వివరాలు వెల్లడిస్తున్న సిట్ చీఫ్ ఫకీరప్ప, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ
సాక్షి, విశాఖపట్నం/ పెదవాల్తేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టుబెట్టడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉన్నట్టుగా తేటతెల్లమైంది. లివిటిపుట్టు ఘటన వెనుక వైఎస్సార్‌సీపీ హస్తం ఉందంటూ అధికార టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది. ఈ హత్యోదంతంలో మావోలకు సహకరించిన నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ ఫకీరప్ప, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఆదివారం విశాఖలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు దర్యాప్తు వివరాలను మీడియాకు వివరించారు. టీడీపీ డుంబ్రిగుడ మండల ఉపాధ్యక్షుడు యేడెల సుబ్బారావు–ఈశ్వరి దంపతులతోపాటు గెమ్మిలి శోభన్, కొర్ర కమలలు ఈ ఘటనలో కీలక సూత్రధారులని దర్యాప్తులో తేలిందని వారు తెలిపారు. వీరి సహకారంతోనే మావోయిస్టు పార్టీ కోరాపుట్ డివిజన్ దళం పక్కా వ్యూహంతో ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు గత నెల 23న సర్రాయి వద్ద గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు చుట్టుముట్టి హతమార్చిన విషయం తెలిసిందే.
300 మందిని విచారించిన సిట్: ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి 20 రోజులపాటు సుమారు 300 మందిని సిట్ విచారించింది. కిడారి, సోమలను హతమార్చడంలో మావోలకు ప్రత్యక్షంగా సహకరించినట్టుగా పేర్కొంటూ టీడీపీ నాయకుడు యేడెల సుబ్బారావు, యేడెల ఈశ్వరిలతోపాటు గెమ్మిలి శోభన్, కొర్రా కమలను అరెస్టు చేసిన సిట్ బృందం వారిని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అరెస్టయిన నలుగురూ గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటక్షన్ గిరిజన రైట్స్ (ఓపీజీఆర్) గ్రూపులో పనిచేసినట్టు సిట్ చీఫ్ ఫకీరప్ప వెల్లడించారు. రెండేళ్లుగా వరుస ఎదురు కాల్పులు, లొంగుబాట్లు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినందున ఉనికి చాటుకోవడంతోపాటు ఏజెన్సీలో అలజడిని సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రముఖ వ్యక్తుల రాకపోకల గురించి సమాచారం ఇవ్వాలని మావోయిస్టులు వీరిపై ఒత్తిడి తెచ్చారన్నారు.
మందుపాతర స్వాధీనం: నిందితుల నుంచి మావోయిస్టులు ముద్రించిన 8 కరపత్రాలు, రెండు ఎరుపు రంగు బ్యానర్లు స్వాధీనం చేసుకున్నామని సిట్ చీఫ్ తెలిపారు. 10 కిలోల సామర్థ్యం కలిగిన ఓ మందుపాతర, ఎలక్ట్రికల్ వైరును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మావో అగ్రనేతలు చలపతి, అతని భార్య అరుణ ఈ ఆపరేషన్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా తేలిందన్నారు.
మీనా 21వ ముద్దాయే
ఏవోబీ సరిహద్దులోని ఆండ్రపల్లి వద్ద ఈ నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన మావో అగ్రనేత గాజర్ల రవి భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ జిలానీ బేగం అలియాస్ మీనాను కిడారి, సోమల హత్యాకాండలో 21వ ముద్దాయిగా గుర్తించామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట మావోలు విడుదల చేసిన లేఖపై సందేహాలు వస్తున్నందున ఆ లేఖ అసలుదా? లేక నకిలీదా? అని విచారిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment