సాక్షి, ముంచంగిపుట్టు: పరవళ్లు తొక్కుతున్న నదీ జలాలు.. వాగులు, సెలయేర్లు.. కొండలు, కోనలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మన్యంలో అద్భుత దృశ్యంగా పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో జలపాతాలు హొయలొలుకుతున్నాయి. తొలకరి వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జలపాతాల నీటి ఉధృతికి తోడై మరింత కనువిందు చేస్తున్నాయి.
చిన్న జలపాతాలు సైతం ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో డుడుమ జలపాతం 2,700 అడుగుల పైనుంచి మంచు తెరల మధ్య జాలు వారుతూ ఆహ్లాద పరుస్తోంది. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ జడిగూడ జలపాతం సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది.
ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం నింగికి ఎగసి పడుతున్నట్లు కనిపిస్తోంది. బరడ పంచాయతీ హంశబంద, జర్జుల పంచాయతీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
వీటిని చూసేందుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి విశేష అనుభూతిని పొందుతున్నారు. అక్కడ చుట్టు పక్కల వంటలు చేస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ, సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
పాల కడలి స్నోయగాలు
మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్ పొగమంచు, మేఘాలతో గురువారం ఉదయం పాలసముద్రంలా దర్శనమిచ్చింది. వేకువజాము నుంచి ఉదయం 10గంటల వరకు కొండల నిండా మంచు పరుచుకుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించి పరవశించారు.
– సాక్షి, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment