కిడారి కుటుంబానికి రూ.కోటి సాయం  | One crore to the Kidari Family | Sakshi
Sakshi News home page

కిడారి కుటుంబానికి రూ.కోటి సాయం 

Sep 29 2018 5:01 AM | Updated on Oct 9 2018 2:53 PM

One crore to the Kidari Family - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యంలో హింసకు తావుండదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మావోయిస్టుల చేతిలో మృత్యువాతపడిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను పాడేరులో, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను అరకులో శుక్రవారం సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బాౖMð్సట్‌ గనులను తవ్వబోమని తాము స్పష్టమైన హామీ ఇచ్చినా మావోయిస్టులు దీన్ని నెపంగా చూపడం సముచితం కాదని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకులను దారుణంగా చంపారంటే జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. మావోలకు ఇది మంచి పద్ధతి కాదన్నారు.

ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. కిడారి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. కిడారి రెండో కుమారుడు సందీప్‌కుమార్‌కు ప్రభుత్వశాఖలో గ్రూప్‌–1 ఉద్యోగం ఇస్తామన్నారు. కుటుంబంలోని నలుగురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పార్టీపరంగా సహాయం చేస్తామన్నారు. పాడేరులో కిడారి మెమోరియల్‌ నిర్మిస్తామన్నారు. కిడారి పెద కుమారుడు విషయంలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కిడారి కుటుంబానికి విశాఖలో ఇంటిస్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామన్నారు. అదేవిధంగా సివేరి సోమ కుటుంబంలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఏడుగురికి రూ.70 లక్షలు ప్రభుత్వపరంగా అందజేయడంతోపాటు పార్టీపరంగా తలో రూ.5 లక్షలు చొప్పున ఇస్తామని తెలిపారు. సోమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు విశాఖలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. అరకులో మధ్యలో నిలిచిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి పట్టా మంజూరు చేస్తామని తెలిపారు.

లోతైన పరిశీలన జరపాల్సి ఉంది..: నిఘా వైఫల్యంపై తొందరపడి మాట్లాడడం సరికాదని సీఎం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చూస్తామని, ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. వాళ్లు(మావోయిస్టులు) వచ్చిన విధానం.. హతమార్చిన తీరుపై లోతైన పరిశీలన జరపాల్సిన అవసరముందన్నారు. జరిగిన ఘటనపై సమీక్షించుకుంటామని చెప్పారు.  మంత్రులు చినరాజప్ప, ఆనందబాబు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పంచకర్ల రమేష్‌బాబు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, డీజీపీ ఠాకూర్, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement