సుబ్బారావు
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలు ఏ స్థాయిలో సహాయ సహకారాలు అందించారో విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. టీడీపీ నేతల సహకారంతోనే మావోలు పక్కా స్కెచ్ అమలు చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కదలికలు ఎప్పటికప్పుడు టీడీపీ నేతల ద్వారా తెలుసుకుని, మాటు వేసి మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు వై.సుబ్బారావు కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మావోల ఉచ్చులో పడేలా చేయడంలో సుబ్బారావు దంపతులు క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఘటన జరిగిన గత నెల 23వ తేదీ ఉదయం సర్రాయిలో గ్రామ వికాస్ కార్యక్రమానికి కిడారి, సోమలు అరకు నుంచి బయల్దేరారని తెలియగానే, మావోలు మాటు వేసిన లివిటిపుట్టు వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో కూడా సుబ్బారావు మరికొంతమంది సహకారంతో క్రియాశీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది.
వై జంక్షన్‌లో ట్రాఫిక్ మళ్లింపు
ఘటన జరిగిన రోజు ఉదయం నుంచే వై జంక్షన్‌గా పిలువబడే డుంబ్రిగుడ– గుంటచీమ– లివిటిపుట్టు రోడ్డులో సుబ్బారావు సివిల్ దుస్తుల్లో ఉన్న మావోలతో కలసి ట్రాఫిక్ మళ్లించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. ఆ రోజంతా ఆ జంక్షన్‌లోనే ఆయన హల్‌చల్ చేశారని, నిత్యం వందలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే ఈ వై జంక్షన్ వద్ద ఘటన జరిగిన రోజున జనసంచారం లేకుండా చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో మావోల నుంచి తప్పించుకునేందుకు కారును మళ్లించేందుకు యత్నించగా.. గుర్తుతెలియని లారీ ఒకటి తమ వాహనాన్ని అడ్డుకుందంటూ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన విషయం తెలిసిందే. అంతమంది మావోలు అక్కడ మాటు వేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను అడ్డగించి ముట్టడించిన సమయంలో ఆ లారీ అటువైపుగా ఎలా వచ్చింది? సోమ కారును ఎందుకు అడ్డగించింది? ముందే ఆ ప్రాంతంలో ఉంచారా? అసలు ఆ లారీ ఎవరిది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సుబ్బారావు భార్య మరికొంతమంది స్థానికులతో కలిసి మావోలకు ఆ రోజు భోజనాలు పెట్టినట్టు సిట్ గుర్తించింది.
హెచ్‌ఎం చెండా ఏలియా అడ్డగింపు
నిషేధిత ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ గిరిజన్ రైట్స్ (ఓపీజీఆర్) వ్యవస్థాపకుడు, ప్రస్తుతం గూడా హైస్కూల్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న చెండా ఏలియాను బుధవారం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించడం కలకలం రేపింది. హుకుంపేట మండలం గూడ రోడ్డులో కారులో వెళ్తున్న తనను ముందుగా ఓ వ్యక్తి ఆపి కారు దింపారని, తర్వాత మరో ముగ్గురు తన వద్దకు రాగా.. తృటిలో తప్పించుకున్నట్టు ఏలియా స్థానిక మీడియాకు వివరించారు. వాస్తవానికి ఏలియా నుంచి కొంత సమాచారం రాబట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా మంగళవారం అరకు పోలీసులు కోరారు. అయితే ఆయన తనకు ఆరోగ్యం బాగోలేదు.. రేపు వస్తానని చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment