నక్సల్స్ క్యాంప్‌పై భద్రతా బలగాల మెరుపు దాడి
17 మంది మావోయిస్టులు మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వీరిలో తెలంగాణ కేడర్‌కే చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటన.. బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావో యిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.
రాష్ట్ర సరిహద్దుల్లో ఘటన
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో తొలిసారిగా కాల్పులు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 17 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతులు ఎవరు? ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు.
ఇదీ చదవండి: సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
Comments
Please login to add a commentAdd a comment