గత ఐదేళ్లలో వందలాది మంది మావోయిస్టుల మృతి
ఈ ఏడాది ఇప్పటికే 187 మంది ఎన్‌కౌంటర్
ఆపరేషన్ కగార్‌తో మావోలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం
ప్రతిగా ఇన్‌ఫార్మర్ల పేరిట గిరిజనులను చంపుతున్న మావోలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాకులు దూరని కారడవిగా పేరున్న బస్తర్ జంగిల్‌లో నెత్తురు ఏరులై పారుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం తలపెట్టిన పోరు కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 187 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఆపరేషన్ గ్రీన్‌హంట్‌తో మొదలు..
దేశ భద్రతకు మావోయిస్టులను ముప్పుగా పేర్కొంటూ 2009లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేసింది. అయితే తొలినాళ్లలోనే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు ఎక్కువగా చెడ్డపేరు వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గ్రీన్‌హంట్‌కు మరింత పదునుపెట్టి ఆపరేషన్ ప్రహార్ పేరుతో ఉధృతంగా దాడులు చేసింది. దీంతో ఛత్తీస్‌గఢ్ హింసపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆ తర్వాత 2018లో ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. హస్తం పార్టీ సీఎంగా భూపేష్ బఘేల్ ఎన్నికయ్యారు. ఆయన హయాంలో మావోయిస్టులపట్ల కరుణ చూపారు. మరోవైపు కరోనా మహమ్మారి రావడంతో మావోయిస్టు ఆపరేషన్లలో తక్కువ స్థాయిలో హింస చోటుచేసుకుంది.
సూర్యశక్తి, జల్‌శక్తి పేరుతో ప్రత్యేక కార్యాచరణ
2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓటమిపాలై తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరిట ఉక్కుపాదంతో విరుచుకుపడుతోంది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను రూపుమాపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలను బస్తర్ అడవుల్లోకి పంపిస్తోంది. వేసవి కాలంలో మావోయిస్టుల అడ్డాలపై సమర్థంగా దాడి చేసేందుకు వీలుగా ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేసింది.
దీంతో జనవరి నుంచి జూన్ మధ్య 150 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులకు పట్టుండే వర్షాకాలంలో కూడా వేడి తగ్గకుండా ఉండేందుకు ఆపరేషన్ జల్‌శక్తి పేరుతో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తోంది. ఫలితంగా అడవులు దట్టంగా పరుచుకున్నా ఎన్‌కౌంటర్లు ఆగడం లేదు. దీంతో బస్తర్ అడవులు అట్టుడికిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 187 మంది మావోయిస్టులు చనిపోగా 212 మంది అరెస్టయ్యారు. మరో 201 మంది లొంగిపోయారు. దీనికి ప్రతిగా ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు పదుల సంఖ్యలో అడవి బిడ్డలను చంపుతున్నారు. ఆర్మీ క్యాంపులపైనా దాడులకు తెగబడుతున్నారు.
నాడు భారీగా ఏకే–47లు.. నేడు తూటాలకే కటకట..
పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టు పార్టీగా మారాక విస్తృతమైన ‘నెట్‌వర్క్’ అందుబాటులోకి రావడంతో ఆధునిక ఆయుధాలు మావోయిస్టుల చేతికి అందాయి. సల్వాజుడం, ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఎన్‌కౌంటర్లకు పాల్పడేందుకు రంగంలోకి దిగిన భద్రతా బలగాలపై తొలినాళ్లలో మావోయిస్టులు పైచేయి సాధించారు. ఈ క్రమంలో పలుమార్లు భద్రతా దళాల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ముఖ్యంగా 2007 మార్చి 15న సుక్మా జిల్లా తాడిమెట్ల దగ్గర జరిగిన దాడిలో భద్రతా దళాలకు చెందిన 145 ఆయుధాలను మావోయిస్టులు పట్టుకుపోయారు. అందులో ఏకంగా 125 ఏకే–47లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2001 నుంచి 2024 ఆగస్టు వరకు భద్రతా దళాలకు చెందిన 516 ఆటోమెటిక్ రైఫిల్స్‌ను మావోయిస్టులు ఎత్తుకుపోయారు. కానీ ఆపరేషన్ గ్రీన్‌హంట్, ఆపరేషన్ ప్రహార్, కగార్‌లతో తీవ్ర నిర్బంధం, దాడులు పెరగడం వల్ల మావోయిస్టు దళాల్లో రిక్రూట్‌మెంట్లు తగ్గిపోయాయి. దీంతో దళాల్లో సభ్యుల సంఖ్య కూడా కుచించుకుపోతోంది. దీంతో భద్రతా బలగాలను ఒత్తిడిలోకి నెట్టేందుకు వీలుగా తమ వైపు నుంచి ఎటాక్ తీవ్రంగా ఉండేలా డివిజన్ కమిటీ స్థాయి సభ్యులకు సైతం ఆధునిక ఆయుధాలు ఇచ్చేందుకు మావోయిస్టులు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ«టోమేటిక్ రైఫిల్స్ కలిగి ఉండే విషయంలో మావోలకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ వాటి కోసం ఉపయోగించే తూటాల విషయంలో కొరత ఎదురవుతున్నట్లు తెలిసింది. గతంతో పోలిస్తే తూటాల సరఫరాకు మార్గాలు చాలావరకు మూసుకుపోవడమే ఇందుకు కారణం. అందువల్లే గత నెలలో బస్తర్‌లో నాలుగైదుసార్లు భద్రతా దళాల క్యాంపులపై దాడులకు పాల్పడినా మావోలు భారీస్థాయిలో కాల్పులు చేపట్టలేదు. కేవలం అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్లతోనే దాడులు చేశారు.
తెలంగాణలో నిలదొక్కుకోలేక..
ఛత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరగడంతో తెలంగాణలో తిరిగి నిలదొక్కుకోవడానికి మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఏడుగురు నక్సల్స్ చనిపోయారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇటీవల జరిగిన కరకగూడెం ఎన్‌కౌంటర్ అతిపెద్దదిగా పేర్కొంటున్నారు. అక్కడ ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment