డీఐజీ హరికృష్ణ సమక్షంలో లొంగిపోయిన 60మంది మావోయిస్టు సభ్యులు, సానుభూతిపరులు
సాక్షి, పాడేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతను పోలీసులు అరెస్టుచేశారు. అంతేకాక.. ఆ పార్టీలో పనిచేస్తున్న 60 మంది సభ్యులు, సానుభూతిపరులు మంగళవారం పాడేరులో విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్. హరికృష్ణ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే.
ఇంజరికి వస్తుండగా ప్రభాకర్ అరెస్టు
మావోయిçస్టు పార్టీలో కీలకంగా ఉన్న పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అలియాస్ గొడ్డలి రాయుడు కోండ్రుం నుంచి ఇంజరి గ్రామానికి వస్తున్న సమయంలో పెదబయలు పోలీసులు అరెస్టుచేసినట్లు డీఐజీ హరికృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆదివాసీ పీటీజీ కోందు కులానికి చెందిన వంతాల రామకృష్ణ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందినవాడు.
మావోయిస్టు పార్టీ నేత భూపతి ప్రోద్బలంతో 2003లో మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ఏరియా కమిటీ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగాడు. అరెస్టయిన రామకృష్ణ ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని మల్కన్‌గిరి, కోరాపుట్టు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రజాకోర్టులు పెట్టి అమాయక గిరిజనులను హత్యలు చేసేవాడని, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసేవాడని డీఐజీ తెలిపారు.
ఆయనపై ఏఓబీ వ్యాప్తంగా సుమారు 124 కేసులున్నాయన్నారు. 14 హత్యలు, 13 ఎదురుకాల్పుల ఘటనలు, నాలుగు మందుపాతరలు పేల్చిన సంఘటనలు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు మరో ఆరు కేసులు ఆయనపై ఉన్నాయన్నారు. దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతోపాటు పలువురు గిరిజనుల హత్య కేసుల్లో వంతాల రామకృష్ణ నిందితుడు. అలాగే, అనేక ఎదురుకాల్పుల ఘటనలతో పాటు మందుపాతర్ల పేల్చివేతలు, పొక్లెయిన్లను తగులబెట్టిన సంఘటనలు, పలు కిడ్నాప్ కేసుల్లోను రామకృష్ణ ప్రముఖ పాత్ర వహించాడని డీఐజీ తెలిపారు.
ఇక అరెస్టు అయిన రామకృష్ణ పేరుపై ప్రభుత్వం రూ.ఐదు లక్షల రివార్డును కూడా ప్రకటించిందని ఆయన తెలిపారు. రామకృష్ణ నుంచి రూ.39 లక్షల నగదు, ఐదు కిలోల మైన్, ఐదు డిటోనేటర్లు, 90 మీటర్ల పొడవు గల కరెంట్ వైరు, ఆరు బ్యాటరీలు, 9ఎంఎం పిస్టల్, ఎనిమిది 9ఎంఎం రౌండ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని.. ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు.
60 మంది లొంగుబాటు
మరోవైపు.. మావోయిస్టు పార్టీ పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 33 మందిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. వీరిలో ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందిన కొర్రా చిన్నయ్య అలియాస్ శ్రీకాంత్ 95 నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు డీఐజీ తెలిపారు.
ఏఓబీ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందని, గత ఏడాది 135 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోగా.. ప్రస్తుతం 60 మంది ఒకేరోజు జనజీవన స్రవంతిలోకి రావడం శుభపరిణామమని డీఐజీ హరికృష్ణ తెలిపారు. వీరందరిపై అనేక కేసులున్నాయన్నారు. రూ.లక్ష రివార్డు ఉన్న సభ్యులకు ఆ నగదును వారికే అందజేయడంతో పాటు లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు.
గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి
మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పోలీసు కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం చేపడతామని.. ఇందుకు ఒడిశా పోలీసు యంత్రాంగం కూడా అన్నివిధాల సహకరిస్తోందని హరికృష్ణ వివరించారు. గంజాయి నిర్మూలన కార్యక్రమాలు చేపడుతూ గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుతో జీవనోపాధి కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు.
మారుమూల గ్రామాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. నిరుద్యోగ యువతకు ప్రేరణ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని డీఐజీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ అడ్మిన్ తుసీన్ సిన్హా, సీఆర్పీఎఫ్ 284 బెటాలియన్ కమాండెంట్ ఆశీష్ విశ్వకర్మ, అసిస్టెంట్ కమాండెంట్ అరుణ్‌కుమార్, డీఎస్పీ వెంకట్రావు, పాడేరు సీఐ సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment