Massive Encounter
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వీరిలో తెలంగాణ కేడర్‌కే చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటన.. బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావో యిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఘటనతెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో తొలిసారిగా కాల్పులు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 17 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతులు ఎవరు? ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు. ఇదీ చదవండి: సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్ -
ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్
-
ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కాంకేర్ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని నార్త్ అబూజ్‌మడ్‌లో గల పేకమెటాకపూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో రెండు జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ విభాగాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే కూంబింగ్ చేపట్టారు.ఈ క్రమంలో శనివారం బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరపగా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మరి కొందరు తప్పించుకున్నారు. కాగా, ఈ ఘటనలో చిర్మాన్ యాదవ్, కైలేశ్వర్ గావ్డే అనే జవాన్లు తీవ్రంగా గాయపడడంతో నారాయణపూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, మందులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. -
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
-
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, ములుగు జిల్లా తాడ్వాయిల సరిహద్దు అడవుల్లో మావో యిస్టులు సంచరిస్తున్నట్టు గ్రేహౌండ్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు బుధవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు ఉన్న కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలో ని నీలాద్రిగుట్టను గుర్తించారు. వెంటనే అదనపు బలగాలను అడవుల్లోకి రప్పించారు. మొత్తంగా 150 మంది వర కు పోలీసులు బృందాలుగా ఏర్పడి ఏరియా డామినేషన్ మొదలెట్టారు. ఈ క్రమంలో ఉదయం 6:45 గంటలకు ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అడవుల్లోంచి వస్తున్న భారీ శబ్దాలు, కాల్పుల మోతలు విని సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. మృతులంతా బీకే–ఏఎస్ఆర్కే డివిజన్ వారే ఈ కాల్పుల్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామ రాజు (బీకే–ఏఎస్ఆర్) డివిజన్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. మృతుల్లో నలుగురు పురుషు లు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే 47, ఒక్కో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, పిస్టల్తోపా టు తూటాలు, కిట్‌బ్యాగులు లభించినట్టు ఎస్పీ తెలిపా రు. ఈ కాల్పుల నుంచి మావోయిస్టు మాసయ్య తప్పించుకున్నట్టు తమకు సమాచారముందని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఎల్జీఎస్గా పనిచేస్తూ.. కరకగూడెం ఎన్కౌంటర్లో చనిపోయిన ఆరుగురు మావోయిస్టులు మణుగూరు–పాల్వంచ ఏరియాలో లోకల్ గెరిల్లా స్క్వాడ్‌గా (ఎల్జీఎస్) పనిచేస్తున్నారు. వీరిలో బీకే–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్న లచ్చన్న అలియాస్ కుంజా వీరన్న (42) స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గొల్లపల్లి మండలం రాయిగూడెం గ్రామం. 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరిన లచ్చన్న అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ కాల్పుల్లో చనిపోయిన పూనెం లక్కే (29) అలియాస్ తులసి (సీజీ, బీజాపూర్ జిల్లా, గంగ్లూర్ గ్రామం‡) లచ్చన్న భార్యగా ప్రచారం జరుగుతోంది. ఈమె 2005లో మావోయిస్టు పార్టీలో చేరింది. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. వీరిలో అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం సంగంపాడుకు చెందిన కొవ్వాసి రాము(25) 2015లో పార్టీలో చేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన పొడియం కోసయ్య (21) అలియాస్ శుక్రు 2019లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మిగిలిన ఇద్దరు కోసి, దుర్గేశ్ ఇటీవలే మావోయిస్టు పార్టీ సభ్యులుగా చేరారు. వారిద్దరూ సేఫ్ కరకగూడెం ఎన్కౌంటర్లో కానిస్టేబుళ్లు వంశీ, సందీప్‌లలో ఒకరికి పొట్టలో తూటా దూసుకుపోగా, మరొకరి కాలుకు గాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని భద్రాచలం ఆస్ప త్రికి తరలించారు. ఆపై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. సాయంత్రానికి బయటకొచ్చిన మృతదేహాలు ఉదయం 6:45 గంటలకు ఎన్కౌంటర్ జరగ్గా, ఎనిమిది గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. 10:30 గంటలకు మృతుల ఫొటోలు, పేర్లు వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తహసీల్దార్, ఎస్పీ రోహిత్‌రాజ్ ఘటనాస్థలికి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు వచ్చే వరకు మృతదేహాలను మణుగూరు/భద్రాచలం ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇది విప్లవద్రోహుల పనే: ఆజాద్ విప్లవ ద్రోహుల కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మా వోయిస్టు పార్టీ బీకే –ఏఎస్ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసన గా ఈనెల 9న జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.జనజీవన స్రవంతిలో కలవండి: డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో డీజీపీ జితేందర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాలకు తావులేదని డీజీపీ స్పష్టం చేశారు. అనాలోచిత హింసను మావోయిస్టులు కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు ప్రభుత్వపరంగా పునరావాసం కలి్పస్తామని, ఇందుకు తక్షణ, దీర్ఘకాలిక సహాయక చర్యలు పొందవచ్చని డీజీపీ హామీ ఇచ్చారు మావోలపై ‘టోర్నడో’ ఎఫెక్ట్» రెండునెలల క్రితమే భద్రాద్రి జిల్లాలోకి లచ్చన్న దళం » తాడ్వాయిలో సుడిగాలులకు కూలిన చెట్లు » ఆశ్రయం కోసం కరకగూడెం వనాల్లోకి వచ్చిన మావోయిస్టులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం ఎన్కౌంటర్ వెనుక తాడ్వాయి టోర్నడో (సుడిగాలులు) కీలకంగా మారాయి. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు ములుగు–భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని దట్టమైన అడవులను కేంద్రంగా చేసుకొని రెండు నెలలుగా తిరుగుతున్నారు. అయితే భారీ సుడిగాలుల ధాటికి తాడ్వాయి మండలంలో ఒకేచోట రెండు వందల హెక్టార్లలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. దీంతో మావోయిస్టుల కదలికలకు బ్రేక్ పడింది. అనివార్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవులకే దళాలు పరిమితం కావాల్సి వచ్చి0ది. చివరకు మావోల ఉనికి పోలీసులకు తెలియడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పార్టీ విస్తరణకు వచ్చి... తెలంగాణలో మళ్లీ పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో జూన్‌లో చిన్నచిన్న జట్లుగా మావోయిస్టులు గోదావరి దాటినట్టు సమాచారం. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భద్రు, లచ్చన్నతో పాటు దాదాపు పదిహేను మంది సభ్యులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గత జూలై 25న ములుగు –భద్రాద్రి జిల్లా సరిహద్దులో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్ (34) అలియాస్ విజేందర్ చనిపోయాడు. మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని పారిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. పెరిగిన నిర్బంధం.. దామెరతోగు ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నిఘా విస్తృతం చేశారు. లచ్చన్న దళానికి చెందిన సభ్యుల వివరాలు, ఫొటోలతో పాటు వారి తలలపై ఉన్న రివార్డులను సైతం వివరిస్తూ పోలీసులు వాల్‌పోస్టర్లు అంటించి నిర్బంధాన్ని తీవ్రం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయుధాలతో గోదావరి నది దాటడం మావోయిస్టులకు కష్టంగా మారినట్టు తెలుస్తోంది. నలభై రోజులుగా.. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా..అడవులు, కొండల్లో రోజుకో చోటుకు మకాం మారుస్తూ పోలీసులకు చిక్కకుండా మావోయిస్టులు సంచారం సాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అతి భారీ సుడిగాలులు సృష్టించిన బీభత్సంతో తాడ్వాయి మండలాన్ని వదిలేసి పూర్తిగా భద్రాద్రి జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చి0ది. దీంతో కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ చేస్తూ ఎన్కౌంటర్లో ఆరుగురిని మట్టుబెట్టారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శుక్రవారం మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులకు దిగారు. ఇరువురి నడుమ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగాయి. కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. అదేసమయంలో, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఒక బారెల్ గ్రెనేడ్ లాంఛర్, 12 బోర్ గన్, దేశవాళీ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు లభించాయన్నారు. ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెల్సిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆపరేషన్ ‘ఆర్కే’!
మరోసారి విఫలమైన పథకం ఏవోబీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక బృందం ‘ఆర్కే’.. రెండక్షరాల ఈ పేరు వింటే చాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ముచ్చెమటలు పోస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏవోబీలో మావోయిస్టు ఉద్యమాన్ని ఉచ్ఛస్థితికి తీసుకెళ్లిన ఈ మావో అగ్రనేత అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే)ను లక్ష్యంగా చేసుకునే పోలీసు ఉన్నతాధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారని తెలుస్తోంది. దాని ఫలితమే సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్. అసలు లక్ష్యమైన ఆర్కే ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోగలిగినా.. పలువురు కీలకనేతలు సహా 24 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకప్పుడు ఏవోబీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జరిపిన శాంతిచర్చల్లో పాల్గొన్న మావోయిస్టుల బృందంలో ఆర్కే కూడా ఉన్నారు. ఆ తర్వాత పలుమార్లు జరిగిన ఎన్కౌంటర్ల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆర్కే లక్ష్యంగా ఎప్పటినుంచో పని చేస్తున్న పోలీసు బలగాలు ఆ మధ్య గాలికొండ ఏరియా, దంతెవాడ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కే హతమయ్యాడని తొలుత వార్తలు వచ్చినా.. తర్వాత అవి వాస్తవం కాదని తేలింది. తాజాగా ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్ లక్ష్యం కూడా ఆర్కేయేనని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఆర్కే లక్ష్యంగానే ఆపరేషన్ ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతోనే రంగంలోకి దిగినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి అంతర్గత సంభాషణల్లో స్పష్టం చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడుములగుమ్మ సమితి పనసపుట్టు పంచాయతీలోని కటాఫ్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో మావోల ప్లీనరీ జరుగుతోందని.. అందులో ఆర్కే ఉన్నాడన్న పక్క సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇటీవల పోలీసులకు చిక్కిన మిలీషియా సభ్యుల్లో పలువురు గతంలో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరిలో కొంతమందిని షెల్టర్ జోన్ ఏరియాకు పంపి అక్కడ మావోల ఆనుపానులు గుర్తించారు. గత వారం రోజులుగా వీరు అదే పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు మావోల క దలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. డిసెంబర్లో జరగనున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఈ ప్లీనరీలో అగ్రనేతలంతా సమావేశమవుతున్నట్టు పక్కా సమాచారం అందింది. వ్యూహకర్త జయరామిరెడ్డి తాజా ఎన్కౌంటర్ వెనుక ప్రధాన వ్యూహకర్త గ్రేహౌండ్స్ కమాండెంట్ జయరామిరెడ్డి అని తెలిసింది. ఏవోబీలో మావోయిస్టు కార్యకాలాపాలకు పూర్తిగా చెక్‌పెట్టాలన్న లక్ష్యంతో తాజా ఆపరేషన్‌కు ఆయనేస్కెచ్ వేయడంతోపాటు.. మొత్తం పర్యవేక్షించారని పోలీసు అధికారులు చెబుతున్నారు. మూడువైపుల నుంచి ఇరు రాష్ట్రాల పోలీసులు బలగాలను రంగంలో దింపారు. సాధారణంగా ప్లీనరీ వంటి ముఖ్యమైన సమావేశాలు జరిగినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రత ఏర్పాటు చేసుకుంటారు. అయితే ప్రస్తుత ప్లీనరీ జరుగుతున్న కటాఫ్ ఏరియా పూర్తిగా లోయ ప్రాంతం కావడంతో మూడంచెల భద్రతను ఛేదించే పని లేకుండా ఎత్తయిన ప్రదేశం నుంచి దాడి జరిపేలా వ్యూహరచన చేశారు. ఆపరేషన్ ఆర్కే పేరుతో శుక్రవారం రాత్రి నుంచి మొదలు పెట్టిన కూంబింగ్ చేపట్టిన దళాలు ఆదివారం సాయంత్రానికి మావో శిబిరానికి సుమారు పది కిలోమీటర్లదూరానికి చేరుకున్నాయి. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బూసిపూట్ వద్ద వాహనాలతో పాటు సెల్ఫోన్లను పూర్తిగా బంద్ చేశారు. ఎటువంటి సిగ్నల్స్ పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగారు. ఆ తర్వాత సుమారు 9 కిలోమీటర్లు పూర్తిగా కాలినడకనే లక్ష్యం వైపు సాగారు. సోమవారం తెల్లవారుజామున చీకటి తెరలు వీడకముందే కొండపై నుంచి ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. మావోలు వారిని గుర్తించినా అప్పటికే ఆలస్యమైంది. రెండు శిబిరాల్లో 40 మంది మావోలు ఉండగా.. గ్రేహౌండ్స్ దళాలు మాత్రం ఒక శిబిరం మాత్రమే ఉందన్న ఆలోచనతో దానిపై దృష్టి పెట్టాయి. ఈ శిబిరంలో ఉన్న ఆర్కే తనయుడు ఫృద్వీ అలియాస్ మున్నాతో సహా పలువురు మావో కీలకనేతలు నేలకొరిగారు. కాగా రెండో శిబిరంలో ఉన్న ఆర్కేతోపాటు మరికొందరు అగ్రనేతలు తప్పించుకున్నారు. ఆర్కే చిక్కక పోయినప్పటికీ ఆర్కే తనయుడు మున్నాతో సహా చలపతి, రవి, దయా తదితర ముఖ్యనేతలు చనిపోయారు. -
ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్
- మావోయిస్టు ఉద్యమ చరిత్రలో భారీ నష్టం - వరుసగా మరణిస్తున్న కీలక నేతలు - యాక్షన్ టీమ్‌లకు నేతృత్వం వహించగల నేతలంతా మృతి సాక్షి, హైదరాబాద్, పెద్దపల్లి: ఏఓబీలో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా నమోదైంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతుండగా.. ఇప్పటికి కొన్ని వందల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగాయి. కానీ ఎప్పుడూ ఇంత మంది మావోయిస్టులు, అందులోనూ అగ్రనేతలు మరణించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో కీలక నేతలను మావోయిస్టులు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్‌లలో భారీ ఎన్కౌంటర్లు జరిగినా ఇంత నష్టం ఎన్నడూ లేదు. పెద్ద సంఖ్యలో ఎన్కౌంటర్లు.. 1996లో ఖమ్మం జిల్లా పగిడేరు వద్ద 16 మంది పీపుల్స్‌వార్ సభ్యులు ఎన్కౌంటర్ అయ్యారు. అయితే ఆ 16 మంది సభ్యులు కూడా కొత్తగా రిక్రూటైనవారే. వారిని ఖమ్మం జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 1998లో ఒడిశాలో పీపుల్స్‌వార్ ప్లీనరీపై పోలీసులు చేసిన దాడిలో 17 మంది నక్సలైట్లు మరణించారు. అందులో నలుగురు జిల్లా కమిటీ స్థాయి నాయకులు ఉన్నారు. పీపుల్స్‌వార్ పార్టీ చరిత్రలో గిరాయిపల్లి ఎన్కౌంటర్లో జనార్దన్, మురళీమోహన్‌లాంటి నలుగురు అగ్రనేతలను కోల్పోయింది. కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్లో నల్లా ఆదిరెడ్డి, ఎర్రం సంతోశ్‌రెడ్డి, శీలం నరేశ్ వంటి ముగ్గురు కీలక నాయకులను ఒకేసారి కోల్పోయింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న ఎన్కౌంటర్ జరిగిన నల్లమలలో 11 మంది మరణించారు. వరంగల్ జిల్లా కౌకొండలో సుధాకర్ సహా 9 మంది, కరీంనగర్ జిల్లా అచ్చంపల్లిలో రామన్నతో పాటు 10 మంది, పాలకుర్తిలో 9 మంది, సింహాచలం కొండల్లో ఓబులేసు సహా 14 మంది, వరంగల్ జిల్లా తుపాకులగూడెంలో 13 మంది, ఖమ్మం జిల్లా పువ్వర్తిలో 11 మంది, ఛత్తీస్‌గఢ్ కంచెల్లో 18 మంది, ఎర్రగుంటపాలెంలో సుదర్శన్‌తోపాటు 12 మంది, నల్లమల సున్నిపెంటలో మట్ట శ్రీధర్ సహా 11 మంది, గాజుల నర్సాపూర్‌లో సిటి ప్రభాకర్ వెంట 13 మంది, మానాలలో రమేశ్‌తోపాటు 12 మంది, పద్మక్క ఎన్కౌంటర్లో ఆరుగురు... ఇలా భారీ ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. అయితే ఆ ఎన్కౌంటర్లలో ఒకరిద్దరు అగ్రనేతలు మాత్రమే ఉండగా.. మిగతా వారంతా సాధారణ కేడరే. అదే ప్రస్తుత ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కన్నుమూశారు. సంఖ్యాపరంగా కూడా దేశంలోనే ఇది పెద్ద ఎన్కౌంటర్. కోలుకోలేని దెబ్బ.. కొన్నేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను వదిలి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లిపోయారు. అయితే వారు తిరిగి సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పుడల్లా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2009 మేలో వరంగల్ సమీపంలోని తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ మిలటరీ వ్యూహకర్త, కేంద్ర మిలటరీ కమిషన్ బాధ్యుడు పటేల్ సుధాకర్‌రెడ్డి మరణించారు. తర్వాత శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండలరెడ్డి, ఆజాద్ వంటి కీలక నేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇప్పుడు ఏఓబీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌తో పాటు ఆయన దళం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇలా వ్యూహాత్మకంగా దాడులు చేసే సత్తా కలిగిన నేతలు మరణిస్తుండడం మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. ఇప్పుడు యాక్షన్ టీమ్‌లకు నేతృత్వం వహించే సామర్థ్యమున్న నేతల్లో నంబాల కేశవరావు అలియాస్ ఆశన్న ఒక్కరే మిగిలారని సమాచారం. అనుకూలమైన కాలంలోనూ.. సాధారణంగా ఎన్కౌంటర్లు ఎక్కువగా వేసవికాలంలోనే జరుగుతుంటాయి. ఎందుకంటే చెట్లు, నీటి వనరులన్నీ ఎండిపోయి ఉంటాయి. పోలీసు బలగాలు అడవులను గాలించడం కూడా సులువు. శీతాకాలం, వర్షాకాలాల్లో మావోయిస్టులకు భద్రత ఎక్కువ. కానీ ప్రస్తుతం వర్షాలతో అడవులు దట్టంగా మారిన సమయంలో ఏవోబీలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి మావోయిస్టులను దెబ్బతీశారు. -
ఎన్కౌంటర్
-
అడవిలో అన్వేషణ
- ఖమ్మం జిల్లా చర్ల సమీపంలో భారీ ఎన్కౌంటర్ - చంద్రన్న వర్గం దళ సభ్యుల సంచారం! - అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు - ప్రాధాన్యత సంతరించుకున్న ఓఎస్డీ పర్యటన - పోలీసుల అదుపులో చంద్రన్న వర్గం దళ సభ్యులు జంగారెడ్డిగూడెం :రాష్ట్ర సరిహద్దులోని ఖమ్మం జిల్లా చర్ల మండలంలో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరగటం, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) చంద్రన్న వర్గం దళాలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏజెన్సీ మండలాల్లోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చర్ల సమీపంలో చత్తీస్‌గఢ్ సరిహద్దు భాగంలో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతిచెందగా, వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో మావోయిస్ట్ ఖమ్మం జిల్లా కార్యదర్శి, దళ కమాండర్ లచ్చన్న , తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్ భార్య సమ్మక్క అలియాస్ సోనీ ఉన్నారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మిగిలిన మావోయిస్టు దళ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలోకి ప్రవేశించి తలదాచుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీని మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం ఏజెన్సీ మండలాల పోలీసులు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. గతంలో పశ్చిమ ఏజెన్సీలో.. ప్రధానంగా పోలవరం , బుట్టాయగూడెం మండలాల్లో పలు ఎన్కౌంటర్లు జరిగాయి. జనశక్తి క్రాంతి వర్గం, దళిత బహుజన శ్రామిక విముక్తి దళాలు ఎన్కౌంటర్లలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతానికి పశ్చిమ ఏజెన్సీలో న్యూడెమోక్రసీ ఆత్మరక్షణ దళాలు సంచరిస్తున్నాయి. గతంలో న్యూడెమోక్రసీ దళ కమాండర్ ధర్మన్న కూడా ఎన్కౌంటర్లో మృతిచెందారు. తాజాగా న్యూడెమోక్రసీలో చీలిక రావడంతో చంద్రన్న వర్గం ఏర్పడింది. చంద్రన్న వర్గం కూడా దళాలను ఏర్పాటు చేసుకుని ఏజెన్సీలో సంచరిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అచ్చెన్నపాలెంలో గ్రామస్తులతో చంద్రన్నవర్గ దళ సభ్యులు సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఇదిలావుంటే మావోయిస్టులు జిల్లాలోని అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లోకి వస్తున్నప్పటికీ.. కేవలం షెల్టర జోన్‌గా మాత్రమే వాడుకుంటున్నారే తప్ప ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు. తాజాగా చర్ల సమీపంలో ఎన్కౌంటర్ నేపథ్యంలో, చంద్రన్న దళాల సంచారంతో పశ్చిమ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం అర్ధరాత్రి బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామానికి పెద్దఎత్తున వెళ్లిన పోలీసులు గ్రామాన్ని తనిఖీ చేసినట్టు సమాచారం. ఓఎస్డీ పర్యటన ఒక పక్క ఎన్కౌంటర్, మరో పక్క చంద్రన్న దళాల సంచారం నేపథ్యంలో ఏజెన్సీ మండలాలకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఓఎస్డీ పకీరప్ప పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పకీరప్ప మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం వచ్చారు. సమాచారం చెప్పేందుకు ఆయన అంగీకరించలేదు. ఏజెన్సీ పోలీస్స్టేషన్లను కూడా ఆయన పరిశీలించినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో చంద్రన్న వర్గం దళ సభ్యులు సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) చంద్రన్న వర్గం దళ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దళ కమాండర్ ధర్మన్న అనారోగ్యం పాలవడంతో గతనెల 26న జంగారెడ్డిగూడెం వచ్చి వైద్యం చేయించుకున్నట్టు సమాచారం. ఆయన వెంట చంద్రన్న వర్గం లీగల్ ఆర్గనైజేషన్ అయిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు రామన్న, ఆ వర్గం పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సోమరాజు సహాయంగా వచ్చినట్టు తెలిసింది. ధర్మన్నకు వైద్యం చేయించి తిరిగి వెళుతుండగా ఆ ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు తరలించి విచారిస్తున్నట్టు భోగట్టా. వెంటనే కోర్టులో హాజరుపర్చాలి పోలీసులు అదుపులోకి తీసుకున్న సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం ప్రతినిధులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని ఆ వర్గం రాష్ట్ర కమిటీ నాయకుడు ఎస్.రాజారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడుతూ వైద్యంచేయించుకుని వెళుతున్న దళ కమాండర్ ధర్మన్నను, అరుణోదయ నాయకుడు రామన్నను, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సోమరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అప్పటినుంచి వారి జాడ తెలియలేదని, పోలీసులు వెంటనే వారిని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఆ ముగ్గురినీ పోలీసులు ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణం కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. -
మావోయిస్టులకు వరుస దెబ్బలు
భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తం మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగుతారని అంచనా గ్రామాలను జల్లెడ పడుతున్న కూంబింగ్ పార్టీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆదివాసీలు చింతూరు :ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ నెలకొంది. మన జిల్లా సరిహద్దులకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీని ప్రభావం విలీన మండలాలపై పడే అవకాశముండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని సాక్లేర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న , తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి హరిభూషణ్ భార్య సోనీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజుతో కలిపి మొత్తం 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముందని భావిస్తున్న పోలీసులు అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు జిల్లా సరిహద్దుల వైపు వచ్చే అవకాశముందని భావిస్తున్న పోలీసులు పొరుగు రాష్ట్రాల సహకారంతో అదనపు బలగాలను మోహరించినట్టు సమాచారం. మావోయిస్టులకు వరుస దెబ్బలు ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులకు ఇటీవల వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 2015-16లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో సుమారు 70 మంది వరకు మావోయిస్టులు మృతిచెందారు. గతేడాది ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్లో విలీన మండలాల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న శబరి ఏరియా కమిటీ అప్పటి కార్యదర్శి మొప్పు మొగిలి అలియాస్ నరేష్, అతని గన్‌మెన్ తెల్లం రాములు హతమయ్యారు. ఇటీవల చింతూరు మండలం మల్లంపేట సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రస్తుత శబరి ఏరియా కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్ మృతిచెందాడు. విశాఖ, తూర్పు సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మంగళవారం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. 2014లో ఇదే ప్రాంతంలో జరిగినఎన్కౌంటర్లో అప్పటి కేకేడబ్ల్యూ(ఖమ్మం, కరీంనగర్, వరంగల్) కమిటీకి చెందిన 9 మంది మావోయిస్టులు మృతిచెందారు. నగేష్ ఎన్కౌంటర్ అనంతరం విలీన మండలాల్లో సుమారు రెండు నెలలపాటు స్తబ్ధుగా వున్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే నేపథ్యంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగల నడుమ సోమవారం చెట్లను నరికి రహదారిని దిగ్బంధించారు. తద్వారా మావోయిస్టులు తిరిగి శబరి ఏరియా కమిటీని బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఖాళీగావున్న శబరి ఏరియా కమిటీ కార్యదర్శి బాధ్యతలను ఓ మహిళా నాయకురాలికి అప్పగించనున్నట్టు సమాచారం. మావోయిస్టులకు అత్యంత పట్టు కలిగినసరిహద్దుల్లోని పామేడు, గొల్లపల్లి ప్రాంతాల్లోనే ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడంతో పోలీసులు పైచేయి సాధించినట్టయింది. గతంలో తమ డిమాండ్ల సాధనకు సుక్మా జిల్లా కలెక్టర్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఇదే ప్రాంతంలో దాచి ఉంచారు. హడలిపోతున్న ఆదివాసీలు తాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్ నిమిత్తం పోలీసులు గ్రామాలను జల్లెడ పడుతుండడంతో ఆదివాసీలు హడలిపోతున్నారు. మరోవైపు ఎన్కౌంటర్లో సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ఈ ఘటనపై పోస్ట్‌మార్టం నిర్వహించే అవకాశముండడంతో ఎవరిని టార్గెట్ చేస్తారోననే భయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్య ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.