ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని షెల్టర్ కోసం వచ్చినట్లు అనుమానం
ఏవోబీ దండకారణ్యంలో జల్లెడపడుతున్న కేంద్ర బలగాలు
సరిహద్దులో పోలీసులు అప్రమత్తం.. ఔట్ పోస్టుల్లో రెడ్ అలెర్ట్
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నమావోయిస్టులు షెల్టర్ కోసం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని దండకారణ్యం ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని కేంద్ర పోలీసు బలగాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఏవోబీలోని దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కొన్నేళ్లుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టు పార్టీకి అడ్డాగా మారింది.
ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితంగా ఉంది. అక్కడి నుంచే మూడేళ్లుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కేంద్ర పోలీసు బలగాల నిర్బంధంలో ఉంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పోలీసు పార్టీలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సుమారు 79మంది కీలక నేతలు, సభ్యులను కోల్పోయింది.
కాంకేరు జిల్లాలోని మాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఏకంగా 29మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మిగిలిన క్యాడర్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న ఏపీకి చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతానికి వచ్చి తలదాచుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది.
మరోవైపు మావోయిస్టుల కార్యకలపాలను నియంత్రించాలనే లక్ష్యంతో అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒడిశా పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చింతూరుకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు.
అప్రమత్తంగా ఉన్నాం
ఏవోబీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల మరణాలు తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సరిహద్దులో పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా అధికంగా ఉంది. ఒడిశా> పోలీసు యంత్రాంగం సహకారం తీసుకుంటున్నాం. అన్ని ఔట్ పోస్టుల పరి«ధిలో రెడ్ అలర్ట్ అమలులో ఉంది. – తుహిన్ సిన్హా, ఎస్పీ, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment