పది మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా భెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా పది మంది మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతం ఏపీ, తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో మూడు రాష్ట్రాల పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజ్‌గూడ, దంతేస్‌పురం, నగరం, భండార్‌పదర్ గ్రామాల మధ్య అడవుల్లో కుంట– కిష్టారం ఏరియా నక్సల్స్ కమిటీ సమావేశమైంది.
నక్సలైట్ల సమావేశంపై పక్కా సమాచారం అందుకున్న జిల్లా, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం ఉదయం భండార్‌పదర్ గ్రామ సమీపంలో మావోలకు పోలీసులు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పరస్పర కాల్పులు మొదలయ్యాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. ఇందులో పది మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్‌రాజ్ ప్రకటించారు.
మృతుల్లో డివిజినల్ కమిటీ సభ్యుడు మద్కం మాసా, మాసా భార్య దుధీ హునీ, ఏరియా కమిటీ సభ్యురాలు లఖ్మా మాధవి, గార్డ్ కొవసీ కోసా, మద్కం జితూ, మద్కం కోసీలుగా గుర్తించారు. మద్కం మాసాపై రూ.8 లక్షలు, లఖ్మాపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది. మిగతా నలుగురిని గుర్తించాల్సి ఉంది. ఘటనస్థలం నుంచి ఇన్సాస్, ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మావోలపై ఉక్కుపాదం
దేశంలో 2026 మార్చి నాటికి మావోయి స్టులను అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ డివిజన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 207 మంది మావోలు చనిపోగా 787 మంది అరెస్ట్ అయ్యారు. 789 మంది లొంగిపోయారు. దీంతో బస్తర్ అడవుల్లో సంచరించడం మావో యిస్టు దళాలకు కష్టంగా మారింది.
నిర్బంధం పెరగడంతో దండకారణ్యం, అబూజ్‌మడ్ అడవుల నుంచి ఇతర రాష్ట్రాల్లోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు మావోలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు చనిపోయాడు.
తెలుగు మాట్లాడే ప్రాంతంలో..
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం ఏపీలోని చింతూరు, తెలంగాణలోని దుమ్ముగూడెం ప్రాంతాలకు సరిహద్దుగా ఉంది. ఇక్కడ ఉన్న ఆదివాసీ గ్రామాల పేర్లు తెలుగులో ఉండడమే కాక వారు తెలుగు కూడా మాట్లాడగలరు. ఉపాధి, విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు వచ్చివెళ్తుంటారు. ఈ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరగడంతో ఏపీ, తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెరిగిపోవడంతో ఈ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గాలిస్తున్నా ఇప్పటికీ మావోయిస్టు అగ్రనా యకత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం ఒక్కటే మావోయిస్టులకు ఊరటనిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment