andhra orissa border
-
వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: దండకారణ్యంలో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు మావోయిస్టు పార్టీపై పెను ప్రభావం చూపుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి మద్వీ హిడ్మాను ఆ పార్టీ అగ్రనాయకత్వం తొలగించింది. దండకారణ్యంలో కేంద్ర బలగాలను ఎదుర్కోవడంలో వైఫల్యం చెందారనే కారణంతోనే హిడ్మాను తొలగించినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతితోపాటు 16 మంది మావోయిస్టులు ఇటీవల హతమైన నేపథ్యంలో హిడ్మాను తొలగించడం గమనార్హం.వాస్తవానికి చలపతి నాయకత్వంలోనే హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రధానంగా మిలటరీ ఆపరేషన్ల ప్రణాళిక, నిర్వహణ చలపతి నుంచే ఆయన నేర్చుకున్నారు. వారిద్దరిదీ గురుశిష్యుల బంధంగా చెబుతారు. 2017లో చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా బలగాలపై దాడికి హిడ్మానే నేతృత్వం వహించారు. దాంతో ఆయనకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర కమిటీ సభ్యునిగా నియమించారు. 2022 తరువాత ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి మావోయిస్టు అగ్రనేతలు చత్తీస్ఘడ్ సరిహద్దులకు తరలిపోయారు. అప్పటి నుంచే చలపతి, హిడ్మా మధ్య విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. చలపతి దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉండటంతో ఒడిశాలోని మావోయిస్టు పార్టీ వ్యూహాలను హిడ్మానే పర్యవేక్షిస్తున్నారు.మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడి అరెస్ట్ ఎటపాక: చత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడిని అల్లూరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎస్పీ అమిత్ బర్దర్ గురువారం ఎటపాకలో మీడియాకు వెల్లడించారు. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా కొన్ని రోజులుగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి పోలీసులు ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ చెరువుగుంపు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు సోడి పొజ్జి అలియాస్ లలిత్‌ను పోలీసులు పట్టుకున్నారు. పొజ్జి ఛత్తీస్‌గఢ్‌లోని గొండిగూడకు చెందిన వ్యక్తి అని ఎస్పీ చెప్పారు. చదవండి: ఓవర్ యాక్షన్ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు -
వావ్ అనిపించే వాటర్‌ఫాల్స్.. చూపు తిప్పుకోలేరు!
సాక్షి, ముంచంగిపుట్టు: పరవళ్లు తొక్కుతున్న నదీ జలాలు.. వాగులు, సెలయేర్లు.. కొండలు, కోనలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మన్యంలో అద్భుత దృశ్యంగా పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో జలపాతాలు హొయలొలుకుతున్నాయి. తొలకరి వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జలపాతాల నీటి ఉధృతికి తోడై మరింత కనువిందు చేస్తున్నాయి. చిన్న జలపాతాలు సైతం ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో డుడుమ జలపాతం 2,700 అడుగుల పైనుంచి మంచు తెరల మధ్య జాలు వారుతూ ఆహ్లాద పరుస్తోంది. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ జడిగూడ జలపాతం సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం నింగికి ఎగసి పడుతున్నట్లు కనిపిస్తోంది. బరడ పంచాయతీ హంశబంద, జర్జుల పంచాయతీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వీటిని చూసేందుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి విశేష అనుభూతిని పొందుతున్నారు. అక్కడ చుట్టు పక్కల వంటలు చేస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ, సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. పాల కడలి స్నోయగాలు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్ పొగమంచు, మేఘాలతో గురువారం ఉదయం పాలసముద్రంలా దర్శనమిచ్చింది. వేకువజాము నుంచి ఉదయం 10గంటల వరకు కొండల నిండా మంచు పరుచుకుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించి పరవశించారు. – సాక్షి, పాడేరు -
మావోలకు గట్టి ఎదురుదెబ్బ
సాక్షి, పాడేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతను పోలీసులు అరెస్టుచేశారు. అంతేకాక.. ఆ పార్టీలో పనిచేస్తున్న 60 మంది సభ్యులు, సానుభూతిపరులు మంగళవారం పాడేరులో విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్. హరికృష్ణ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే. ఇంజరికి వస్తుండగా ప్రభాకర్ అరెస్టు మావోయిçస్టు పార్టీలో కీలకంగా ఉన్న పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అలియాస్ గొడ్డలి రాయుడు కోండ్రుం నుంచి ఇంజరి గ్రామానికి వస్తున్న సమయంలో పెదబయలు పోలీసులు అరెస్టుచేసినట్లు డీఐజీ హరికృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆదివాసీ పీటీజీ కోందు కులానికి చెందిన వంతాల రామకృష్ణ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందినవాడు. మావోయిస్టు పార్టీ నేత భూపతి ప్రోద్బలంతో 2003లో మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ఏరియా కమిటీ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగాడు. అరెస్టయిన రామకృష్ణ ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని మల్కన్‌గిరి, కోరాపుట్టు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రజాకోర్టులు పెట్టి అమాయక గిరిజనులను హత్యలు చేసేవాడని, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసేవాడని డీఐజీ తెలిపారు. ఆయనపై ఏఓబీ వ్యాప్తంగా సుమారు 124 కేసులున్నాయన్నారు. 14 హత్యలు, 13 ఎదురుకాల్పుల ఘటనలు, నాలుగు మందుపాతరలు పేల్చిన సంఘటనలు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు మరో ఆరు కేసులు ఆయనపై ఉన్నాయన్నారు. దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతోపాటు పలువురు గిరిజనుల హత్య కేసుల్లో వంతాల రామకృష్ణ నిందితుడు. అలాగే, అనేక ఎదురుకాల్పుల ఘటనలతో పాటు మందుపాతర్ల పేల్చివేతలు, పొక్లెయిన్లను తగులబెట్టిన సంఘటనలు, పలు కిడ్నాప్ కేసుల్లోను రామకృష్ణ ప్రముఖ పాత్ర వహించాడని డీఐజీ తెలిపారు. ఇక అరెస్టు అయిన రామకృష్ణ పేరుపై ప్రభుత్వం రూ.ఐదు లక్షల రివార్డును కూడా ప్రకటించిందని ఆయన తెలిపారు. రామకృష్ణ నుంచి రూ.39 లక్షల నగదు, ఐదు కిలోల మైన్, ఐదు డిటోనేటర్లు, 90 మీటర్ల పొడవు గల కరెంట్ వైరు, ఆరు బ్యాటరీలు, 9ఎంఎం పిస్టల్, ఎనిమిది 9ఎంఎం రౌండ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని.. ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. 60 మంది లొంగుబాటు మరోవైపు.. మావోయిస్టు పార్టీ పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 33 మందిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. వీరిలో ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందిన కొర్రా చిన్నయ్య అలియాస్ శ్రీకాంత్ 95 నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు డీఐజీ తెలిపారు. ఏఓబీ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందని, గత ఏడాది 135 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోగా.. ప్రస్తుతం 60 మంది ఒకేరోజు జనజీవన స్రవంతిలోకి రావడం శుభపరిణామమని డీఐజీ హరికృష్ణ తెలిపారు. వీరందరిపై అనేక కేసులున్నాయన్నారు. రూ.లక్ష రివార్డు ఉన్న సభ్యులకు ఆ నగదును వారికే అందజేయడంతో పాటు లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పోలీసు కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం చేపడతామని.. ఇందుకు ఒడిశా పోలీసు యంత్రాంగం కూడా అన్నివిధాల సహకరిస్తోందని హరికృష్ణ వివరించారు. గంజాయి నిర్మూలన కార్యక్రమాలు చేపడుతూ గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుతో జీవనోపాధి కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. నిరుద్యోగ యువతకు ప్రేరణ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని డీఐజీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ అడ్మిన్ తుసీన్ సిన్హా, సీఆర్పీఎఫ్ 284 బెటాలియన్ కమాండెంట్ ఆశీష్ విశ్వకర్మ, అసిస్టెంట్ కమాండెంట్ అరుణ్‌కుమార్, డీఎస్పీ వెంకట్రావు, పాడేరు సీఐ సుధాకర్ పాల్గొన్నారు. -
AOB: రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
పాడేరు/ముంచంగిపుట్టు: ఏవోబీ వ్యాప్తంగా బుధవారం నుంచి మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈ వారోత్సవాలను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా, ఆంధ్రా పోలీసు యంత్రాంగమంతా ఈ వారోత్సవాలపై దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బలగాలు ఇప్పటికే కూంబింగ్ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల పోలీసు బలగాలన్నీ ఇప్పటికే ఒడిశా కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విశాఖ ఏజెన్సీకి సంబంధించి కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని అన్ని పోలీసు స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసేంత వరకు రెడ్ అలెర్ట్ అమలు చేస్తున్నారు. ఏజెన్సీలోని దారకొండ, పెదవలస, బలపం, నుర్మతి, రూడకోట అవుట్‌పోస్టుల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలు అధికమయ్యాయి. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఏవోబీ వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఆయా మారుమూల గ్రామాల్లో ప్రచారం చేస్తోంది. విశాఖ రూరల్ ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి, పాడేరు ఏఎస్పీ జగదీష్ ఈ రెండు సబ్ డివిజన్లలో పోలీసు యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూంబింగ్ చర్యలు, మండల కేంద్రాల్లోని వాహనాలు, ఇతర తనిఖీలను సమీక్షిస్తున్నారు. కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ముమ్మర తనిఖీలు చేస్తున్న బలగాలు డాగ్, బాంబు స్క్వాడ్ల తనిఖీలు ముంచంగిపుట్టు మండలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దులో డాగ్, బాంబు స్క్వాడ్లతో పోలీసు బలగాలు కల్వర్టులు, వంతెనలు తనిఖీలు చేస్తూ వాహన రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. గూడెంకొత్తవీధి మండలంలో మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారపార్టీ నేతలపై దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్త చర్యలు చేపట్టారు. జి.మాడుగుల మండలంలో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీస్, బాంబ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. చింతపల్లి–జీకే వీధి రహదారి మార్గంలో వాహనాలు తనిఖీ చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతగిరి మండలంలోని ములియగుడలోని జంక్షన్ వద్ద అరకు–విశాఖ ప్రధాన రహదారిలోని వాహనాలను ఆపి క్షుణంగా పరిశీలించారు. -
ఏవోసీబీలో కూంబింగ్ ముమ్మరం
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా–ఛత్తీస్‌గఢ్ (ఏవోసీబీ) సరిహద్దుల్లోని ట్రై జంక్షన్ ప్రాంతంలో పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతల కదలికల నేపథ్యంలో మన్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం, విశాఖ మన్యంలో బుధవారం జరిగిన వరుస ఎన్కౌంటర్లతో మన్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎదురుకాల్పుల నుంచి కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్ అలియాస్ మహేందర్‌రెడ్డి, అరుణ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి అర కి.మీ. దూరంలోని మరో ప్రాంతంలో వారు ఉండటంతో కాల్పుల మోత వినగానే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది మావోయిస్టుల రక్షణతో వారు ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని ట్రై జంక్షన్ వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే వారి కోసం మూడు వైపుల నుంచి కుంబింగ్‌ను ముమ్మరం చేశారు. ట్రై జంక్షన్‌లోనే అగ్రనేతలు? ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (ఏఓబీజెడ్‌సీ) ఆధ్వర్యంలో మళ్లీ కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు సన్నద్ధమవుతన్నట్లు నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. జూన్–జులైలలో అందుకోసం పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారని కూడా పసిగట్టాయి. దీంతో బస్తర్ కేంద్రంగా మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు గత నెలలో సమావేశమైనట్లు సమాచారం. వరుస లొంగుబాట్లు, ఆనారోగ్య సమస్యలతోపాటు కరోనాతో కూడా మావోయిస్టులు గత కొద్దిరోజులుగా బలహీనపడిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా గాలింపు చర్యలు చేపట్టాలని వారు నిర్ణయించారు. శిక్షణా తరగతుల నిర్వహణకు ఇతర ప్రాంతాల నుంచి అగ్రనేతలు వచ్చేవరకు వేచి చూడాలని ముందుగానే నిర్ణయించారు. ఇంతలో అగ్రనేతలు చేరుకున్నారన్న సమాచారం రావడంతో గ్రేహౌండ్స్, కోబ్రా, ఎస్పీఎఫ్, ఐటీబీటీ, బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా జూన్ రెండోవారం నుంచి కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో.. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో సోమ, మంగళవారాల్లో జరిగిన ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగలంమెట్ట వద్ద బుధవారం ఎన్కౌంటర్లో ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులతోపాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనలతో మల్కనగిరి, విశాఖ మన్యంలలో ఎన్కౌంటర్లపై మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించి కూంబింగ్‌ను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్, అరుణలు 40 మంది మావోయిస్టుల రక్షణతో ట్రై జంక్షన్‌కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దాంతోపాటు ఏఓబీజెడ్‌సీ ఇన్చార్జ్ డుడుమలతోపాటు మరికొందరు అగ్రనేతలు ఆ ప్రాంతంలోనే ఉండొచ్చన్నది పోలీసు ఉన్నతాధికారుల అంచనా. అగ్రనేతల్లో ఎవరు ఉండొచ్చన్న దానిపై అప్పుడే ఏమీ చెప్పలేమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఆ ప్రాంతంలో భారీస్థాయిలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని.. ఇన్ఫార్మర్లు చెప్పినదాన్ని బట్టి ఒకరిద్దరు అగ్రనేతలు కూడా ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. దీంతో ఏఓసీబీలో పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. -
సీలేరులో నాటు పడవల బోల్తా
సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు సీలేరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి జలాశయంలో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటనలో 8మంది గిరిజన కూలీలు గల్లంతయ్యారు. వారిలో 6 మృతదేహాలు లభ్యం కాగా.. ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. వీరిలో ఎక్కువ మంది చిన్న పిల్లలే. ప్రమాదం నుంచి 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ గుంటవాడ పంచాయతీ పరిధిలోని కొందుగుడ గ్రామానికి చెందిన చిన్నాపెద్దా కలిసి 35 మంది గిరిజనులు 8 నెలల క్రితం కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం వారంతా ఒకే వాహనంలో బయలుదేరి సోమవారం సాయంత్రానికి సీలేరు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో తాము హైదరాబాద్ నుంచి వచ్చిన విషయం అధికారులకు తెలిస్తే క్వారంటైన్‌కు తరలిస్తారని భావించి వారందరూ అడవి మార్గంలో సీలేరు జలాశయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జలాశయానికి అవతల ఉన్న తమ గ్రామంలోని వారికి సమాచారం అందించి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో రెండు నాటు పడవలు తెప్పించుకుని తొలుత 17 మంది అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. తిరిగి అవే పడవల్లో రెండో ట్రిప్‌లో 18 మంది బయలుదేరగా.. 30 మీటర్ల వెడల్పు, 70 మీటర్ల లోతున్న జలాశయం మధ్యలోకి వచ్చేసరికి నీటి ప్రవాహం పెరిగి పడవలోకి ఒక్కసారిగా నీరు చేరింది. ముందున్న పడవ మునిగిపోతుండటంతో అందులోని వారు ప్రాణభయంతో వెనక ఉన్న పడవను పట్టుకునే ప్రయత్నం చేయగా.. రెండు పడవలు మునిగిపోయాయి. ముందున్న పడవలో ప్రయాణిస్తున్న 11 మందిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. ఆరుగురు గల్లంతయ్యారు. వెనుక పడవలోని ఏడుగురిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా ఇద్దరు గల్లంతయ్యారు. 6 మృతదేహాలు వెలికితీత ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇంజన్ బోట్ల ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రానికి అనుష్క (23), ఏసుశ్రీ (5), గాయత్రి (3), అజిర్ (1), సంసోన్ (10), అనుష్ వర్ధన్ (5) మృతదేహాలను వెలికితీయగా.. కొర్రా లక్ష్మి (23), పింకీ (5) జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో ఆళ్ల నాని ఫోన్లో మాట్లాడారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, ఎస్పీ, ఏఎస్పీలు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఒడిశా పోలీస్ శాఖ ఓఎస్డీ సుమరాం, మల్కన్‌గిరి కలెక్టర్ వై.విజయ్‌కుమార్, ఎస్పీ రిషికేస్ కిలారి, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను చిత్రకొండ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కొందుగుడ గ్రామంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
బావను చంపిన బావమరుదులు
బరంపురం: సొంత బావనే బావమరుదులు మారణాయుధాలతో పొడిచి చంపిన ఘటన ఆంధ్రా–ఒడిశా బోర్డరులోని గిరిసిలా చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. గోళాంతరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గిరిసిలా గ్రామానికి చెందిన డి.ధర్మా, అతడి అన్న డి.జేజారావులపై ధర్మా బావమరుదులైన జి. తిరుపతి, జి.నాగేశ్వరరావులు ఏదో విషయమై రాత్రి గొడవపడ్డారు. దీంతో ఒకానొక దశలో కోపోద్రేకులైన ఇరువర్గాలు ఒకరిపై మరొకరు భౌతికదాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బావమరుదులు తమ బావని కత్తులతో పొడిచి చంపగా, ధర్మా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇదే ఘటనలో జేజారావుకి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న గోళాంతరా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం వైద్యసేవల నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి క్షతగాత్రుడిని తరలించారు. అయితే ఈ హత్యకి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని ఏఎస్పీ బబులి నాయక్ తెలిపారు. చదవండి: అక్కను హింసిస్తున్నాడని సొంత బావనే.. -
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కాల్పుల మోత
-
తృటిలో తప్పిన భారీ ఎన్కౌంటర్
సాక్షి, విజయనగరం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మరోసారి తుపాకుల మోతమోగింది. ముంచంగిపుట్టు, పెదబయలు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే తప్పించుకోగా, ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు అనంతరం పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా.. సంఘటనా స్థలంలో రక్తపు మరకలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు. మరోవైపు భారీ వర్షాలతో పోలీసుల కూంబింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా నెలాఖరున అమరవీరుల వారోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నద్ధం అయ్యారు. ఇందుకోసం కార్యక్రమాల రూపకల్పనకు వారంతా కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారంతో పోలీసులు కూంబింగ్ జరిపారు. అయితే గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే చికిత్స చేయిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
విశాఖలో మావోయిస్టు కీలక నేతల అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు బెల్లం నారాయణస్వామి అలియాస్ నందు అలియాస్ ఆజాద్, అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాదిలను విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం అద్దరవీధి వద్ద జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబందించిన చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్ తెలిపిన వివరాలు వెల్లడించారు. ‘అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామానికి చెందిన ఆజాద్ దాదాపు 35 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేస్తున్నాడు. ఇతనిపై సుమారు 20 లక్షలు రూపాయలు ప్రభుత్వ రివార్డు ఉంది. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో సుమారు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు బెల్లం నారాయణస్వామి అలియాస్ నందు అలియాస్ ఆజాద్ భార్య, కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాది అలియాస్ పూల్ బత్తిని కూడా అరెస్టు చేశామ’ని ఏఎస్పీ తెలిపారు. ఆమెపై రూ. ఆరు లక్షలు రివార్డు ఉందని, సుమారు 30కు పైగా కేసులు ఏవోబీలో నమోదయ్యాయని, గత 23 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తుందని ఏఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి విశాఖ తరలించినట్లు చెప్పారు. -
సరిహద్దుల్లో టెన్షన్ !
సాక్షి, కొత్తగూడెం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గత 5నెలల కాలం లో మరింతగా కోలుకోలేని దెబ్బ తగిలింది. గత మార్చి 2న సరిహద్దులోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్ మొదలు ఇప్పటివరకు సరిహద్దు జిల్లాల్లో జరిగిన వరుస ఘటనల్లో సుమారు 70 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. వారి దాడుల్లో 30 మందికి పైగా హతమయ్యారు. ఇందులో భద్రతా సిబ్బం దితో పాటు కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇన్ఫార్మర్లు ఉన్నారు. మావోలకు, భద్రతా బలగాలకు మధ్య ఎడతెరిపి లేని పోరు నడుస్తుండడంతో ఏజెన్సీ ప్రాంతాలు తుపాకుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడు లు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తంగా మారింది. గిరిజన పల్లెల్లో ఎప్పుడేం జరుగుతుం దో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు వచ్చాయి. గత నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబాబాద్, మహా రాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, బస్తర్, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్ జిల్లాల్లో 5 రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు సరిహద్దుల్లోని చర్ల, వెంకటాపురం మండలాల్లో శబరి ఏరియా కమిటీ పేరుతో కరపత్రాలు విడుద ల చేస్తున్నారు. తాజాగా ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా ఇర్మానార్ అడవుల్లో మావోయిస్టులకు డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డులు, ఎస్టీఎఫ్ బలగాలకు మధ్య సుమారు 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఉద్యమ చరిత్రలోనే భారీ నష్టం.. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పార్టీకి ఈ సీజన్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్చి 2న బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రతా బలగాలు, మావోయిస్టుల దాడులు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తమైంది. గత ఏప్రిల్ నెల చివరి వారంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏకంగా 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. తరువాత ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చర్ల ఏరియా కమాండర్ అరుణ్ మృతి చెందాడు. తడపలగుట్ట ఎన్కౌంటర్ తరువాత ఇప్పటివరకు మావోయిస్టులు ప్రతీకారంగా భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఇతరులను సుమారు 30 మందిని హతమార్చారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అయితే మావోయిస్టులపై పోరును కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దండకారణ్యంలో మావోయిస్టులపై పోరాడేందుకు భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను దింపింది. బెటాలియన్లలోని జవాన్లు 90శాతం పైగా 30 ఏళ్లలోపు యువకులే. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా గత ఏప్రిల్ 14న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బీజాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో పర్యటించారు. గ్రామస్వరాజ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. మావోయిస్టులు జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపే దండకారణ్యంలో ప్రధాని పర్యటించడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. సత్యనారాయణపురం వద్ద కల్వర్టు పేల్చివేత గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా గత మే నెల 4వ తేదీన ఏజెన్సీలో బంద్ నిర్వహించిన మావోయిస్టులు చర్ల మండలం సత్యనారాయణపురం–ఆర్ కొత్తగూడెం మధ్య కల్వర్టు పేల్చివేశారు. అక్కడికి అర కిలోమీటరు దూరం లో సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంప్ ఉండగా కల్వర్టు పేల్చి మావోలు సవాల్ విసిరారు. మే 11న చర్ల బస్టాండ్ వద్ద ప్రెషర్ బాంబు విడిచి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు బాంబును గుర్తించి చెరువులో నిర్వీర్యం చేశారు. -
అడవిలో అక్షర దివిటీలు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా పల్లెలు. నిన్న మొన్నటివరకూ అక్కడి పరిస్థితులు దయనీయం. వారిని పట్టించుకునేవారిని కనం. అక్కడి పరిస్థితులను సాక్షి పరిశీలించింది. అంతే ఆర్ద్రంగా అక్షరీకరించింది. రెండు రాష్ట్రాల అధికారులను కదిలించింది. అంతే... అడవి మధ్యన, కొండల మాటున అభివృద్ధికి, అక్షరానికి దూరమైన అక్కడి ప్రజల జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అక్షర సుగంధాలు పరిమళిస్తున్నాయి. 21 గ్రామాల్లో మళ్లీ చదువుల తల్లి పరవశిస్తోంది. ఇరు రాష్ట్రాల ఉపాధ్యాయులు కొఠియా పల్లెలకు క్యూ కడుతున్నారు. గిరిజన బిడ్డలకు చదువులు చెప్పేందుకు పోటీపడుతున్నారు. సాక్షిప్రతినిధి విజయనగరం : దశాబ్దాలుగా మారని వారి బతుకుల్లో వెలుగులకు కారణం ‘సాక్షి’ దినపత్రిక కావడం గర్వకారణం. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, పాలకులు, అధికారులకు ఆమడ దూరంగా కొఠియా ప్రజలు అనుభవిస్తున్న దుర్భర జీవితాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకితీసుకువచ్చింది. క్షేత్ర స్థాయిలో ‘సాక్షి’ తొలిసారిగా కొఠియా పల్లెల్లో పర్యటించి అక్కడి వారి కన్నీటి వ్యధలను కళ్లకు కట్టినట్టు ప్రముఖంగా ప్రచురించి పాలకుల 0కళ్లు తెరిపించింది. ఫలితంగా కొఠియా ప్రజల జీవితాల్లో పెను మార్పు మొదలైంది. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన ఈ గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఆ ప్రయత్నంలో ఒక భాగం ఈ విద్యా వికాసం. ‘సాక్షి’ పది వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ చరిత్రలో నిలిచిపోయే మార్పునకు ఇది శ్రీకారం. పోటాపోటీగా ఏపీ, ఒడిశా బోధనలు కొఠియా గ్రామాల్లో ఒక్కో రాష్ట్రానివి 14 చొప్పున 24 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి నిర్వహణను రెండు రాష్ట్రాల వారు వేర్వేరుగా చూసుకుంటున్నారు. గ్రామాల్లోని ఐదేళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో, 5 సంవత్సరాలు పైబడినవారిని స్థానిక పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఒక విద్యార్థి పేరు రెండు రాష్ట్రాల పాఠశాలల్లోనూ నమోదు చేస్తున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మాత్రం ఉపాధ్యాయులు రావడం లేదు. కానీ ఇప్పుడులా గ్రామాల్లో ఆంధ్రా–ఒడిశా అధికారులు తరచుగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పాఠశాలలను ఒడిశా అధికారులు పరిశీలించినప్పుడు గ్రామంలోని విద్యార్థులు ఆంధ్రా ప్రాంతంలోని పాఠశాలలో ఉండటాన్ని గమనించారు. వెంటనే ఒడిశా ప్రభుత్వం స్పందించింది. ఒడియా బోధనకు ఉపాధ్యాయులను పురమాయించింది. ఇటు ఆంధ్రా ప్రాంతంలోనూ అదే పరిస్థితి. మొత్తమ్మీద అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి రెండు రాష్ట్రాల ఉపాధ్యాయులు పోటీపడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా ఒడిశా ప్రభుత్వం ఇటీవల ధూళి¿భద్ర గ్రామంలో ఆంధ్రా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని ఒడిశా అధికారులు పరిశీలించారు. అక్కడ ఏపీ రాష్టర బోర్డు ఉండడాన్ని గమనించారు. ఆ భవనం ఒడిశా ప్రభుత్వం నిర్మించినందున అక్కడ ఏపీ కేంద్రాన్ని నిర్వహించడాన్ని తప్పు పట్టారు. తక్షణమే బోర్డు తీయాలని లేదంటే వేరే భవనం వద్ద ఆ కేంద్రాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలానే ఇటీవల కాలంలో అక్కడ చోటు చేసుకుంటున్నాయి. అక్షరాన్ని వారానికోరోజు ఒక పూట నేర్చుకోవడమే గగనమనుకునే ప్రాంతంలో కేవలం ‘సాక్షి’ కథనాల వల్ల విద్యార్థులకు నిత్యం విద్య అందే పరిస్థితులు వచ్చాయి. భావితరాల భవిష్యత్తుకు బాటలు ఏర్పడ్డాయి. -
పోరుబాట వీడిన చంబాల రవీందర్
డీజీపీ ఎదుట లొంగుబాటు 24 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర అనారోగ్యంతోనే బయటికి.. కుటుంబ సభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం జఫర్‌గఢ్/వరంగల్‌క్రైం : సుదీర్ఘ కాలంగా విప్లవోద్యమంలో పని చేస్తున్న జిల్లాకు చెంది న ప్రముఖ మావోయిస్టు నేత కుక్కల రవీందర్ అలియూస్ చంబాల రవీందర్ తన భార్యతో సహ పోలీసుల ఎదుట శుక్రవారం లొంగిపోయూరు. కుమారుడి లొంగుబాటు గురించి తెలియగానే ఆయన తల్లి, సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో రవీందర్ లొంగిపోయినట్లు తెలిసింది. మండలంలోని తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన చంబాల సాయిలు, నర్సమ్మ దంపతులకు నలుగురు కుమారులు. అందరిలో చిన్నవాడైన రవీందర్ ఇదే మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక సహకార సొసైటీలో వాచ్‌మన్‌గా ఏడాదిపాటు పని చేశాడు. ఈ క్రమంలో అతడికి వివాహమైంది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఆయన పీపుల్స్‌వార్‌లో పనిచేస్తున్నట్లు తెలియడంతో వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. రెండు నెలలు జైలులో ఉండి ఇంటికి వచ్చిన ఆయనపై గ్రామస్తులు పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో విసుగు చెంది 1990లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆయన తిరిగి రాకపోవడంతో నాలుగేళ్ల తర్వాత భార్య విడాకులు ఇచ్చి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత తిరిగి ఆయన ఒక్కసారి కూడా ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన రవీందర్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఆంధ్రా- ఒరిస్సా బార్డర్లో స్పెషల్ జోనల్ కమిటీ ప్రొటెక్షన్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనపై ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. ఆలస్యంగా పోలీస్ రికార్డుల్లోకి.. రవీందర్ అజ్ఞాతంలోకి వెళ్లిన కొన్నేళ్ల తర్వాత పోలీసులు ఈ విషయూన్ని గుర్తించారు. అతడు అజ్ఞాతంలో ఉన్నట్లు అక్టోబర్ 29, 1998లో పోలీస్ రికార్డుల్లో నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు తరచూ తమ్మడపల్లి(ఐ) గ్రామానికి వెళ్లి రవీందర్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులను శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు గురిచేశారు. ఈ బాధ భరించలేక అతడి సోదరులు కొన్నేళ్లపాటు ఊరు విడిచి వెళ్లారు. కుటుంబ సభ్యులను పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రవీం దర్ మాత్రం లొంగిపోలేదు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇల్లు శిథిలవస్థకు చేరుకుని, చుట్టూ ముళ్ల కంపలు పెరిగాయి. ప్రస్తుతం రవీందర్ పెద్ద అన్న గ్రామంలోనే మరో ఇల్లు నిర్మించుకొని తల్లితో కలిసి నివసిస్తున్నాడు. తమ్మడపల్లి(ఐ)లో హర్షాతిరేకాలు.. రవీందర్ లొంగిపోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు రడపాక ఎల్లయ్య, మునిగల సామేల్ మాట్లాడుతూ పోలీసులు ఎలాంటి కేసులు పెట్టకుండా ప్రశాంతంగా గ్రామంలో జీవించేలా చూడాలని కోరారు. -
తుపాకుల నీడలో ఏవోబీ ఎన్నికలు
ఎక్కడ కాలేస్తే ఏ మందుపాతర పేలుతుందో తెలీదు. ఎటు వెళ్తుంటే ఏ తుపాకి గుండు పేలుతుందో తెలీదు. ఎప్పుడొచ్చి ఎవరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారో చెప్పలేరు. అయినా.. తప్పనిసరిగా పోటీ చేయాలి, ఎన్నికల్లో నిలబడాలి. ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో రాజకీయ నాయకుల పరిస్థితి ఇది. మన రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిషాలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈసారి మన రాష్ట్రంతో పాటు ఒడిషాలో కూడా అసెంబ్లీ, లోక్‌సభ రెండింటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. మావోయిస్టుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఎన్నికలు కత్తిమీద సాములాగే ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నా, వాటిని బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడం, అయినా కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడం కోసం నాయకులు ఎలాగోలా నానా కష్టాలు పడి నామినేషన్లు దాఖలు చేయడం ఇక్కడ మామూలే. గ్రామపంచాయతీ సర్పంచి దగ్గర్నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరికీ ఇక్కడ మావోయిస్టుల నుంచి ముప్పు ఉండటం సర్వసాధారణం. గతంలో మంత్రి బాలరాజును ఒకసారి మావోయిస్టులు కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. అభ్యర్థులు ప్రచారానికి వెళ్తారనుకునే దారుల్లో ముందుగానే మందుపాతరలు అమర్చడం, ఎన్నికల ఏర్పాట్లు చూసేందుకు వచ్చే పోలీసులను హతమార్చేందుకు మందుపాతరలు పేల్చి, కాల్పులు జరపడం లాంటి చర్యలకు మావోయిస్టులు పాల్పడటం ఇటీవలి కాలంలో కూడా చూశాం. ఛత్తీస్‌గఢ్‌లో ఇంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారం కోసం వచ్చిన పలువురు కాంగ్రెస్ నాయకులు మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా అక్కడ ఎన్నికల ఏర్పాట్లు చూసేందుకు వెళ్తున్న పోలీసులపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లోనూ ఈసారి నాయకులు, పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. మావోయిస్టు అగ్రనాయకత్వం కూడా ఎక్కువగా ఏవోబీ మీదే దృష్టి సారించిందని, అందువల్ల అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడు ఎక్కడికి ప్రచారానికి వెళ్లేదీ ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని నాయకులకు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. -
మావోయిస్టుల టార్గెట్‌లో బాలరాజు, మరో 18 మంది
-
మావోయిస్టుల టార్గెట్‌లో బాలరాజు, మరో 18 మంది
నిన్న కాక మొన్న ఛత్తీస్‌గఢ్‌లో ఏకంగా 16 మంది భద్రతాదళాలను హతమార్చిన మావోయిస్టులు.. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో కూడా రెచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఏవోబీ ప్రాంతంలో ఎప్పటినుంచో బలంగా ఉన్న మావోయిస్టులు.. ఈసారి ఏకంగా తొమ్మిది యాక్షన్ టీమ్స్ ఏర్పాటుచేసుకున్నాయి. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ముందుగానే గుర్తించారు. మావోయస్టుల టార్గెట్‌లో మాజీ మంత్రి బాలరాజు కుటుంబ సభ్యులు సహా మొత్తం 18 మంది ఉన్నారని విశాఖ ఏఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల విశాఖ ఏజెన్సీ మొత్తాన్ని తాము అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో మావోయిస్టులు ఈ ప్రాంతంలో కొంతవరకు అలజడి సృష్టించినందున.. ఈసారి పోలీసులు ముందునుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
ఉద్యమానికి విఘాతం...
కొయ్యూరు, న్యూస్‌లైన్: మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ బుధవారం లొంగిపోయిన ఉసెండీ ఉద్యమ ప్రయాణం ఆంధ్రా ఒరిస్సా బోర్డర్(ఏవోబీ)లోని తాండవ దళం నుంచి ప్రారంభమైంది. ఆయనను అప్పట్లో అప్పన్నగా పిలిచేవారు. ఏడాది పాటు దళ కమాండ ర్గా పని చేశారు. 1987 డిసెంబర్ 25న తూర్పుగోదావరి జిల్లా గుర్తేడులో ఏడుగురు ఐఏఎస్ అధికారులను పీపుల్స్‌వార్ గ్రూపు అపహరించిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్‌తో జైలు నుంచి విడుదలైన వారిలో ఉసెండీ కూడా ఉన్నాడు. విడుదలయ్యాక తాండవ దళ ం కమాండర్‌గా పనిచేశాడు. ఆ తదుపరి ఛత్తీస్‌గఢ్ ఉద్యమ బలోపేతానికి మూడు దశాబ్దాలకు పైగా కృషి చేశాడు. దండకారణ్య కమిటీ ఆధ్వర్యంలో వెలువడే ‘ప్రభాత్’ అనే పత్రిక నిర్వహణ బాధ్యతను నిర్వర్తించాడు. వ్యూహ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే ఉసెండీ లొంగుబాటు దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. కాగా, ఒకప్పుడు కీలకమైన నేతలతో బలీయంగా ఉండే ఏవోబీలో నేడు గట్టి నేతలే కరువయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు దేవన్న 2007లో ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ప్రస్తుతం జైలులో ఉన్న చడ్డా భూషణంతో విభేదాలతో పిల్లి వెంకటేశ్వర్లు అలియాస్ జాంబ్రి 15 ఏళ్ల కిందట లొంగిపోయాడు. నందు కూడా రెండేళ్ల కిందట లొంగిపోయాడు. ఏవోబీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా చేసిన వినయ్ అలియాస్ గోపన్న రాజమండ్రిలో దొరికిపోయాడు. ఇలా కీలక నేతలు తూర్పు డివిజన్ నుంచి కనుమరుగయ్యారు.