వారా స్కానింగ్ పద్ధతిని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం మావోయిస్టులు వినియోగించే వైర్‌లెస్‌సెట్, మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలను రికార్డు చేయడంతోపాటు వారు ఏ ప్రాంతంలో, ఎంత దూరంలో ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నేత చత్తీస్‌గఢ్, ఆంధ్ర సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్ డెప్యూటీ కమాండర్ పోడియం ముడా సోమవారం పోలీసులకు చిక్కాడు. అతని అరెస్టుతో తూర్పు మన్యంలో మావోలకు ఎదురు దెబ్బ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. 2014లో చత్తీస్‌గఢ్ మంత్రి మహేందర్ కర్మా సహా అనేక దాడుల్లో 116 మంది పోలీసుల మృతికి కూడా కారకుడని పోలీసులు చెబుతున్నారు. ఏవోబీలోనే ఆర్కే.. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోనే ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆయనతో సహా ఏవోబీలో తలదాచుకున్న మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగానే కూంబింగ్ జరుగుతోందని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. -
ట్రాఫిక్‌ను ఆపి.. కాపు కాసి..
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలు ఏ స్థాయిలో సహాయ సహకారాలు అందించారో విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. టీడీపీ నేతల సహకారంతోనే మావోలు పక్కా స్కెచ్ అమలు చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కదలికలు ఎప్పటికప్పుడు టీడీపీ నేతల ద్వారా తెలుసుకుని, మాటు వేసి మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు వై.సుబ్బారావు కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మావోల ఉచ్చులో పడేలా చేయడంలో సుబ్బారావు దంపతులు క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఘటన జరిగిన గత నెల 23వ తేదీ ఉదయం సర్రాయిలో గ్రామ వికాస్ కార్యక్రమానికి కిడారి, సోమలు అరకు నుంచి బయల్దేరారని తెలియగానే, మావోలు మాటు వేసిన లివిటిపుట్టు వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో కూడా సుబ్బారావు మరికొంతమంది సహకారంతో క్రియాశీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. వై జంక్షన్లో ట్రాఫిక్ మళ్లింపు ఘటన జరిగిన రోజు ఉదయం నుంచే వై జంక్షన్‌గా పిలువబడే డుంబ్రిగుడ– గుంటచీమ– లివిటిపుట్టు రోడ్డులో సుబ్బారావు సివిల్ దుస్తుల్లో ఉన్న మావోలతో కలసి ట్రాఫిక్ మళ్లించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. ఆ రోజంతా ఆ జంక్షన్‌లోనే ఆయన హల్చల్ చేశారని, నిత్యం వందలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే ఈ వై జంక్షన్ వద్ద ఘటన జరిగిన రోజున జనసంచారం లేకుండా చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో మావోల నుంచి తప్పించుకునేందుకు కారును మళ్లించేందుకు యత్నించగా.. గుర్తుతెలియని లారీ ఒకటి తమ వాహనాన్ని అడ్డుకుందంటూ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన విషయం తెలిసిందే. అంతమంది మావోలు అక్కడ మాటు వేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను అడ్డగించి ముట్టడించిన సమయంలో ఆ లారీ అటువైపుగా ఎలా వచ్చింది? సోమ కారును ఎందుకు అడ్డగించింది? ముందే ఆ ప్రాంతంలో ఉంచారా? అసలు ఆ లారీ ఎవరిది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సుబ్బారావు భార్య మరికొంతమంది స్థానికులతో కలిసి మావోలకు ఆ రోజు భోజనాలు పెట్టినట్టు సిట్ గుర్తించింది. హెచ్ఎం చెండా ఏలియా అడ్డగింపు నిషేధిత ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ గిరిజన్ రైట్స్ (ఓపీజీఆర్) వ్యవస్థాపకుడు, ప్రస్తుతం గూడా హైస్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న చెండా ఏలియాను బుధవారం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించడం కలకలం రేపింది. హుకుంపేట మండలం గూడ రోడ్డులో కారులో వెళ్తున్న తనను ముందుగా ఓ వ్యక్తి ఆపి కారు దింపారని, తర్వాత మరో ముగ్గురు తన వద్దకు రాగా.. తృటిలో తప్పించుకున్నట్టు ఏలియా స్థానిక మీడియాకు వివరించారు. వాస్తవానికి ఏలియా నుంచి కొంత సమాచారం రాబట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా మంగళవారం అరకు పోలీసులు కోరారు. అయితే ఆయన తనకు ఆరోగ్యం బాగోలేదు.. రేపు వస్తానని చెప్పినట్లు తెలిసింది. -
మావోలకు టీడీపీ నేతల సహకారం.. నిఘా వైఫల్యం
ఇద్దరు ప్రముఖుల హత్యకు స్కెచ్ వేశారు.. పలుమార్లు మాటేశారు.. ఇంకెన్నోసార్లు రెక్కీలు చేశారు.. అయినా పోలీస్ వ్యవస్థ పసిగట్టలేకపోయింది.. నిఘా వ్యవస్థ నిద్రపోయింది.. సొంత పార్టీ నేతలే ఉప్పందిస్తున్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులూ పట్టుకోలేకపోయాయి.. ఇన్ని వైఫల్యాల ఫలితమే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యాకాండ.. సిట్ విచారణలో ఇవే అంశాలు ఒక్కొక్కటిగా నిర్థారణ అవుతున్నాయి.. హత్యాకాండ అనంతరం అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్ల విధ్వంసంలోనూ పలువురు మావోయిస్టులు పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటన్నింటికీ మించి.. ఒత్తిడితోనో, బెదిరింపులవల్లో.. ఏ కారణాలతోనో.. టీడీపీ కిందిస్థాయి నేతలే మావోలకు వేగులుగా, ఇన్ఫార్మర్లుగా మారి.. తమ అగ్రనేతల కదలికల సమాచారాన్ని మావోలకు చేరవేయడం.. హత్యాకాండ కోసం వచ్చిన దళ సభ్యులకు భోజన, వసతి కల్పించినట్లు తేటతెల్లడం కావడం కలకలం రేపుతోంది.ఈ హత్యల్లో ప్రతిపక్షం కుట్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలను రాజకీయ లబ్ధికోసం చేసినవిగా తేల్చేస్తున్నాయి. విశాఖపట్నం : అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు మావోలు పలుమార్లు ప్రయత్నించినా పోలీసులు పసిగట్టలేకపోయారన్న వాదన తెరపైకి వచ్చింది. నాలుగైదుసార్లు ప్రయత్నించిన వారు.. చివరికి లివిటిపుట్టు వద్ద సెప్టెంబర్ 23న సాధించగలిగారని అంటున్నారు. అక్కడికి సరిగ్గా రెండు రోజుల ముందు సెప్టెంబర్ 21న పెదబయలు మండలం పెదగూడ పంచాయతీలోని కోయాపల్లిలో కిడారి, సోమలను హతమార్చేందుకు మావోలు మాటు వేశారని.. ఆరోజు కిడారి వచ్చినా, సోమ రాకపోవడంతో వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అంతకు ముందు బొంగరం సమీపంలోని కుంటమామిడి వద్ద కూడా ప్రయత్నించి విఫలమయ్యారంటున్నారు. బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉందని గొప్పగా చెప్పుకునే పోలీసులు వీటిలో ఏ ఒక్కదాన్నీ పసిగట్టలేకపోవడం తలదించుకునేలా చేసింది. టీడీపీ నేతల సహకారంతోనే స్కెచ్ టీడీపీ సీనియర్ నాయకుడు, తూటంగి మాజీ ఎంపీటీసీ యేడెల సుబ్బారావు, అతని భార్యతోపాటు కొందరు కిడారి, సోమ అనుచరులు సహకరించడంతో మావోల పని సులువైంది. వారి సహకారంతోనే స్కెచ్ వేసి కిడారి, సోమలను రప్పించేలా లివిటిపుట్టు వద్ద ఉచ్చు పన్ని, మాటు వేశారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం ఇదే నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. సుబ్బారావు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. పోతంగి పంచాయతీ అంత్రిగుడకు చెందిన కమల, శోభన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఘటనకు ముందురోజు(శనివారం) రాత్రి సాధారణ దుస్తుల్లో ఉన్న ఇద్దరు మావోలకు అన్నం పెట్టినట్లు విచారణలో కమల అంగీకరించినట్టు తెలుస్తోంది. శోభన్ కూడా ఇదే విషయం విచారణలో చెప్పినట్లు సమాచారం. వీరితో పాటు తాజాగా మాజీ మావోయిస్టు కామరాజు సోదరుడు, టీడీపీ నాయకుడైన బిసోయి మూర్తి, టీడీపీకే చెందిన తూటంగి దతూర్ గ్రామ మాజీ సర్పంచ్ కుంతర్ల సుబ్బారావులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. టీడీపీ మాజీ ఎంపీపీ ధనేరావును ఇప్పటికే విచారిస్తున్న పోలీసులు.. మరింత సమాచార సేకరణలో భాగంగా వ్యూహాత్మకంగా అతడ్ని మంగళవారం బయటకు పంపినట్లు చెబుతున్నారు. మరో వైపు లివిటిపుట్టు పరిసర గ్రామాలకు చెందిన సుమారు పదిమందిని అదుపులోకి తీసుకొని విలువైన సమాచారం రాబట్టినట్లు తెలిసింది. వీరిందరిపై కేసులు నమోదు చేసే అవకాశాలుండగా.. అంతా టీడీపీకీ చెందినవారే కావడంతో కేసులు నమోదు చేస్తే ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయోనన్న ఆందోళన సిట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ హత్యాకాండ వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నవేనని తేల్చేస్తున్నాయి. విధ్వంసంలోనూ మావోలు? లివిటిపుట్టులో హత్యాకాండ అనంతరం డుంబ్రిగుడ, అరుకు పోలీస్ స్టేషన్లపై జరిగిన దాడి, దహనంలోనూ మావోల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ దుస్తుల్లో కొంతమంది మావోలు ఆందోళనకారులతో కలిసిపోయి పోలీస్‌స్టేçషన్లపై దాడికి ఆజ్యం పోశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూతవేటు దూరంలోనే అరుకు పోలీసులు, ఏపీఎస్పీ బలగాలు ఉన్నప్పటికీ ఆందోళనకారుల్లో కలిసి ఉన్నారన్న భయంతోనే ముందడుగు వేయలేకపోయారంటునారు. విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మావోలు కాల్పులకు దిగడం లేదా బాంబులు వేసే ప్రమాదముందని, అదే జరిగితే భారీగా ప్రాణనష్టం వాటిల్లే ముప్పును గుర్తించే వెనకడుకు వేయాల్సి వచ్చిందని ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోపక్క కిడారి, సోమలు హత్యకు గురైన విషయం క్షణాల్లోనే మీడియా ద్వారా పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ వారు సకాలంలో స్పందించకపోవడం వల్లే మావోలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి నలువైపుల నుంచి కూంబింగ్ చేపట్టి ఉంటే కొంతమందైనా మావోలు చిక్కేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.