సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీ మారితే గిరిజన కోటాలో మంత్రి పదవి ఇస్తామని అధికార తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని ఇటీవల విశాఖ మన్యంలో మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వెల్లడించినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. కాల్పుల కంటే ముందు కిడారిని మావోయిస్టులు లోతుగా ప్రశ్నించారని, ఆయన పలు సంచలనాత్మక విషయాలు బయటపెట్టారని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేశారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... అధికార పార్టీలో చేరినందుకు రూ.12 కోట్లు ఇచ్చారని, విశాఖ మన్యంలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు మంత్రి నారా లోకేశ్ తనకు లైసెన్స్‌లు ఇప్పించారని కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల ఎదుట ఒప్పుకున్నారు. తాను కొన్ని తప్పులు చేశానని, మైనింగ్ ఆపేస్తానని, రాజకీయాలు కూడా మానేస్తానని, ఇందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆయన వేడుకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను సైతం మావోలు ప్రశ్నించారు. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే కిడారితో కలిసి తిరగాలని ముఖ్యమంత్రి తనకు చెప్పారని సోమ అన్నారు. బాక్సైట్ క్వారీలతో ఎమ్మెల్యే తనకు 25 శాతం వాటా ఇచ్చారని, పెట్టుబడి ఆయనే పెడతామన్నారని, ఈ మేరకు తమ పార్టీ కూడా చెప్పిందని మావోయిస్టుల ఎదుట అంగీకరించారు.
మావోయిస్టులు, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణ
మావోలు: పార్టీ ఎందుకు మారావు?
కిడారి: గిరిజనుల కోటాలో మంత్రి పదవి ఇస్తామన్నారు.
మావోలు: పార్టీ మారినందుకు ఎంత డబ్బు తీసుకున్నావు?
కిడారి: 12 కోట్లు. (తొలుత మౌనం. డ్రైవరుతో ఆరా. నాకు తెలియదన్నాక కిడారిని గట్టిగా గద్దించడంతో వెల్లడి)
మావోలు: వద్దని చెప్పినా మైనింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నావు. లైసెన్స్‌లు ఎలా వచ్చాయి?
కిడారి: మంత్రి నారా లోకేశ్ ఇప్పించారు. అన్నీ ఆయనే చూసుకుంటామన్నారు.
మావోలు: అయితే, వద్దనా మైనింగ్ చేస్తావా?
కిడారి: కొన్ని తప్పులు చేశా. మైనింగ్ ఆపేస్తా. ఇక చేయను, ఈ మేరకు రాసిస్తా. రాజకీయాలు కూడా మానేస్తా. రెండు రోజులు సమయం ఇవ్వండి.
మావోలు: ఇంకా ఏమేం ఒప్పందాలు ఉన్నాయి?
కిడారి: ఇంకెప్పటికీ, ఇంకేమీ చేయను.
మావోలు: చేసిందంతా ఒక ఎత్తయితే... ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నావు. కొత్తగా రెండు వాహనాలు కొన్నావు కదా!
కిడారి: అవును. ట్రైకార్ సంస్థ ద్వారా రుణం తీసుకున్నా. 35 శాతం సబ్సిడీ, ఎమ్మెల్యే అలవెన్స్ ఉంది.
మావోలు: అంత విలాసవంతమైన జీవితం కావాలా?
కిడారి: మౌనం.
సివేరి సోమతో మావోయిస్టుల సంభాషణ
మావోలు: నువ్వు వాడితో(కిడారి) కలిసి ఎందుకు తిరుగుతున్నావు?
సివేరి: ఎమ్మెల్యే పార్టీ మారి వచ్చినందున కలిసి తిరగమని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని కార్యక్రమాలు, ఫంక్షన్లకు కూడా కలిసే వెళ్లమన్నారు.
మావోలు: క్వారీలు వద్దన్నాం, బాక్సైట్ తవ్వొద్దని చెప్పాం కదా!
సివేరి: నాకు ఎమ్మెల్యే 25 శాతం వాటా ఇచ్చారు. పెట్టుబడి ఆయనే పెడతామన్నారు. ఈ మేరకు పార్టీ కూడా చెప్పింది.
పాలకులతో కుమ్మక్కై మోసం చేస్తావా?
మా వద్ద నీకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయంటూ ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు పలు అంశాలపై నిలదీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉన్నది ఉన్నట్లు అంగీకరించానని, ఇకపై ఎలాంటి తప్పులు చేయనని, తనను వదిలిపెట్టాలని, రెండు రోజులు అవకాశం ఇవ్వాలని కిడారి మొరపెట్టుకున్నారని చెప్పారు. గిరిజనులను బాగుచేస్తానని చెప్పి, బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఇప్పుడు వారి బతుకులనే దెబ్బతీసేలా అధికార పార్టీతో చేతులు కలుపుతావా? పాలకులతో కుమ్మక్కై ఇలా ఎంతకాలం మోసం చేస్తావు? నీలాంటి వాడు బతకడానికి వీల్లేదు, నీ ఖేల్ ఖతం అంటూ కిడారిపై తుపాకులు ఎక్కుపెట్టి గుళ్లవర్షం కురిపించినట్లు సమాచారం.
ఉలిక్కిపడ్డ టీడీపీ పెద్దలు
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య గురించి తెలియగానే అధికార పార్టీ ముఖ్య నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటన ఎలా జరిగిందనే అంశం కంటే ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ముందుగా ఆ సంగతులు తెలుసుకోండి అంటూ వారు ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నందున తక్షణమే నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ పనిపైనే దృష్టి పెట్టారు. మావోయిస్టులు, ఎమ్మెల్యే మధ్య జరిగిన సంభాషణ అప్పటికే బయటకు రావడంతో... ‘‘ప్రత్యక్ష సాక్షుల నుంచి ఒక్క విషయం కూడా బయటకు పొక్కకూడదు. ఎమ్మెల్యే కొనుగోలు సంగతిని బయటకు రానివ్వొద్దు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో తెలియదు. వాళ్ల నోళ్లు నొక్కేయండి. ఒక్క మాట బయటకొచ్చినా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త’’ అంటూ అధికార పార్టీ పెద్దల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు అత్యవసర ఆదేశాలు అందినట్లు తెలిసింది.
ప్రత్యక్ష సాక్షుల మాటలు మార్పించండి
ప్రత్యక్ష సాక్షులు ఇప్పటివరకు చెప్పిన మాటలను స్వయంగా వారితోనే మార్చి చెప్పించాలనే పోలీసు ఉన్నతాధికారుల నుంచి స్థానిక అధికారులకు ఆదేశాలు అందుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అప్పుడు ఏదో ఆందోళనతో అలా చెప్పామనే కోణంలో మళ్లీ మాట్లాడించాలని సూచిస్తున్నట్లు సమాచారం.
తప్పుడు ప్రచారం చేద్దాం..
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, వారు చెప్పకుండా, తమ సూచనలు లెక్కచేయకుండా వెళ్లారని, మావోయిస్టులతో చర్చించి ఒప్పందాలు చేసుకోవడానికే వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వాలని, దాన్నే ఎక్కువగా ప్రచారం చేయాలనే సూచనలు ఉత్తరాంధ్రలోని టీడీపీ నేతలకు పార్టీ ముఖ్యుల నుంచి వెళ్లినట్లు తెలిసింది. తద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై చర్చ జరగకుండా చూడాలనేది టీడీపీ ఎత్తుగడగా తెలుస్తోంది. పోలీసుల చేతగానితనాన్ని కూడా ప్రత్యేకంగా ప్రచారం చేయాలని కూడా అంటున్నట్లు వినికిడి.
మావోల వద్ద సమాచారం నిక్షిప్తం
అధికార పార్టీ తన అనుకూల మీడియా ద్వారా తిమ్మినిబమ్మి చేస్తుందని మావోయిస్టులు గ్రహించినట్లు సమాచారం. అందుకే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలతో జరిగిన సంభాషణలను వ్యూహాత్మకంగా రికార్డు చేసినట్లు తెలిసింది. సాధారణంగా ఏదైనా సంఘటనకు పాల్పడిన తరువాత మావోయిస్టులు అధికారికంగా మీడియాకు లేఖలు విడుదల చేస్తారు. ఆ లేఖల్లో మరెన్ని వివరాలు ఉంటాయో, ఎలాంటి లోగుట్లు బయటకు వస్తాయో అనే ఆందోళన కూడా తమ పార్టీ ముఖ్య నేతల్లో ఉందని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.
గిరిజన ద్రోహులైనందుకే...
ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని మావోయిస్టులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకునే ముందు ఆయన తీవ్ర భయాందోళనలతో తనతోపాటు వాహనంలో ఉన్న వారితో పలు అంశాలను ప్రస్తావించారు. డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు, అంగరక్షకులు, ఇతర నాయకులు ఎమ్మెల్యేతోపాటు ఉన్నారు. ఈ రోజు మావోయిస్టుల చేతిలో చచ్చాంరా... అని కిడారి వ్యాఖ్యానించినట్లు డ్రైవర్ రవి మీడియాకు చెప్పారు. ‘‘నన్ను బాక్సైట్ తవ్వకాల గురించి అడిగారు. వైకాపా నుంచి టీడీపీలోకి మారినందుకు ఎంత తీసుకున్నారో తెలుసా? అని ప్రశ్నించారు’’ అని రవి వివరించారు. కిడారి, సివేరిలు గిరిజన ద్రోహులైనందునే చంపుతున్నామని మావోయిస్టులు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్ స్వామి, కిడారి పీఏ అప్పారావు వెల్లడించారు. ‘‘ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని మాత్రం కొద్దిదూరం తీసుకెళ్లారు. స్థానికులతో కొంతమంది మావోయిస్టులు చెట్టు కింద సమావేశం నిర్వహించారు. ఆ తరువాత కాల్పులు జరిగాయి’’ అరకు మాజీ సర్పంచి చటారి వెంకటరాజు తెలిపారు.
స్థానికుల సమక్షంలోనే ప్రశ్నించిన మావోలు
వాహనాన్ని అడ్డగించి తమ అదుపులోకి తీసుకోబోయే సమయంలో వ్యూహంలో భాగంగానే పలువురు స్థానికులను మావోయిస్టులు వెంట పెట్టుకుని వెళ్లారు. ఆ సందర్భంగానూ మావోయిస్టులు, ఎమ్మెల్యే మధ్య మాటలు జరిగాయి. సివేరి సోమ విషయంలోనూ దాదాపు ఇదేవిధంగా జరిగింది. వీటికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలనే ఉద్దేశంతోనే స్థానికులను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ‘‘ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి గిరిజనులే. వారిని చంపేస్తే గిరిజనులు ఆగ్రహించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సహకరించకపోవచ్చు. తమ కదలికలను పోలీసులకు తెలియజేయవచ్చు. వాటన్నింటి దృష్ట్యానే స్థానికులను వెంట తీసుకెళ్లారు. వారి సమక్షంలోనే అన్ని వివరాలు రాబట్టారు. ఆ తరువాతే కాల్చారు’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు విశ్లేషించారు. ఎమ్మెల్యే అమ్ముడుపోయిన విషయాన్ని గిరిజనుల మధ్య నిరూపించాలన్నదే మావోల ఎత్తుగడ అని పేర్కొన్నారు. తమ సమక్షంలోనే మావోయిస్టులు పలు ప్రశ్నలు అడిగినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.
సంభాషణలు బట్టబయలు
కిడారి, సివేరిల హత్యకు ముందు ముగ్గురు గన్‌మెన్‌లు, ఇద్దరు డ్రైవర్లు, కిడారి పీఏ అప్పారావు, అరకు మాజీ సర్పంచ్ వెంకట్రాజు, నాయకురాలు లావణ్య తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వీరితోపాటు తమకు నమ్మకస్తులైన వారిని కూడా మావోలు వెంట తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత వేర్వేరుగా కాల్చి చంపారు. సంఘటన జరిగిన తరువాత దాదాపు ఆరేడు గంటలపాటు పోలీసుల జాడ లేదు. ఈలోగానే ప్రత్యక్ష సాక్షులు తమ కళ్లెదుట జరిగిన సంఘటనను హతుల కుటుంబీకులకు, మిత్రులు, బంధువులకు, పార్టీ ముఖ్య నాయకులకు చేరవేశారు. సంఘటనా స్థలం నుంచి అరకు పోలీసుస్టేషన్ వద్దకు మృతదేహాలను సొంత వాహనాల్లో తీసుకొచ్చేటప్పుడు మార్గమధ్యంలోని గ్రామాల్లో ప్రజల డిమాండ్ మేరకు ఆగారు. ఆ సమయంలో కూడా జరిగిన సంఘటనను వివరించారు. దీంతో సంభాషణల వ్యవహారం బట్టబయలైంది.
Comments
Please login to add a commentAdd a comment