ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ నెత్తుటిధార | Chhattisgarh Encounter March 20 At least 30 Maoists Dead | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ నెత్తుటిధార

Published Fri, Mar 21 2025 3:53 AM | Last Updated on Fri, Mar 21 2025 7:02 AM

Chhattisgarh Encounter March 20 At least 30 Maoists Dead

గంగలూరు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తున్న పోలీస్‌ బలగాలు

బీజాపూర్, కాంకేర్‌ జిల్లాల్లో వేర్వేరు ఎన్‌కౌంటర్లు 

కనీసం 30 మంది మావోయిస్టుల మృతి

మావోల కాల్పుల్లో ఒక జవాను వీరమరణం  

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/బీజాపూర్‌/కాంకేర్‌/న్యూఢిల్లీ: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌ మరోసారి రక్తమోడింది. బస్తర్‌ అడవుల్లో నెల రోజులుగా నిశ్శబ్ద వాతావరణం ఉండగా గురువారం ఒక్కసారిగా తుపాకులు గర్జించాయి.  బీజాపూర్, కాంకేర్‌ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కనీసం 30 మంది మావోయిస్టులు మరణించారు. 

దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులోని బీజాపూర్‌ జిల్లా గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పశ్చిమ బస్తర్‌ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ, టాస్‌్కఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన సుమారు 700 మంది భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉదయం 7 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. 

కాల్పుల అనంతరం ఘటనాస్థలిలో భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టగా మధ్యాహ్నం సమయానికి 18 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించగా, సాయంత్రం 6 గంటల సమయానికి ఈ సంఖ్య 26కు చేరింది. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఏకే 47, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్‌ ఆయుధాలను   స్వా«దీనం చేసుకున్నట్టు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ప్రకటించారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాను వీరమరణం పొందినట్లు వెల్లడించారు. మావోల మృతదేహాలను జిల్లా కేంద్రమైన బీజాపూర్‌కు తరలించారు. 

కాంకేర్‌–నారాయణపూర్‌ మధ్య.. 
మరో ఘటనలో కాంకేర్‌–నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో ఉత్తర బస్తర్‌–మాడ్‌ డివిజన్‌ కమిటీ సమావేశమైందనే సమాచారంతో రెండు జిల్లాల భద్రతా దళాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు కాంకేర్‌ ఎస్పీ ఇందిరా కల్యాణ్‌ ప్రకటించారు. 

భారీగా ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ మృతులను నారాయణ్‌పూర్‌ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ రెండు చోట్లా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నారాయణపూర్‌ జిల్లాలో తుల్‌తులీ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.  

టీసీఓఏను దాటుకుని.. 
ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది చివరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు భద్రతా దళాలు ఉధృతంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో జనవరిలో 50 మంది, ఫిబ్రవరిలో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే మార్చిలో వేసవి రావడంతో ట్యాక్టికల్‌ కౌంటర్‌ ఆఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ (వ్యూహాత్మక ఎదురుదాడులు, టీసీఓఏ) పేరుతో మావోలు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో గత నెల రోజులుగా నెమ్మదించిన భద్రతా దళాలు గురువారం దూకుడు కనబరిచాయి. దీంతో రెండు ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోలు చనిపోయారు. మొత్తంగా ఈ ఏడాదిలో 120 మంది మావోయిస్టులు చనిపోవడం గమనార్హం. 

ఏడాదిలోగా మావోయిస్టురహిత భారత్‌: అమిత్‌ షా 
‘నక్సల్‌ ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ దిశగా భద్రతా బలగాలు మరో గొప్ప విజయం సాధించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తంచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారని గురువారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సభ్యులపై మోదీ ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోందని స్పష్టంచేశారు. 



లొంగిపోతే అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇస్తున్నా.. కొందరు లెక్కచేయడం లేదన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, తగిన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భారత్‌.. మావోయిస్టురహిత దేశంగా మారడం తథ్యమని అమిత్‌ షా పునరుద్ఘాటించారు. మరో ఏడాదిలోగా మావోయిస్టులను పూర్తిగా అంతం చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు.  

మోదీ పాలనలో మావోయిస్టులకు చావుదెబ్బ  
2025లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 104 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మరో 164 మంది లొంగిపోయారని పేర్కొంది. 2024లో 290 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించగా, 1,090 మంది అరెస్టయ్యారని, 881 మంది లొంగిపోయారని తెలిపింది. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల వ్యవధిలో 16,463 మావోయిస్టు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, మోదీ సర్కారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 దాకా వీటి సంఖ్య 53 శాతం తగ్గిపోయిందని, పదేళ్లలో కేవలం 7,744 హింసాత్మక ఘటనలు జరిగాయని హోంశాఖ స్పష్టంచేసింది. 

అదే సమయంలో మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది సంఖ్య 1,851 నుంచి 509కు పడిపోయినట్లు తెలిపింది. సాధారణ పౌరుల మరణాల సంఖ్య 4,766 నుంచి 1,495కు తగ్గిపోయినట్లు పేర్కొంది. 2004–14తో పోలిస్తే 2014–24లో భద్రతా సిబ్బంది మరణాలు 73 శాతం, పౌరుల మరణాలు 70 శాతం పడిపోయాయని ఉద్ఘాటించింది. 

2014లో దేశంలో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు 126 ఉండగా, 2024లో కేవలం 12 మాత్రమే ఉన్నాయని ప్రకటించింది. మావోయిస్టుల నియంత్రణ కోసం గత ఐదేళ్లలో కొత్తగా 302 సెక్యూరిటీ క్యాంప్‌లు, 68 నైట్‌ ల్యాండింగ్‌ హెలిప్యాడ్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ వివరించింది.  

మృతుల్లో అగ్రనేతలు?
బీజాపూర్, కాంకేర్‌ ఎన్‌కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు డివిజన్‌ కమిటీ మెంబర్లు మరణించి ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడా నేతలతోపాటు ఈ రెండు కమిటీలకు రక్షణ కల్పించే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ–2, పీఎల్‌జే–5)కి చెందిన ప్లాటూన్‌ దళ సభ్యులు కూడా మృతుల్లో ఎక్కువ మంది ఉండే అవకాశముందని తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement