ఉప్పందించింది గంజాయి వ్యాపారులే? | New dimensions in the case of Kidari Sarveswara Rao and Soma Murders | Sakshi
Sakshi News home page

ఉప్పందించింది గంజాయి వ్యాపారులే?

Published Wed, Sep 26 2018 3:25 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

New dimensions in the case of Kidari Sarveswara Rao and Soma Murders - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యోదంతం వెనుక గంజాయి వ్యాపారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిచ్చిన సమాచారంతోనే మావోయిస్టులు పక్కా వ్యూహంతో దాడికి దిగి హతమార్చినట్లు భావిస్తున్నారు. గంజాయి వ్యాపారులు, ఎమ్మెల్యే కిడారి మధ్య ఇటీవల విబేధాలు తలెత్తినట్లు చెబుతున్నారు. అందువల్లే ఎమ్మెల్యే కదలికలను వారు ఎప్పటికప్పుడు మావోయిస్టు ఇన్‌ఫార్మర్లకు చేరవేసినట్లు తెలిసింది. ఈ సమాచారంతోనే మావోయిస్టులు దాడి జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు.

చర్చికి వెళ్లాలని బయల్దేరి...
అరకులో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ శనివారం రాత్రి విజయవాడ నుంచి అరకు చేరుకున్నారు. ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ నెల 23వతేదీన కుటుంబంతో కలసి స్వగ్రామం బత్తివలసలోని చర్చికు వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అదే సమయంలో తనతోపాటు రావాలని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కోరడంతో కాదనలేక ఆయన వెంట వాహనంలో బయల్దేరారు. ఎమ్మెల్యేతోపాటు వెళ్తున్నట్లు డుంబ్రిగుడ ఎస్‌ఐకి సమాచారం ఇవ్వడంతో.. ‘మీరు వెళ్లండి ఏం పర్వాలేదు.. నేను మీ వెనక తర్వాత వస్తా..’ అని చెప్పారని సోమ అనుచరులు పేర్కొంటున్నారు. సోమ అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న గంజాయి వ్యాపారులు మావోయిస్టు ఇన్‌ఫార్మర్లకు ఉప్పందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్‌ బందోబస్తు లేకుండా కిడారి, సోమ ఒంటరిగా వçస్తున్నట్లు నిర్ధారించుకున్న అనంతరం మావోయిస్టులు కార్యాచరణకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన రోజు ప్రజా ప్రతినిధుల అనుచరులు ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారు..? ఏం మాట్లాడారనే అంశాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు. 

అక్కడ ఫోన్లు పనిచేయలేదా?
ఘటన అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ లివిటిపుట్టులో సిగ్నల్స్‌ పనిచేయకపోవడం వల్ల పూర్తి సమాచారం రాలేదని చెప్పగా.. హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు ఫోన్‌లో తెలియజేశామని కిడారి, సోమ అనుచరులు పేర్కొనడం గమనార్హం.

మన్యంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు..
విశాఖ మన్యంలో సుమారు పాతిక వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానిక గిరిజనులను అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున గంజాయి సాగు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. గంజాయి సాగు నిల్వ, రవాణా విషయంలో అడ్డంకులు సృష్టించకుండా ఉండేందుకు పోలీస్, ఎక్సైజ్‌ సిబ్బంది, అధికార పార్టీ నేతలకు వ్యాపారులు నెలవారీ మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. 

సిట్‌ దర్యాప్తు ప్రారంభం
కిడారి, సోమ డ్రైవర్లను విచారించిన అధికారులు
పాడేరు: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనపై సిట్‌ అధికారులు అరకులో దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరి వాహనాల డ్రైవర్లు రవి, చిట్టిబాబులను విచారించిన సిట్‌ అధికారులు సంఘటన జరిగిన తీరుపై పలు విషయాలను సేకరించారు. అనంతరం లివిటిపుట్టు వద్ద సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మరోవైపు యూనిఫైడ్, గ్రేహౌండ్స్‌ పోలీసు బలగాలను మన్యానికి తరలించారు. మంగళవారం ఏజెన్సీ ప్రాంతాలకు  చేరుకున్న పోలీసు బలగాలు అరకు, డుంబ్రిగుడ మండలాల పరిధిలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. 

గన్ను పట్టిన మహిళా దండు
సాక్షి, విశాఖపట్నం/అరకులోయ: ఏవోబీ మావోయిస్టు పార్టీ ఉద్యమంలో మహిళలు కీలకంగా మారారు. మావోయిస్టు పార్టీలో గతంలో మహిళల సంఖ్య తక్కువగా ఉండేది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మహిళలు కూడా అధికంగానే ఉన్నారు. ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలతో పాటు, తన కుమారుడు మున్నాను కూడా పొగొట్టుకున్న మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే.. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న తర్వాత మళ్లీ ఏవోబీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేశారనే విషయం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలతో తెలుస్తోంది. దీనికి మహిళా మావోలను ఆయన సన్నద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాలతో పాటు, సరిహద్దులోని ఒడిశా పల్లెల్లో మావోయిస్టు ఉద్యమంపై అగ్రనేతలు ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి అనేక గ్రామాల గిరిజన యువత  ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. వీరిలో 17 ఏళ్లు దాటిన గిరిజన యువతులే అధికంగా ఉన్నట్టు సమాచారం. విశాఖ ఏజెన్సీ, ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజన యువతులు వందల సంఖ్యలో మావోయిస్టు పార్టీలో చేరినట్టు గతంలో ప్రచారం జరిగింది.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు క్యాడర్‌లో మహిళలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏవోబీలో యువతకు పెద్దఎత్తున శిక్షణ ఇచ్చారని, ఈ శిక్షణలో గిరిజన యువతులు కూడా ఎక్కువగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత నెలలో ఏవోబీలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరిగాయి. ఒడిశాతో పాటు, విశాఖ ఏజెన్సీ మారుమూల గ్రామాలలోను గిరిజనులతో సమావేశాలు నిర్వహించిన సమయంలో మహిళా మావోయిస్టులే కీలకపాత్ర వహించారు. ఆయుధాలు చేతబూనిన మహిళా దండును చూసినట్లు గిరిజనులు చెబుతున్నారు. విశాఖ ఏజెన్సీ కోరుకొండ, పెదబయలు దళాలతో పాటు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌ జిల్లాల్లో పలు దళాలలో మహిళలు అధికంగా ఉన్నట్లు సమాచారం. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల వాహనాలను ముట్టడించిన వారిలో మహిళా మావోయిస్టులే అధికంగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళా మావోయిస్టులే వారిని తుపాకులతో కాల్చి చంపారు.ఇది మహిళా మావోయిస్టులతో చేపట్టిన తొలి ఆపరేషన్‌గా ఏజెన్సీలో ప్రచారం జరుగుతుంది.  

రెండేళ్లుగా భారీగా రిక్రూట్‌మెంట్‌
ఏవోబీలో మావోలు బలపడుతున్నారని లివిటిపుట్టు ఘటనతో తేటతెల్ల మవుతోంది. గత రెండేళ్లలో భారీగా రిక్రూట్‌మెంట్‌ జరిగిందన్నది నిన్నటి ఘటనలో పాల్గొన్న మావోల వయసును బట్టి స్పష్టమవుతోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం లివిటిపుట్టు ఆపరేషన్‌లో పాల్గొన్న వారిలో అత్యధికులు 18–20 ఏళ్ల లోపు వారే ఎక్కువ. దీంతో రిక్రూట్‌మెంట్‌ జరగడం లేదన్న పోలీసుల వాదన తప్పని రుజువైంది. సాక్షుల చెప్పిన సమాచారాన్ని బట్టి కాల్పుల్లో పాల్గొన్న వారు గుత్తుకోయల, కొందూస్‌ తెగకు చెందిన వారిగా భావిస్తున్నారు. గుత్తుకోయల తెగకు చెందిన వారు తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో ఉంటారు. ఇక కొందూస్‌ తెగకు చెందిన వారు ఒడిశా–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో ఉంటారు. కిడారి ఆపరేషన్‌లో పాల్గొన్న వారు తెలుగు మాట్లాడుతుండటంతో వీరంతా తెలంగాణ, ఏపీకి చెందిన వారేనని భావిస్తున్నారు. ఎక్కువ మంది తెలంగాణ యాసలో మాట్లాడారని సాక్షులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement