
ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్
- మావోయిస్టు ఉద్యమ చరిత్రలో భారీ నష్టం
- వరుసగా మరణిస్తున్న కీలక నేతలు
- యాక్షన్ టీమ్‌లకు నేతృత్వం వహించగల నేతలంతా మృతి
సాక్షి, హైదరాబాద్, పెద్దపల్లి: ఏఓబీలో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా నమోదైంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతుండగా.. ఇప్పటికి కొన్ని వందల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. కానీ ఎప్పుడూ ఇంత మంది మావోయిస్టులు, అందులోనూ అగ్రనేతలు మరణించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో కీలక నేతలను మావోయిస్టులు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్‌లలో భారీ ఎన్‌కౌంటర్లు జరిగినా ఇంత నష్టం ఎన్నడూ లేదు.
పెద్ద సంఖ్యలో ఎన్‌కౌంటర్లు..
1996లో ఖమ్మం జిల్లా పగిడేరు వద్ద 16 మంది పీపుల్స్‌వార్ సభ్యులు ఎన్‌కౌంటర్ అయ్యారు. అయితే ఆ 16 మంది సభ్యులు కూడా కొత్తగా రిక్రూటైనవారే. వారిని ఖమ్మం జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 1998లో ఒడిశాలో పీపుల్స్‌వార్ ప్లీనరీపై పోలీసులు చేసిన దాడిలో 17 మంది నక్సలైట్లు మరణించారు. అందులో నలుగురు జిల్లా కమిటీ స్థాయి నాయకులు ఉన్నారు. పీపుల్స్‌వార్ పార్టీ చరిత్రలో గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌లో జనార్దన్, మురళీమోహన్‌లాంటి నలుగురు అగ్రనేతలను కోల్పోయింది.
కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నల్లా ఆదిరెడ్డి, ఎర్రం సంతోశ్‌రెడ్డి, శీలం నరేశ్ వంటి ముగ్గురు కీలక నాయకులను ఒకేసారి కోల్పోయింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న ఎన్‌కౌంటర్ జరిగిన నల్లమలలో 11 మంది మరణించారు. వరంగల్ జిల్లా కౌకొండలో సుధాకర్ సహా 9 మంది, కరీంనగర్ జిల్లా అచ్చంపల్లిలో రామన్నతో పాటు 10 మంది, పాలకుర్తిలో 9 మంది, సింహాచలం కొండల్లో ఓబులేసు సహా 14 మంది, వరంగల్ జిల్లా తుపాకులగూడెంలో 13 మంది, ఖమ్మం జిల్లా పువ్వర్తిలో 11 మంది, ఛత్తీస్‌గఢ్ కంచెల్‌లో 18 మంది, ఎర్రగుంటపాలెంలో సుదర్శన్‌తోపాటు 12 మంది, నల్లమల సున్నిపెంటలో మట్ట శ్రీధర్ సహా 11 మంది, గాజుల నర్సాపూర్‌లో సిటి ప్రభాకర్ వెంట 13 మంది, మానాలలో రమేశ్‌తోపాటు 12 మంది, పద్మక్క ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు... ఇలా భారీ ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. అయితే ఆ ఎన్‌కౌంటర్లలో ఒకరిద్దరు అగ్రనేతలు మాత్రమే ఉండగా.. మిగతా వారంతా సాధారణ కేడరే. అదే ప్రస్తుత ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కన్నుమూశారు. సంఖ్యాపరంగా కూడా దేశంలోనే ఇది పెద్ద ఎన్‌కౌంటర్.
కోలుకోలేని దెబ్బ..
కొన్నేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను వదిలి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లిపోయారు. అయితే వారు తిరిగి సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పుడల్లా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2009 మేలో వరంగల్ సమీపంలోని తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ మిలటరీ వ్యూహకర్త, కేంద్ర మిలటరీ కమిషన్ బాధ్యుడు పటేల్ సుధాకర్‌రెడ్డి మరణించారు. తర్వాత శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండలరెడ్డి, ఆజాద్ వంటి కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఇప్పుడు ఏఓబీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌తో పాటు ఆయన దళం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇలా వ్యూహాత్మకంగా దాడులు చేసే సత్తా కలిగిన నేతలు మరణిస్తుండడం మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. ఇప్పుడు యాక్షన్ టీమ్‌లకు నేతృత్వం వహించే సామర్థ్యమున్న నేతల్లో నంబాల కేశవరావు అలియాస్ ఆశన్న ఒక్కరే మిగిలారని సమాచారం.
అనుకూలమైన కాలంలోనూ..
సాధారణంగా ఎన్‌కౌంటర్‌లు ఎక్కువగా వేసవికాలంలోనే జరుగుతుంటాయి. ఎందుకంటే చెట్లు, నీటి వనరులన్నీ ఎండిపోయి ఉంటాయి. పోలీసు బలగాలు అడవులను గాలించడం కూడా సులువు. శీతాకాలం, వర్షాకాలాల్లో మావోయిస్టులకు భద్రత ఎక్కువ. కానీ ప్రస్తుతం వర్షాలతో అడవులు దట్టంగా మారిన సమయంలో ఏవోబీలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి మావోయిస్టులను దెబ్బతీశారు.