విశాఖ సిటీ: బహుళ జాతి సంస్థలకు ఏజెంట్లుగా మారి కోట్లాది రూపాయల ఆదివాసీల సహజ సంపదను కొల్లగొడుతున్నందునే ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చామని మావోయిస్టులు ప్రకటించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ(ఏఓబీఎస్‌జెడ్‌సీ) లెటర్ హెడ్‌పై అధికార ప్రతినిధి జగబంధు పేరుతో శుక్రవారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు.
మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు కూడా లేటరైట్ పేరుతో బాౖక్సైట్‌ను దోచుకుంటున్నారని, ఆపకపోతే తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కిడారి, సోమ హత్య జరిగిన వారం రోజుల తర్వాత ఆ హత్యల గురించి ఎర్ర సిరా అక్షరాలతో వచ్చిన లేఖ అబద్ధమని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో లేఖ బయటకు వచ్చినా అందులో కిడారి, సోమ హత్యల గురించి మావోలు చెప్పలేదు. తాజాగా విడుదలైన లేఖలో మాత్రం హతమార్చడానికి దారితీసిన పరిస్థి తులు, జరుగుతున్న మోసాల గురించి వివరిస్తూ.. కమిటీ లెటర్‌హెడ్‌పై లేఖ రావడంతో విశ్వసనీయత చేకూరింది. లేఖలోని సారాంశం..
వారు ఆదివాసీ ద్రోహులు
‘‘కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు ఆదివాసీ నేతలు కానే కాదు. వారు ద్రోహులు. ప్రజాసేవ ముసుగులో మామూలు స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తారు. క్వారీ యజమానులుగా, అరకు, అనంతగిరి, పాడేరు, విశాఖలో ఆస్తుల్ని, భూముల్ని అక్రమంగా గడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తూ, బాక్సైట్ వెలికితీత కోసం జిందాల్, రస్‌అల్‌ఖైమా, అన్‌రాక్‌లకు ఏజెంట్లుగా వ్యవహరించి అక్రమంగా డబ్బు వెనకేసు కున్నారు. సివేరి సోమ ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో ఇలాంటి దళారీ పాత్రలు నిర్వహించి నందుకుగాను, చైనా క్లే తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో డుంబ్రిగూడ మండలం కండ్రుం గ్రామాల ప్రజలంతా ఏకమై వెంటపడి తరి మారు. ప్రజాగ్రహానికి గురైనా తన తీరు మార్చు కోకుండా జిందాల్‌కు ఏజెంటుగా వ్యవహరించ డమే కాకుండా బాౖక్సైట్ విషయంలో ప్రజా వ్యతిరేకిగా వ్యవహరించాడు. సర్వేశ్వరరావు రోజుకో పార్టీని మారుస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా అర్రులు చాచాడు. ఆయన కొన సాగిస్తున్న క్వారీని మూసెయ్యాలనే డిమాండ్‌తో హుకుంపేట మండలం గూడ గ్రామ ప్రజలు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా అధికార అండతో ఏమాత్రం ఖాతరు చెయ్యలేదు.
సొంత పార్టీలోనే వాటికి వ్యతిరేకంగా బహిరంగంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. వీరిద్దరూ మెజార్టీ ప్రజల ఆగ్రహానికి గురైన కార ణంగా ప్రజావ్యతిరేకుల్ని, ద్రోహులను అంతం చెయ్యాలనే నిర్ణయంతోనే తమ పార్టీ పీఎల్‌జీఏ ఆధ్వర్యంలో తీర్పుని అమలు చేశాము’’ అని జగబంధు లేఖలో స్పష్టం చేశారు.
అయ్యన్నా.. మైనింగ్ మానుకో
తెలుగుదేశం ప్రభుత్వ అండదండలతో తూర్పు కనుమల్లో అటవీ సంపదను బినామీ పేర్లతోనూ, ఆదివాసీ దళారులుగా పుట్టకొకరు తయారై, క్వారీలు, గనుల్ని తెరుస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని తరలిస్తున్నారనీ, దీని వెనుక మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్‌లున్నారని తెలిపారు. మన్యం ప్రాంత సంపద అక్రమ తరలింపుని తక్షణమే నిలిపెయ్యా లనీ, లేకపోతే.. జరిగే తీవ్ర పరిణామాలకు తామే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని దళారీలను, ప్రజా వ్యతిరేక నాయకుల్ని జగబంధు హెచ్చరించారు. ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ వెలికితీత కోసం జారీ చేసిన జీవో నం.97ని పూర్తిగా రద్దు చెయ్యడమే కాకుండా, అటవీ సంపదని అక్రమంగా దోచుకునే కార్యక్రమాల్ని మానుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment