శిల్పను అదుపులోకి తీసుకుని కారులో తీసుకెళుతున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తిజేస్తూ యువత మావోయిస్టుల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారన్న అభియో గంపై చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్పను జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం అరెస్టు చేసింది. వారిలో శిల్ప హైకోర్టు న్యాయవాది.
ఏపీలోని విశాఖపట్నంలో 2017 డిసెంబర్‌లో అదృశ్యమైన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ బృం దాలు సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న నిందితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశాయి. దాదాపు 4 గంటలపాటు సోదాలు చేపట్టి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వారిని అరెస్టు చేశాయి.
ఇదీ కేసు...
పోలీసుల కథనం ప్రకారం కాప్రాలోని సాయిబాబా కాలనీకి చెందిన పల్లెపాటి పోచమ్మ చిన్న కుమార్తె రాధ నర్సింగ్ విద్యార్థిని. మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ రాధను కలిసేవారు. 2017 డిసెంబర్‌లో రాధను కలిసిన దేవేంద్ర... కొందరికి వైద్యం చేయాల్సి ఉందంటూ బలవంతంగా ఆమెను తీసుకుకెళ్లాడు.
అప్పటి నుంచి రాధ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె కోసం పోచమ్మ అనేక ప్రాంతాల్లో గాలించి చివరకు తన కుమార్తె మావోయిస్టు పార్టీలో చేరిందని... విశాఖపట్నం జిల్లా పెద్దబయలు అటవీ ప్రాంతంలో అగ్రనేతలు ఉదయ్, అరుణలతో కలసి పనిచేస్తున్నట్లు తెలుసుకుంది. రాధ అదృశ్యంపై ఈ ఏడాది జనవరిలో విశాఖ జిల్లాలోని పెద్దబయలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన సమయంలో రాధ మైనర్ కావడంతో దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు.
బలహీన వర్గాల కేసులు వాదిస్తున్న శిల్ప...
హైకోర్టు అడ్వొకేట్‌గా పని చేస్తున్న శిల్ప 6 నెలలుగా బోడుప్పల్‌లోని హేమానగర్‌లో భర్త కిరణ్, అత్త హేమతో కలసి అద్దెకు ఉంటోంది. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన పలు కోర్టు కేసులను శిల్ప వాదిస్తోంది. కాగా, తన భార్యను ఎన్‌ఐఏ అక్రమంగా అరెస్టు చేసిందని శిల్ప భర్త కిరణ్ ఆరోపించారు.
రంగంలోకి ఎన్‌ఐఏ...
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ అయింది. దీంతో ఈ నెల 3న ఈ కేసును రీ–రిజిస్టర్ చేసిన ఎన్‌ఐఏ... సీఎంఎస్ నాయకులే కుట్రపూరితంగా రాధను మావోయిస్టు పార్టీలో చేర్చారని, అడవిలో ఆమెను నిర్బంధించి ఉంచారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులను నిందితులుగా చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment