
ఆపరేషన్ ‘ఆర్కే’!
మరోసారి విఫలమైన పథకం
ఏవోబీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక బృందం
‘ఆర్కే’.. రెండక్షరాల ఈ పేరు వింటే చాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ముచ్చెమటలు పోస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏవోబీలో మావోయిస్టు ఉద్యమాన్ని ఉచ్ఛస్థితికి తీసుకెళ్లిన ఈ మావో అగ్రనేత అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే)ను లక్ష్యంగా చేసుకునే పోలీసు ఉన్నతాధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారని తెలుస్తోంది. దాని ఫలితమే సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్. అసలు లక్ష్యమైన ఆర్కే ఈ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకోగలిగినా.. పలువురు కీలకనేతలు సహా 24 మంది మావోయిస్టులు హతమయ్యారు.
ఒకప్పుడు ఏవోబీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జరిపిన శాంతిచర్చల్లో పాల్గొన్న మావోయిస్టుల బృందంలో ఆర్కే కూడా ఉన్నారు. ఆ తర్వాత పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్ల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆర్కే లక్ష్యంగా ఎప్పటినుంచో పని చేస్తున్న పోలీసు బలగాలు ఆ మధ్య గాలికొండ ఏరియా, దంతెవాడ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్కే హతమయ్యాడని తొలుత వార్తలు వచ్చినా.. తర్వాత అవి వాస్తవం కాదని తేలింది. తాజాగా ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్ లక్ష్యం కూడా ఆర్కేయేనని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
ఆర్కే లక్ష్యంగానే ఆపరేషన్
‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతోనే రంగంలోకి దిగినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి అంతర్గత సంభాషణల్లో స్పష్టం చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడుములగుమ్మ సమితి పనసపుట్టు పంచాయతీలోని కటాఫ్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో మావోల ప్లీనరీ జరుగుతోందని.. అందులో ఆర్కే ఉన్నాడన్న పక్క సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇటీవల పోలీసులకు చిక్కిన మిలీషియా సభ్యుల్లో పలువురు గతంలో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరిలో కొంతమందిని షెల్టర్ జోన్ ఏరియాకు పంపి అక్కడ మావోల ఆనుపానులు గుర్తించారు. గత వారం రోజులుగా వీరు అదే పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు మావోల క దలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. డిసెంబర్‌లో జరగనున్న పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఈ ప్లీనరీలో అగ్రనేతలంతా సమావేశమవుతున్నట్టు పక్కా సమాచారం అందింది.
వ్యూహకర్త జయరామిరెడ్డి
తాజా ఎన్‌కౌంటర్ వెనుక ప్రధాన వ్యూహకర్త గ్రేహౌండ్స్ కమాండెంట్ జయరామిరెడ్డి అని తెలిసింది. ఏవోబీలో మావోయిస్టు కార్యకాలాపాలకు పూర్తిగా చెక్‌పెట్టాలన్న లక్ష్యంతో తాజా ఆపరేషన్‌కు ఆయనేస్కెచ్ వేయడంతోపాటు.. మొత్తం పర్యవేక్షించారని పోలీసు అధికారులు చెబుతున్నారు. మూడువైపుల నుంచి ఇరు రాష్ట్రాల పోలీసులు బలగాలను రంగంలో దింపారు. సాధారణంగా ప్లీనరీ వంటి ముఖ్యమైన సమావేశాలు జరిగినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రత ఏర్పాటు చేసుకుంటారు. అయితే ప్రస్తుత ప్లీనరీ జరుగుతున్న కటాఫ్ ఏరియా పూర్తిగా లోయ ప్రాంతం కావడంతో మూడంచెల భద్రతను ఛేదించే పని లేకుండా ఎత్తయిన ప్రదేశం నుంచి దాడి జరిపేలా వ్యూహరచన చేశారు.
ఆపరేషన్ ఆర్కే పేరుతో శుక్రవారం రాత్రి నుంచి మొదలు పెట్టిన కూంబింగ్ చేపట్టిన దళాలు ఆదివారం సాయంత్రానికి మావో శిబిరానికి సుమారు పది కిలోమీటర్లదూరానికి చేరుకున్నాయి. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బూసిపూట్ వద్ద వాహనాలతో పాటు సెల్‌ఫోన్లను పూర్తిగా బంద్ చేశారు. ఎటువంటి సిగ్నల్స్ పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగారు. ఆ తర్వాత సుమారు 9 కిలోమీటర్లు పూర్తిగా కాలినడకనే లక్ష్యం వైపు సాగారు. సోమవారం తెల్లవారుజామున చీకటి తెరలు వీడకముందే కొండపై నుంచి ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. మావోలు వారిని గుర్తించినా అప్పటికే ఆలస్యమైంది. రెండు శిబిరాల్లో 40 మంది మావోలు ఉండగా.. గ్రేహౌండ్స్ దళాలు మాత్రం ఒక శిబిరం మాత్రమే ఉందన్న ఆలోచనతో దానిపై దృష్టి పెట్టాయి. ఈ శిబిరంలో ఉన్న ఆర్కే తనయుడు ఫృద్వీ అలియాస్ మున్నాతో సహా పలువురు మావో కీలకనేతలు నేలకొరిగారు. కాగా రెండో శిబిరంలో ఉన్న ఆర్కేతోపాటు మరికొందరు అగ్రనేతలు తప్పించుకున్నారు. ఆర్కే చిక్కక పోయినప్పటికీ ఆర్కే తనయుడు మున్నాతో సహా చలపతి, రవి, దయా తదితర ముఖ్యనేతలు చనిపోయారు.